పనీ–పాటా అనే నుడికారం ఊరికే పుట్టలేదు; శ్రామిక సంస్కృతిలో పని లేకుండా పాటా, పాట లేకుండా పనీ ఉండవు; అవి అన్యోన్యాలు. పాడుకుంటూ పనిచేస్తే పనిభారం తగ్గుతుందంటారు; అందుకే, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదని ఓ సినీకవి అన్నాడు. అసలు పాట రూపంలో కవిత్వమే కానీ, అభినయ రూపంలో నృత్య, నాటకాలే కానీ, ఆమాటకొస్తే ఇతర కళారూపాలే కానీ పుట్టింది పనితోనేనని పండితులు తేల్చారు. వైయక్తిక, సామూహిక శ్రమలో భాగమైన శారీరక చర్యలను కళారూపాలు అంటిపెట్టుకునే ఉండేవన్నారు. పనినీ, పాటనూ విడదీసి చూడడం నాగరికత ముదిరిన తర్వాతే వచ్చింది. పాట అనేది పనిలేనప్పుడు పాడుకునే వ్యాపకమైంది. రానురాను పాటను పక్కన పెట్టి పనికి మాత్రమే పట్టం కట్టే స్థితికి దారితీసి; తాజాగా వారానికి 70 గంటలు పనిచేయాలని ఒకరంటే, కాదు 90 గంటలు పనిచేయాలని మరొకరు అనే వరకు వెళ్లింది. కొన్నిరోజులుగా ఇదే పెద్ద చర్చనీయాంశం.
మనిషితో సహా సమస్త జీవరాశితోనే పని కూడా పుట్టింది; అది కర్మగా మారి కర్మయోగంగా తాత్విక శిఖరానికీ చేరింది; దాంతోపాటు కలలూ, కన్నీళ్ళ చరిత్రనూ మూటగట్టింది. వేల సంవత్సరాల వెనకటి వేట–ఆహార సేకరణ జనాల జీవనంలోకి తొంగి చూస్తే, వారు వారానికి పదిహేను గంటలే పనిచేసేవారని మానవశాస్త్ర నిపుణులంటారు. వారిది మొరటుదనం, అజ్ఞానం మూర్తీభవించిన దుర్భర జీవితమని కొందరంటే; కాదు, ఆ తర్వాతి కాలానికి చెందిన వ్యవసాయ జీవనంతో పోల్చితే వేట–ఆహారసేకరణ జనాలది అత్యున్నత సంస్కృతికి చెందిన సంపన్న సమాజమనీ, తగినంత తీరిక ఉండడమే అందుకు కారణమనీ మరికొందరు అన్నారు.
ప్రకృతిని అధ్యయనం చేయడానికీ, చంద్రుడి వృద్ధిక్షయాలపై ఆధారపడిన కాలగణనాన్ని కూర్చడానికీ, కళారూపాల అభివృద్ధికీ ఆ తీరిక తోడ్పడిందనీ, వారే తొలి శాస్త్రవేత్తలూ, కళాకారులనీ – అప్పటి అనేక గుహా చిత్రాలు, కుడ్యచిత్రాల ఆధారంగా నిపుణులు నిరూపించారు. వ్యవసాయ జీవనం నుంచీ ఆ తీరిక అడుగంటి పారిశ్రామిక యుగానికి వచ్చేసరికి వారానికి 80 నుంచి 100 గంటలు పనిచేయవలసిన దుఃస్థితి దాపురించి, ఆ నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తడంతో వారానికి 40 గంటల పని ప్రామాణిక కొలమానంగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది.
నిజానికి పనీ–తీరికా అనేవి ఏదో ఒక నిర్ధారణకో, ఒకే ఒక్క నిర్వచనానికో అందని సంక్లిష్ట అనుభవాలు. ప్రతిసారీ పనిభారాన్ని దాని పరిమాణంతోనూ, గంటలతోనూ తూచలేం. ఇష్టంతో స్వచ్ఛందంగా చేసే పని అలాంటి కొలతలనూ, శ్రమనూ కూడా అధిగమిస్తుంది. నిర్బంధంగా విధించే పని తక్కువ పరిమాణంలో ఉండి, తక్కువ సమయాన్ని తీసుకునేదైనా భారంగానే తోస్తుంది.
స్వతంత్రంగా కొయ్యపని చేసుకుంటూ అందులో కళాత్మకతనూ, తృప్తినీ ఆస్వాదించిన ఒక వడ్రంగి ఒక ఫ్యాక్టరీ కార్మికుడిగా మారడంతోనే వాటిని కోల్పోయి ఎలా నిరాసక్తంగా మారాడో కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో చిత్రిస్తారు. పనిగంటలు పెరిగితే ఉత్పాదకత పెరుగుతుందనుకోవడమూ సత్యదూరమేనని చెప్పి, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ లాంటి దేశాల అనుభ వాన్ని ఉటంకించేవారూ ఉన్నారు. వారానికి 30–35 గంటల పనితోనే ఈ దేశాలు ఉత్పాదకత లోనూ, సంతోషభరిత జీవనంలోనూ అగ్రస్థానం వహించడాన్ని వారు ఉదాహరిస్తున్నారు.
పనీ–తీరికలలో ఏది ఎక్కువైనా జీవనశకటం ఒకవైపే ఒరిగిపోయి జీవితమే అస్తవ్యస్తమవుతుంది. జీవిక కోసమే మొత్తం సమయాన్ని వెచ్చిస్తే, జీవించడమే మరచిపోతామని ఒక సూక్తి. అన్నిటా సమతూకం పాటించడంలోనే సంతోష రహస్యం ఇమిడి ఉందన్నది మరొక ఉద్బోధ.
అందుకే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు; అదే అన్ని సందర్భాలకూ వర్తించే సార్వకాలిక సూత్రం. నిజానికి పనికీ–తీరికకీ మధ్య అన్యోన్యతా, పరస్పరతా ఉన్నాయే తప్ప వైరుద్ధ్యం లేదని, దేని విలువ దానిదేనని అనేవారూ ఉన్నారు. కుటుంబ సభ్యులతోనూ, విందు వినోదాలతోనూ ఆహ్లాదంగా గడిపే తీరిక సమయం పనిలో నిమగ్నతకూ, నాణ్యతకూ, ఉత్పాదకత పెరగడానికే తోడ్పడుతుందంటారు.
పనిలో ఇతర దేశాలతో పోటీ, అభివృద్ధీ అనేవి కొత్తగా వచ్చాయి. దేశాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించడానికి పని గంటలు పెంచాలనడం పూర్తిగా కొట్టిపారవేయవలసినదేమీ కాదు. కాకపోతే, ఇతర అనేకానేక దృష్టికోణాలను, వాస్తవాలను విస్మరించి ఏకపక్షంగా అలాంటి అభిప్రాయానికి రావడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది ఒక విమర్శ. అభివృద్ధిలో పోటీ పడవలసిందే కానీ, ఇక్కడి మానవవనరుల అందుబాటునూ, వాటి అభివృద్ధినీ కూడా పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే వాదన వినిపిస్తోంది.
వివిధ రంగాలలో ఇప్పటికే పెరిగిన పని భారం ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనీ, అందువల్ల ఉత్పాదకత మందగిస్తోందనీ ఆయా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకోవైపు దేశంలో నిరుద్యోగం రేటు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కనుక, పని గంటలను పెంచడం కన్నా పని చేసే చేతుల సంఖ్యను పెంచి పనిని పంచడమే అత్యుత్తమ పరిష్కారమనీ; అందుకు అవసర మైన అన్నిరకాల శిక్షణ సదుపాయాలనూ అభివృద్ధి చేయాలనే వాదన ముందుకు వస్తోంది.
పని నుంచి పాటను వేరు చేసినప్పుడు చిన్న పని కూడా పెనుభారమే అవుతుంది. పనికి పాటను జోడించడమే దానిని తేలికచేసే మార్గం. పనీ–పాటా కలిసినప్పుడు... పనే పాటవుతుంది!
పనీ – పాటా
Published Mon, Jan 20 2025 12:09 AM | Last Updated on Mon, Jan 20 2025 12:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment