సందర్భం
ఒకప్పుడు మశూచి వ్యాధి బారిన పడి లక్షలమంది మరణించేవారు. అలాగే ప్లేగ్ వ్యాధితో కూడా! అలాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు కలికానికి కూడా లేవు. దీనికి కారణాలు ఆ రోగాలను మట్టుబెట్ట డంలో జరిగిన నిరంతర కృషి.1980వ దశకంలో ఎయిడ్స్ అంటే మరణం. దీని బారిన పడినవారు బతికి ఉన్నా, చచ్చినవారితో సమానం అన్నట్టుగా సమాజం పరిగణించిన రోజులు అవి. హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలియ గానే గుండెలో బండ పడినట్లే భావించి మానసికంగా మరణా నికి చేరువయ్యేవారు. ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా విలవిలలాడి పోయాయంటే అప్పట్లో ఈ వ్యాధి కలిగించిన భయోత్పాతాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆనాటి ముఖచిత్రం.
ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందే లేదనుకున్న ఈ వ్యాధికి తగిన మందులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే! ఎయిడ్స్‌కు గురి కాకుండా ఎలాగూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందని తెలిసినా, 72 గంటల లోపు పోస్ట్ ప్రొఫలాక్సిస్ మందులు వాడి దాని బారి నుంచి బయటపడవచ్చు.
తొమ్మిదేళ్ల క్రితమే క్యూబాలో హెచ్‌ఐవీ ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులను పూర్తిగా తుడిచి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని, గట్టిగా ప్రయత్నిస్తే, మొత్తం ప్రపంచానికి ఎయిడ్స్ నుంచి విముక్తి కలిగించవచ్చనే గట్టి సందేశాన్ని ఆ దేశం ప్రపంచ దేశాలకు పంపింది. ఎయిడ్స్ పాజిటివ్ దంపతులు నేడు చికిత్స తీసుకొని, ఆ వ్యాధి లక్షణాలు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలను కనవచ్చు. హెచ్‌ఐవీ పాజిటివ్ వాళ్ళు... ఆ వ్యాధి సోకని వాళ్ళను నిక్షేపంగా వివాహం చేసు కొని, ఎలాంటి భయ సంకోచాలూ లేకుండా హాయిగా కాపు రాలు చేసుకోవచ్చు. అనేక శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని అలాంటి చికిత్సా పద్ధతులు, ఈనాడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి.
బీపీ, షుగర్ బాధితులు అతి తక్కువ ఖర్చుతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వాడుతూ ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపున్న మాదిరిగానే, ఎయిడ్స్ రోగులు కూడా 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్రను క్రమం తప్పకుండా రోజూ వేసుకుంటూ, తగు విశ్రాంతి, పోషకా హారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే, 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్ సెట్’, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, పలు అధ్య యన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.
వైద్యపరంగా ఇంతటి భరోసా లభిస్తున్నా, ఎయిడ్స్ రోగులు మానసికమైన భయాందోళనలతో చికిత్సకు దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. రోజువారీ వాడాల్సిన మాత్రలు తమ దగ్గర ఉంటే పక్కవారికి తెలిస్తే, పరువు పోతుందనే భయంతో సక్రమంగా వాడకుండా కోరి ప్రమా దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు.
ఇంత ప్రగతి సాధించినా ఇప్పటికీ సామాన్యులే కాక, విద్యాధికులైన హెచ్‌ఐవీ రోగులు కూడా అపోహలు, మూఢ నమ్మకాలతో శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణ కాని పొడులు, కషాయాలతో వ్యాధిని మరింత ముదరబెట్టుకొంటున్నారు. కొందరు పాము విషం తీసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుందనే ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం కోసం ‘అందరం కలసి శ్రమిద్దాం– ఎయిడ్స్‌ను నిరోధిద్దాం‘ అన్న నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, ఆధునిక చికిత్సా పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది.
హెచ్‌ఐవీ ఎయిడ్స్ వ్యాధి నూటికి నూరుపాళ్ళు నివారించే వీలున్న వ్యాధి కనుక నిరంతరం దీనిపై ప్రజల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఆత్మహత్యల నిరోధానికి కౌన్సెలింగ్ ఇస్తున్న తరహాలోనే ప్రజలకు అందుబాటులో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నంబరుతో రోగులకు, సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తామెవరు అన్నది పైకి తెలిసే అవకాశం ఉండదు కనుక రోగులు నిర్భయంగా, ఎలాంటి సంకోచమూ లేకుండా వైద్యులను సంప్రతించి సక్రమంగా చికిత్స తీసుకునే వీలుంటుంది.
నిర్మూలనకు మంచి అవకాశాలు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ముప్పును ప్రపంచానికి పూర్తిగా తప్పించాలంటే కలసికట్టు కృషి అవసరం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పరస్పర సహకారంతో ప్రజల్లో, ప్రత్యేకించి ఎయిడ్స్ బాధితుల్లో చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నాలు నిరంతరం చేయగలిగితే... మశూచి, ప్లేగు వ్యాధుల మాదిరిగానే అతి త్వరలోనే ఎయిడ్స్ అనే భయంకర రోగాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అసాధ్యం ఏమీ కాదు. అలాంటి శుభ దినం త్వరలోనే రాగలదని ఆశిద్దాం.
డా‘‘ కూటికుప్పల సూర్యారావు
వ్యాసకర్త ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు ‘ 93811 49295
(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం)
Comments
Please login to add a commentAdd a comment