యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ‘కాప్ 28’ సదస్సు జరగనుంది. పూర్వ సగటు ఉష్ణోగ్రతల కంటే 2023లో 1.4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. వాతావరణ మార్పుల సదస్సు కోసం ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు సమావేశమవుతున్నప్పుడు, ఇంతకంటే కీలక సమస్య వేరేదీ లేదు. ఇప్పటికే, ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాలలో వరద బీభత్సం విదితమే. దేశమంతటా వర్షాలు సకాలంలో పడలేదు. వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నది. పంటల విస్తీర్ణం, దిగుబడి మీద వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) లోని అన్ని సభ్యత్వ పక్షాలు దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు సమావేశం కానున్నాయి. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం తొలి ‘గ్లోబల్ స్టాక్ టేక్’ (జీఎస్టీ) పూర్తి చేయడం ఈ సమావేశంలో మొదటి ప్రధాన అంశం. పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించే దిశగా సమష్టి పురోగతిని అంచనా వేయడం, ముఖ్యంగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, అడాప్టేషన్ ప్రయత్నాల పురోగతి, నిధుల ప్రవాహం అంచనా వేయడం ఈ జీఎస్టీ లక్ష్యం. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మదింపు తదుపరి పర్యావరణ, వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకునే చర్యలకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది.
శిలాజ ఇంధనాల వినియోగం తగ్గేనా?
2023 సెప్టెంబర్‌లో విడుదలైన మొదటి జీఎస్టీ అధ్యయన ఫలితం, స్పష్టంగా ఉన్నది: ప్రపంచం మొత్తం అనుకున్న లక్ష్యం నుంచి దారి తప్పింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరగనున్న ‘కాప్ 28’(కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్– భాగస్వామ్య పక్షాల 28వ సమావేశం)లో దీని దిద్దుబాటు మీద చర్చ జరుగుతుందని ఆశిస్తున్నారు. అనేక చర్యల మీద ఏకాభిప్రాయం లేదు. ఈ నివేదిక వల్ల కొన్ని చర్యల పైన విశాల ఒప్పందాలు జరుగుతాయని అంచనా.
ప్రధానంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు చేయాలనే లక్ష్యం ఒకటి కాగా, శిలాజ ఇంధనాల వినియోగం దశల వారీగా తగ్గించే లక్ష్యం పైన చర్చలు వివాదాస్పదంగా ఉన్నాయి. దుబాయ్ సమావేశం అధ్యక్షుడు ఒక చమురు కంపెనీ అధిపతి అయిన నేపథ్యంలో చమురు ఉపయోగం తగ్గించడానికి చర్చలు జరుగుతాయా అన్న అనుమానాలు ఉన్నాయి.
రెండవ పెద్ద అంశం, ‘నష్టం మరియు హాని’. పేద దేశాలు, వెనుకబడిన దేశాల మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ ఉండడంతో భూగోళ కాలుష్యానికి కారక దేశాలు నష్ట పరిహారం అందించాలని చర్చలు జరుగుతున్నాయి. గత కాప్ 27 సమావేశంలో ఆఫ్రికన్ దేశాలు పట్టుబట్టి నష్టం మరియు హాని పరిహార నిధి ఏర్పాటును తీర్మానం చేశాయి. అటువంటి నిధిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఆ సమావేశ పురోగతిగా వర్ణించారు.
ఈ కీలక నిర్ణయం తీసుకున్నా, దాని ఏర్పాటు విషయం దశలలో తేలాల్సి ఉంది. ఇప్పటికే గత ఏడాది నుంచి ఈ విషయం మీద సమావేశాలు జరుగు తున్నాయి. పురోగతి ఆశాజనకంగానే ఉన్నది. కర్బన ఉద్గారాల వల్ల భౌగోళిక కాలుష్యం పెరిగి, సగటు ఉష్ణోగ్రత పెరిగి, వాతావరణ మార్పులు జరిగి నష్టపోతున్న దేశాలు, ప్రాంతాలు వాటిని ఎదుర్కొనే ప్రతి చర్యల మీద నిధులు సొంతంగా పెట్టుకునే సామర్థ్యం లేక ఈ ప్రపంచ నిధి గురించి ఆలోచించాయి.
భారత దేశంలో ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో విపరీత వర్షాల వల్ల నదీ ప్రవాహం పెరిగి కొన్ని ఆనకట్టలు కొట్టుకుపోయి జరిగిన ఆస్తి నష్టం అంచనా లక్ష కోట్ల రూపాయలు. ఇటువంటి నష్ట భర్తీకి, పునర్నిర్మాణానికి సొమ్ములు ప్రపంచ నిధి నుంచి ఇవ్వాలని ఆశిస్తున్నారు. కానీ ఆ నిధికి డబ్బులు ఎవరు, ఎంత ఇవ్వాలి అనే విషయం నుంచి ఎవరికి, ఏ విధంగా,ఎంత ఇవ్వాలి అనే వరకు చర్చలు జరుగుతున్నాయి. అన్ని ప్రాథమిక దశలోనే ఉన్నాయి. నష్ట పరిహార నిధి పూర్తి స్థాయి ఏర్పాటుకు కనీసం 5 ఏళ్లు పడుతుందని అంచనా. వేగంగా నిర్ణయించాలని పేద దేశాల ఆకాంక్ష. ధనిక దేశాలకు ఈ నిధి ఏర్పాటు ఇష్టం లేదు. అది తమ ఆర్థిక రంగం మీద భారం అవుతుంది అని వారి భావన.
ఆహార, ఆరోగ్యాలపై ప్రభావం
2023 అంతటా వివిధ రూపాల్లో (రెండవ గ్లాస్గో సంభాషణ, ప్రత్యేక వర్క్ షాప్‌లు, మంత్రుల సంప్రదింపులతో సహా) దీనిపై చర్చలు జరిగాయి. కాల పరిమితులతో కూడిన లక్ష్యసాధన, అర్హత ప్రమాణాలు, ఆర్థిక వనరులు వంటి విషయాలపైన ఆలోచనలను రూపొందించడానికి ఒక పరివర్తన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పని చిన్నదేమీ కాదు. గ్రీన్ క్లైమేట్ ఫండ్ పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఐదేళ్లు పట్టింది. పరివర్తన కమిటీ పని తీరును పరిశీలిస్తే, పరిష్కరించ వలసిన సాంకేతిక అంశాలు మాత్రమే కాకుండా, విభేదాలను పరిష్క రించడానికి రాజకీయ మార్గదర్శకత్వం అవసరమని తెలుస్తుంది.
యూఎన్‌ఎఫ్‌సీసీసీ కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం, ఎస్బీఐ, ఎస్బీఎస్టీఏలకు సంబంధించిన ఐదు భారీ అంశాలతో పాటు అనేక ఇతర సమస్యలను కాప్ 28 ప్రస్తావించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాప్ 28 సమావేశ అధ్యక్ష (యూఏఈ) పాత్ర కీలకం అని భావిస్తున్నారు. ప్రత్యేకంగా శిలాజ ఇంధనాల ఉత్పత్తిని ఎలా పరిష్కరిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. వాతావరణ మార్పులకు, ఆహారం, ఆరోగ్యానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అర్థం చేసుకుని, తగిన చర్యల మీద దృష్టి పెంచడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
స్థూలంగా, వాతావరణ మార్పుల సదస్సు అంటే కేవలం చెట్లు, అడవులు, కాలుష్యం గురించే కాదు. ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ అభివృద్ధి విధానాలు, ఆర్థిక విధానాలు, ఉత్పత్తి పద్ధతులు, జీవన శైలి మార్పులతో సహా సమస్త మానవాళి చర్యల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇందులో సామాజిక న్యాయం, సమానత్వం, సహకారం, గౌరవం, మానవ హక్కులు వంటి సూత్రాలు విధిగా ఉంటాయి.
భారతదేశం పాత్ర
భారతదేశం వహించే పాత్ర కూడా అనేక అంతర్జాతీయ సమావేశాల మాదిరిగానే కాప్ 28 సదస్సులో కూడా ముఖ్యమైన అంశంగా మారుతున్నది. నిర్ణయాలు తీసుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు, అంతర్గతంగా ఎదురు అవుతున్న ప్రకృతిపరమైన నష్టాలకు భారత ప్రతినిధి వర్గం పని తీరును కూడా నిశితంగా గమనించాల్సి ఉన్నది. ఈ ప్రతినిధి వర్గంలో ఎవరు ఉంటారు, వారికి ప్రభుత్వం ఇచ్చిన సందేశం లేదా ఆదేశాలు ఏమిటి అని మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది.
ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, ధనిక దేశాలు, పేద దేశాల మధ్య వారధిగా, అమెరికా దేశాల కూటమికీ, రష్యా, చైనా దేశాల కూటమికీ మధ్య కీలకంగా పరిణమించిన భారత్ ఈ సదస్సులో వ్యవహరించే తీరు మీద ఆసక్తి ఉన్నది. ‘అభివృద్ధి’ మార్గం వివాదస్పదం అవుతున్న సందర్భంలో, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, పేదరికం, అనారోగ్యం,ఆకలి వంటి అంశాలను పరిష్కరించే వివిధ మార్గాలు, చర్యలు కూడా అంతర్జాతీయ పరిణామాల ప్రభావానికి లోను అవుతున్నాయి. కాబట్టి అక్కడ జరిగేది వేరు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి వీలు లేదు. మన రాజకీయ వ్యవస్థ, ప్రధానంగా రాజకీయ నాయకులు ఈ అంశాల మీద తమ పరిజ్ఞానం పెంచుకుంటేబాగుంటుంది.
దొంతి నరసింహా రెడ్డి
వ్యాసకర్త విధాన విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment