మిగిలేది... మానవత్వ పరిమళమే! | Sakshi Guest Column On Humanity | Sakshi
Sakshi News home page

మిగిలేది... మానవత్వ పరిమళమే!

Published Sun, Jul 7 2024 5:44 AM | Last Updated on Sun, Jul 7 2024 5:44 AM

Sakshi Guest Column On Humanity

అభిప్రాయం

సమాజం భ్రష్టు పట్టిపోయింది. మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. నిజమే! కాని, మానవత్వం గల మనుషులు కొందరైనా ఉన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. అయితే, సమాజంలో వీరి శాతాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

న్యూజిలాండ్‌ లోని గ్రేమోత్‌ లోకల్‌ మార్కెట్‌లో ఒక దయార్ద్ర హృదయుడు తిరుగుతుంటాడు. రొయ్యల, చేపలూ లాగా అక్కడ ఫుడ్‌ మార్కెట్‌లో తాబేళ్ళను కూడా అమ్ముతారు. మనం చెప్పుకుంటున్న దయార్ద్ర హృదయుడు తాబేలు మాంసం కోసం రాడు. తాబేళ్ళను రక్షించడానికి వస్తుంటాడు. బేరమాడి మార్కెట్‌లో బతికి ఉన్న తాబేళ్ళన్నింటినీ కొంటాడు. వాటిని ట్రక్కులో వేసుకుని పోయి సముద్రంలోకి వదులుతాడు. 

అక్కడ తాబేళ్లు అంతరించి పోయే దశలో ఉన్నాయి. అందుకే ఈ పని! ఏదో విధంగా తమ పని గడిస్తే చాలుననుకుంటూ కాలుష్యాలు పెంచుతున్న మనుషుల మధ్య ఎంతో బాధ్యతతో ‘మనిషి’లా ప్రవర్తించే వారున్నారు. ‘ప్రపంచమేమీ గొడ్డుపోలేదు’ అని అన్నది అందుకే! పాపువా న్యూ గినియా – మార్కెట్ల దగ్గరా ఇలాంటి జీవ పరిరక్షకులు ఉన్నారు. 

ఇటీవల రాజస్థాన్‌ జైపూర్‌లో మానవత్వం మతాన్ని గెలిచింది. మధూలిక అనే ఒక 48 ఏళ్ల హిందూ మహిళ 13 మంది ముస్లింల ప్రాణాలు కాపాడింది. భర్త చనిపోయి, ఇద్దరు పిల్లలతో ఒక బట్టల కొట్టు నడుపుకుంటూ జీవిస్తోంది. ఆమె బట్టల కొట్టు ఉన్న ఆ వీధిలో ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారు. ఒకరోజు హిందూ వర్గానికి చెందిన గుంపు – శోభాయాత్ర ఊరేగింపు తీస్తూ  అల్లర్లు సృష్టించింది. అందులో భాగంగా అక్కడ ఉన్న 13 మంది ముస్లింలపై దాడిచేయడానికి వారి వెంట పడ్డారు. 

ఇదంతా గమనించిన మధూలిక ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చిన ముస్లింలను తన కొట్టులోకి పంపి వెంటనే షట్టర్‌ వేసేసింది. తర్వాత హిందూ దుండగుల్ని ధైర్యంగా ఎదుర్కొని, చాకచక్యంగా వారిని వెనక్కి పంపించింది. ‘మానవత్వం అన్నిటికన్నా గొప్పదని భావించి, ముస్లిం సోదరులకు ఆశ్రయమిచ్చాన’ని– ఆ తర్వాత ఆమె పత్రికల వారికి చెప్పింది. ఒక సామాన్య మహిళ ఆచరణాత్మకంగా, ఎంతో గొప్ప సందేశం ఇచ్చింది. 

హైదరాబాదు పాత బస్తీలో గాజుల అంజయ్య అందరికీ తెలిసినవాడు. అతని మిత్రులలో చాలా మంది ముస్లింలే. 2022, ఏప్రిల్‌ 17న తన కొడుకు పెళ్ళికి మిత్రులందరినీ ఆహ్వానించాడు. అవి రంజాన్‌ రోజులు గనుక ‘రోజా’ పాటించే తన ముస్లిం మిత్రులెవరూ ఇబ్బంది పడకూడదని వారి కోసం నమాజ్‌ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. ఇఫ్తార్‌ విందూ ఏర్పాటు చేశాడు. 

వారంతా మరునాడు ఉపవాసం పాటించేందుకు ‘సహౌరీ’ ఏర్పాటు చేశాడు. స్వార్థప్రయోజనాల కోసం విద్వేషాలు నూరిపోసే వారి వలలో పడకూడదనీ, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకోవడం అందరి బాధ్యత అనీ పాతబస్తీ అంజయ్య ఎప్పుడూ చెబుతుంటాడు. ఇలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది. ఒక ముల్లాగారు తమ మసీదులో హిందూ అమ్మాయి వివాహం జరిపించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.

ముస్లింల, క్రైస్తవుల సఖ్యత గూర్చి కూడా ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. ఇది  2022 ఏప్రిల్‌ 21న మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో 
ముస్లింలు చర్చిలో నమాజు చదివారు. ఇఫ్తార్‌ విందుకోసం అజ్మల్‌ ఖాన్‌ అనే వ్యక్తి అన్ని మతాల మత పెద్దల్ని ఆహ్వానించాడు. అయితే, అక్కడ చర్చి ఫాదర్‌ ఆ విందు అహ్వానాన్ని అంగీకరించడమే కాకుండా, ఆ ఇఫ్తార్‌ విందు తమ చర్చిలోనే నిర్వహించాలని సూచించాడు. ఆ రకంగా తొలిసారి ఇస్తార్‌ విందు చర్చిలో, ఫాదర్‌ పర్యవేక్షణలో జరిగింది. 

పరమత సహనం, సహకారం అంటే ఇదే కదా! అసలైన భారతదేశపు ‘ఆత్మ’ అక్కడ తొణికిసలాడింది. ఆత్మ అంటే... ఆత్మ – పరమాత్మలు కావు. అంతరంగంలోని ఒక సమర్పణ భావం! ఆలోచనల ఐక్యత!! గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం. మనిషి మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమించడం. ఇక్కడ చెప్పుకున్న సంఘటనలన్నింటికీ ఒక అంతస్సూత్రం ఉంది. ‘దేవుడు లేడు – మతం అనేది వ్యక్తిగతం – మన చివరి గమ్యం – మానవవాదం’ అనేది సాధించడానికి... ఇలా మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయేమో!

క్రమంగా తరతమ భేదాలు మరిచి, మనుషులంతా ఒక్కటే అనే విషయం జీర్ణించుకునేందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో? మనిషికి మనిషే ముఖ్యం – దేవుళ్ళు కాదు, అనే భావనలోకి సమాజం ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా ‘మన మార్గం సుదీర్ఘమైంది. రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. ఇరవై ఒకటవ శతాబ్దపు స్త్రీ – పురుషుల్ని అంటే మనల్ని మనం కొత్తగా తయారు చేసుకోవడానికి రోజు వారీగా కృషి చేస్తూనే ఉండాలి’ అన్న చే గువేరా మాటలు గుర్తు చేసుకుంటూ ఉండాలి.  నిజమే– బూజు పట్టిన భావజాలాన్ని వదిలి, కొంచెం కొంచెంగా పైపైకి ఎదుగుతూనే ఉండాలి. పైకి ఎదిగితేనే (ఎగిరితేనే) అద్భుతమైన మానవత్వ దృశ్యాలు కనబడతాయి. 

నువ్వు బతికి ఉన్నావంటే...
నీ జీవితపు విజయోత్సవాన్ని పంచుకో
స్వర్గమనేది ఎక్కడైనా ఉంటే...
దాన్ని భూమి మీదికి దించుకో–
అని ఎలుగెత్తి చెబుతూ ముందుకు సాగాల్సి ఉంది.

డాక్టర్‌ దేవరాజు మహారాజు 
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement