ఆడపిల్లలకు చదువెందుకని ప్రశ్నించే రోజుల్లో పట్టుబట్టి బాలికలకు చదువు చెప్పడానికి విద్యాలయాలు స్థాపించిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ (1793–1873). ముఖ్యంగా తెలుగునేలపై వెలుగు నింపిన మానవతామూర్తి ఆయన. జర్మనీలోని హెల్మెస్టడ్ ప్రాంతంలో 1793 జూలై 10న జన్మించిన ఈయన అమెరికా వెళ్లి ఫిలడెల్ఫియాలో వేదాంత శాస్త్రం, యూని వర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి వైద్య విద్యలో ఎండీ పట్టా పొందాడు. మెడిసిన్ చదివే రోజుల్లోనే సంస్కృతం నేర్చుకున్నాడు. మిషనరీగా అభిషేకం పొంది దాదాపు 300 పైగా సండే స్కూల్స్ నెలకొ ల్పాడు. హయ్యర్ చురుకుదనాన్ని గమనించిన మెకానిక్స్ బర్గ్‌కు చెందిన ‘ది సెంట్రల్ మిషనరీ సొసైటీ’ వారు భారతదేశానికి మిషనరీగా ఆయన్ని ఎంపిక చేశారు.
ఆ విధంగా హయ్యర్ 1842 జూలై 31న గుంటూరు వచ్చాడు. వచ్చిన వెంటనే తెలుగు నేర్చుకుని తొలి పాఠశా లను 1842 నవంబరులో ప్రారంభించాడు. అదీ కేవలం బాలికలకు మాత్రమే. నెల గడిచేసరికి ఎని మిది మంది ముస్లిం బాలికలకు పాఠశాల ప్రవేశం కల్పించాడు. అనంతరం అన్ని వర్గాల వారికి ఏడు పాఠశాలలు నెలకొల్పి బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. 1844 నాటికి మరో ఎనిమిది పాఠశాలలు ప్రారంభించారు.
ఆ కాలంలో ప్రసూతి సమయంలో సరైన వైద్యం లభించక తల్లీ–పిల్లలు మరణించేవాళ్లే ఎక్కువ. అందుకే గుంటూరు కొత్తపేటలో 1843లో ఉచిత వైద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేశాడు. 1845 నాటికి రాజమండ్రి, భీమవరంలో పాఠశాలలను నెలకొల్పాడు. ఆ పరిసర ప్రాంతాల్లోనే వైద్య శాలలు ప్రారంభించాడు. హయ్యర్ ఒక ఆదర్శమూర్తిగా దర్శనమిస్తాడు. జీవిత భాగస్వామి ఎంపికలో ఇద్దరు పిల్లలున్న మేరీగాష్ అనే వితంతువును వివాహం చేసుకుని కొత్త జీవితం కల్పించాడు. తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించి తెలుగులోనూ కీర్తనలు రాశాడని అంటారు. తెలుగు వారికి సేవచేసి విద్య, వైద్యంతో ప్రజల గుండెల్లో నిలిచిన హయ్యర్ 1873లో 80 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలో మరణించాడు.
– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, తెనాలి
Comments
Please login to add a commentAdd a comment