భారత్‌లో పనిగంటల అంశం మరోసారి చర్చ తెర మీదకు వచ్చింది. ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారం మొత్తం మీద ఏకంగా 90 గంటలు పని చేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. మొన్నీమధ్యే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 70 గంటలు పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యం ‘అంతకుమించి’ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ఈ దరిమిలా వీళ్లిద్దరి గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. అయితే..
ఇంతకీ 70.. 90.. మనిషి శరీరం ఒక వారంలో అసలు ఎన్నేసి పనిగంటలను చేయగలదు?. ఏ మేర పని ఒత్తిడిని ఒక ఉద్యోగి భరించగలరు?. అలా గనుక పని చేస్తే.. శరీరంలో కలిగే మార్పులేంటి?. ఈ విషయంలో అసలు వైద్యులు ఏం చెబుతున్నారు?.. బిజినెస్ టైకూన్లు చెబుతున్న అంతటి పని భారం ఉద్యోగి మోయ తరమేనా?..
వారంలో 90 గంటలపని.. అంటే ఏడు రోజులపాటు 13 గంటల చొప్పున పని చేయాలన్నమాట. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, ఇతర పనులు, ప్రయాణాలు, ఆఖరికి కుటుంబ సభ్యులతో గడపడం లాంటి వాటితో సర్దుకుపోవాలన్నమాట. అయితే ఇది శారీరకంగానేకాదు.. మానసికంగానూ మనిషిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయం ప్రకారం.. వారంలో 55 గంటలకు మించి గనుక పని చేస్తే గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉంటుందట. అలా పనిచేసే ఉద్యోగుల్లో వందలో 35 మంది స్ట్రోక్ బారినపడే అవకాశం ఉంది. వందలో 17 మంది ప్రాణమే పొగొట్టుకునే అవకాశం ఉంది అని ఆ స్టడీ వెల్లడించింది.
‘‘ఎక్కువసేపు పని చేయడమంటే గుండె మీద ఒత్తిడి పెంచడమే. దీనివల్ల కోర్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్‌లపై ప్రభావం పడుతుంది. తద్వారా బీపీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. అలా హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌తో పాటు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడడమో లేదంటే కుంచిచుపోతాయి’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. ఉద్యోగుల పని గంటలు తగ్గాల్సిందే!
.. ఇక ఎక్కువ గంటలు పని చేయడం డయాబెటిస్‌కు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఇది రక్తంలో షుగర్ స్థాయిపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతుంది. మహిళలు 45 గంటలకంటే ఎక్కువసేపు పని చేసినా.. పురుషులు 53 గంటలకు మించి పని చేసినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు తెలిపాయి కూడా. ఇక చాలాసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఇది ఒబెసిటీ(స్థూలకాయం)కి దారి తీయొచ్చు. అన్నింటికి మించి.. విపరీతమైన పనిభారం మానసిక ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. ఇది బంధాలకు బీటలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే..
విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. జీరో రెస్ట్ వర్క్.. నిద్రాహారాలను నిర్లక్ష్యం చేయిస్తుంది. పని ఒత్తిడి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతిమంగా.. అనారోగ్యకరమైన జీవనశైలి వైపునకు అడుగులు వేయిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో అధిక పని గంటల నిర్ణయాలతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: వారానికి మొత్తం 40 గంటలే పని ఉండాలి!
ఇన్ఫోసిస్ మూర్తి(78) ఏమన్నారంటే..
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలి.
తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మరోసారి ఆయన స్పందిస్తూ..
ఇన్ఫోసిస్(Infosys)ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?.
ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం(64) ఏమన్నారంటే..
ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను. అయినా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. అందుకోసం ఆదివారం సెలవులనూ వదిలేయాలి.
Comments
Please login to add a commentAdd a comment