భవిష్యత్‌కు భరోసా ఎంత!
రిటైర్మెంట్ జీవితంపై 56 శాతం ఉద్యోగుల ఆందోళన: తేల్చిన సర్వే
న్యూఢిల్లీ: క్షణం తీరిక లేని బిజీ జీవన గమనంలో కొట్టుకుపోతున్న సగటు ఉద్యోగికి భవిష్యత్‌పై భరోసా ఎంత? దేశంలోని సగానికి పైగా ఉద్యోగుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. తమ తల్లిదండ్రులతో పోలిస్తే... పదవీ విరమణ తరువాత జీవితంపై 56 శాతం మంది ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థ ‘విల్స్ టవర్స్ వాట్సన్’ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
మొత్తం రెండు వేల మంది ఉద్యోగులపై సంస్థ అధ్యయనం చేసింది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు ఆర్థిక సమస్యలు తమ జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నతమైన పదవీ విరమణ లేదంటే హెల్త్ బెనిఫిట్స్, బోనస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ క్రమంలో ఉద్యోగుల దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి సంస్థలు తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విల్స్ టవర్స్ వాట్సన్ ఇండియా డెరైక్టర్ కులిన్ పటేల్ చెప్పారు. ఉద్యోగులను పొదుపు వైపు మళ్లించేలా సహకారం అందించాలన్నారు.