ఎక్కువ పనిగంటలు ప్రమాదకరం! | Long working hours are dangerous | Sakshi
Sakshi News home page

ఎక్కువ పనిగంటలు ప్రమాదకరం!

Published Tue, Oct 31 2023 4:58 AM | Last Updated on Tue, Oct 31 2023 10:55 AM

Long working hours are dangerous - Sakshi

యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అన్న మాటలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అసలు భారత కార్మిక చట్టం, ఫ్యాక్టరీ చట్టం వంటివి ఏం చెబుతున్నాయి, రోజుకి 8 గంటలు పైబడి పని చేస్తే  పర్యవసనాలు ఏమిటి వంటి అనేక విష యాలు చర్చించవలసిన అవసరం ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా  చాలా దేశాల్లో 49 పని గంటల విధానం అమల్లో ఉంది. మన దేశంలో రోజువారి విశ్రాంతి సమయం, వార్షిక సెలవులు కలిపి వారానికి 48 పనిగంటలు మించకుండా ఉండేలా చట్టాలు ఉన్నాయి. మనిషికీ మనిషికీ  పని గంటల్లో తేడా; అలాగే డబ్బు, ప్రాంతం, సంస్కృతి, జీవన విధానం వంటి అనేక అంశాలతో పాటు ముఖ్యంగా జీతాలు, లాభాలు ఆధారంగా కూడా ఈ పని గంటలు మారుతూ ఉంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో వారి వారి అంగీ కారాన్ని బట్టి కూడా పని గంటలు నిర్దిష్టంగా ఉంటాయి. 

ప్రపంచవ్యాప్తంగా నియమిత పని గంటలు వారానికి 40 నుంచి 44గా అమలులో ఉన్నాయి. తాత్కాలిక, బదిలీ ఉద్యోగులకు ఒకలాగా; పర్మినెంట్‌ ఉద్యోగులకు ఒకలాగా, అలాగే రోజుకి ఇన్ని గంటలని వారానికి మొత్తంగా 48 గంటలు మించకుండా పనిగంటలు ఉండాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ పని గంటలు వున్న దేశం జర్మనీ. ఇక్కడ సంవత్సరానికి 1340 గంటలు  పని గంటలుగా ఉంటాయి. మెక్సికో, కొలంబియా, కోస్టారికాలలో ఎక్కువ పనిగంటలు (1886) ఉన్నాయి.

భారతదేశం  బ్రిటిష్‌ పాలనలో ఉన్నప్పుడు అప్పటి వైస్రాయ్‌ కౌన్సిల్లో లేబర్‌ మెంబర్‌గా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కార్మికులకూ, ఉద్యో గులకూ రోజుకు 8 పని గంటలు ఉండాలని 1942లో మొదటిసారి డిమాండ్‌ చేశారు. అనేక వాదోపవాదాలూ, తర్జనభర్జనల మధ్య వైస్రాయ్‌ కౌన్సిల్‌ 9 పనిగంటలు ఉండాలనీ, దీనిలో 30 నిమిషాలు రెండు దఫాలుగా విశ్రాంతి ఉండాలనీ నిర్ణయించారు. ‘1948 ఫ్యాక్టరీ చట్టం’ సెక్షన్‌ 54 ప్రకారం ఈ తొమ్మిది గంటల పని, విశ్రాంతి సమయాన్ని అంబేడ్కర్‌ కార్మికుల పక్షాన పోరాడి సాధించారు. 

ఇటీవల మన దేశంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ‘కర్ణాటక ఫ్యాక్టరీస్‌ అమెండ్మెంట్‌ యాక్ట్‌ బిల్లు – 2023’ను ఆమోదించడం ద్వారా రోజుకు 12 పని గంటలు ఉండాలని నిర్ణయిం చింది (వారానికి 48 గంటలు మించకుండా). అలాగే భారత కార్మిక మంత్రిత్వ శాఖ రోజుకు12 పనిగంటలు ఉండాలని పార్లమెంట్‌లో చట్టం చేసినప్పటికీ... ‘ఇండియన్‌ ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ –1948’ ఓవర్‌ టైంతో కలిపి 50 నుంచి 60 పని గంటలు దాటకూడదనే నిబంధన కచ్చితంగా పాటించాలని చెప్పింది. 

2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంత ర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనం, అంచనాల ప్రకారం ఎవరైతే వారానికి 55 గంటలు దాటి పని చేస్తారో వారిలో ప్రతి పది మందిలో ఒక కార్మి కుడు గుండె పోటుతో మరణిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా  745,000 మంది కార్మికులు గుండెపోటుతో మరణించినట్లు నివేదిక తెలిపింది. దీనికి కారణం ఎక్కువ పని చేయడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థల సంయుక్త నివేదిక చెబుతున్నటువంటి సత్యం.

పైన ఉదాహరించిన ఎక్కువ గంటలు పని చేయడం వల్ల జరిగిన మరణాలను పరిశీలిస్తే, యువత వారానికి 70గంటలు పని చేస్తే జరిగే నష్టం అంచనా వేయొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పవచ్చు. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి ఆయన రంగంలో ఆయన ఆదర్శప్రాయులు. వయస్సు రీత్యా కూడా పెద్దవారు. ఇప్పటికే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో యువత అనేక ఆరోగ్య, మానసిక, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అనేక వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం.  

ఆయన తన అభిప్రాయాలు మెజారిటీ మనోభావాలు దెబ్బతినే విధంగానూ, అశాస్త్రీ యంగానూ వ్యక్తపరిస్తే ఆ ప్రభావం సమాజం మీద కచ్చితంగా ఉంటుంది. యువత మానసిక స్థితి మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక దారుఢ్యం, కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతా వరణం వంటివాటిని బట్టి ఉంటుంది. కాబట్టి విధాన నేర్ణేతలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.
– డా‘‘ గుబ్బల రాంబాబు, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు, ఏపీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement