కందుకూరి వీరేశలింగం పంతులు
తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ‘కార్యశూరుడు వీరేశలింగం/ కదం తొక్కి పోరాడిన సింగం/ దురాచారాల దురాగతాలను / తుద ముట్టించిన అగ్ని తరంగం’ అన్నారు. ఇప్పుడు మనం అటువంటి కందుకూరి వారి 174వ జయంతి సంద ర్భంలో ఉన్నాం (ఏప్రిల్ 16).
‘ఉద్యోగంలో చేరడానికి అమావాస్యనాడే ఎందుకు వచ్చా’ వని అధికారి అడిగాడు. అందుకు వీరేశలింగం చెప్పిన సమాధానం అధికారి నోరు మూయించింది. ‘అయ్యా! అన్ని రోజులూ ఆ ఈశ్వరుడు సృష్టించినవనే చెబుతారు కదా? మరి అలాంటప్పుడు అన్ని రోజులూ మంచివే – అలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఉద్యోగంలో చేరినా, అది మంచి రోజే అవుతుంది’ అని తాపీగా సమాధానమిచ్చారు వీరేశలింగం. ఈ విషయం ‘మూఢ నమ్మకాలపై నా పోరాటం’ అనే గ్రంథంలో ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఆ గ్రంథంలో ఆయన అనేక ప్రహసనాలు రాశారు. శకునాలు, జోస్యాల వంటివాటిని నమ్మడం ఎంత అశాస్త్రీయమో కళ్లకు కట్టినట్లు వాటి ద్వారా వివరించారు.
జ్యోతిష్యాన్ని నమ్మేవారు తాము నమ్మిన జోస్యాలు నిజం కానప్పుడు వాటిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. ఎప్పుడైనా ఒకటి అరా నిజమైతే వాటినే మళ్లీ పట్టుకుని వేలాడుతారు. ఒక విధంగా జ్యోతిష్యం చెడిపోయిన గడియారం లాంటిది. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని, ఆగిపోయిన గడి యారాన్ని నమ్మడం ఎంత మూర్ఖత్వమో, జ్యోతిష్యాన్ని నమ్మడం కూడా అంతే మూర్ఖత్వం! వాస్తవానికి మనం ఏదైనా విషయం ఊహించి చెబితే, అందులో కొంత మేరకు నిజమయ్యే అవకా శాలు ఉంటే ఉంటాయి. ఉండకపోతే ఉండవు.
ఇకపోతే, దేవుడి విషయం చూద్దాం! ఒక కారుకు బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడిందని అనుకుందాం. ఆ ప్రమాదంలో బతికినవాళ్ళు ‘ఆ దేవుడి దయవల్ల బతికామని చెప్పుకుంటారు కదా? మరి చనిపోయిన వారిని ఎవరు చంపినట్టూ? ఆ దేవుడు చంపాడని చెప్పాలి కదా? కానీ చెప్పరు. ఒకవేళ ప్రమాదానికి గురయిన ఆ కారులోని వారంతా చనిపోతే మీడియాలో వార్త ఇలా ఉంటుంది. ‘కారు బ్రేకులు ఫెయిలై,అందులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృతి చెందారు’ అని ఉంటుంది. బ్రేకులు ఫెయిల్ కావడం హైలైట్ అవుతుందే తప్ప ఆ వార్తలో దేవుడి ప్రసక్తి ఉండదు.
ప్రయాణికులు బతికితే ‘దేవుడి దయ’ వల్ల బతికారనడం, మరణిస్తే మాత్రం, తప్పు – బ్రేకులు ఫెయిల్ కావడంపై పెట్టడం ఏమైనా బాగుందా? తప్పు దేవుడి మీద పెట్టి, ఆయనే చంపేశాడని, అనుకునే ధైర్యం ఉండదు.
ప్రజలు ఇలాంటి ధోరణికి అలవాటు పడిపోవడం వల్ల కదా దేవుడు, జ్యోతిష్యం, వాస్తు, ఆత్మ, పునర్జన్మ వంటి అంధ విశ్వాసాలు సమాజంలో సజా వుగా బతుకుతున్నాయి? ఇలాంటి విశ్వాసాల వల్లనే సమాజం రోగగ్రస్తమవుతూ ఉంది. మన జీవి తంలో మన చుట్టూ జరుగుతున్న విషయాలను నిశితంగా పరిశీలిస్తూ, హేతుబద్ధంగా విశ్లేషించు కుంటే నిజానిజాలు బయటపడతాయి. ‘దైవాన్నీ, జ్యోతిష్యాన్నీ నమ్మేవారు తమ సౌకర్యానుసారంగా ఆలోచనల్ని, విధివిధానాల్ని మార్చుకుంటూ ఉంటారని’ వీరేశలింగం పంతులు ఏనాడో చెప్పారు.
మరి, మనవాళ్ళు ఏమైనా చెవికి ఎక్కించుకున్నారా? లేదే? గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా మూఢ నమ్మకాల్లో పడి పోతున్నారు. ఒక పెరియార్, ఒక కందుకూరి, ఒక తాపీ ధర్మారావు, ఒక గోరా వివేచన అనే దుడ్డు కర్రలతో జనాన్ని అదిలిస్తూనే వచ్చారు. మనం కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉండాలి. జన చైతన్యానికి దోహదం చేస్తూనే ఉండాలి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లోకి వద్దాం.
‘మహాభారత కాలంలోనే శాటిలైట్, ఇంటర్నెట్ ఉంది’ అని అన్నారు త్రిపుర ముఖ్యమంత్రి. ఇటువంటి మాటల ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్నవారూ తామేమిటో స్వయంగా నిరూపించుకుంటున్నారు. లేకపోతే అర్ధ సత్యాలతో, అబద్ధాలతో తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడండని ఈ దేశ ప్రజలకు స్వయంగా ఈ దేశ ప్రధాని చెబుతారా? ‘నేడే చూడండి’ అంటూ ఊళ్లల్లో ఓ మైకు రిక్షా తిరుగుతుండేది.
ప్రధాని పదవి ఆ స్థాయికి చేరిందా? అదే ఎందుకు? గుజరాత్ అల్లర్లపై వచ్చిన ‘పర్జానియా’ పూర్తి హిందీ సినిమా యూట్యూబ్‌లో ఉంది. అది చూడమని చెప్పలేదెందుకూ? రేషన్ ఇవ్వడం చేత గాకే ఆయన భాషణ్‌లు ఇస్తుంటారని సగటు భారతీయుడికి అర్థమైంది.
మూఢ నమ్మకాలు, జ్యోతిష్యం, వాస్తు, ఆవు పేడ, ఆవు మూత్రం వాటితో ఈ దేశ ప్రజల్ని విడగొట్టి, విభజించి, దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చాలన్న ఉద్దేశంతోనే విద్యారంగాన్ని కాషాయంలో ముంచుతున్నారు. ‘దేశం కాషాయీకరణ చెందితే తప్పేంటి?’ అని దేశ ద్వితీయ పౌరుడైన తెలుగువాడు ప్రశ్నిస్తుంటే – మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? లేక సాధారణ శకానికి పూర్వ కాలంలో ఉన్నామా? అని అనుమానపడాల్సి వస్తోంది.
ఇప్పుడు బంతి బాధ్యతాయు తంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాల కోర్టులో ఉంది. ప్రశ్నించగల సామర్థ్యం, స్థైర్యం గల సామాన్య పౌరులు కూడా ప్రతి పక్షంలో ఉన్నట్టే – ప్రజాకవి వేమన, కందుకూరి వీరేశలింగం లాంటి వారి రచనల నుండి స్ఫూర్తిని పొందాల్సి ఉంది.
డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment