ఆఫీస్‌లో ఎక్కువ పనిచేస్తే.. ఇక అంతే! | Japan Turns To Tech To Cut Working Hours In Government Offices | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌లో టైం దాటినా పనిచేస్తే.. మెమో జారీ!

Published Sat, Mar 9 2019 8:54 AM | Last Updated on Sat, Mar 9 2019 8:54 AM

Japan Turns To Tech To Cut Working Hours In Government Offices - Sakshi

జపాన్‌... పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడి. అంతటి భయంకర దాడికి దేశం చిన్నాభిన్నమైనప్పటికీ... జపనీయులు ఎంతో  మనోధైర్యంతో తమ దేశాన్ని మళ్లీ నిలబెట్టుకున్నారు. తమ జీవనశైలితో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఎంతో నిబద్ధతో పనిచేసే జపనీయులు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ... తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు...  అక్కడి ప్రభుత్వం రొటీన్‌కు భిన్నంగా కొత్త కొత్త నిబంధనలు రూపొందించి మరీ క్రమశిక్షణలో పెడుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకునేంతంగా ఆ దేశ పౌరులు ఏంచేస్తున్నారో మనమూ ఓసారి తెలుసుకుందాం... 

టోక్యో:  జపాన్‌లోని ఓ ఆఫీస్‌.. డ్యూటీ షిప్ట్‌ ముగిసిపోయే సమయం సాయంత్రం 5 గంటలకు సరిగ్గా ఓ అలారం మోగుతుంది. ఉద్యోగులు వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని అనౌన్స్‌మెంట్‌ వస్తుంది. కాసేపయ్యాక.. ఓ డ్రోన్‌ ఆఫీస్‌ మొత్తం తిరుగుతుంది. ఎక్కడైనా ఉద్యోగులు కనిపిస్తే.. వెంటనే పై అధికారులకు సమాచారం ఇస్తుంది.  వాళ్లు సదరు ఉద్యోగులకు ఫోన్‌ చేస్తారు. వెంటనే పని ఆపేసి వెళ్లకపోతే మెమో జారీ చేస్తామని హెచ్చరిస్తారు. విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. జపాన్‌లోని ప్రభుత్వ ఆఫీసుల్లో, చాలా కంపెనీల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అవును..జపాన్‌ ఉద్యోగులు చేయాల్సిన పనిగంటలకంటే ఎక్కువ గంటలు పని చేయడమేగాక... తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేగాక..ఉద్యోగులు ఏదైనా నిరసన తెలపాలన్నా ఎక్కువసేపు పనిచేసి నిరసన తెలుపుతున్నారు. ఇదంతా తలనొప్పిగా మారడంతో.. పనిరాక్షసులపై  ప్రభుత్వానికి కఠిన నిబంధనలు అమలు చేయక తప్పడంలేదు. 
కరోషి.. 
ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడి పెరిగి గుండెపోటు, అవయవాల ఫెయిల్యూర్‌ వంటివి సంభవిస్తున్నాయి. దీనిని జపాన్‌ భాషలో కరోషి అని పిలుస్తుంటారు. ఎన్‌హెచ్‌కే వార్తా సంస్థలో పనిచేసే ఓ మహిళా రిపోర్టర్‌ మివా సాడో.. వయసు 31 సంవత్సరాలు మాత్రమే. 2013 జులైలో ఆమె గుండెపోటుతో మరణించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో కరోషి వ్యాధితో చనిపోయినట్టు తేలింది. ఎన్నికల సమయం కావడంతో ఆమె 159 గంటలపాటు అదనంగా పనిచేసినట్టు తేలింది. నెలలో రెండు రోజులు మాత్రమే వీక్‌ ఆఫ్‌  తీసుకున్నారట. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ విషయం బయటికి వచ్చింది. ఇది ఒక్కటేగాక.. ఇలా జపాన్‌లో చాలామంది కరోషి వ్యాధితో మరణిస్తున్నట్లు  సర్వేల్లో తేలింది. ఇలాంటి మరణాలను మొదట 1978లో అధికారికంగా గుర్తించి కరోషి అని పేరు పెట్టారు. అప్పటి నుంచి  ఆఫీస్‌లోనే చనిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీనికి ప్రధాన కారణం.. వాళ్ల పని సంస్కృతి, ఎక్కువ మొత్తంలో అందే జీతాలు. అంతేగాక ఇక్కడ పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసేవారికి సైతం రూ.లక్షల్లో జీతాలు అందుతాయి. 
ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు.. 

  • కరోషిని గుర్తిస్తే వెంటనే సమాచారం ఇచ్చేలా  1988లోనే ఒక హెల్ప్‌లైన్‌ నంబరును ఏర్పాటు చేశారు. 
  • 1990–2007 మధ్య కాలంలో ఈ నంబరుకు దాదాపు రెండు వేల కాల్స్‌ వచ్చాయి. 
  • ఇది గుర్తించిన చాలా కంపెనీలు ఉద్యోగులకు ప్రత్యేక కళ్లద్దాలు పంపిణీ చేశాయి. అవి ఉద్యోగుల కళ్ల కదలికలను గమనించి సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తాయి. ఏకాగ్రత తగ్గినట్టు గుర్తిస్తే కాసేపు విరామం తీసుకోమంటూ వారి ఫోన్లకు సందేశం పంపిస్తాయి. 
  • అయితే 2008 నుంచి కాల్స్‌ రావడం కొంత తగ్గినా ఇప్పటీకి ఏడాదికి సగటున 400 కాల్స్‌ వస్తున్నాయి. 
  • ఈ మధ్యనే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఇంటికి పంపడానికి డ్రోన్లను రంగంలోకి దించారు. టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆఫీసులోనే ఉండి పనిచేస్తుంటే ఈ డ్రోన్‌ పసిగట్టేస్తుంది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తుంది. అధికారులు పరిశీలించి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జపాన్‌ వాసుల పనితీరులో మాత్రం పెద్దగా మార్పు  కనిపించడంలేదట. ఎక్కువ గంటలు పనిచేయడానికే మొగ్గు చూపి, ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు ఉద్యోగులు.  

చట్టపరంగా... 

  • దశాబ్దాలుగా జపాన్‌ను కరోషి తీవ్రంగా వేధిస్తోంది. దీంతో  ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి చర్యలు చేపట్టాయి.  
  • చట్టప్రకారం నెలలో 100 గంటలకు మించి పనిచేయకూడదు.  
  • వారానికి రెండు చొప్పున వారాంతపు సెలవులు తీసేసినా రోజుకి ఐదుగంటలకు మించి పనిచేయరాదు. 
  • నిబంధనలు అతిక్రమించి ఎక్కువగంటలు పనిచేస్తే ఆ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. 
  • నిబంధనలు ఉల్లంఘించి కంపెనీలు తమ ఉద్యోగులతో ఎక్కువ గంటలు పనిచేయించినా చర్యలు తప్పవు. 

(సాక్షి, స్టూడెంట్‌ ఎడిషన్)  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement