Vijaya Gupta K: విశ్రాంత జీవితమూ విలువైనదే! | A retired life is worth a lot: Greeting card designer Vijaya Gupta K | Sakshi
Sakshi News home page

Vijaya Gupta K: విశ్రాంత జీవితమూ విలువైనదే!

Published Tue, Apr 25 2023 12:19 AM | Last Updated on Tue, Apr 25 2023 12:19 AM

A retired life is worth a lot: Greeting card designer Vijaya Gupta K - Sakshi

ఆమె రోజుకు ఆరు గంటలు పని చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? నిజమే. ఆమె వయసు డెబ్బయ్‌. ఇదీ ఆమె ప్రత్యేకత. తన కోసమే కాదు... సమాజానికీ పనిచేస్తారు. ‘సృజనాత్మకత మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇష్టమైన పని దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ విలువైనదే... సద్వినియోగం చేసుకోవాలి’ అంటూన్న విజయాగుప్తా పరిచయం.

ఇది స్క్రీన్‌ ఎరా. టీవీ స్క్రీన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌. ఇరవై నాలుగ్గంటల్లో పద్నాలుగు గంటలు స్క్రీన్‌తోనే గడిపేస్తున్నారు. స్క్రీన్‌ మీద పని చేయాల్సిన ఉద్యోగులకు తప్పదు. మరి ఖాళీగా ఉంటూ సమయం ఎలా గడపాలో తెలియక స్క్రీన్‌కి అంకితమయ్యే వాళ్లు మాత్రం తప్పనిసరిగా తమ ఇరవై నాలుగ్గంటలనూ ఒకసారి విశ్లేషించుకోవాలని చెబుతున్నారు హైదరాబాద్, హిమాయత్‌ నగర్‌కు చెందిన విజయాగుప్తా కోట్రికె. తనకిష్టమైన వ్యాపకం కోసం ఇంట్లో ఒక గదిని వర్క్‌ స్టేషన్‌గా మార్చుకున్నారామె. ఎనిమిదేళ్ల వయసులో గ్రీటింగ్‌ కార్డు తయారు చేసిన సృజనాత్మకమైన ఆమె విజయ ప్రస్థానం ఇది.
 
జీవితం ఇచ్చిన గిఫ్ట్‌
‘‘మా నాన్న ఉద్యోగ రీత్యా నేను పుట్టినప్పుడు చెన్నైలో ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్‌కి బదిలీ. ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నలతో మొత్తం ఏడుగురం. ఇంట్లో ఎవరూ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదు. పెళ్లి పత్రికల వెనుక ఖాళీ పేజీ మీద బొమ్మలు గీసి, పత్రిక మీద ఉండే కొన్ని బొమ్మలను కత్తిరించి అతికించి సొంతంగా గ్రీటింగ్‌ కార్డు తయారు చేశాను. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో విరామం వచ్చింది. పిల్లలు పెద్దయ్యి, నాక్కొంత విరామం వచ్చేటప్పటికి యాభై ఏళ్లు నిండాయి. అప్పుడు అనుకోకుండా ఒక వరలక్ష్మీవ్రతంలో వాళ్లిచ్చిన రిటర్న్‌ గిప్టులు చూసినప్పుడు నాలోని సృజనాత్మక కోణం నిద్రలేచింది. ఆ సందర్భం... జీవితం నాకిచ్చిన గిఫ్ట్‌ అనే చెప్పాలి.

ఇక అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు రెండు వందలకు పైగా క్రియేటివ్‌ పీస్‌లను తయారు చేస్తున్నాను. నాకు ఎగ్జిబిషన్‌లకు వెళ్లడం అలవాటు. కొన్నా కొనకపోయినా సరే... ఎగ్జిబిషన్‌లకు వెళ్లేదాన్ని. ఏ ప్రాంతం ఏ హస్తకళలకు ప్రసిద్ధి అనేది అవగతమైంది. అలా ఉదయ్‌పూర్‌కెళ్లి అక్కడి కళాకారుల పనితీరును తెలుసుకున్నాను. నేను బీఏ హిందీ లిటరేచర్‌ స్టూడెంట్‌ని కావడంతో భాష సమస్య రాలేదు. మావారి సలహాతో నేను చేస్తున్న పనిని రిజిస్టర్‌ చేశాను. నాకు వచ్చిన ఆర్డర్‌లకు పని చేసివ్వడంతోపాటు పని నేర్చుకుంటామని వచ్చే మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నాను.
 
ఇదీ రొటీన్‌!
ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల వేడి నీటిని తాగుతాను. అరగంట వాకింగ్, మరో అరగంట డాక్టర్‌ సూచించిన ఎక్సర్‌సైజ్‌లు. ఎనిమిదింటికి కాఫీ లేదా టీ, ఓ గంట సేపు ఫోన్‌లో మెసేజ్‌ లు చెక్‌ చేసుకుని నా క్లయింట్‌ల నుంచి ఆర్డర్‌లు, ఇతర సందేహాలకు రిప్లయ్‌ ఇస్తాను. పదిగంటలకు వంట, పూజ పూర్తి చేసి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తాను. రెండు గంటలు విశ్రాంతి. మధ్యాహ్న భోజనం తర్వాత మా వారు బయటకు వెళ్లినప్పటి నుంచి నా గదిలో పని మొదలు పెడితే ఏడు గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం. కొద్దిసేపు టీవీలో వార్తా విశేషాలు, గేమ్‌ షోలు కొద్దిసేపు టీవీ చూడడం పది గంటలకు నిద్ర.

వారంలో మూడు రోజులు మా వాసవీ మహిళా సంఘం కార్యకలాపాలతో ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉంటాను. హడావుడిగా పరుగులు ఉండవు, కానీ పనిలో ఉంటాను. మా అబ్బాయి, అమ్మాయి కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. వాళ్లు మా ఇంటికి వచ్చే ముందు ‘రేపు నీ పనులేంటమ్మా? మేము ఎప్పుడు రావచ్చు’ అని అడుగుతారు. పిల్లలు వాళ్ల ఉద్యోగాలు, వ్యాపారాల్లో, వాళ్ల పిల్లల చదువులతో బిజీగా ఉంటారు. పిల్లలు మన కోసం టైమ్‌ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ వయసులో తరచూ నిరాశ ఎదురవుతుంటుంది.

అందుకే నా టైమ్‌ని సహాయం అవసరమైన బాలికల చదువు, ఉపాధి కల్పనలో నిమగ్నం చేసుకుంటాను. లాభనష్టాల్లేకుండా నడిచే బాలికల హాస్టల్‌ నిర్వహణ, మహిళా సంఘం కార్యకలాపాలు సంయుక్తంగా చూసుకుంటాం. సహాయం అవసరమై వచ్చిన వాళ్లకు హాస్టల్‌లో వసతి ఇచ్చి, మహిళా సంఘం తరఫున స్కిల్‌ డెవలప్‌మెంట్, వొకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తాం. ఉడాన్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌లోనూ మెంబర్‌ని. దేశరక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పూర్తిగా అందనప్పుడు మా సంస్థ నుంచి వాళ్ల పిల్లల చదువు కోసం స్కూల్‌ ఫీజులు చెల్లిస్తాం.  
 
ఇదే మంచి సమయం!
నా వయసు మహిళలకు నేను చెప్పగలిగిందొక్కటే... విశ్రాంత జీవితం శాపం కాదు, ఇది ఒక వరం. పిల్లలు మన మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చూసుకోవాలని కోరుకోకూడదు. ఎవరికి వాళ్లు తమకంటూ ఒక వ్యాపకాన్ని వృద్ధి చేసుకోవాలి. పుస్తకాలు చదవడం కావచ్చు, పూజలు, సత్సంగాలు, ఆలయాల సందర్శనం... ఏదైనా కావచ్చు. మనిషికి సోషల్‌ లైఫ్‌ ఉండాలి. ఇంటినుంచి బయటకు వస్తే పరిచయాలు పెరుగుతాయి. భావ సారూప్యం కలిగిన వాళ్లతో స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో ప్రతిరోజూ సంతోషకరంగానే గడుస్తుంది’’ అన్నారు విజయా గుప్తా కోట్రికె.

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : నోముల రాజేశ్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement