ఈ గంటల లెక్క సరైనదేనా?! | Sakshi Editorial On Working Hours for Employees | Sakshi
Sakshi News home page

ఈ గంటల లెక్క సరైనదేనా?!

Published Thu, Nov 2 2023 4:04 AM | Last Updated on Thu, Nov 2 2023 12:43 PM

Sakshi Editorial On Working Hours for Employees

శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం అని కవి వాక్కు. కాకపోతే ఎలా శ్రమించాలి? ఎంతసేపు శ్రమించాలి? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అందుకే కావచ్చు... వారానికి 70 గంటలు పని చేయాలంటూ ఇన్ఫోసిస్‌ సంస్థ సహ–వ్యవస్థాపకులు నారాయణమూర్తి తాజాగా చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యువతరంలో పెద్ద చర్చ రేపుతోంది. ఐటీ వృత్తినిపుణుల్ని ఉద్దేశించి ఓ పాడ్‌ క్యాస్ట్‌లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయమది.

రానున్న దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్త మార్పులతో వచ్చిపడే డిమాండ్లను అందుకొని, భారత ఉత్పాదకతను పెంచుకోవాలంటే ఈ అధిక పని గంటల విధానం అవసరమనేది ఆయన మాట. కార్పొరేట్‌ దిగ్గజాలు ఆ ప్రతిపాదనను సమర్థిస్తుంటే, శ్రామికవర్గాలు ఈ సుదీర్ఘ పనిగంటల ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. వెచ్చించిన కాలం, ఉత్పాదకత... ఈ రెంటి మధ్య సంబంధం అన్నిసార్లూ అనులోమానుపాతంలోనే ఉంటుందా అనే మౌలిక ప్రశ్న మొదలైంది.

పనిగంటలు పెంచి, ఎక్కువ పని చేయడమనే ప్రతిపాదన పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు కారణాలు లేకపోలేదు. మన దేశంలో ఇప్పటికే అధిక సంఖ్యాకులు ఎక్కువ పని చేస్తూ, తక్కువ వేత నాలు పొందుతున్నారు. ఇక, ఇంటిని చక్కబెట్టే మహిళలు, అసంఘటిత రంగ శ్రామికులు లక్షల మంది ఈ 70 గంటల లెక్కకు మించే పనిచేస్తున్నారు. జీతం బత్తెం లేని కుటుంబ స్త్రీలు, వేతనం పొందినా లెక్కల్లోకి రాని అసంఘటిత శ్రామికుల రీత్యా ఉత్పాదకతలో అది కనిపించకపోవచ్చు.

‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ (ఓఈసీడీ) గణాంకాల ప్రకారం అధిక పనిగంటల విషయంలో మొత్తం 187 దేశాల్లో మనది 136వ ర్యాంకు. భారతీయ శ్రామికులు సగటున ఏటా 1660 గంటలు పనిచేస్తూ, 2,281 డాలర్ల మేర తలసరి జీడీపీ అందిస్తున్నారు. ఇండొనేసియా, ఆస్ట్రేలియా వగైరా దాదాపు అంతే గంటల్లో అధిక తలసరి జీడీపీ సాధిస్తున్నాయి. 

నిజానికి, రోజుకు గరిష్ఠంగా 8 గంటల పని మాత్రమే అనే పద్ధతిని భారతీయ కార్మిక చట్టాల్లోకి తేవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వారానికి 70 గంటలు, అంటే రోజుకు 11.5 గంటలు అనే పద్ధతి తెస్తే మునుపటి పోరాటాల ఫలితమంతా గంగలో కలిసిపోతుందనే భయమూ శ్రామికుల్లో ఉంది. అదనపు జీతం, పరిహారాల ఊసెత్తకుండా కేవలం అధిక పని గంటల ప్రతిపాదన తీసుకురావడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది.

ఒకవేళ ఉత్పాదకత, అభివృద్ధి పెరగాలనుకుంటే... శ్రామికులు తమ ఉద్యోగంతో పాటు నచ్చిన మరో పని కూడా ఏకకాలంలో చేసుకొని అదనంగా సంపాదించుకొనేలా ‘మూన్‌లైటింగ్‌’కు అనుమతించాలని కొందరు నిపుణుల సూచన. తద్వారా శ్రామికులకూ, దేశానికీ ఉపయోగమనేది వారి వాదన. అయితే, పలు దిగ్గజ టెక్‌ సంస్థల భావన తద్భిన్నంగా ఉంది. మారుతున్న శ్రామిక సంస్కృతిలో మూన్‌లైటింగ్‌ విడదీయరాని భాగమని కేంద్ర ఐటీ అమాత్యులంటున్నా, దాన్ని శిరోధార్యమంటున్న కార్పొరేట్ల సంఖ్య తక్కువే! 

వృత్తి పట్ల అంకితభావం, అచంచలమైన శ్రద్ధ కావాల్సిందే! కానీ, పని మీద దృష్టి అనేది చివరకు ఉద్యోగ జీవితానికీ – కుటుంబ జీవితానికీ మధ్య సమతౌల్యం దెబ్బ తీయకూడదు. మనిషి పూర్తిగా డస్సిపోయే పరిస్థితి తేకూడదు. శారీరక, మానసిక సమస్యలకు కారణం కాకూడదు. ఏ పని చేసినా సంతోషంగా చేస్తే ఫరవాలేదు. ఆ పరిస్థితి అంతటా సాధ్యం కాదు. సంతోషమే సగం బలం అనే మనం అందులో వెనకబడ్డాం.

ఇప్పటికే ప్రపంచ సంతోషసూచిలో మన దేశపు స్కోరు గణనీయంగా తగ్గుతోంది. దశాబ్దం క్రితం 2013లో 4,772 స్కోరుతో సంతోషసూచిలో భారత్‌ 111వ ర్యాంకులో ఉండేది. తీరా ఈ ఏడాది మన స్కోరు 4,036కు పడిపోయింది. మన ర్యాంకు 126కు దిగజారింది. ఈ పరిస్థితుల్లో సంతోషంగా పని చేయాలనే పద్ధతికి నీళ్ళొదిలి, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, అధిక గంటల పనితో ఉత్పాదకత పెంచాలని భావిస్తే, మొదటికే మోసం వస్తుంది. దీర్ఘకాలంలో అది దేశానికి నష్టదాయకంగా పరిణమించే ప్రమాదం ఉంది.

నారాయణమూర్తి అన్నట్టు దేశాభివృద్ధికి మరింత శ్రమించాలనడంలో సందేహం లేదు. అయితే ఆ శ్రమను పని గంటలతో కొలవాలనుకుంటేనే చిక్కు. భారత్‌ను ఇప్పటికీ నిరుద్యోగం, తక్కువ ప్రతిఫలానికే పనిచేయాల్సి రావడం పట్టిపీడిస్తున్నాయి. స్వయం ఉపాధికి దిగుదా మంటే కావాల్సిన పెట్టుబడి దొరకని పరిస్థితి. విద్య, ఆరోగ్య వసతులూ అంతంత మాత్రమే.

అవ్యవస్థీకృత ఆర్థికరంగంలో వారానికి 48 గంటల పైనే పని చేస్తున్నా, వేతనాల్లో వ్యత్యాసం, ఉపాధి భద్రత లేమి లాంటి సమస్యలు సరేసరి. ఈ నేపథ్యంలో జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచేలా ప్రభుత్వ విధానాలు మారాలి. పనిగంటల కన్నా మానవ సంక్షేమ మూలధనంపై దృష్టిపెట్టడం కీలకం. అప్పుడు ఉత్పాద కత పెరుగుతుంది. అందుకు పాలకులు ప్రాథమిక వ్యవస్థాగత లోపాలను సవరించడం అవసరం. 

గమనిస్తే, అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సగటు భారతీయ శ్రామికుడు ఎక్కువ సేపు పనిచేస్తున్నా, ఉత్పాదకత తక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే, ఎంత నాణ్యమైన పని చేశావనేది ప్రధానం కావాలి కానీ, ఎంతసేపు గానుగెద్దులా పని చేశావనేది కాదు. గంటలకొద్దీ శ్రమను పెంచే కన్నా, నైపుణ్యాలకు పదునుపెట్టి, కొద్దిపాటి పరిశ్రమతో అధిక ఫలితం అందించే నవీన మార్గాలను అన్వేషించాలి.

పారిశ్రామిక శిఖరం జేఆర్డీ టాటా మాటల్లో చెప్పాలంటే, ‘భారత్‌ ఆర్థిక అగ్రరాజ్యం కావడం కన్నా, ఆనందమయ దేశం కావాలి.’ అంచనాలు, అంతకు మించి ఒత్తిడి అంతకంతకూ అధికమవుతున్న కాలంలో అది చాలా ముఖ్యం. సంతోషం, సామర్థ్యం పెరిగితే సంపద అదే సృష్టి అవుతుంది. శ్రమజీవి ప్రతి చెమటచుక్క సిరులు పండిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement