విశ్లేషణ
దక్షిణ భారతదేశంలో కులాన్ని ప్రశ్నిస్తూ తొలిసారి గొంతెత్తిన కార్యకర్త అయోతీ థాస్. ఆది ద్రావిడ నేపథ్యం నుండి వచ్చిన ఆయన రాజకీయం, సాహిత్యం, మతం వంటి అనేక రంగాలలో అవిరళకృషి చేసినవారు. తమిళ పండితుడు.
వృత్తి రీత్యా సిద్ధ వైద్యుడు. పందొమ్మిదవ శతాబ్దం చివరలో ఆది ద్రావిడ ప్రజల అభ్యున్నతి కోసం నడుం బిగించి 1891లో ‘కుల రహిత ద్రవిడ మహాసభ’ను స్థాపించారు. ఈ విషయంలో రెట్టమాలై శ్రీనివాసన్ అనే మరో సంఘ సంస్కర్త ఈయనకు సహకరించారు. బౌద్ధం స్వీకరించిన అయోతీ థాస్, పరయల (మాలల) అసలు మతం బౌద్ధమని తేల్చారు. అంద రినీ అందులోకి మారమని సూచించారు. కులరహిత సమాజం బౌద్ధం ద్వారానే సాధ్యమని ఉద్బోధించారు.
1861–91 మధ్య కాలంలో క్రైస్తవులు, ముస్లింలు మినహా మిగిలిన వారందరినీ బలవంతంగా హిందువులుగానే పరిగణించేవారు. అయితే అయోతీ థాస్ ‘హిందూ’ అనే గుర్తింపును నిరాకరించారు. కారణమేమంటే హిందూను గుర్తిస్తే అందులో ఉన్న కుల నిర్మాణాన్ని, నిచ్చెన మెట్ల కుల సంస్కృతిని, అసమా నతలను స్వీకరించాలి. అందుకని ఆయన దాన్ని తిరస్కరించడంతో పాటు, తన అనుయాయులందరినీ తిరస్కరించమని సూచించారు.
ఆయన రాజకీయంగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. తను స్థాపించిన ‘కుల రహిత ద్రవిడ మహా సభ’ పక్షాన 10 డిమాండ్లతో ఒక వినతి పత్రం తయారు చేసి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పంపారు. వారు వాటిని తమ 12వ సమావేశంలో చర్చించారు కూడా! అయితే, అందులో ఒక్క డిమాండుకు కూడా సుముఖత వ్యక్తపరచలేదు. ఆ డిమాండ్లలో ఉచిత విద్య, బంజరు భూముల కేటాయింపు, పరయల ఆలయ ప్రవేశం వంటివి ఉన్నాయి.
ఆలయ ప్రవేశం ఇక్కడ భక్తికి సంబంధించిన విషయం కాదు. మనుషులుగా సమాన హోదా, సమాన హక్కుకు సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీతో పని కాలేదని అయోతీ థాస్ తన ప్రయత్నం మానుకోలేదు. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌కు పోటీగా 1884లో స్థాపితమైన ‘మద్రాస్ మహాజన సభ’కు కూడా అవే పది డిమాండ్ల వినతి పత్రం పంపించారు. కానీ, అక్కడా చుక్కెదురైంది. నిర్వాహక సభ్యులు ఆయనను ఘోరంగా అవమానించారు.
జరిగిన అవమానంతో అయోతీ థాస్ తీవ్రమైన మనో వేదనకు గురయ్యారు. తాము హిందువులమే అయితే జాతి విచ క్షణ ఎందుకూ? కుల దూషణలెందుకూ? దేవుడు అందరి వాడైన ప్పుడు ఆలయ ప్రవేశం తమకెందుకు ఉండదూ? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆయన వాటికి సమాధానాలు కను గొనే ప్రయత్నంలో వేదాలు, బ్రాహ్మణత్వం, ఆచారాలు వంటి వాటి గూర్చి అధ్యయనం ప్రారంభించారు.
1870 దశకంలో తన పాతికేళ్ళ ప్రాయంలో తమిళనాడు నీల గిరి ప్రాంతంలోని తోడర్–కొండ జాతులను సమైక్యపరిచి 1875లో ‘అద్వైతానంద సభ’కు రూపకల్పన చేశారు. అప్పుడే రెవరెండ్ జాన్ రతినమ్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన మద్రాసులో ఆది ద్రావిడుల కోసం వెస్లియన్ మిషన్ పాఠశాల నిర్వహిస్తున్నాడు. ఆయన పరిచయంతో అయోతీ థాస్‌కు కొత్త ఉత్సాహం లభించింది. దాంతో 1885లో ‘ద్రవిడ పాండ్యన్’ అనే వార్తా పత్రికను ప్రారంభించారు. 1886లో ‘ఆది ద్రావిడులు హిందువులు కారు’ అని భారతదేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మ కమైన ప్రకటన చేశారు.
1891లో ద్రవిడ మహాసభను స్థాపించి, ఆది ద్రావిడులకు ఒక పిలుపునిచ్చారు. వారంతా తమను తాము హిందువులుగా కాక, ‘కుల రహిత తమిళులు’గా ప్రకటించుకోవాలని కోరారు. ఆ రోజుల్లో అదొక సాహసోపేతమైన చర్య. ఒకసారి అయోతీ థాస్ తన అనుచరులతో థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడ యిన కల్నల్ హెచ్.ఎస్. ఆల్కాట్‌ను కలుసుకున్నారు. బౌద్ధం స్వీకరించాలన్న తన కోర్కెను ఆయనకు తెలియజేశారు.
ఆయన అయోతీ థాస్ శ్రీలంకకు వెళ్లే ఏర్పాటు చేశాడు. శ్రీలంకలో అయోతీ థాస్ సింహళ బౌద్ధ భిక్షువు సుమంగళ నాయక్ నుండి ధమ్మదీక్ష స్వీకరించారు. చెన్నై తిరిగి వచ్చాక 1889లో ‘శాక్య బౌద్ధ సంఘాన్ని’ స్థాపించి, దాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేశారు.
ఈయన అప్పుడు ఏర్పాటు చేసిన శాక్య బౌద్ధ సొసైటీయే కాల క్రమంలో ఇండియన్ బుద్ధిస్ట్ అసోసియేషన్‌గా మారిపోయింది. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా నిలిచిన ఆయన, రచయితగా చేసిన కృషి కూడా తక్కువది కాదు. అంబికయ్యన్ కథ, ఇంద్ర జాతి చరిత్ర, ఇంద్ర దేశ బౌద్ధ పండుగలు, తిరువళ్ళువర్ చరిత్ర వంటి డజనకు పైగా గ్రంథాలు రాశారు.
‘అయోతీ థాస్’గా ప్రసిద్ధుడైన ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాత్తవరాయన్. అయోతీ థాస్ అనేది ఆయనకు ఆయనే పెట్టుకున్న పేరు. బాల్యంలో ఈయన అయోధ్య దాసర్ పండిట్ అనే ఉపాధ్యాయుడి వద్ద చదువు నేర్చుకున్నారు.
తమిళం, ఇంగ్లిష్, పాళీ భాషలు, తత్వశాస్త్రం, సిద్ధ వైద్యం... ఇలా అనేక విషయాలు నేర్చుకున్నారు. అందువల్ల గురువుగారి పట్ల ఏర్పడ్డ గౌరవ భావంతో తన పేరు కూడా అయోధ్య దాసర్‌గా చెప్పుకునేవాడు. ఆ పేరే స్థిరపడి అయోతీ థాస్‌గా మారింది. తమిళ పలుకుబడి థాస్ అంటే తెలుగులో దాసుడు అనే అర్థం.
వీరిది విద్యావంతుల కుటుంబం. ఈయన తండ్రి కాంత ప్పన్, ఫ్రాన్సిస్ వైటీ ఎల్లిస్ అనే బ్రిటిష్ అధికారి దగ్గర పని చేసేవాడు. తన కుటుంబం తరతరాలుగా భద్రపరచుకుంటూ వచ్చిన తాళపత్ర గంథాలు తిరుక్కురళ్, నాలడియార్‌లను ఫ్రాన్సిస్ ఎల్లిస్‌కు అందించాడు కాంతప్పన్. ఆయన వాటి విలువను గ్రహించి, ఇంగ్లిష్‌లోకి అనువదించాడు.
తర్వాత పుస్తకాలుగా ముద్రించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ రకంగా తమిళుల సాంస్కృతిక సంపదైన తిరుక్కురళ్ వెలుగులోకి వచ్చింది. అయోతీ థాస్ 1845 మే 20న మద్రాసులోని రాయ పేటలో జన్మించారు. మళ్ళీ అదే మే నెల 5వ తేదీన 1914లో 69వ యేట కన్నుమూశారు. ఒక రకంగా పెరియార్, ద్రవిడర్ కళగమ్, బి.ఆర్. అంబేడ్కర్‌లకు ఈయనే స్ఫూర్తిప్రదాత!
డా‘‘ దేవరాజు మహారాజు
– వ్యాసకర్త సాహితీవేత్త, విశ్రాంత ప్రొఫెసర్
(మెల్బోర్న్ నుంచి)
Comments
Please login to add a commentAdd a comment