retirement life
-
పదవీ విరమణకు పెరుగుతున్న ప్రాధాన్యత
న్యూఢిల్లీ: భారతీయుల్లో విశ్రాంత జీవనం పట్ల అవగాహన పెరుగుతోంది. గతంలో జీవిత లక్ష్యాల్లో పదవీ విరమణ ప్రణాళికకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, పీజీఐఎం ఇడియా నిర్వహించిన ‘రిటైర్మెంట్ రెడీనెస్ సర్వే, 2023’ పరిశీలిస్తే ఈ విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 67 శాతం మంది తాము రిటైర్మెంట్ ప్రణాళిక కలిగి ఉన్నట్టు చెప్పడం గమనార్హం. 2020లో నిర్వహించిన సర్వేలో వ్యక్తుల ఆర్థిక ప్రాధాన్యతల్లో రిటైర్మెంట్ (పదవీ విరమణ)కు 8వ స్థానం ఉంటే, అది ఈ ఏడాది సర్వేలో 6వ స్థానానికి చేరుకుంది. రిటైర్మెట్ అనేది కుటుంబ బాధ్యతల్లో భాగమని గతంలో భావించేవారు. కానీ, కొన్నేళ్ల కాలంలో దీనికి నిర్వచనంలో మార్పు వచి్చంది. వ్యక్తిగత సరక్షణ, స్వీయ గుర్తింపునకు రిటైర్మెంట్ను కీలకంగా ఇప్పుడు ఎక్కువ మంది భావిస్తున్నారు. తమ కోరికల విషయంలో రాజీ పడకుండా ఆర్థిక అంశాలపై నియంత్రణను కోకుంటున్నారు. ‘‘కరోనా మహ మ్మారి కొన్ని ముఖ్యమైన అశాలను ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది. స్వీయ గుర్తింపు, స్వీయ సంరక్షణ, స్వీయ విలువ అనేవి కుటుంబ బాధ్యతల నిర్వహణతోపాటు వ్యక్తుల ప్రాధాన్య అంశాలుగా అవతరించాయి’’అని పీజీఐఎం మ్యూచువల్ ఫండ్ సీఈవో అజిత్ మీనన్ పేర్కొన్నారు. సర్వేలోని అంశాలు ► రూ.20–50వేల మధ్య ఆదాయం కలిగిన వారిలో, రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారు 2020లో 49 శాతంగా ఉంటే.. 2023 సర్వే నాటికి 67 శాతానికి పెరిగారు. ► రిటైర్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020 నాటికి రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారిలో 14 శాతం మందే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటే, తాజాగా అది 24 శాతానికి పెరిగింది. ► పదవీ విరమణ తర్వాత జీవనానికి పెద్ద మొత్తంలో నిధి అవసరమని ఎక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు. 2020లో సగటున రూ.50 లక్షలకు ప్రణాళిక రూపొందించుకుంటుంటే, అది రూ.73.44 లక్షలకు పెరిగింది. ► కరోనా మహమ్మారి మిగిలి్చన జ్ఞాపకాల నేపథ్యంలో మరింతగా ఇన్వెస్ట్ చేస్తూ, ఆర్థిక భద్రత కలి్పంచుకోవాల్సిన అవసరాన్ని మూడింట రెండొంతుల మంది గుర్తిస్తున్నారు. ► ఆర్థిక ప్రణాళిక కలిగిన వారిలో 50 శాతం మంది పదవీ విరమణ తర్వాత ఆర్థిక మదగమనం ఏర్పడితే ఎలా అన్న ఆందోళనతో ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత ద్రవ్యోల్బణం, ఆరోగ్యం, జీనవ వ్యయం ఆందోళన కలిగించే ఇతర అంశాలుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం గురించి 56 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. -
Vijaya Gupta K: విశ్రాంత జీవితమూ విలువైనదే!
ఆమె రోజుకు ఆరు గంటలు పని చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? నిజమే. ఆమె వయసు డెబ్బయ్. ఇదీ ఆమె ప్రత్యేకత. తన కోసమే కాదు... సమాజానికీ పనిచేస్తారు. ‘సృజనాత్మకత మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇష్టమైన పని దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ విలువైనదే... సద్వినియోగం చేసుకోవాలి’ అంటూన్న విజయాగుప్తా పరిచయం. ఇది స్క్రీన్ ఎరా. టీవీ స్క్రీన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్. ఇరవై నాలుగ్గంటల్లో పద్నాలుగు గంటలు స్క్రీన్‌తోనే గడిపేస్తున్నారు. స్క్రీన్ మీద పని చేయాల్సిన ఉద్యోగులకు తప్పదు. మరి ఖాళీగా ఉంటూ సమయం ఎలా గడపాలో తెలియక స్క్రీన్‌కి అంకితమయ్యే వాళ్లు మాత్రం తప్పనిసరిగా తమ ఇరవై నాలుగ్గంటలనూ ఒకసారి విశ్లేషించుకోవాలని చెబుతున్నారు హైదరాబాద్, హిమాయత్ నగర్‌కు చెందిన విజయాగుప్తా కోట్రికె. తనకిష్టమైన వ్యాపకం కోసం ఇంట్లో ఒక గదిని వర్క్ స్టేషన్‌గా మార్చుకున్నారామె. ఎనిమిదేళ్ల వయసులో గ్రీటింగ్ కార్డు తయారు చేసిన సృజనాత్మకమైన ఆమె విజయ ప్రస్థానం ఇది. జీవితం ఇచ్చిన గిఫ్ట్ ‘‘మా నాన్న ఉద్యోగ రీత్యా నేను పుట్టినప్పుడు చెన్నైలో ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్‌కి బదిలీ. ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నలతో మొత్తం ఏడుగురం. ఇంట్లో ఎవరూ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదు. పెళ్లి పత్రికల వెనుక ఖాళీ పేజీ మీద బొమ్మలు గీసి, పత్రిక మీద ఉండే కొన్ని బొమ్మలను కత్తిరించి అతికించి సొంతంగా గ్రీటింగ్ కార్డు తయారు చేశాను. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో విరామం వచ్చింది. పిల్లలు పెద్దయ్యి, నాక్కొంత విరామం వచ్చేటప్పటికి యాభై ఏళ్లు నిండాయి. అప్పుడు అనుకోకుండా ఒక వరలక్ష్మీవ్రతంలో వాళ్లిచ్చిన రిటర్న్ గిప్టులు చూసినప్పుడు నాలోని సృజనాత్మక కోణం నిద్రలేచింది. ఆ సందర్భం... జీవితం నాకిచ్చిన గిఫ్ట్ అనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు రెండు వందలకు పైగా క్రియేటివ్ పీస్‌లను తయారు చేస్తున్నాను. నాకు ఎగ్జిబిషన్లకు వెళ్లడం అలవాటు. కొన్నా కొనకపోయినా సరే... ఎగ్జిబిషన్లకు వెళ్లేదాన్ని. ఏ ప్రాంతం ఏ హస్తకళలకు ప్రసిద్ధి అనేది అవగతమైంది. అలా ఉదయ్పూర్కెళ్లి అక్కడి కళాకారుల పనితీరును తెలుసుకున్నాను. నేను బీఏ హిందీ లిటరేచర్ స్టూడెంట్‌ని కావడంతో భాష సమస్య రాలేదు. మావారి సలహాతో నేను చేస్తున్న పనిని రిజిస్టర్ చేశాను. నాకు వచ్చిన ఆర్డర్లకు పని చేసివ్వడంతోపాటు పని నేర్చుకుంటామని వచ్చే మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నాను. ఇదీ రొటీన్! ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల వేడి నీటిని తాగుతాను. అరగంట వాకింగ్, మరో అరగంట డాక్టర్ సూచించిన ఎక్సర్సైజ్లు. ఎనిమిదింటికి కాఫీ లేదా టీ, ఓ గంట సేపు ఫోన్లో మెసేజ్ లు చెక్ చేసుకుని నా క్లయింట్ల నుంచి ఆర్డర్లు, ఇతర సందేహాలకు రిప్లయ్ ఇస్తాను. పదిగంటలకు వంట, పూజ పూర్తి చేసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. రెండు గంటలు విశ్రాంతి. మధ్యాహ్న భోజనం తర్వాత మా వారు బయటకు వెళ్లినప్పటి నుంచి నా గదిలో పని మొదలు పెడితే ఏడు గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం. కొద్దిసేపు టీవీలో వార్తా విశేషాలు, గేమ్ షోలు కొద్దిసేపు టీవీ చూడడం పది గంటలకు నిద్ర. వారంలో మూడు రోజులు మా వాసవీ మహిళా సంఘం కార్యకలాపాలతో ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉంటాను. హడావుడిగా పరుగులు ఉండవు, కానీ పనిలో ఉంటాను. మా అబ్బాయి, అమ్మాయి కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. వాళ్లు మా ఇంటికి వచ్చే ముందు ‘రేపు నీ పనులేంటమ్మా? మేము ఎప్పుడు రావచ్చు’ అని అడుగుతారు. పిల్లలు వాళ్ల ఉద్యోగాలు, వ్యాపారాల్లో, వాళ్ల పిల్లల చదువులతో బిజీగా ఉంటారు. పిల్లలు మన కోసం టైమ్ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ వయసులో తరచూ నిరాశ ఎదురవుతుంటుంది. అందుకే నా టైమ్‌ని సహాయం అవసరమైన బాలికల చదువు, ఉపాధి కల్పనలో నిమగ్నం చేసుకుంటాను. లాభనష్టాల్లేకుండా నడిచే బాలికల హాస్టల్ నిర్వహణ, మహిళా సంఘం కార్యకలాపాలు సంయుక్తంగా చూసుకుంటాం. సహాయం అవసరమై వచ్చిన వాళ్లకు హాస్టల్లో వసతి ఇచ్చి, మహిళా సంఘం తరఫున స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తాం. ఉడాన్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లోనూ మెంబర్ని. దేశరక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పూర్తిగా అందనప్పుడు మా సంస్థ నుంచి వాళ్ల పిల్లల చదువు కోసం స్కూల్ ఫీజులు చెల్లిస్తాం. ఇదే మంచి సమయం! నా వయసు మహిళలకు నేను చెప్పగలిగిందొక్కటే... విశ్రాంత జీవితం శాపం కాదు, ఇది ఒక వరం. పిల్లలు మన మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చూసుకోవాలని కోరుకోకూడదు. ఎవరికి వాళ్లు తమకంటూ ఒక వ్యాపకాన్ని వృద్ధి చేసుకోవాలి. పుస్తకాలు చదవడం కావచ్చు, పూజలు, సత్సంగాలు, ఆలయాల సందర్శనం... ఏదైనా కావచ్చు. మనిషికి సోషల్ లైఫ్ ఉండాలి. ఇంటినుంచి బయటకు వస్తే పరిచయాలు పెరుగుతాయి. భావ సారూప్యం కలిగిన వాళ్లతో స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో ప్రతిరోజూ సంతోషకరంగానే గడుస్తుంది’’ అన్నారు విజయా గుప్తా కోట్రికె. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
కోటిన్నరతో.. కృష్ణా రామా!
సాక్షి, అమరావతి: రూ.కోటిన్నర ఉంటే చాలు.. మన దేశంలో రిటైర్మెంట్ అనంతరం కృష్ణా రామా అని ప్రశాంతంగా జీవనం గడిపేయొచ్చట. అయితే.. ఈ లెక్క భారతీయులకు సంబంధించి కాదండోయ్. అమెరికన్ల కోసం మాత్రమే! ఎందుకంటే.. అమెరికా ఉద్యోగులు, రిటైరైన వారిలో 13 శాతం మంది పదవీ విరమణ అనంతర జీవితాన్ని విదేశాల్లో గడిపే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఏగాన్’ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అమెరికన్లు రిటైర్మెంట్ అనంతరం వివిధ దేశాల్లో సాఫీగా జీవితం గడిపేందుకు ఎంత ఖర్చవుతుందనే గణాంకాలను ఆ సంస్థ విడుదల చేసింది. ► రిటైర్మెంట్ అనంతరం జీవించేందుకు ప్రపంచంలో అత్యధికంగా సింగపూర్‌లో ఎక్కువ వ్యయం (దాదాపు రూ.9.21 కోట్లు) కానుంది. అమెరికాతో పోలిస్తే సింగపూర్‌లోనే 60% అధికంగా రిటైర్డు జీవితానికి ఖర్చవుతుంది. ఆ తరువాత స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌లో కూడా అమెరికాతో పోలిస్తే శేష జీవిత ఖర్చులు ఎక్కువే. ► రిటైరైన అమెరికా ఉద్యోగులు తరువాత జీవితాన్ని సాఫీగా గడపాలంటే పాకిస్థాన్‌లో రూ.1.30 కోట్లు, భారత్‌లో రూ.1.53 కోట్లకుపైగా వ్యయం అవుతుంది. ► ఓ అమెరికా ఉద్యోగి రిటైరైన తరువాత స్వదేశంలో (అమెరికా) శేష జీవితం గడపాలంటే దాదాపు రూ.5.79 కోట్లు కావాలి. -
ముందే రిటైర్మెంటా.. 20 ప్లస్‌లో ఆరంభిస్తే సాధ్యమే
నేటి తరం యువత 60 ఏళ్లు వచ్చే వరకు కష్టపడాలని అనుకోవడం లేదు. కెరీర్‌ను ముందుగానే ముగించాలని కోరుకుంటోంది. ముందస్తు రిటైర్మెంట్ ఆకాంక్ష క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా రిటైర్ అయితే, అప్పటి నుంచి తమ అభిరుచులకు అనుగుణంగా స్వేచ్ఛగా జీవించొచ్చనే కాన్సెప్ట్ ఆదరణకు నోచుకుంటోంది. తోటి వారిని చూసి దీనికి ఆకర్షితులయ్యే వారూ ఉంటున్నారు. కానీ, ఇది ఎలా సాధ్యం? ఇదే ఎక్కువ మందికి ఎదురయ్యే ప్రశ్న. దీనిపై స్పష్టత తెచ్చుకోలేక, తర్వాత చూద్దాంలే.. అని అనుకుని కెరీర్లో సాగిపోయేవారూ ఉన్నారు. ఉద్యోగ, వృత్తి బాధ్యతలకు ముందస్తుగా విరమణ పలికి, నచ్చినట్టు జీవించడం అంటే వినడానికి ఎంతో ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, దీన్ని చేరుకోవాలంటే సరైన లెక్కలు, ప్రణాళికలు కావాలి. వాటిని ఆచరణలో పెట్టినప్పుడు లక్ష్యం సఫలమవుతుంది. ఇందుకు ఏం చేయవచ్చన్నది అవగాహన కల్పించే కథనం ఇది. రిటైర్మెంట్ అన్నది అన్నింటిలోకి చివరి లక్ష్యం అవుతుంది. దీనికంటే ముందు జీవితంలో నెరవేర్చాల్సిన, సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు తదితరాలు. వీటిని సాధించేందుకు సరైన దిశలోనే అడుగులు వేస్తున్నారా? రిటైర్మెంట్ కంటే ముందుగా ఎదురయ్యే లక్ష్యాలకు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక అవసరం. వీటిని చేరుకునేందుకు కావాల్సినంత, సరైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. లేకపోతే జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యాల విషయంలో ఏ మాత్రం లెక్కలు తప్పినా, రిటైర్మెంట్ లక్ష్యం విషయంలో రాజీ పడాల్సి రావచ్చు. ఎవరైనా కానీ, ముందుగా ఎదురుపడే అవసరం గురించే ఆలోచిస్తారు. అందుకే ముందే రిటైర్మెంట్ తీసుకోవాలంటే, దానికంటే ముందు ఎదురయ్యే వాటి గురించి కూడా ప్రణాళిక వేసుకోవాలి. జీవితంలో కీలకమైన లక్ష్యాలు సాధించలేకపోతే రిటైర్మెంట్ సాధ్యం కాదన్న సూక్ష్మాన్ని గుర్తించాలి. ‘‘సురక్షితమైన భవిష్యత్తుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత మీ జీవన శైలి పదవీ విరమణ తర్వాత దిగజారిపోకూడదు. వైద్య చికిత్సలకు అవసరమైనంత నిధి ఉండాలి. పిల్లల విద్య, వారి వివాహాలు, కారు కొనుగోలు, సెలవుల్లో పర్యటనలు వీటన్నింటికీ ఏర్పాట్లు ఉండాలి’’అని హమ్ ఫౌజీ సీఈవో సంజీవ్ గోవిలా సూచించారు. ఎంత కావాలి..? విశ్రాంత జీవనం కోసం సమకూర్చుకోవాల్సిన నిధి విషయంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే సమకూర్చుకున్న నిధి ఏ మూలకూ చాలకపోవచ్చు. అదే జరిగితే పేరుకే రిటైర్మెంట్ అవుతుంది. ఆ తర్వాత ఖర్చులకు చాలక మళ్లీ ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకుని రిటైర్మెంట్ కోసం కావాల్సిన నిధిని పక్కా అంచనా వేయాలి. ఈ విషయంలో నిపుణుల సాయం ఎంతో అవసరం పడుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి కావాల్సిన నిధిని అంచనా వేయడం అత్యంత ముఖ్యమైనదని రైట్ హారిజాన్స్ ఫండ్ మేనేజర్ అనిల్ రెగో పేర్కొన్నారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం నెలవారీ ఖర్చులు రూ.25,000 ఉన్నాయని అనుకుందాం. అతడు ఏ వయసులో రిటైర్ అయితే ఆ తర్వాత జీవనానికి ఎంత మొత్తం కావాలన్నది ఇక్కడి పట్టికలో చూడొచ్చు. ప్రస్తుత నెలవారీ వ్యయాలకు ఏటా సగటున 5 శాతం ద్రవ్యోల్బణం ప్రభావం పరిగణనలోకి తీసుకుని రిటైరయ్యే నాటికి ఎంత కావాలో వేసిన అంచనాలు ఇవి. పట్టికలోని నెలవారీ పెట్టుబడిని ఏడాదికోసారి 8 శాతం పెంచుతూ వెళ్లాలి. పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి వస్తుందన్న అంచనా. రిటైర్మెంట్ నాటికి సమకూరిన ఫండ్‌పై ఆ తర్వాత ఏటా 7 శాతం రాబడి వస్తుందని అనుకుంటే, ఇంత మొత్తం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అవసరాలు వేర్వేరు.. రిటైర్మెంట్కు తక్కువ వ్యవధి ఉన్నప్పుడు నెలవారీ పెట్టుబడికి ఎక్కువ మొత్తం అవసరపడుతుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన జీవనశైలి, అవసరాలు, ఖర్చులు ఉంటుంటాయి. కనుక నెలవారీ ఎంత మొత్తం, ఏడాదికి ఎంత చొప్పున కావాలన్నది ఎవరికి వారు అంచనాకు రావాలి. ఏడాదికి తమ ఖర్చులు, తమ ఆరోగ్య అవసరాలు, ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉన్నాయా? పిల్లలు ఎంత మంది? వారికి ఏ స్థాయి ఖర్చులో విద్య చెప్పించాలని అనుకుంటున్నారు? సొంతింటి ప్రణాళిక, వాహనం ఇత్యాది అవసరాలన్నింటినీ ఒక జాబితాగా రాసుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక సలహాదారు లేదంటే పెట్టుబడి సలహాదారును సంప్రదించాలి. వారు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, నెలవారీగా దేనికి ఎంత మొత్తం పొదుపు, మదుపు చేయాలి, ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి? అనేది ఒక ప్రణాళిక రూపొందించి ఇస్తారు. దీనికోసం ద్రవ్యోల్బణం, జీవిత కాలం తదితర అంశాలను వారు విశ్లేషిస్తారు. వారిచ్చిన ప్రణాళిక ప్రకారం సాగిపోవాలి. 30 ఏళ్ల వ్యక్తి నెలవారీ ఖర్చులు రూ.30,000 ఉన్నాయని అనుకుంటే ఏ వయసులో రిటైర్మెంట్ అయితే ఎంత మొత్తం కావాలో ఇక్కడి టేబుల్లో చూడొచ్చు. పైన టేబుల్ మాదిరే జీవిత కాలం 90 ఏళ్లకు అనుకుని, ఏటా పెట్టుబడిపై 10 శాతం రాబడి అంచనా ప్రకారం, ఏటా పెట్టుబడి 8 శాతం పెంచుతూ వెళ్లే విధంగా, రిటైర్మెంట్ తర్వాత 7 శాతం రాబడి కోసం సమకూర్చుకోవాల్సిన నిధి అంచనాలు ఇవి. అప్రమత్తత రిటైర్మెంట్కు మరో ఐదేళ్లు ఉందనగా పెట్టుబడుల విషయంలో అప్రమత్తం కావాలి. ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వారు మార్కెట్ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణమైన వ్యూహాన్ని అమల్లో పెట్టాలి. ఉదాహరణకు 2008 మార్కెట్ పతనం, 2020 మార్కెట్ పతనం గుర్తుండే ఉంటాయి. 2020 మార్కెట్ పతనం తర్వాత స్టాక్స్ రికవరీకి ఏడాది సమయం పట్టింది. కొన్ని స్టాక్స్ పూర్తిగా కోలుకుని కొత్త గరిష్టాలకు చేరుకుంటే, కొన్ని ఆలస్యంగా రికవరీ అయ్యాయి. అందుకుని రిటైర్మెంట్కు మరో మూడు–ఐదేళ్లు ఉందనగా, మార్కెట్ సైకిల్‌ను అర్థం చేసుకోవాలి. భారీ దిద్దుబాటు వచ్చి దిద్దుబాటు వచ్చి చాలా ఏళ్లు అయ్యిందా? మార్కెట్ల వ్యాల్యూషన్లు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో చలిస్తున్నాయా? ఇలాంటి అంశాలపై నిపుణుల సాయంతో అంచనాకు రావాలి. మూడు ఐదేళ్ల ముందు నుంచి ఏటా నిర్ణీత శాతం చొప్పున ఈక్విటీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ డెట్ సాధనాల్లోకి మళ్లించుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో కొంత మేర పెట్టుబడులు అవసరంపడతాయి. ఎందుకంటే ముందుగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత కనీసం 25 ఏళ్ల నుంచి 35–40 ఏళ్ల పాటు జీవించి ఉండే వారికి ఈక్విటీలు తప్పనిసరి. అప్పుడే కార్పస్ కరిగిపోకుండా ఉంటుంది. అందుకుని నిపుణులు సూచించిన మేర ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించి, మిగిలిన మొత్తాన్ని క్రమంగా వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఊహించని విధంగా రిటైర్మెంట్ నాటికి మార్కెట్లు భారీ దిద్దుబాటుకు గురైతే అప్పుడు రిటైర్మెంట్ లక్ష్యాన్ని ఏడాది నుంచి మూడేళ్ల పాటు వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. అందుకుని సాధ్యమైన మేర లక్ష్యం వాయిదా పడకూడదంటే ముందస్తు జాగ్రత్తలు తప్పదు. అవరోధాలు.. ముందుగా పదవీ విమరణ తీసుకునే వారికి సంపాదించే కాలం ఇతరులతో పోలిస్తే తక్కువ ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలంలో సమకూర్చుకోవాల్సినంత 20–25 ఏళ్లకే సాధించాలి. రిటైర్మెంట్ తర్వాత ఇతరులపై ఆధారపడకూడదు. పైగా ముందస్తు రిటైర్మెంట్ అంటే ఉదాహరణకు 55 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుందాం. అక్కడి నుంచి కనీసం 80 ఏళ్ల వరకు జీవించి ఉంటారని అనుకుంటే, 35 ఏళ్ల కాలానికి అవసరాలు తీర్చేంత ఫండ్ కావాలి. 25–30 ఏళ్లకు కెరీర్ ఆరంభిస్తే.. అక్కడి నుంచి ముందస్తు రిటైర్మెంట్కు 30–25 ఏళ్లే మిగిలి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ కాలానికి ఫండింగ్ ఏర్పాటు చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదన్నది గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణతో, ఎటువంటి దుబారాకు చోటు ఇవ్వకుండా సంపాదనలో అధిక భాగం భవిష్యత్తుకు పొదుపు చేసుకున్నప్పుడు లక్ష్యం సాకారం అవుతుంది. ఉదాహరణకు పిల్లల విద్య కోసం బడ్జెట్ వేసుకుంటే, ఆ బడ్జెట్ మించకుండా దాన్ని అధిగమించాలి. లేదంటే వేరే లక్ష్యం కోసం ఉద్దేశించిన మొత్తం నుంచి దానికి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు గొలుసుకట్టు మాదిరి ఒకదాని కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది. లేదంటే రుణం తప్పదు. రాబడి రేటు కీలకం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) ఇన్వెస్ట్ చేసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు అందుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే, పెట్టుబడుల విధానంలో చిన్న మార్పుతోనూ మెరుగైన నిధిని సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మనకు ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగే మొత్తానికి అనుగుణంగా సిప్ పెట్టుబడినీ పెంచుకుంటూ వెళ్లాలి. ఏడాదికోసారి ఆర్జన పెరిగినప్పుడు పెట్టుబడిని పెంచుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. ఖర్చులు కూడా ద్రవ్యోల్బణ ప్రభావంతో ఏటా పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెరిగాయని పెట్టుబడుల విషయంలో రాజీ పడితే లక్ష్యం సాకారం కాదు. అనవసర ఖర్చులను తగ్గించుకుని అయినా అనుకున్న మేర, ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఏటా ఆదాయం అనుకున్న మేర పెరగకపోతే ఎలా? దీనికి సంబంధించి కూడా ప్లాన్–బి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్రస్తుత జీవనశైలిలో పూర్తి రాజీ పడకూడదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రెండింటినీ సమన్వయం చేసుకునే విధంగా ఆచరణ ఉండాలి. అలాగే, ఏటా పెట్టుబడిని పెంచడం ఒక్కటి కాకుండా, పెట్టుబడి సాధనాల మధ్య సమతూకం కూడా ఉండాలి. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాల్సిందే. పెట్టుబడులకు కనీసం 20 ఏళ్లు అంతకుమించి కాలం ఉంటే అగ్రెస్సివ్ ప్రణాళిక వేసుకోవచ్చు. ఈక్విటీలకు 75 శాతం నుంచి 100 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎన్పీఎస్ ప్లాన్‌లోనూ 75 శాతం ఈక్విటీ పెట్టుబడులకు ఆప్షన్ ఉంది. ఎంత ఎక్కువ కాలం ఉంటే కాంపౌండింగ్ వల్ల అంత పెద్ద మొత్తం సమకూరుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి అధిక రిస్క్ తీసుకునే వారికి సాధారణంగా 70–80 శాతం ఈక్విటీలు, మిగిలిన 20 శాతం మేర స్థిరాదాయ (డెట్) పథకాలను నిపుణులు సూచిస్తుంటారు. నిజానికి చాలా మంది విషయంలో గమనిస్తే అన్నింటికంటే ఆలస్యంగా మొదలు పెట్టేది రిటైర్మెంట్ కోసమే అవుతోంది. ఎక్కువ మంది చేసే పెద్ద తప్పిదం ఇదే. ఆర్జన మొదలైన మొదటి నెల నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించిన వారు చాలా సులభంగా కావాల్సిన నిధిని సమకూర్చుకోగలరు. అంతేకాదు, కాంపౌండింగ్ పవర్‌తో ముందస్తు రిటైర్మెంట్ వీరికి చాలా సులభం అవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ ఈ లక్ష్యం భారంగా మారుతుంది. రిస్క్‌లు–రక్షణ ముందస్తు రిటైర్మెంట్ లక్ష్యం పెట్టుకున్న వారు రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణాలు తీసుకున్నా, రిటైర్మెంట్ పెట్టుబడుల ప్రణాళికకు అవరోధంగా లేకుండా ఉండాలి. రిటైర్మెంట్ నాటికి తీర్చేలా ఉండాలి. మరీ ముఖ్యంగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకునే వారు ఉద్యోగం భద్రత అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. రుణాలపై మారటోరియం ఆప్షన్ తీసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఊహించని పరిణామాలు ఎదురైతే ప్రణాళిక వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ విధమైన రిస్క్‌లను ఎదుర్కొనే ప్రణాళిక కూడా కావాలి. అలాగే, రోడ్డు ప్రమాదంలో గాయపడి వైకల్యం పాలై ఆర్జన ఆగిపోయే పరిస్థితి వస్తే..? అనుకున్నదంతా తలకిందులైపోతుంది. దీనికి సంబంధించి బీమా కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. అలాగే, మనకు ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబాన్ని ఆదుకునే జీవిత బీమా, ఆస్పత్రిలో వైద్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకుని చాలా ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ----------------------------------------------------------------------------------------------------------------------------- గమనిక: ఇక్కడ పట్టికల్లో ఇచ్చిన అంచనాలు అన్నీ కూడా పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి ప్రకారం వేసిన అంచనాలు. కానీ, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో 12 శాతం వార్షిక రాబడి సాధ్యమే. కనుక ఆ ప్రకారం చూస్తే చేయాల్సిన నెలావారీ పెట్టుబడి 10 శాతం తక్కువైనా అనుకున్న కార్పస్‌ను సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. -
అవిశ్రాంత పోరాటం
విశ్రాంత జీవనం అంటేనే ఎన్నో అనుభవాలతో కూడుకున్నది. పోరాటాల జీవనమైతే వాటి ఫలితాల గురించి నలుగురికి తెలియజేసి, సమస్యల పరిష్కార దిశగా సాగమని సూచనలు చేస్తారు. 79 ఏళ్ల రూప్ రేఖా వర్మ జీవనం పోరాటాల ప్రయాణమే. లక్నో వీధుల్లో నిలబడి అన్యాయాలను ప్రతిఘటించమని, న్యాయంగా జీవించమని వీధుల్లో కరపత్రాలను పంపిణీ చేసి మరీ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అంతేకాదు.. కేరళ జర్నలిస్ట్ కప్పన్‌కు ఉత్తర్ ప్రదేశ్‌లో బెయిల్ ఇచ్చేందుకు ఈ వయసులోనూ ధైర్యంగా ముందుకొచ్చి వార్తల్లో నిలిచారు. లేమి నుంచే పోరాటం.. తను చదువుకున్నప్పటి రోజుల గురించి వివరిస్తూ ‘యూనివర్శిటీలో ఎం.ఏ. చేస్తున్నప్పుడు టీచర్లతో, సీనియర్లతో మాట్లాడాలన్నా భయమేసేది. కానీ, అక్కడ అమ్మాయిల కోసం ఏమాత్రం సౌకర్యాలు ఉండేవి కావు. ముఖ్యంగా ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేవి కావు. చాలా కష్టంగా అనిపించేది. ఇలా భయపడితే లాభం లేదు. ఏదైనా తెగింపుతోనే సాధ్యం అనుకున్నాను. అలాగే, కాలేజీ సమస్యలపై గళమెత్తాను. దీంతో టాయ్‌లెట్స్ మాత్రమే కాదు ఉమెన్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. ఇది అప్పటి రోజుల్లో పెద్ద విజయమే. ఆ తర్వాత అదే యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరాను. అధ్యాపకురాలిగా... ‘ఎక్కువగా సామాజిక సమస్యలపైనే విద్యార్థులకు బోధన ఉండేది’ అంటూ 40 ఏళ్లు యూనివర్శిటీ అనుభవాలను మన ముందుంచుతోంది ఈ అధ్యాపకురాలు. మూడేళ్ల పాటు జీతం లేకుండా ప్రత్యేకంగా ఉమెన్ రీసెర్చ్ సెంటర్‌ను సైతం నిర్వహించారు. అదే సమయంలో కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రీసెర్చ్ అకడమిక్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయడంతో పాటు లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేసింది. ‘సిలబస్‌కు మించి సమాజంపై అవగాహనకు పుస్తకాలే దోహదం చేశాయి. సాహిత్యంపై ఆసక్తి, తత్త్వశాస్త్ర అధ్యయనం వల్ల అభ్యుదయ భావాలు అభివృద్ధి చెందాయి’ అని తనకు కలిగిన ఆలోచనల గురించి నలుగురితో పంచుకుంటోంది. తన∙హయాంలో అప్లికేషన్ ఫారమ్‌లో అప్పటివరకు తండ్రి పేరు మాత్రమే ఉండేదని, ఆ తర్వాత కాలంలో తల్లిపేరు కూడా చేర్చేలా చేశామని వివరిస్తుంది. హత్యారోపణలు ‘దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి నా వయసు నాలుగేళ్లు. మా నాన్న డాక్టర్‌గా సేవలు అందజేసేవాడు. నాటì స్వాతంత్య్ర రోజుల్లో సమస్యలను చూస్తూ, కథలు వింటూ పెరిగాను. ఇంట్లోనూ దేశానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ చర్చల్లో ఉండేవి. కాలేజీలోనూ ఏ కార్యక్రమమైనా చర్చావేదిక ఉంటే అక్కడ తప్పక నేనుండేదాన్ని. మతం పేరుతో, కులం పేరుతో అల్లర్లు సృష్టించేవారుండేవారు. ఏదో విధమైన గొడవలకు విద్యార్థులను ప్రేరేపించేవారు. ఆ అల్లర్లు ఎలా ఉండేవంటే.. నా మీద హత్యారోపణలు కూడా వచ్చాయి. నా పైన తప్పుడు కేసులు పెట్టారు. నాపైన దుష్ప్రచారాలతో కూడిన ఉత్తరాలు ఇంటింటికీ పంపించారు. యూనివర్శిటీలో ఉద్యోగానికి, బోధించడానికి అవన్నీ అడ్డు పడ్డాయి. ఏడాదిన్నరపాటు కోర్టులో పోరాటం చేసి నెగ్గాను. సమాజం, విద్యార్థులు నాకు తోడుగా నిలిచారు. దీంతో నా గురించి చాలా మందికి తెలిసింది..’ అంటూ తాను సమస్యలను ఎదుర్కొన్న విధం గురించి వివరిస్తారు. పెళ్లి వ్యాపారం కాదు.. వివాహ వ్యవస్థ గురించి తెలియజేస్తూ ‘మన సమాజంలో అమ్మాయిల పెళ్లికి సంబంధించి ఎప్పుడూ తప్పుడు ఆలోచనలే ఉంటాయి. ఆడపిల్లకు వయసు వస్తే చాలు పెళ్లెప్పుడు అని ప్రశ్నిస్తుంటారు. ఎవరో తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో అని చెబుతారు. ‘నో’ చెబితే ఎందుకు చేసుకోవు.. అని నిలదీస్తారు. పెళ్లి అంటే వ్యాపారం కాదు కదా! నేనెవరినీ ఇష్టపడలేదు. ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను. లేదంటే లేదు’ అని ఇంట్లోవారికి గట్టిగానే చెప్పాను. దీంతో ఎవరూ నా ఆలోచనకు విరుద్ధంగా ప్రవర్తించలేకపోయారు’ అని తన ఒంటరి జీవితం గురించి వివరించే రూప్ రేఖా వర్మ 1980లో ‘సాజీ దునియా’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. సమస్యలపై ఒంటరిగా పోరాడటం మొదలుపెట్టారు. ‘మొదట్లో ఆ సంస్థలో చాలా కొద్దిమంది మాత్రమే చేరారు. ఏం చేసైనా సమతా సమాజాన్ని సృష్టించడమే లక్ష్యంగా కొనసాగుతాను’ అని చెబుతారు. వీధి వీధిలో అవగాహన.. ప్రభుత్వాలు, వారి అణచివేత, సమాజంలో వివక్ష విధానాలపై కాలేజీ రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్న రేఖా వర్మ ‘అధ్యాపకురాలిగా ఉన్నప్పటి నుంచే వీధుల్లో కరప్రతాలు పంచుతూనే ఉన్నాను’ అని తెలియజేస్తారు. ‘లక్నో వీధుల్లో నిలబడి స్వాతంత్య్రానికి ముందు భారతీయులు సమష్టి్టగా జరిపిన విప్లవాల గురించి కథనాలున్న కరపత్రాలను పంచుతున్నాను. సంఘటితంగా పోరాటం చేస్తేనే ఏదైనా మనకు చేరువ అవుతుంది అని చెప్పడమే నా లక్ష్యం. కులం, మతం అనే వివక్ష, ద్వేషం వదిలేసి మిగిలిన జీవిత సమస్యలపై దృష్టి పెట్టండి. వాటి పరిష్కారానికి చేయీ చేయీ కలపండి. దేశంలో పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఉద్యమించండి. విభేదాలు విడిచిపెట్టి, ఒక్కతాటి పైకి వస్తేనే దేశం పురోగమిస్తుంది’ అని చాటుతోంది ఈ అధ్యాపకురాలు. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ కష్టపడ్డాం ఇక విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడిపేద్దాం అని చాలామంది అనుకుంటారు. కానీ, లక్నో యూనివర్శిటీకి వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేసి రిటైర్ అయిన రూప్ రేఖా వర్మ మాత్రం మంచి పనికి అసలు రిటైర్మెంట్ లేదనుకుంది. ఎనిమిది పదుల వయసుకు చేరువలో ఉన్న రూప్ రేఖ ఈ సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకుంది. అన్యాయాలపై పోరాటం చేయడానికి అవగాహనే లక్ష్యంగా సాగాలని వీధి వీధి తిరుగుతోంది. -
భవిష్యత్‌కు భరోసా ఎంత!
రిటైర్మెంట్ జీవితంపై 56 శాతం ఉద్యోగుల ఆందోళన: తేల్చిన సర్వే న్యూఢిల్లీ: క్షణం తీరిక లేని బిజీ జీవన గమనంలో కొట్టుకుపోతున్న సగటు ఉద్యోగికి భవిష్యత్‌పై భరోసా ఎంత? దేశంలోని సగానికి పైగా ఉద్యోగుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. తమ తల్లిదండ్రులతో పోలిస్తే... పదవీ విరమణ తరువాత జీవితంపై 56 శాతం మంది ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థ ‘విల్స్ టవర్స్ వాట్సన్’ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మొత్తం రెండు వేల మంది ఉద్యోగులపై సంస్థ అధ్యయనం చేసింది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు ఆర్థిక సమస్యలు తమ జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నతమైన పదవీ విరమణ లేదంటే హెల్త్ బెనిఫిట్స్, బోనస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగుల దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి సంస్థలు తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విల్స్ టవర్స్ వాట్సన్ ఇండియా డెరైక్టర్ కులిన్ పటేల్ చెప్పారు. ఉద్యోగులను పొదుపు వైపు మళ్లించేలా సహకారం అందించాలన్నారు.