మానవుల వల్లే వైరస్‌ల విజృంభణ! | Sakshi Guest Column On Viruses caused by humans | Sakshi
Sakshi News home page

మానవుల వల్లే వైరస్‌ల విజృంభణ!

Published Fri, Aug 9 2024 12:12 AM | Last Updated on Fri, Aug 9 2024 12:12 AM

Sakshi Guest Column On Viruses caused by humans

విశ్లేషణ

వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్‌లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.

దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్‌లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్‌ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్‌లు కూడా ఒలింపిక్స్‌ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్‌ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్‌ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. 

అనేక వైరస్‌ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్‌లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. 

పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరు
వాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్‌లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్‌లకు లభిస్తున్నాయి. సైన్‌ ్స రచయిత ఎడ్‌ యంగ్‌ ఇటీవల ‘ది అట్లాంటిక్‌’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్‌’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్‌  అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్‌  అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్‌  (పాండమిక్‌ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. 

జార్జ్‌టౌన్‌  యూనివర్సిటీకి చెందిన గ్లోబల్‌ ఛేంజ్‌ జీవశాస్త్రవేత్త కాలిన్‌  కార్ల్‌సన్‌  ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్‌ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్‌లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్‌’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్‌ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. 

ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్‌లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్‌లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.

వినాశకర మార్పులు
వేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్‌సన్‌  వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్‌ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. 

ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్‌ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్‌లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్‌లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్‌సన్‌ బృందం అంచనా వేస్తోంది. 

వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్‌సన్‌  హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్‌ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్‌ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. 

కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!
కార్ల్‌సన్‌  బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్‌బర్గ్‌ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్‌ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. 

క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్‌ వైరస్‌ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్‌ కోవ్‌–2 కూడా వూహాన్‌  ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్‌లను కూడా మోసుకొస్తాయి.

పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్‌ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్‌ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. 

అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్‌లు మనిషికి సోక వచ్చు. ఇన్‌ ఫ్లుయెంజా వైరస్‌ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్‌బర్గ్‌ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్‌  హెల్త్‌ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్‌ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. 

క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. 

కె. శ్రీనాథ్‌ రెడ్డి 
వ్యాసకర్త ‘పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌  ఆఫ్‌ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement