‘వారానికి 40 గంటలే పని ఉండాలి!’ | EY Worker Death Row: Congress MP Shashi Tharoor 40 Hours Theory | Sakshi
Sakshi News home page

వారానికి ఐదురోజులు.. మొత్తం 40 గంటలే పని ఉండాలి!

Published Sat, Sep 21 2024 8:55 AM | Last Updated on Sat, Sep 21 2024 10:34 AM

EY Worker Death Row: Congress MP Shashi Tharoor 40 Hours Theory

పని భారం.. తీవ్ర ఒత్తిడితో ఓ యువ ఉద్యోగిణి ప్రాణం కోల్పోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ భిన్నంగా స్పందించారు.

పని ఒత్తిడితో యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా ఉద్యోగి మరణించిన ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. పని ప్రదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగొద్దని సూచించిన ఆయన.. పనివేళలపై పార్లమెంట్‌లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు. ఈ క్రమంలో వారానికి 40 గంటల పని దినాల ప్రతిపాదన తెరపైకి తెచ్చారాయన.

 

నాలుగు నెలలు.. ఏడు రోజులు.. రోజుకి 14 గంటల చొప్పున పని చేయడంతోనే ఆమె ఒత్తిడికి గురైంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నా. అందుకే వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండాలి. ప్రభుత్వ/ప్రైవేట్‌ ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలే పని చేయాలి. ఈ దిశగా చట్టం కోసం వచ్చే  పార్లమెంట్‌ సమావేశాల్లో నా వంతు కృషి చేస్తా.. అని తన ఎక్స్‌ ఖాతాలో ఆయన ఒక సందేశం కూడా ఉంచారు. అంతేకాదు ఇదే అంశంపై అన్నా తండ్రి సిబి జోసెఫ్‌తోనూ తాను మాట్లాడినట్లు థరూర్‌ తెలిపారు.

కేరళకు చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్‌ అన్నా సెబాస్టియన్‌ పెరయిల్‌(26) నాలుగు నెలలుగా పూణే ఈవై కార్యాయలంలో పని చేస్తూ.. జులై నెలలో కన్నుమూసింది. అయితే పని ఒత్తిడి వల్లే అన్నా మరణించిందని ఆమె తల్లి అనిత ఈవై ఇండియా చైర్మన్‌ రాజీవ్‌ మెమానీకి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇక.. ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక శాఖ విచారణ చేపట్టింది. మరోవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రాజీవ్‌ మెమానీ స్పందించారు. ‘‘ఆమె కుటుంబంతో మాట్లాడాను. సెబాస్టియన్‌ మృతికి సంతాపం తెలిపాను. వారి జీవితంలో ఏర్పడిన వెలితిని ఎవరూ పూడ్చలేరు. ఆమె అంత్యక్రియల సమయంలో మేము అక్కడ లేకపోవడంపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నాను. ఇది మా పని సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. భవిష్యత్తులో ఇలా జరగదు’’ అని సంస్థ మెమానీ పేర్కొన్నారు. 

తెరపైకి నారాయణమూర్తి కామెంట్స్‌

పని ఒత్తిడితో ఈవై ఉద్యోగిణి మరణించడం చర్చనీయాశంగా మారిన వేళ.. పనిగంటలపై ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా.. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలన్నా.. భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాల్సిందేనని అన్నారాయన.  

‘‘ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ.  అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే మన యువత అదే తరహాలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ‘ఇదీ నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతా’ అనే అనే ప్రతిజ్ఞ చేయాలి’’ అని నారాయణమూర్తి అన్నారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

వారానికి 100 గంటలైనా పని చేయాలంటూ ఎలోన్‌ మస్క్‌ లాంటి బిలియనీర్లు పిలుపు ఇస్తుంటారు. కానీ,   ఓవర్ వర్క్ వల్ల గుండె, మెదడు ఇతర కీలకమైన అవయవాలపై ఒత్తిడి పడుతుంది. చివరకు.. మరణానికి కూడా దారి తీయొచ్చు. మొన్నీమధ్య చైనాలోనూ ఓ పెయింటర్‌ ఇలా గొడ్డు చాకిరీ చేసే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఆరా తీస్తే..  వరుసగా 104 రోజులు పని చేసిన ఆ కిందిస్థాయి ఉద్యోగి..  ఒకే ఒక్కరోజు సెలవు తీసుకున్నాడని తేలింది. 

ఇదీ చదవండి: కోటి జీతం.. అయినా ఈవై ఉద్యోగం వద్దనుకున్నాడు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement