కొందరు నిజాయతీగా సమా జానికి పనికొచ్చే రచనలు చేస్తారు. అటువంటి అరుదైన, విలువైన రచయిత కొడవటి గంటి రోహిణీ ప్రసాద్. అరవై మూడవ యేట అనూహ్యంగా 2012 సెప్టెంబర్ 8న బొంబాయిలో కన్నుమూసి, తెలుగు జాతికి దిగ్భ్రాంతిని కలుగ జేసిన ఆయన కృషి చిరస్మరణీయం.
బాల్యంలో తండ్రి కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.) కల్పించిన వాతావరణం వల్ల రోహిణీ ప్రసాద్ పుస్తకాల వైపు, హేతువాద దృక్పథం వైపు, శాస్త్రీయ అవగాహన వైపు ఆకర్షితులయ్యారు. కానీ, సంగీతం వైపు, నాట్యం వైపు, అనువాదాల వైపు ఆకర్షితులు కావడం ఆశ్చర్యంగా తోస్తుంది. విశాఖలో చదువుకునే రోజుల్లో రోహిణీ ప్రసాద్ కర్ణాటక సంగీత వాయిద్యం వీణ నేర్చుకోవాలి. కానీ, ఆయన హిందుస్తానీ సంగీత వాద్యం – సితార్ నేర్చుకున్నారు. తర్వాత ముంబ యిలో ఉన్నప్పుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ శిష్యరికం చేసి సితార్ వాదనంలో ప్రావీణ్యం గడించారు.
ముంబయిలో అక్కడి తెలుగువారితో కలిసి కూచిపూడి, భరత నాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలు కలగలిపి ‘కృష్ణ పారిజాతం’ బ్యాలేకు రూపకల్పన చేశారు. ఈ అణు భౌతిక శాస్త్రవేత్త ముంబాయిలో సితార్ కచేరీలు చేయడం మామూలై పోయినా, 1990లలో అమె రికాలోని పలు నగరాలలో తన కళా ప్రదర్శనలు కొన సాగించడం, సితార్ వాద్య కళాకారుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారని తెలిసినప్పుడు ఆశ్చర్య పోతాం. అంతేకాదు, రాగాల గూర్చి, సంగీత వాద్య పరికరాల గూర్చి ఎన్నో విలువైన వ్యాసాలు రాశారని తెలిసినప్పుడు మనసు ఉప్పొంగిపోయినా, వెంటనే చివుక్కుమంటుంది. అయ్యో! ఈయనకు రావాల్సిన గుర్తింపు రాకపోయెనే అనీ!
తనకు సన్నిహితంగా తెలిసిన హిందుస్తానీ, కర్ణా టక సంగీత సమ్రాట్టుల జీవిత విశేషాలన్నీ 2000– 2012 మధ్య కాలంలో ‘ఈమాట డాట్ కామ్’లో ఆయన భద్రపరిచారు. ప్రధానంగా జరిగిన లోపమే మంటే ఆయన పుస్తకాలు వెంట వెంట రాకపోవడం. గ్రంథాలు వెలువడడం, గ్రంథాలయాల్లో లభ్యం కావడం, వచ్చే తరాలకు అందుబాటులో ఉండటం అవసరం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉండి కూడా రోహిణీ ప్రసాద్ ఆలోచనలు తెలుగు జాతికి అందాల్సి నంతగా అందలేదు. బడే గులాం అలీఖాన్, అల్లా ఉద్దీన్ ఖాన్, అహ్మద్ జాన్ ధిరక్వా, ప్రభా ఆత్రే, ఉస్తాద్ అమీర్ ఖాన్, విలాయత్ ఖాన్, ఈమని శంకరశాస్త్రి, నౌషాద్, ఓపీ నయ్యర్, సీఆర్ సుబ్బురామన్, ఘంట సాల, బాల మురళీ కృష్ణ వంటి మహా సంగీత విద్వాంసుల శైలులపై, వారి జీవిత విశేషాలపై రాసిన వ్యాసాలు ఇప్పటికైనా పుస్తక రూపంలో రావాలి. ఆ రకంగా మరణాంతరమైనా రోహిణీ ప్రసాద్ కృషి వెలుగులోకి వస్తుంది.
రోహిణీ ప్రసాద్, తన తండ్రి కొ.కు. లాగా సృజ నాత్మక సాహిత్యంలో కృషి చేయలేదు. కానీ వైజ్ఞానిక సారస్వతంలో చేసిన కృషి తక్కువది కాదు. అలాగే తన సోదరి ఆర్. శాంతసుందరి లాగా అనువాదాల వైపు కూడా ఆకర్షితులయ్యారు. 1947 నుండి ఏడేళ్లపాటుచందమామ పత్రికలో అచ్చయిన పిల్లల కథలను ఆయన ఇంగ్లిష్‌లోకి అనువదించారు. బాల సాహిత్యం విలువను, సాహిత్యం విలువను, అనువాదాల విలు వను, సంగీత కళారూపాల విలువను గ్రహించడంతో పాటు సమాజంలో వైజ్ఞానిక అవగాహన ఎంతో అవ సరం అన్నది గ్రహించారు. అందుకే మరణానంతరం తన శరీరం మట్టిపాలు కాకుండా వైద్య పరిశోధనలకు ఉపయోగపడాలి అను కున్నారు.
మూఢ విశ్వాసాలను బలపరిచే వారిపై వ్యంగ్యా స్త్రాలు సంధిస్తూనే... జరుగుతున్న సంఘటనల వెనుక ఎటువంటి భౌతిక శక్తులు పని చేస్తాయో హేతువాదులు వివరించగలగాలని సూచించారు. పుట్టిన ప్రతి ప్రాణి కలకాలం జీవించడానికి ప్రకృతి సూత్రాలు ఒప్పు కోవని, అయితే పనికొచ్చే పదార్థం జన్యు పదార్థమే గనక, దాన్ని తరువాతి తరం కోసం వాడుకుంటూ
ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తగా, సంగీత కారుడిగా, సైన్స్ రచయితగా ఒక క్రమపద్ధతిలో నిరంతరం కృషి చేస్తూ వచ్చిన రోహిణీ ప్రసాద్ ఒక విష యాన్ని గట్టిగా నమ్మారు. ‘నీ పనికి నువ్వొక రూప మివ్వు. ఆ పనే మళ్ళీ నీకో రూపమిస్తుంది’ అని! జీవి తాంతం ఆయన ఆచరించిన సూత్రం అదే!
‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ తన పుస్తకంలో రోహిణీ ప్రసాద్ ఇలా అంటారు... ‘మతాలన్నీ ఎప్పుడు ఎలా తలెత్తాయో అర్థం చేసుకుంటే అవి ఈ రోజుల్లో ఎందుకు నిరుపయోగమో అర్థమవుతుంది. మతం అపెండిక్స్ అని ఎవరో అన్నారు. నిజమే మన శరీరంలో పెద్ద పేగుకు చివర ఉన్న అపెండిక్స్ ఒకప్పుడు పని కొచ్చేదట. ఈనాడు దానివల్ల ఉపయోగమేమీ లేక పోగా, అప్పుడప్పుడు అపెండిసైటిస్ వ్యాధి కలిగిస్తూ ఉంటుంది. దాన్ని తొలగించడమే మంచిది. మతమనేది కూడా అంతే.’ మతం పట్ల స్పష్టమైన వైఖరి తెలియ జేశారాయన. మనకిప్పుడు వైజ్ఞానిక స్పృహ, వివేచన, ఇంగిత జ్ఞానం కలిగించే రచనలు కావాలి. డాక్టర్ రోహిణీ ప్రసాద్ అలాంటి రచనలే చేశారు. మనకు గొప్ప శాస్త్రవేత్తలు, మేధావులూ ఉన్నారు. కానీ సామా న్యుడి కోసం సైన్స్ రాసే రచయితలు ఎక్కువగా లేరు. ఉన్నా... వారు సైన్స్ సమాచారం ఇవ్వగలుగుతున్నారే గానీ, సమాజానికి అన్వయిస్తూ రాయలేక పోతున్నారు. విలువల్ని ప్రతిష్ఠాపించే చేవగల ఈయన మరణం వల్ల, తెలుగు సమాజానికి పెద్ద విఘాతమే. రోహిణీ ప్రసాద్ ఆశించిన సమాజానికి రూపకల్పన చేయాలి.
డా‘‘ దేవరాజు మహారాజు, వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment