రేపటి నుంచే టెన్త్‌ పరీక్షలు | Tenth Class Exams From 19-03-2020 | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే టెన్త్‌ పరీక్షలు

Published Wed, Mar 18 2020 2:01 AM | Last Updated on Wed, Mar 18 2020 8:33 AM

Tenth Class Exams From 19-03-2020 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,530 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులు అంతా ఒకేసారి రాకుండా, ఒకేచోట గుంపులుగా ఉండకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంత మందుగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడమే కాకుండా పరీక్ష హాల్లోకి  పంపించేలా చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించినట్లు చెప్పారు. 

బాలురే అధికం..
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 11,045 పాఠశాలలకు చెందిన 5,34,903 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో 2,73,971 మంది బాలురు కాగా, 2,60,932 మంది బాలికలున్నారు. మొత్తం విద్యార్థులు 5,09,079 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 25,824 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. పరీక్షల నిర్వహణలో 30,500 మంది టీచర్లు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి 144 సిట్టింగ్‌ స్క్వాడ్స్, 4 ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటుచేశారు. 

అధికారులతో మంత్రి సబిత సమీక్ష
విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు బాగా రాయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం ఆమె అధికారులతో సమీక్షించారు. కోవిడ్‌ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరైనా విద్యార్థులు జలుబు, దగ్గుతో బాధపడుతూ అనారోగ్యంగా ఉంటే వారి కోసం ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి పరీక్షా కేంద్రంలోనూ శానిటైజర్లు, లిక్విడ్‌ సోప్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. విద్యార్థులు మాస్కులు ధరించినా, వాటర్‌ బాటిళ్లు తెచ్చినా అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను రిజర్వులో ఉంచుతున్నామని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి స్థానంలో ఇతరులను నియమిస్తామని చెప్పారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. 

గ్రేస్‌ పీరియడ్‌ ఉండదు..
గతంలో మాదిరిగా గ్రేస్‌ పీరియడ్‌ అంటూ ఏమీ ఉండదని, ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమయ్యాక విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు వీలైనంత ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చి నష్టపోవద్దని చెప్పారు. కనీసం గంట ముందుగానే (ఉదయం 8:30 గంటలకల్లా) వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. ముందురోజే ఓ సారి పరీక్ష కేంద్రాన్ని చూసుకుంటే మంచిదని సూచించారు. ఇప్పటికే హాల్‌టికెట్లను పంపిణీ చేశామని, అందని వారు తమ వెబ్‌సైట్‌ నుంచి (www.bse. telangana.gov.in) డౌన్‌లోడ్‌ చేసుకొని నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చని వెల్లడించారు. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లపై ఎవరి సంతకం అక్కర్లేదని స్పష్టంచేశారు.

వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బంది..
ఇప్పటివరకు వెబ్‌సైట్‌ నుంచి 4.05 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సబిత వెల్లడించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్య సిబ్బందిని, అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలోనూ (040–23230942), జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్‌ రూం లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement