అక్టోబర్ 7న హమాస్ హతమార్చిన అవీవ్ కుట్జ్ కుటుంబం
ఇజ్రాయెల్ గతాన్ని చూపి హమాస్ నేరాలను సమర్థించటం ఎంతమాత్రమూ సాధ్యం కాదు. రెండు తప్పులు ఒక ఒప్పుగా మారవు. దురాక్రమణతో దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియన్లను చెరబట్టడం, ఇటీవలి సంవత్సరాల్లో శాంతి కోసం చిత్తశుద్ధితో జరిగిన ప్రయత్నాలను వమ్ము చేయటం విషయంలో ఇజ్రాయెల్‌ను కచ్చితంగా విమర్శించాల్సిందే. అయితే హమాస్ దుశ్చర్యలు శాంతిప్రక్రియ పునఃప్రారంభం కోసం చేసినవి కాదు. ఆ దారుణాలు దురాక్రమణను అంతం చేసేవి కూడా కాదు. దానికి విరుద్ధంగా హమాస్ ప్రారంభించిన యుద్ధం లక్షలాదిమంది పాలస్తీనా పౌరుల ఎడతెగని వ్యథకు కారణమైంది.
అవీవ్ కుట్జ్ నా బాల్య స్నేహితుడికి చాలా సన్నిహిత మిత్రుడు. ఇజ్రాయెల్‌లో కఫార్ అజా ప్రాంతంలో భార్య లివ్‌నాత్, ముగ్గురు పిల్లలతో అవీవ్ చాలా కాలం నుంచి నివసిస్తున్నాడు. తమ కిబుట్జ్ (కిబుట్జ్ అంటే హిబ్రూ భాషలో పెద్ద వ్యవసాయ క్షేత్రం. స్వచ్ఛందంగా, పోటీరహితంగా పనిచేయడానికి ముందుకొచ్చే వ్యక్తుల సమూహం అక్కడ నివసిస్తుంది)పై హమాస్ జరిపే రాకెట్లు, మోర్టార్ల దాడులు చూస్తూనేవున్నా ఏదో ఒక నాటికి ప్రశాంతత ఏర్పడక పోతుందా అన్న ఆశతో కుట్జ్ కుటుంబం అక్కడే వుంటోంది. యుద్ధ క్షేత్రంలో కాస్తయినా శాంతిని వెదుక్కోవాలనే సంకల్పంతో యేటా పతంగుల పండుగ నిర్వహించటం కుట్జ్ కుటుంబానికి అలవాటు.
ఆ ఉత్సవంలో రంగురంగుల గాలిపటాలు, అందులో కొన్నింటిపై శాంతి సందేశాలు– అన్నిటినీ గాజా సరిహద్దు ముళ్ల కంచెకు సమీపంలోనే ఎగరేస్తారు. ‘మేం ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాం తప్ప ఘర్షణను కాదని చెప్పటమే ఈ ఉత్సవ సారాంశం’ అని గతంలో జరిగిన పతంగుల పండుగలో పాల్గొన్న లివ్‌నాత్ సోదరి చెప్పారు. ఈసారి పతంగుల పండుగ అక్టోబర్ 7న జరపాలని నిర్ణయించారు. కానీ ఆ ఉత్సవ ప్రారంభానికి కొన్ని గంటల ముందు హమాస్ ఉగ్రవాదులు కఫార్ అజాపై విరుచుకు పడ్డారు. దాన్ని చెరబట్టారు. కుట్జ్ అయిదుగురు కుటుంబ సభ్యులనూ హత మార్చారు.
ఇటువంటి ఉదంతాలు మనసును కలచివేస్తాయి. మనుషులు ఎందుకీ దారుణాలకు పాల్పడతారు? దీనిద్వారా హమాస్ సాధించదల్చుకున్నది ఏమిటి? ఒక ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవటం సంప్రదాయ సంగ్రామం లక్ష్యంగా ఉంటుంది. హమాస్ ఉగ్రవాదం దీనికి భిన్నం. భయోత్పాతాన్ని వ్యాపింపజేయటం, లక్షలమంది ఇజ్రా యెలీ, పాలస్తీనా పౌరుల్లోనూ, ప్రపంచ ప్రజానీకంలోనూ విద్వేష బీజాలు నాటడం దాని మానసిక యుద్ధతంత్ర ఆంతర్యం.
పీఎల్‌ఓ వంటి ఇతర పాలస్తీనా సంస్థలకు హమాస్ భిన్నమైనది. మొత్తం పాలస్తీనా పౌరులందరితో దాన్ని సమం చేయకూడదు. హమాస్ తన పుట్టుక నుంచీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ ఉనికిని, మనుగడ సాగించేందుకు దానికిగల హక్కును గుర్తించ నిరాకరిస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇతర అరబ్బు దేశాల పౌరుల మధ్య శాంతి సాధనకు ఏర్పడే ప్రతి అవకాశాన్నీ తన శక్తికొద్దీ ధ్వంసం చేస్తోంది. ప్రస్తుత హింసా పరంపరకు నేపథ్యం ఇజ్రాయెల్‌కూ, గల్ఫ్ దేశాలకూ మధ్య కుదురుతున్న శాంతి ఒప్పందాలు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య సైతం శాంతి ఒప్పందం చిగురించబోతున్నది.
ఈ ఒప్పందం రెండు దేశాల మధ్యా సాధారణ సంబంధాలు ఏర్పర్చడం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దురాక్రమణలో బతుకులు వెళ్లదీస్తున్న లక్షలాదిమంది పాలస్తీనా వాసులకు ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించటానికి తోడ్పడుతుంది. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి ప్రక్రియ పునఃప్రారంభం కావటానికి దోహదం చేస్తుంది. శాంతి స్థాపన అవకాశాల కన్నా హమాస్‌ను భయపెట్టగలిగేది మరేదీ వుండదు. అందుకే అది అక్టోబర్ దాడులకు తెగబడింది. కేవలం ఆ కారణంతోనే కుట్జ్ కుటుంబ సభ్యులనూ, మరో వేయిమందికి పైగా ఇజ్రాయెలీ పౌరులనూ అత్యంత పాశవికంగా హతమార్చింది. హమాస్ చర్య దాని సంపూర్ణ అర్థంలో అక్షరాలా మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరమే. మానవత్వంలో మనకుండే విశ్వాసాన్ని ధ్వంసం చేయటమే.
ఇజ్రాయెల్ గతాన్ని చూపి హమాస్ నేరాలను సమర్థించటం
ఎంత మాత్రమూ సాధ్యంకాదు. రెండు తప్పులు ఒక ఒప్పుగా మారవు. దురాక్రమణతో దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియ న్లను చెర బట్టడం, ఇటీవలి సంవత్సరాల్లో శాంతికోసం చిత్తశుద్ధితో జరిగిన ప్రయత్నాలను వమ్ము చేయటం విషయంలో ఇజ్రాయెల్‌ను కచ్చితంగా విమర్శించాల్సిందే. అయితే కుట్జ్ కుటుంబ సభ్యుల హత్య, ఇతర దుశ్చర్యలు శాంతిప్రక్రియ పునఃప్రారంభం కోసం చేసినవి కాదు. ఆ దారుణాలు దురాక్రమణను అంతం చేసేవి కూడా కాదు. దానికి విరుద్ధంగా హమాస్ ప్రారంభించిన యుద్ధం లక్షలాది మంది పాలస్తీనా పౌరుల ఎడతెగని వ్యథకు కారణమైంది.
హమాస్‌పై సాగిస్తున్న యుద్ధంలో తన ప్రాంతాన్నీ, పౌరులనూ పరిరక్షించుకోవటం మాత్రమే కాదు... తన మానవీయతను కాపాడు కోవటం కూడా ఇజ్రాయెల్ కర్తవ్యమే. తమ స్వస్థలంలో శాంతి సౌభాగ్యాలు అనుభవించే హక్కు పాలస్తీనా పౌరులకుంది. దాంతోపాటు ఘర్షణల మధ్య కూడా వారి మౌలిక మానవ హక్కులను అన్ని పక్షాలూ గుర్తించి తీరాలి. ఇది ఒక్క ఇజ్రాయెల్‌కు మాత్రమే కాదు... గాజా స్ట్రిప్‌తో సరిహద్దు వుండి, దాన్ని పాక్షికంగా మూసివేసిన ఈజిప్టుకు కూడా వర్తిస్తుంది. ఇక హమాస్ విషయానికొస్తే మాన వాళి మొత్తం ఆ సంస్థనూ, దాని మద్దతుదార్లనూ వెలివేయాలి.
గాజా యుద్ధ ఉద్దేశాలేమిటో విస్పష్టంగా ఉండాలి. హమాస్‌ను నిరాయుధీకరించాలి. గాజా స్ట్రిప్‌ను నిస్సైనికీకరించాలి. అలాగైతేనే పాలస్తీనా పౌరులు గౌరవ మర్యాదలతో మనుగడ సాగి స్తారు. వారితోపాటు ఇజ్రాయెల్ పౌరులు కూడా నిర్భయంగా జీవనం కొనసాగిస్తారు. ఈ లక్ష్యాలు సాధించేంతవరకూ మన మానవీయతనుకాపా డుకోవటం ఎంతో కష్టంతో కూడుకున్న పని. తీరని వేదన అనుభవిస్తున్న పాలస్తీనియన్లకు సహానుభూతి ప్రకటించటం మానసికంగా అశక్తతలో, అచేతనలో కూరుకుపోయిన చాలామంది ఇజ్రాయెలీ పౌరులకు కష్టమే.
మనసులు స్వీయ విషాదంతో నిండి పోయిన వర్తమానంలో కనీసం వేరేవారి వ్యథను గుర్తించటానికి కూడా అందులో చోటు మిగలదు. ఎన్ని కష్టాల్లోనైనా అలాంటి చోటును నిలుపుకోగలిగిన కుట్జ్ కుటుంబం, వారిలాంటి అనేకులు ఇవాళ మృత్యు ఒడికి చేరారు. లేదా తీవ్ర మనోవ్యాకులత లోనికి జారుకున్నారు. అటు పాలస్తీనా పౌరులదీ ఇదే పరిస్థితి. వారు సైతం చెప్పలేనంత వ్యథను అనుభవిస్తున్నారు. మా బాధలను గమనించే స్థితిలో లేరు.
కానీ ఈ వేదనాభరిత స్థితికి దూరంగావున్న ఇతరులంతా వాస్తవాలను పాక్షిక దృష్టితో చూసే మందబుద్ధిని వదుల్చుకుని బాధాసర్పద్రష్టులందరికీ సహానుభూతి ప్రకటించటానికి కృషి చేయాలి. శాంతి స్థాపనకు చోటుండేలా సహాయపడటం వెలుపలి వారి కర్తవ్యం. ఆ బాధ్యతను మీకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే ఆ విషయంలో మేం అశక్తులమయ్యాం.
మా కోసం మీరు ఆ మంచి పని చేయండి. ఏదో ఒకరోజు ఈ కష్టాలన్నీ కడతేరినప్పుడు, ఈ గాయాలు మానినప్పుడు ఇజ్రాయెలీ పౌరులూ, పాలస్తీనా పౌరులూ ఆ చోటులో సురక్షితంగా మనుగడ సాగిస్తారు. యువల్ నోవా హరారి ఇజ్రాయెల్ పౌరుడు. చరిత్రకారుడు, తత్వవేత్త. ‘సేపియన్స్’, ‘హోమో డియుస్’, ‘అన్‌స్టాపబుల్ అజ్’ తదితర పుస్తకాల రచయిత.
యువల్ నోవా హరారి
(‘టైమ్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment