అతడు మానవవాద విప్లవకారుడు!  | Devaraju Maharaju Article Indian Philosopher MN Roy Birthday Special | Sakshi
Sakshi News home page

అతడు మానవవాద విప్లవకారుడు! 

Published Sun, Mar 20 2022 12:32 AM | Last Updated on Sun, Mar 20 2022 12:32 AM

Devaraju Maharaju Article Indian Philosopher MN Roy Birthday Special - Sakshi

అలుపెరుగని సత్యాన్వేషి, కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, ప్రపంచ మానవ వాద విప్లవకారుడు ఎంఎన్‌ రాయ్‌– తీవ్ర జాతీయ వాదంలోంచి, ప్రపంచ కమ్యూనిస్ట్‌ రాజకీయాలతో మమేకమై, తర్వాత కాలంలో రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీ స్థాపకుడయ్యారు. ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసుకోవాలంటే ఎంఎన్‌ రాయ్‌ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్, మెక్సికన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ స్థాపకుడు (1917) కావడమేమిటీ? విచిత్రమని పిస్తుంది. కానీ అది వాస్తవం. ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనని ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండనివ్వలేదు. రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీ స్థాపనతో పాటూ భారత రాజ్యాంగ చిత్తుప్రతిని కూడా తయారు చేసి, ప్రచురించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన సమయానికే ఆయన ‘నూతన మానవ వాదాని’కి మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేశారు. 

ఒక జీవితకాలంలో ఒక వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేయగలిగా రన్నది అంతుపట్టని విషయం. డెహ్రాడూన్‌లో తన నివాసమున్న చోటనే  ‘ఇండియన్‌ రినైజాన్స్‌ ఇనిస్టిట్యూట్‌’ను స్థాపించారు. ఇది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్‌ హౌస్‌’గా పేరు పొందింది. భారతీయ సమాజంలో మనువాదుల ప్రభావంతో శతాబ్దాలుగా వేళ్ళూనుకుని ఉన్న మతతత్వ భావనకి వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమన్నారు రాయ్‌. ఎంఎన్‌ రాయ్‌ అసలు పేరు నరేంద్రనాథ్‌ భట్టాచార్య. 21 మార్చి 1887న పశ్చిమ బెంగాల్‌ 24 ఉత్తర పరగణాల్లో ఒక పూజారి కుటుంబంలో పుట్టారు. బాల్యంలో తండ్రి దీనబంధు భట్టాచార్య దగ్గరే సంస్కృతం, కొన్ని సనాతన శాస్త్రాలు చదువుకున్నారు. అప్పుడే అతనిలో కొత్త ఆలోచనలు ప్రారంభమయ్యాయి. 14 వ ఏట వెళ్ళి ‘అనుశీలన్‌ సమితి’ అనే విప్లవ సంస్థలో చేరారు. కానీ కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురయ్యింది. ఆ తర్వాత జతిన్‌ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు – అని తన గ్రంథం (చైనాలో నా అనుభవాలు)లో రాసుకున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘జుగాంతర్‌’ సభ్యులు ఎన్నో  కార్యక్రమాలు చేస్తుండేవారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ కాలంలో రాయ్‌ జర్మన్ల సహాయంతో బ్రిటిష్‌ వాళ్లను తరమడానికి ఆయుధాల సేకరణకు ప్రయత్నించారు.  

1916లో రాయ్‌ అమెరికా చేరుకున్నారు. కానీ, బ్రిటిష్‌ గూఢచారులు అతని కదలికల్ని గమనిస్తూనే ఉన్నారు. రాయ్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలో అడుగు పెట్టగానే అక్కడి ప్రాంతీయ వార్తా పత్రికలో రాయ్‌ గురించి ఓ సంచలన వార్త ప్రచురితమై ఉంది. ‘‘ప్రఖ్యాత బ్రాహ్మణ విప్లవకారుడు, ప్రమాదకారి అయిన జర్మన్‌ గూఢచారి నరేంద్రనాథ్‌ భట్టాచార్య అమెరికాలో అడుగు పెట్టాడ’’న్నది ఆ వార్త సారాంశం. దొరక్కుండా ఉండటానికి రాయ్‌ వెంటనే క్యాలిఫోర్నియాకు వెళ్ళిపోయారు. అక్కడ పేరు మార్చుకుని, మానవేంద్రనాథ్‌ రాయ్‌ (ఎంఎన్‌ రాయ్‌)గా చలా మణీ అయ్యారు. క్యాలిఫోర్నియా నుండి తప్పనిసరై మెక్సికో చేరుకున్నారు. అనతి కాలంలోనే అక్కడి సోషలిస్ట్‌లతో కలిసి ‘మెక్సికన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ’ని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్ళకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్ట్‌ పార్టీని స్థాపించగలిగారు. రాయ్‌ తర్వాత కాలంలో లెనిన్, స్టాలిన్‌లను కలిసి 1926లో కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌ స్థాపించారు. 1930లో ఆయన భారత దేశానికి తిరిగి రాగానే, బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. ఆరేళ్ళు జైలు శిక్ష విధించింది. ఆ కాలంలోనే రాయ్‌ తొమ్మిది సంపుటాల ‘‘ప్రిజన్‌ డైరీలు’’ రాశారు. 

జైలు నుండి విడుదలైన తరువాత 1946లో రాయ్‌ డెహ్రా డూన్‌లో ‘ఇండియన్‌ రినైజాన్స్‌ ఇనిస్టిట్యూట్‌’ స్థాపించారు. ఆ సంస్థ ఆధునిక భౌతిక శాస్త్ర దృక్కోణంలో మానవ వాదాన్ని ప్రచారం చేసింది. పత్రికలు, పుస్తకాలు ముద్రించడం; సభలూ, సమావేశాలే కాదు, కార్యాశాలలు నిర్వహించడం నిరంతరం కొనసాగుతూ ఉండేవి. ఫలితంగానే బలమైన మానవ వాద సాహిత్యం వచ్చింది. రాయ్‌ జీవితం నుండి, ఆయన ప్రతి పాదించిన రాడికల్‌ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్ట్‌లు, కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్‌ వాదులు, పార్టీ రహిత కార్యకర్తలు ఎంతో మంది ప్రేరణ పొందారు. మతతత్వంపై పోరాడిన రాయ్, 25 జనవరి 1954న తన 67వ ఏట, గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుత క్లిష్ట పరి స్థితుల్లో మానవవాద ఆలోచనా ధోరణిని బలోపేతం చేసు కోవాల్సి ఉంది. ఈ బాధ్యత దేశంలోని యువతరానిదే! 


దేవరాజు మహారాజు 
వ్యాసకర్త  కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, జీవ శాస్త్రవేత్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement