kandukuri veeresalingam
-
కందుకూరి స్ఫూర్తిగా పోరాడాలి!
తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ‘కార్యశూరుడు వీరేశలింగం/ కదం తొక్కి పోరాడిన సింగం/ దురాచారాల దురాగతాలను / తుద ముట్టించిన అగ్ని తరంగం’ అన్నారు. ఇప్పుడు మనం అటువంటి కందుకూరి వారి 174వ జయంతి సంద ర్భంలో ఉన్నాం (ఏప్రిల్ 16). ‘ఉద్యోగంలో చేరడానికి అమావాస్యనాడే ఎందుకు వచ్చా’ వని అధికారి అడిగాడు. అందుకు వీరేశలింగం చెప్పిన సమాధానం అధికారి నోరు మూయించింది. ‘అయ్యా! అన్ని రోజులూ ఆ ఈశ్వరుడు సృష్టించినవనే చెబుతారు కదా? మరి అలాంటప్పుడు అన్ని రోజులూ మంచివే – అలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఉద్యోగంలో చేరినా, అది మంచి రోజే అవుతుంది’ అని తాపీగా సమాధానమిచ్చారు వీరేశలింగం. ఈ విషయం ‘మూఢ నమ్మకాలపై నా పోరాటం’ అనే గ్రంథంలో ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఆ గ్రంథంలో ఆయన అనేక ప్రహసనాలు రాశారు. శకునాలు, జోస్యాల వంటివాటిని నమ్మడం ఎంత అశాస్త్రీయమో కళ్లకు కట్టినట్లు వాటి ద్వారా వివరించారు. జ్యోతిష్యాన్ని నమ్మేవారు తాము నమ్మిన జోస్యాలు నిజం కానప్పుడు వాటిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. ఎప్పుడైనా ఒకటి అరా నిజమైతే వాటినే మళ్లీ పట్టుకుని వేలాడుతారు. ఒక విధంగా జ్యోతిష్యం చెడిపోయిన గడియారం లాంటిది. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని, ఆగిపోయిన గడి యారాన్ని నమ్మడం ఎంత మూర్ఖత్వమో, జ్యోతిష్యాన్ని నమ్మడం కూడా అంతే మూర్ఖత్వం! వాస్తవానికి మనం ఏదైనా విషయం ఊహించి చెబితే, అందులో కొంత మేరకు నిజమయ్యే అవకా శాలు ఉంటే ఉంటాయి. ఉండకపోతే ఉండవు. ఇకపోతే, దేవుడి విషయం చూద్దాం! ఒక కారుకు బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడిందని అనుకుందాం. ఆ ప్రమాదంలో బతికినవాళ్ళు ‘ఆ దేవుడి దయవల్ల బతికామని చెప్పుకుంటారు కదా? మరి చనిపోయిన వారిని ఎవరు చంపినట్టూ? ఆ దేవుడు చంపాడని చెప్పాలి కదా? కానీ చెప్పరు. ఒకవేళ ప్రమాదానికి గురయిన ఆ కారులోని వారంతా చనిపోతే మీడియాలో వార్త ఇలా ఉంటుంది. ‘కారు బ్రేకులు ఫెయిలై,అందులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృతి చెందారు’ అని ఉంటుంది. బ్రేకులు ఫెయిల్ కావడం హైలైట్ అవుతుందే తప్ప ఆ వార్తలో దేవుడి ప్రసక్తి ఉండదు. ప్రయాణికులు బతికితే ‘దేవుడి దయ’ వల్ల బతికారనడం, మరణిస్తే మాత్రం, తప్పు – బ్రేకులు ఫెయిల్ కావడంపై పెట్టడం ఏమైనా బాగుందా? తప్పు దేవుడి మీద పెట్టి, ఆయనే చంపేశాడని, అనుకునే ధైర్యం ఉండదు. ప్రజలు ఇలాంటి ధోరణికి అలవాటు పడిపోవడం వల్ల కదా దేవుడు, జ్యోతిష్యం, వాస్తు, ఆత్మ, పునర్జన్మ వంటి అంధ విశ్వాసాలు సమాజంలో సజా వుగా బతుకుతున్నాయి? ఇలాంటి విశ్వాసాల వల్లనే సమాజం రోగగ్రస్తమవుతూ ఉంది. మన జీవి తంలో మన చుట్టూ జరుగుతున్న విషయాలను నిశితంగా పరిశీలిస్తూ, హేతుబద్ధంగా విశ్లేషించు కుంటే నిజానిజాలు బయటపడతాయి. ‘దైవాన్నీ, జ్యోతిష్యాన్నీ నమ్మేవారు తమ సౌకర్యానుసారంగా ఆలోచనల్ని, విధివిధానాల్ని మార్చుకుంటూ ఉంటారని’ వీరేశలింగం పంతులు ఏనాడో చెప్పారు. మరి, మనవాళ్ళు ఏమైనా చెవికి ఎక్కించుకున్నారా? లేదే? గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా మూఢ నమ్మకాల్లో పడి పోతున్నారు. ఒక పెరియార్, ఒక కందుకూరి, ఒక తాపీ ధర్మారావు, ఒక గోరా వివేచన అనే దుడ్డు కర్రలతో జనాన్ని అదిలిస్తూనే వచ్చారు. మనం కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉండాలి. జన చైతన్యానికి దోహదం చేస్తూనే ఉండాలి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లోకి వద్దాం. ‘మహాభారత కాలంలోనే శాటిలైట్, ఇంటర్నెట్ ఉంది’ అని అన్నారు త్రిపుర ముఖ్యమంత్రి. ఇటువంటి మాటల ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్నవారూ తామేమిటో స్వయంగా నిరూపించుకుంటున్నారు. లేకపోతే అర్ధ సత్యాలతో, అబద్ధాలతో తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడండని ఈ దేశ ప్రజలకు స్వయంగా ఈ దేశ ప్రధాని చెబుతారా? ‘నేడే చూడండి’ అంటూ ఊళ్లల్లో ఓ మైకు రిక్షా తిరుగుతుండేది. ప్రధాని పదవి ఆ స్థాయికి చేరిందా? అదే ఎందుకు? గుజరాత్ అల్లర్లపై వచ్చిన ‘పర్జానియా’ పూర్తి హిందీ సినిమా యూట్యూబ్‌లో ఉంది. అది చూడమని చెప్పలేదెందుకూ? రేషన్ ఇవ్వడం చేత గాకే ఆయన భాషణ్‌లు ఇస్తుంటారని సగటు భారతీయుడికి అర్థమైంది. మూఢ నమ్మకాలు, జ్యోతిష్యం, వాస్తు, ఆవు పేడ, ఆవు మూత్రం వాటితో ఈ దేశ ప్రజల్ని విడగొట్టి, విభజించి, దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చాలన్న ఉద్దేశంతోనే విద్యారంగాన్ని కాషాయంలో ముంచుతున్నారు. ‘దేశం కాషాయీకరణ చెందితే తప్పేంటి?’ అని దేశ ద్వితీయ పౌరుడైన తెలుగువాడు ప్రశ్నిస్తుంటే – మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? లేక సాధారణ శకానికి పూర్వ కాలంలో ఉన్నామా? అని అనుమానపడాల్సి వస్తోంది. ఇప్పుడు బంతి బాధ్యతాయు తంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాల కోర్టులో ఉంది. ప్రశ్నించగల సామర్థ్యం, స్థైర్యం గల సామాన్య పౌరులు కూడా ప్రతి పక్షంలో ఉన్నట్టే – ప్రజాకవి వేమన, కందుకూరి వీరేశలింగం లాంటి వారి రచనల నుండి స్ఫూర్తిని పొందాల్సి ఉంది. డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త -
వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులు
-
ఎందుకీ గలీజు రాతలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థాపించిన హితకారిణి సమాజానికి సంబంధించిన ఆస్తులను సర్కారు స్వాధీనం చేసుకుంటుందంటూ పచ్చ మీడియాలో రాసిన గలీజు రాతల్లో వాస్తవం లేదని హితకారిణి సమాజం చైర్పర్సన్ కాశీ బాలమునికుమారి చెప్పారు. హితకారిణి సమాజం ట్రస్టు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎవరి మెప్పు పొందడానికి ఇటువంటి రాతలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. నిజాలు తెలుసుకోకుండా భూముల స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ రాయడం ఎంతవరకు సబబని నిలదీశారు. కందుకూరి వీరేశలింగం పంతులు ఏ లక్ష్యంతో ఈ సమాజాన్ని స్థాపించారో.. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను మహిళలకే అందిస్తున్నారని చెప్పారు. అందుకే దళిత మహిళ అయిన తనను ఈ హితకారిణి సమాజానికి చైర్‌పర్సన్‌ను చేసి అభివృద్ధి పథంలో నడిపించాలని ఆదేశించారని తెలిపారు. పచ్చ మీడియాపై లీగల్ చర్యలు ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసి, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు జీతాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసుతో చర్యలు తీసుకున్నారని చెప్పారు. హితకారిణి సమాజం ఆస్తులను ప్రభుత్వం తీసుకోలేదని బాలమునికుమారి స్పష్టం చేశారు. హితకారిణి సమాజంలో అద్దెకిచ్చిన దుకాణాలపై పెత్తనం తమకే ఇవ్వాలంటూ విద్యాశాఖ పట్టుబడుతోందని రాయడం కూడా సత్యదూరమని చెప్పారు. ఆ దుకాణాల అజమాయిషీ ఎప్పటికీ హితకారిణి సమాజం అధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. విలీనం చేసుకుంటున్నప్పుడే ఆస్తులు తమకు అవసరం లేదని, కేవలం విద్యాసంస్థలను అభివృద్ధి చేయడానికే విలీనం చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా పచ్చ మీడియాలో అసత్య కథనం ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై చట్టప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం నగరంలోని దానవాయిపేట, ఇన్నీసుపేటలోని సమాజం ప్రాంగణాలన్నీ కలిపి 31 ఎకరాల్లో ఉండగా.. వీటి విలువ దాదాపు రూ.200 కోట్లని, ఇంత విలువైన భూములను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యాశాఖ భూములు ఇచ్చేయాలని పట్టుబడుతున్నట్టు తప్పుడు కథనం రాయడం మంచిది కాదన్నారు. సమాజం ఆస్తులను భద్రంగా కాపాడుతున్నామని, కందుకూరి ఆశయాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. ఆ భూములను స్వాధీనం చేయాలంటూ దేవదాయ, ధర్మదాయ శాఖ జీవో జారీ చేసినట్లు రాయడం కూడా సరికాదన్నారు. ఉద్దేశపూర్వకంగా కందుకూరి విద్యాసంస్థలపై, హితకారిణి సమాజంపై తప్పుడు కథనాలు రాస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈనాడు చైర్మన్ రామోజీరావుకి వయసు మీదపడటంతో పత్రిక బాధ్యత చూడలేకపోతున్నారేమోనని, అందుకే ఆ పత్రికలో ఇటీవల తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని విమర్శించారు. హితకారిణి సమాజం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, దీనిపై తప్పుడు కథనాలు రాయడం అందరికీ ఆగ్రహం కలిగిస్తుందని పేర్కొన్నారు. హితకారిణి సమాజం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు దేవులపల్లి సరితారాణి, గుడాల ఆదిలక్ష్మి, దూనబోయిన అరుణకుమారి, ఉల్లూరి రాజు, మద్దు సతీష్, కందుకూరి రాజ్యలక్ష్మి ఎంబీఏ మహిళా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ విద్యాప్రతిమ, కందుకూరి రాజ్యలక్ష్మి డీఈడీ మహిళా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ విజయభాను పాల్గొన్నారు. -
కందుకూరి జయంతి; తెలుగు నాటకరంగం దినోత్సవం
నవ్యతా ప్రయోక్త, సంస్కర్త, శతాధిక గ్రంథకర్త కందుకూరి వీరేశలింగం పంతులు సాహితీ ప్రీతితో, సంస్కరణ దృక్పథంతో స్పృశించని శాఖలేదు.. చేపట్టని ప్రక్రియలేదు. ఆయన ప్రజ్ఞ బహుముఖాలుగా విస్తరించింది. ఆంధ్ర సాహిత్యంలో కవుల చరిత్రలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్ర, శాస్త్ర వాజ్మయాది ప్రక్రియలన్నింటికీ ఆద్యులయ్యారు. సాహిత్యాన్ని ఆయన సంఘ సంస్క రణకు ఉపకరణంగా చేసుకున్నారు. ఆనాటి సంఘంలో గూడు కట్టుకొన్న మూఢాచారాలను పారద్రోలారు. తెలుగు నాటకరంగం దినోత్సవ నేపథ్యం.. తెలుగు నాటకరంగానికి వీరేంశలింగం కృషి గణ నీయమైంది. 19వ శతాబ్దిలో బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, కన్యాశుల్కం, అంటరానితనం, వేశ్యావృత్తి వంటి దురాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. అప్పట్లో సామాజిక చైతన్యంతో, సంస్కరణ దృక్పధంతో ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు శ్రవ్యకావ్యాల కంటే నాటకాలు శక్తివం తమైనవన్న ఆలోచనతో వీరేశలింగం 16 నాటకాలను రచించారు. వీరేశలింగంగారి నాటకాల్లో బ్రాహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, అభిజ్ఞాన శాకుంతలం, సత్యహరిశ్చంద్ర, రత్నావళి వంటివి ప్రసిద్ధాలు. బ్రాహ్మ వివాహం నాటకం ఆయనకు మంచి పేరును తెచ్చింది. ఈ నాటకంలో ముక్కుపచ్చలారని బాలికను, కన్యాశుల్కానికి ఆశపడి ముసలివాడికిచ్చి పెళ్లి చేయడాన్ని అధిక్షేపించారు. ముసలివాళ్ల పెళ్లి ఆశను అవహేళన చేసి ప్రేక్షకుల కళ్లు తెరిపించారు. డబ్బు కక్కుర్తితో కన్యాశుల్కానికి ఆశపడి పిల్లల జీవితాలను నాశనం చేసే తల్లిదండ్రులను, పెళ్లిళ్ల పేరయ్యలను తీవ్రంగా నిరసించారు. వీరేశలింగంకి పేరు తెచ్చిన మరో నాటకం వ్యవహార ధర్మబోధిని. ఈ నాటకంలో న్యాయాధికారుల అవినీతిని, న్యాయవాదుల మోసాలను, వాదిప్రతివాదుల దుశ్చర్యలను బట్టబయలు చేశారు. తెలుగు నాటకరంగం దినోత్సవంపై 2000లో పెద్ది రామారావు యవనిక త్రైమాసిక పత్రిక ద్వారా చర్చలు జరిగాయి. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలుగు నాటకరంగం దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం అవసరం అన్న ఆలోచన నాటకరంగ కళాకారులు, విమర్శకుల్లో కలిగింది. వ్యవహారిక భాషలో నాటకాలు రాసిన తొలినాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడు, నాటక సమాజ స్థాపకుడైన వీరేశలింగం జయంతిని ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగం దినోత్సవంగా ఏర్పాటు చేయాలని నాటకరంగం ప్రముఖులంతా ఏకాభి ప్రాయానికి వచ్చారు. కొన్ని నాటక రంగం సంస్థలు 2001 నుంచి వీరేశలింగం జయంతిని తెలుగు నాటకరంగం దినోత్సవంగా జరిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డాక్టర్ కేవీ రమణాచారి నాటక కళాకారుల అభిమతం మేరకు వీరేశలింగం జయంతిని తెలుగు నాటకరంగం దినోత్సవంగా గుర్తించాలని 2007 మార్చిలో ప్రస్తావించారు. వైఎస్సార్ వెంటనే స్పందించి 2007 మార్చిలో వీరేశలింగం దినో త్సవాన్ని ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటకరంగం దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్వర్తులు జారీ చేశారు. 2007 ఏప్రిల్ 16న ప్రభుత్వం అధికారికంగా తొలిసారిగా తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించింది. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నాటక రంగంలో విశేష కృషి చేసిన కళాకారులకు సన్మానాలు, జిల్లా, రాష్ట్రస్థాయి పురస్కారా లతో సత్కరించాలని తీర్మానించారు. ప్రముఖ నాటక కళాకారుల జయంతి, వర్ధంతులను నిర్వహించి ప్రజల్లో నాటకకళ పట్ల ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో తెలుగు నాటకరంగ దినోత్సవం ఆవిర్భ వించింది. కరోనా తగ్గిన తర్వాత తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలు నాటక రంగ దినోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించగలవని ఆశిద్దాం..! డాక్టర్ పీవీ సుబ్బారావు వ్యాసకర్త సాహితీ విమర్శకులు మొబైల్ : 98491 77594 -
కవితల పండుగ: ఫేమస్ కవితలు చూసేద్దామా!
‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా కవితాభిమానులకు తీరే దాహం కాదది. కవిత్వం ఒక వాక్కళ. బహుశ వాక్కు పుట్టినప్పుడే కవిత్వమూ పుట్టి ఉంటుంది. కవిత్వం ఒక చిత్కళ. కవిత్వంలేని భాష లేదు, కవిత్వానికి అందని భావమూ లేదు. కవిత్వం గురించి సవివరంగా చెప్పుకోవాలంటే ఎన్ని ఉద్గ్రంథాలైనా చాలవు. కవిత్వాన్ని సంక్షిప్తంగా చవిచూపడానికి ఒక్క పదునైన వాక్యమైనా సరిపోతుంది. కవిత్వం గురించి ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే, నేడు (మార్చి 21న) ప్రపంచ కవితా దినోత్సవం. కవిత్వానికి గల సమస్త పార్శవాలనూ స్పృశించడం సాధ్యమయ్యే పనికాదు గాని, ఈ సందర్భంగా ఆధునిక తెలుగు కవుల చమత్కారాల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యులలో ఒకరు కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కర్త అయిన కందుకూరి తన కాలంలోని సాంఘిక దురాచారాలను ఖండించడానికి తన కలానికి పదునుపెట్టారు. సమాజంలోని పెద్దమనుషుల దుర్మార్గాలపై వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టారు. కందుకూరి రాసిన ప్రహసనాలు ఆయన చమత్కార ధోరణికి అద్దం పడతాయి. కందుకూరి ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అనే ప్రహసనప్రాయమైన నవల రాశారు. అందులో ఆడుమళయాళాన్ని గురించి వర్ణనలో ఆయన హాస్యం గిలిగింతలు పెట్టిస్తుంది. ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’లోని ‘ఆడుమళయాళం’ పూర్తిగా మహిళల రాజ్యం. అక్కడివారు ‘పత్నీవ్రత ధర్మబోధిని’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలోని నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాటిలో మచ్చుకొకటి... ‘పురుషుండు గార్దభమునున్ స్థిరమగు దండనము లేక చెడిపోదురిలన్ గరుణ దలంపక నెలకొక పరిౖయెనం గొట్టవలయు పత్ని పురుషునన్’ ఇదంతా ఇప్పటితరం పాఠకులకు ‘జంబలకిడి పంబ’ సినిమాను తలపిస్తుంది. కందుకూరి ప్రహసనాల్లో ‘కలిపురుష శనైశ్చరవిలాసం’ ఒకటి. అందులో మద్యానికి ఎంగిలి లేదంటూ వ్యంగ్యంగా చెప్పిన పద్యం... ‘పొగచుట్టకు సతిమోవికి అగణితముగ మద్యమునకు అమృతమునకున్ తగ నుచ్చిష్టము లేదని ఖగవాహను తోడ కాలకంఠుడు బలికెన్’ గురజాడ అప్పారావు తన ‘కన్యాశుల్కం’ నాటకంలో ఇదే పద్యాన్ని వెంకటేశం నోట పలికిస్తారు. అంతేకాదు, ఇదే పద్యాన్ని అనుకరిస్తూ, గిరీశం పాత్రతో ఇలా చెప్పిస్తారు: ‘‘ఖగపతి యమృతము తేగా భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగచుటై్ట జన్మించెను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’’ ‘కన్యాశుల్కం’ నాటకం ఆద్యంతం హాస్యభరితంగానే సాగుతూ, ఆనాటి సమాజంలోని దురాగతాలను కళ్లకు కడుతుంది. హాస్యానికి మారుపేరైన కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాలు కూడా రాశారు. ఆయన రాసిన ‘అద్భుత కవిత్వ ప్రహసనం’లో ప్రాచీన కవిత్వం పాషాణమని, నవీన కవిత్వం గొప్పదని గురువుతో చెబుతారు శిష్యులు. వారు వెలగబెట్టిన నవీన కవిత్వానికి ఒక మచ్చుతునక... ‘తోటకూర తెచ్చి దొడ్డిలోన తరిగి కుండలోన బెట్టి కుదమగాను కింద మంటబెట్ట ఉడకకేం జేస్తుంది దాని కడుపు కాల ధరణిలోన’ ఇక చిలకమర్తివారు రాసిన పకోడి పద్యాలు సుప్రసిద్ధాలు. అయితే, తిరుపతి వేంకట కవులు కూడా పకోడిపై ఒక చమత్కార పద్యం చెప్పారు. కరకరలాడే ఆ పద్యం ఇదీ: ‘కరకరలాడు కొంచెమగు కారము గల్గు బలాండు వాసనా హరమగు గొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా దరమున బల్కుచుందు రదితాదృశమే యగునంచు దోచెడిన్’ ఇలాంటివన్నీ ఆధునిక సాహిత్యం తొలినాళ్లలోని చమత్కారాలకు ఉదాహరణలు. ‘మహాప్రస్థానం’తో శ్రీశ్రీ కవనరంగంలో కదం తొక్కడం ప్రారంభించాక కొత్త ఊపు వచ్చింది. విప్లవకవిగా ముద్రపడిన శ్రీశ్రీ ‘సిప్రాలి’లో చమత్కార కవిత్వంతో పాటు పేరడీ గారడీలూ చేశాడు. ‘సిరిసిరిమువ్వ’ మకుటంతో కంద పద్యాలు, ‘ప్రాసక్రీడలు’, ‘లిమరిక్కుల’తో కలిపి ‘సిప్రాలి’గా తీసుకొచ్చిన పుస్తకంలో శ్రీశ్రీ కవితా చమత్కారం పూర్తిస్థాయిలో కనిపిస్తుంది. ‘పంచపదుల్లో’ శ్రీశ్రీ కవితా హాస్యం చూడండి... ఇవి నిజంగా ‘పంచ్’పదులు. ‘అరవ్వాడి దోసై మీద తోచించి వ్రాశై ఏవో విట్లు వేశై ఏవో ఫీట్లు చేశై తర్వాత చూసుకుందాం ప్రాసై...’ ‘పెరిగితే వ్యాపార దృష్టి మరిగితే లాభాల సృష్టి దొరికితే అమెరికా ముష్టి మిగిలేది విగ్రహపుష్టి నైవేద్య నష్టి!’ ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’, ‘ఇంటింటి పజ్యాలు’లో చమత్కారమే ప్రధానంగా కనిపిస్తుంది. ఆరుద్ర చమత్కారానికి ఓ రెండు మచ్చు తునకలు ‘కోర్టుకెక్కిన వాడు కొండనెక్కిన వాడు వడివడిగ దిగిరాడు ఓ కూనలమ్మా!’ ‘బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కూనలమ్మా!’ పేరడీ గారడీలు ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ ‘నవకవిత’ శీర్షికన... ‘‘సిందూరం, రక్తచందనం బందూకం, సంధ్యారాగం పులిచంపిన లేడినెత్తురూ ఎగరేసిన ఎర్రనిజెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి...’’ అంటూ ఉద్వేగభరితంగా రాసిన కవితకు ‘జరుక్ శాస్త్రి’గా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఇలా పేరడీ రాశారు. ‘‘మాగాయీ కందిపచ్చడీ ఆవకాయ, పెసరప్పడమూ తెగిపోయిన పాతచెప్పులూ పిచ్చాడి ప్రలాపం, కోపం వైజాగులో కారా కిల్లీ సామానోయ్ సరదాపాటకు...’’ శ్రీశ్రీ ఒరిజినల్ కవిత ఎంత ఉద్వేగం కలిగిస్తుందో, జరుక్ శాస్త్రి పేరడీ కవిత అంతకు మించి నవ్వులు పూయిస్తుంది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితలకు జరుక్ శాస్త్రితో పాటు మాచిరాజు దేవీప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారెందరో పేరడీలు రాశారు. మహాప్రస్థానంలో శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ ఇలాతలంలో హేమం పండగ జగానికంతా సౌఖ్యం నిండగ...’ అంటూ రాసిన కవితకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇలా పేరడీ రాశారు: ‘అవాకులన్నీ చవాకులన్నీ మహారచనలై మహిలో నిండగ ఎగబడి చదివే పాఠకులుండగ విరామమెరుగక పరిశ్రమిస్తూ అహోరాత్రులూ అవే రచిస్తూ ప్రసిద్ధికెక్కే కవి పుంగవులకు వారికి జరిపే సమ్మానాలకు బిరుదుల మాలకు దుశ్శాలువలకు కరతాళాలకు ఖరీదు లేదోయ్...’ పేరడీ కవులు కొందరు ప్రాచీన పద్యాలకు సైతం పేరడీలు రాశారు. పోతన భాగవతంలో రాసిన ‘వారిజాక్షులందు వైవాహికములందు’ అనే శుక్రనీతి పద్యానికి డాక్టర్ వెలుదండి నిత్యానందరావు పేరడీ పద్యం చూడండి... ‘పదవి వచ్చు వేళ పదవి పోయెడు వేళ ప్రాణమైన పదవి భంగమందు కూడబెట్టినట్టి కోట్ల రక్షణమందు బొంగకవచ్చు నఘము పొందడధిప’ పోతన భాగవత పద్యాలకు పేరడీలు రాసిన వారిలో పులికొండ సుబ్బాచారి ఒకరు. ‘కలడు కలండనువాడు కలడో లేడో..’ అనే పద్యానికి ఆయన రాసిన పేరడీ ఇది: ‘కలదందురు మంజీరలొ కలదందురు గండిపేట కాలువలందున్ కలదందురు పంపులలో కలదు కలందనెడు నీరు కలదో లేదో!’ శ్రీశ్రీకి గురుతుల్యుడైన అబ్బూరి రామకృష్ణారావు కూడా పోతనను పేరడీ చేశారు. భాగవతంలో పోతన రాసిన ‘అరయన్ శంతనుపుత్రునిపై విదురుపై నక్రూరుపై కుబ్జపై...’ అనే పద్యానికి అబ్బూరి వారి పేరడీ ఇదీ... ‘వడపై, నావడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూందియాం పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిన్, బోండాపయిన్, సేమియా సుడిపై చారు భవత్కృపారసము నిచ్చో కొంతరానిమ్ము నే నుడుకుం గాఫిని ఒక్కచుక్క గొనవే! ఓ కుంభదంభోదరా!’ శ్రీశ్రీ కవితలకు పేరడీలు రావడం ఒక ఎత్తయితే, శ్రీశ్రీ తానే స్వయంగా పేరడీ గారడీలు చేయడం విశేషం. శ్రీశ్రీ తన ‘సిప్రాలి’లో సుమతీ శతకంలోని ‘ఏరకుమీ కసుగాయలు...’ పద్యానికి చేసిన పేరడీ... ‘కోయకుమీ సొరకాయలు వ్రాయకుమీ నవలలని అవాకులు చెవాకుల్ డాయకుమీ అరవ ఫిలిం చేయకుమీ చేబదుళ్లు సిరిసిరిమువ్వా!’ వేమన పద్యాలకైతే పేరడీలు కొల్లలుగా వచ్చాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రసిద్ధులే కాకుండా, కొందరు అజ్ఞాత కవులు కూడా వేమన పద్యాలకు చమత్కారభరితమైన పేరడీలు రాశారు. వేమన పద్యాలకు కొన్ని ఆధునిక పేరడీలు చూడండి... ‘కల్లు సారా బ్రాండి కడుపార త్రాగరా జంకు గొంకు లేక పొంకముగను ఏది దొరకనపుడు ఎండ్రిను ద్రాగరా విశ్వదాభిరామ! వినుర వేమ! ‘గంగిగోవు పాలు గంటెడే చాలునా కడివెడేడ దొరుకు ఖరముపాలు భక్తి కలుగు కూడు పట్టెడే చాలునా విశ్వదాభిరామ! వినుర వేమ!’ ఈ రెండూ వేమన పద్యాలకు అజ్ఞాత కవుల పేరడీలు. వేమనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరడీ మచ్చుకొకటి... ‘వేదవిద్య నాటి వెలుగెల్ల నశియించె గారె బూరె పప్పుచారె మిగిలె బుర్ర కరిగి బొర్రగా మారెరా విశ్వదాభిరామ వినురవేమ’ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక అజ్ఞాతకవి నీచుల రాజ్యం వచ్చినందుకు బాధపడుతూ వ్యంగ్యంగా చెప్పిన ఈ పద్యాలు నవ్వులు పూయించక మానదు... దాదాపు ఉర్దూలోనే రాసిన ఈ పద్య సంభాషణనుు చూడండి... ‘లుచ్ఛా జమాన ఆయా అచ్ఛోంకో హాథ్ దేన హర్ ఏక్ సీకా అచ్ఛా జమాన ఫిర్ కబ్ వచ్చేనా చెప్పవయ్య వల్లీసాబూ!’ (నీచుల రాజ్యం వచ్చింది. మంచివాళ్లకు చెయ్యిచ్చే పద్ధతిని ప్రతివాడూ నేర్చాడు. మళ్లీ మంచికాలం ఎప్పుడొస్తుందోయ్ వలీ సాహెబు) అని అడిగితే, ‘బందేనవాజ్ బుజురుగ్ జిందాహై ఆజ్తో న జీతే హం ఖుదా బందాహి జానె వహసబ్ గందరగోళం జమాన ఖాజాసాబూ! (చేసిన మంచి పనుల వల్ల దేశసేవకులు, పుణ్యపురుషులు అలా ఉన్నారు. మనం అలా జీవించలేం. ఇప్పటికీ భగవద్భక్తుడు సేవకుడే ఈ విషయాలను తెలుసుకోవాలి. అయినా ఖాజా సాహెబూ! ఇప్పుడంతా గందరగోళం కాలం వచ్చింది కదా) అని బదులిచ్చాడు. తెలుగు కవిత్వంలో ఇలాంటి చమత్కారాలు కోకొల్లలు. ఆధునిక కవులలో వికటకవులుగా, హాస్యకవులుగా పేరుపొందిన వారు మాత్రమే కాదు, సంప్రదాయకవులుగా, భావకవులుగా, విప్లవకవులుగా ముద్రపడినవారు సైతం తమ కవిత్వంలో చమత్కారాలూ మిరియాలూ తగుపాళ్లలో నూరారు. స్థలాభావం కారణంగా ఇక్కడ ప్రస్తావించలేకపోయిన కవులలో కూడా ఎందరో మరెందరో పాఠకులకు చవులూరించే కవితలు చెప్పి భళాభళి అనిపించారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అందుకోండి ఈ కవనవ్వుల నజరానాలు. ఆధునిక చాటువులు స్వతంత్ర కావ్యాలు రచించి ప్రసిద్ధులైన ఆధునిక కవులు కొన్ని సందర్భాలలో హాస్యరసభరితమైన చమత్కార చాటువులు చెప్పారు. వాటిలో కొన్ని... ‘శివతాండవం’తో ప్రసిద్ధులైన పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీనాథుడికి తీసిపోని రీతిలో చెప్పిన చిలిపి చాటువుల్లో మచ్చుకొకటి... ‘గజగమన గాదు ఇయ్యది గజసదృశ శరీర సీటు కంతయు తానై అజగరమై కూర్చున్నది గజిబిజిౖయె పోయె మనసు కన్నులు గూడన్’ ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి స్వతంత్ర కావ్యాల్లో హాస్యం తక్కువగానే ఉన్నా, ఆయన సందర్భోచితంగా సంధించిన చమత్కార చాటువులు లేకపోలేదు. ఆయన చెప్పిన ఒక చమత్కార పద్యం... ‘చదువురాని వేళ ‘చంకరుండ’న్నాడు చదువుకొనెడి వేళ ‘సంకరుండ’నె చదువు ముదిరిపోయి షంకరుండనెనయా స్నిగ్ధ మధురహాస! శ్రీనివాస! మిశ్రభాషా కవనవినోదం ఆధునిక కవుల్లో ఇంగ్లిషు, ఉర్దూ భాషలను తెలుగుతో కలగలిపి మిశ్రభాషా కవిత్వం చెప్పి నవ్వులు పూయించిన వారు ఉన్నారు. బ్రిటిష్ పాలనలోని ఆంధ్ర ప్రాంతంలోని కవులు తెలుగు పద్యాల్లో యథేచ్ఛగా ఇంగ్లిషును వాడుకుంటే, నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంత కవులు తమ ఉర్దూ పాటవాన్ని ప్రదర్శించారు. మిశ్రభాషా కవనవినోదానికి కొన్ని ఉదాహరణలు... సామాజిక దురాచారాలను నిరసిస్తూ్త నాటకాలు రాసిన ప్రముఖులలో కాళ్లకూరి నారాయణరావు ఒకరు. మధుపానాసక్తత మితిమీరిన ఆధునిక జీవనశైలిని వెటకరిస్తూ ‘మధుసేవ’ నాటకంలో ఆయన హాస్యస్ఫూర్తికి ఉదాహరణగా నిలిచే పద్యం... ‘మార్నింగు కాగానె మంచము లీవింగు మొఖము వాషింగు చక్కగ సిటింగు కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు గడగడ డ్రింకింగు గ్లాసులు గ్రంబులింగు భార్యతో ఫైటింగు బయటకు మార్చింగు క్లబ్బును రీచింగు గాంబులింగు విత్తము లూసింగు చిత్తము రేవింగు వెంటనే డ్రింకింగు వేవరింగు మరల మరల రిపీటింగు మట్టరింగు బసకు స్టార్టింగు జేబులు ప్లండరింగు దారిపొడుగున డాన్సింగు థండరింగు సారె సారెకు రోలింగు స్రంబలింగు’ నవ్వులను విశ్లేషించి వివరించిన హాస్యరచయిత భమిడిపాటి కామేశ్వరరావు కూడా తెలుగులో ఇంగ్లిషును రంగరించి... ‘ది స్కై ఈజ్ మబ్బీ... ది రోడ్ ఈజ్ దుమ్మీ మై హెడ్ ఈజ్ దిమ్మీ...’ అంటూ కవిత చెప్పారు. -
కందుకూరి వీరేశలింగంకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: తెలుగు జన జీవన గొదావరిలో లేచి నిలిచిన అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ‘తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం. సమాజంలోని అనేక దురాచారాల నిర్మూలనకు కృషి చేసి మహిళా వికాసానికి, అన్ని వర్గాలకూ విద్యను అందించేందుకు పాటుపడ్డ గొప్ప సంఘసంస్కర్త ఆయన. నేడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్బంగా ఘననివాళి’అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం. సమాజంలోని అనేక దురాచారాల నిర్మూలనకు కృషి చేసి మహిళా వికాసానికి, అన్ని వర్గాలకూ విద్యను అందించేందుకు పాటుపడ్డ గొప్ప సంఘసంస్కర్త ఆయన. నేడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్బంగా ఘననివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2020 చదవండి: బాల్య యవ్వనాలు , తొలి నాళ్ళ జీవితం -
చరిత్రను తిరగరాసిన తొలి వితంతు వివాహం
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం కల్చరల్: వివాహమంటే బొమ్మలాట అనుకునే ప్రాయంలో, ముక్కుపచ్చలారని బాలికను కాసులమీద ఆశతో చావడానికి సిద్ధంగా ఉన్న పండుముదుసలికి ఇచ్చి వివాహం చేయడం సంప్రదాయంగా చెలామణీ అవుతున్న రోజులవి. తెలిసీ తెలియని ప్రాయంలో వితంతువుగా మారిన చిన్నారుల మనోవ్యధలను కన్న తల్లితండ్రులే పట్టించుకోని రోజుల్లో.. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలకు సమాజాన్ని సిద్ధం చేస్తున్న రోజులు.. ఎదురైన ప్రతిఘటనలకు అంతే లేదు. అన్నిటినీ ఎదిరించి, తాను నమ్మిన సంస్కరణోద్యమాన్ని విజయపథాన చేర్చగలిగారు కనుకనే ఆయన యుగపురుషుడయ్యారు. కుహనా వేదాంతుల ఇష్టారాజ్యం ‘ప్రారబ్ధం చాలకపోతే, ప్రతివాళ్లకి వస్తుందది (వైధవ్యం). చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా రాసినరాత యెవడైనా తప్పించగలడా?.. వైధవ్యం అనుభవించినవాళ్లంతా పూర్వం యెంత ప్రతిష్ఠ బతికారు కాదు?’ నాటి పెద్దమనుషుల మనస్తత్వాలకు అద్దంపట్టే అగ్నిహోత్రావధానులు పాత్ర ద్వారా మహాకవి గురజాడ అప్పారావు పలికించిన ‘సుభాషితాలు’. నాటి సమాజంలో అగ్నిహోత్రావధానులు లాంటి వారికి కొదవ లేదు. చాటుమాటు వ్యభిచారం చేసినా ఫరవాలేదు, పునర్వివాహం మాట వద్దు... కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్రలో చెప్పిన ఒక సంఘటన..జ్యోతిష శాస్త్రం వృత్తిగా చేసుకుని జీవనం, జీవితం సాగిస్తున్న ఒక పెద్దమనిషి చెల్లెలు వితంతువు అయింది. సరే అన్నగారు వితంతువులు కట్టుకునే అంచులేని ముతకబట్టలను తీసుకువచ్చి, సోదరిని ధరించమన్నాడు. ఆమె ససేమిరా అంది. నేను పునర్వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. సోదరుడు అయినవారి దగ్గిర తన సోదరిని గురించి వాపోయాడు. సోదరుని ‘హితైభిలాషులు’వచ్చి, ఆ చిన్నారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. చాటుమాటు వ్యభిచారం చేసుకున్నా ఫరవాలేదు కానీ, మారు మనువు తలపెట్టవద్దని హెచ్చరించారు. వారు సూచించిన మార్గంలోనే ఆమె జీవనయానం సాగించింది. (కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్రము గ్రంథము– పునర్ముద్రణ 2015.పుటలు 135,136)వితంతు వివాహాలు శాస్త్రసమ్మతమే అనేక గ్రంథాలను పరిశీలించి, కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలకు శాస్త్ర నిషేధం లేదని నిరూపించారు. విశాఖపట్టణం నుంచి మహామహోపాధ్యాయ పరవస్తు వేంకట రంగాచార్యులు స్త్రీపునర్వివాహం శాస్త్రసమ్మతమని ఒక చిన్న పుస్తకం ప్రకటించారు. కొక్కొండ వేంకట రత్నం పంతులు ఈ వాదనను ఖండించడానికి ప్రయత్నాలు చేశారు. కొందరు ఛాందసవాదులు కందుకూరిపై భౌతికదాడులకు సైతం వెనుకాడలేదు. 1881 డిసెంబర్ 11వ తేదీన తొలి వితంతు వివాహం కృష్ణా మండలం తిరువూరు డిప్యూటీ తహసీల్దారు దర్భా బ్రహ్మానందం నుంచి కందుకూరి ఒక లేఖను అందుకున్నారు. తిరువూరు ప్రాంతం, రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే 12 సంవత్సరాల బాల వితంతువు ఉన్నదని, గౌరమ్మకు మారు మనువు చేయడానికి ఆమె తల్లి సుముఖంగా ఉన్నదన్నది లేఖ సారాంశం. విశాఖపట్టణంలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్న గోగులపాటి శ్రీరాములు భార్యను కోల్పోయారు. ఆయనకు కందుకూరిపై గౌరవం, భక్తి ఉన్నాయి. వితంతువును వివాహమాడటానికి ఆయన అంగీకరించారు. ఈ వార్త నగరమంతా పొక్కి, పెద్ద దుమారం లేచింది. వంటమనిషి రావడం మానేసింది. ఇంటి పురోహితుడూ అంతే.. బంధువులు వీరేశలింగాన్ని ఆడిపోసుకున్నారు. ‘ఇంకేముంది? అంతా నాశనమే’ అంటూ శాపనార్థాలు పెట్టారు. తీవ్రమైన ఉద్రిక్త వాతావరణంలో కందుకూరి ఇంట డిసెంబర్ 11వ తేదీ రాత్రి చరిత్రాత్మకమైన తొలి వితంతు వివాహం జరిగింది. నాడు పోలీసులు, విద్యార్థులు కందుకూరికి బాసటగా నిలబడ్డారు.. ‘మహాసంక్షోభంలో వివాహం జరిగిందని కందుకూరి స్వీయచరిత్రలో పేర్కొన్నారు. ఆ తరువాత కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో జరిగిన సుమారు 39 వితంతు వివాహాల వివరాలు లభ్యమవుతున్నాయి. వంకాయలవారి వీధిలోని కందుకూరి జన్మగృహంలో డిసెంబర్ 11వ తేదీ రాత్రి జరిగిన పునర్వివాహాన్ని స్మరిస్తూ, విగ్రహాలను నెలకొల్పారు. నేడు కందుకూరిసంస్కరణోద్యమంపై సెమినార్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఎస్‌కేవీటీ కళాశాలలో కందుకూరి సంస్కరణో ద్యమం–వితంతు వివాహాలు’ అంశంపై సెమినార్ జరగనుంది. సంస్కరణోద్యమాన్నిముందుకు తీసుకువెళ్లాలి స్త్రీ సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. అత్యాచారాలు, హత్యాచారాలు మహిళలపై కొనసాగుతూనే ఉన్నాయి. నేటి విద్యార్థి లోకం, మేధావులు ఈ సమస్య పరిష్కారానికి కందుకూరి స్ఫూర్తితో కృషి చేయాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మన లక్ష్యం కావాలి. నాడు సామాజిక దురాచారాలకు, నేడు అత్యాచారాలకు బాధితురాలు స్త్రీమూర్తి కావడం సభ్యసమాజానికి సిగ్గుచేటు. -
బాల్య యవ్వనాలు , తొలి నాళ్ళ జీవితం
కందుకూరి వీరేశలింగం తెలుగు జన జీవన గొదావరిలో లేచి నిలిచిన అభ్యుదయ ఆది శిఖరం. ఏడు కొండలున్న తెలుగు వారికి ఎనిమిదో కొండలా తాను భాసిల్లాడు. పందొమ్మిదో శతాబ్దంలో భూస్వామ్య యుగ లక్షణాల ప్రపంచం, మరింత ప్రజా చైతన్య దాయకం అయిన పారిశ్రామిక యుగం దిశగా అడుగులు వేస్తున్నది. 1852, 1854 ప్రాంతాలలో బ్రిటిష్ పాలిత భారతదేశంలో మొదలైన రవాణా, వార్తా సౌకర్యాలుగా, రైలు బళ్లు, తపాలా శాఖ వంటివి యావద్దేశాన్ని కలుపుతున్నాయి. పూటకూళ్ల ఇళ్లు వెలుస్తున్నాయి. అంతవరకూ గ్రామీణ జీవనంలో ఉన్న యువతకి, ఆంగ్ల చదువులతో మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇవన్నీ ఏర్పడడానికి ముందే, ఇంకా కచ్చితంగా చెప్పాలీ అంటే, 1857 మొదటి స్వాతంత్య్ర పోరాటానికి తొమ్మిదేళ్ల ముందే కందుకూరి వీరేశలింగం పుట్టుక. పేరు బాగా స్థితిమంతులైన తమ తాతగారిదే. వారి ఇల్లు ఒక వీధిలో గుమ్మం ఉంటే, మరొక వీధిలో పెరటి గుమ్మం ఉండేంత విశాలం. బాల్య యవ్వనాలు – తొలి నాళ్ళ జీవితం తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, పెదతండ్రి పెంపకంలో పెరిగారు. బాల్య వివాహాలను తాను పెద్దయ్యాక వ్యతిరేకించినా, ఆయనకు పదమూడో ఏటనే అద్దంకి వారి తొమ్మిదేళ్ల అమ్మాయి బాపమ్మతో పెళ్లి జరిగింది. వీరేశలింగం గారి తల్లి ఆధునిక స్వభావం, ఎటువంటిది అంటే, బాపమ్మ అనే పేరు కన్నా రాజ్యలక్ష్మి అన్న పేరు తన కోడలికి బాగుంటుందని, అలా పేరు మార్చిన అత్తగారు. వీరేశలింగం చదువు అంతా వీధిబడుల్లోనే నడిచింది. ఇంటినిండా, తాత వీరేశలింగం అప్పట్లో ప్రత్యేకంగా వ్రాయసగాళ్ళచే రాయించి పెట్టిన తాటాకు గ్రంథాలుగా ప్రాచీన సాహిత్యం చూరుకి వేలాడదీసి భద్రంగా దాచిన మూటల్లో ఉండేది. ఇలా తమ ఇంట ప్రాచీన సాహిత్యం ఉండేదని, 1873లో తాను రాసిన ‘రాజశేఖర చరిత్రము’లో మూడు పేజీలకు పైగా వర్ణించిన రాజశేఖరుని గృహం, తమ ఇల్లే్ల అని తన ‘స్వీయ చరిత్ర’లో చెప్తారు. ఈ పుస్తకాలన్నీ చిన్నప్పుడే తమ ఇంటికి వచ్చే పౌరాణికుల సహాయంతో చదివేసిన బాల కందుకూరి ఏకసంథాగ్రాహి. చదివినది బాగా గుర్తు పెట్టుకుంటారు. తమ ఇంట ఉన్న గ్రంథాల్లో ‘వసుచరిత్ర’ లేదని, అది తను చదువుతానని తల్లి పున్నమ్మని అడుగుతారు ఒకసారి. ఆమె తెలివైన మహిళ కావడంతో, కొడుకుని ఒక ప్రశ్న వేస్తుంది. ‘నాయనా, ఆ గ్రంథం నీకు పాఠ్య పుస్తకమా?’ అని. కాదని చెప్తారు. మరి రెండు రూపాయలు పెట్టి ఇప్పుడా పుస్తకం కొనడం ఎందుకని ఆమె అందుకు అంగీకరించదు. ఆ రోజుల్లో తల్లి, బాల వీరేశలింగానికి నెలకు అర్ధరూపాయి జేబు ఖర్చుగా ఇచ్చేది. ఎలాగైనా ‘వసుచరిత్ర’ చదవాలి అన్న పట్టుదల గల బాల కందుకూరి, ఆ పుస్తకాల షాపు యజమానితో, తను నెలకు అర్థ రూపాయి ఇస్తాను అని, బదులుగా ఆ పుస్తకాన్ని ఇక్కడే షాపులో కూచుని చదువుకునేందుకు అనుమతించాలని కోరి, ఆ పని చేస్తూ ఉంటారు. ఇలా షాపులో కూచుని ‘వసుచరిత్ర’ చదువుతున్న సంగతి, తను, తన స్నేహితులు ఇంట్లో తెలీనివ్వరు. కానీ కొన్నాళ్ళకు, కొడుకు స్కూలుకి సరిగా వెళ్ళడం లేదన్న సంగతి తల్లికి తెలిసి, అడిగే సరికి, నిజం చెప్తారు కందుకూరి. తల్లి, అతనికి అప్పుడా పుస్తకం కొని ఇచ్చింది, అలా ఉండేది చదువు విషయంలో కందుకూరి పట్టుదల. కందుకూరి వారింట, కొన్నేళ్లకు పెదతండ్రి మరణించాక, ఈయనే ఇంటి పెద్ద. ఇంటి వద్ద తమ నాయనమ్మ, అమ్మ, పెద్దమ్మ, తన భార్య నలుగురు స్త్రీలు. నాలుగు భిన్న స్వభావాలు, ఇవన్నీ వీరేశలింగం గారికి చిన్నతనం నుంచే అనుభవంలో ఉన్నాయి. తర్క బుద్ధి, శాస్త్రీయ వివేచన ఏర్పడుతున్న సమాజంలో బాలుడు, యువకుడు కందుకూరి. భూత వైద్యాల మీద తగని గురి వారి తల్లి పున్నమ్మకి. ప్రజారోగ్య వ్యవస్థలు ఏవీ ఇంకా ఏర్పడలేదు, గోసాయి చిట్కా వైద్యాలు, పూతలు, భస్మాలు, రక్షరేకులు, ఇదీ కందుకూరి బతికిన పంధొమ్మిదో శతాబ్దపు సమాజం. ఒకసారి వారి తోటలో అరటిచెట్టు సరిగా బోదె నడుమ గెల వేసింది. అలా వేసిన గెల తింటే ఇంటి యజమానికి అరిష్టం అంటే, వినకుండా, ఆ గెల బాగా ఎదిగాక, రోజూ, ఆ గెల అయిపోయిందాకా, ఆ అరటి కాయలే వండించుకుని తింటూ, పైగా వచ్చే పోయే వారికి అందరికీ, ఈ విషయాన్ని చెప్పి, అటువంటి అరిష్టాలు ఏమీ ఉండవు అన్న శాస్త్రీయ దృష్టిని రోజూ ప్రచారం చేసే వారు. ఇటువంటి సంఘటనల వల్ల తెలిసేదేమిటి అంటే, యువ కందుకూరి వ్యక్తిత్వం, మూఢాచారాల పట్ల ఆయనలో ఏర్పడుతున్న వ్యతిరేకత. తాను కోరంగిలోని ఆంగ్ల పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా చేరవల్సి వస్తే, సరిగ్గా అమావాస్య రోజునే వెళ్ళి ఉద్యోగంలో చేరుతానని బలవంతం చేసి, అలాగే పంతం నెగ్గించుకున్న యువకుడు కందుకూరి. ఇవాళ మనం సీవీ రాసి ఉద్యోగాలకు దరఖాస్తుగా పంపుతున్నాము. అలానే అప్పట్లోనే ఒక పద్య రూప సీవీ రాశారు యువ కందుకూరి. వారి ఆత్మవిశ్వాసానికి ఇది ప్రతీక. ‘‘వివేక వర్ధని’’ ప్రారంభ సంచికలో ఇది అచ్చు వేశారు పాతికేళ్ళ కందుకూరి. దీనికి అనుగుణంగానే వారి సాహిత్య, సాంఘిక జీవితం గడిచింది. ‘‘బ్రాహ్మణుడను హూణ భాష నేరిచి యందు నే బ్రవేశ పరీక్షనిచ్చినాడ నాంధ్రమున నొకింత యభిరుచిగలవాడదేశాభివృద్ధికై లేశమైన బ్రాలుమాలక పాటుపడ నిచ్ఛ గలవాడగవితా పటిమ కొంత గలుగువాడ నోపిక సర్వ జనోపయోగములైన విషయమ్ములను, నీతి విషయములును సులభ శైలి నందరకు తెలియునట్టు కఠిన సంధులు లోనుగా గలవి విడిచివ్రాయుదు నొక్కప్పుడన్య దేశీయములను లోనుగా గల వానిని బూని గూర్తు’’ తమ ఇంటి దగ్గరి గోపాలకృష్ణ స్వామి ఆలయ విరాట్ పేరిట , వేణుగోపాల శతకము, మార్కండేయ శతకము తన ఇరవై రెండేళ్లకే రాశారు కందుకూరి (ఈ శతకాలు నష్టమై పోయాయి కానీ, వారి ‘అభాగ్యోపాఖ్యానం’ అనే ఆక్షేప ప్రబంధంలో ఈ శతక పద్యం కొంత భాగాన్ని ఉదహరించారు. కానీ ఇటువంటి రచనల వల్ల ప్రయోజనం ఉండదు అని గ్రహించడానికి ఆయనకు అట్టే కాలం పట్టలేదు. 1873 కాలానికి పాతికేళ్ల కందుకూరి, నవల రాయడానికి పూనుకున్నారు. ఆలివర్ గోల్డ్‌స్మిత్ నవల ‘వికార్ ఆఫ్ ద వేక్ ఫీల్డ్’ చదివి, దాని అనువాదం చేద్దామనుకుని, చివరికి, కొంత ప్రేరణ ఉన్నా, 1870ల్లో గోదావరి జిల్లాల జీవితం చెప్పే ఒక వాస్తవిక జీవన చిత్రణను రాయడం విశేషం. కందుకూరి నవల ‘రాజశేఖర చరిత్రము’ను ఆయన 1874లో మొదలుపెట్టి నడిపిన ‘‘వివేక వర్ధని’’ పత్రికలోనే ధారావాహికగా అచ్చు అయింది. ఆంగ్ల సాహిత్యం బాగా చదువుతున్న కారణంగా, చదివిన పద్ధతుల్లో తానూ రచనా చేయాలన్న అభిలాష సహజంగానే యువ కందుకూరిలో ఏర్పడింది.. దానికి తగిన రచనా ప్రణాళిక, వారి ‘రాజశేఖర చరిత్రము’. ఈ నవలలోనే గోదావరి జిల్లాల జీవితం సహజ వర్ణనలతో నడిపారు. తన ప్రవర్ధమాన దశలోనే రాసిన ఈ నవలలో తొలిసారిగా సమాజంలో స్త్రీల దుస్థితి, వారి సమస్యలు, సంప్రదాయ సమాజపు వెనుకచూపు ఇవన్నీ చిత్రిస్తారు. వ్యవహరిక భాషలో 1883లో వారు రాసిన రెండో రచన ‘సత్యవతీ చరిత్రము’ అనే నవలిక కొంచెం చదువుకున్న అమ్మాయి సత్యవతి రెండో కోడలుగా వస్తే, ఆ గ్రామీణ కుటుంబాలలో వచ్చే మార్పులు, అత్తగార్లు తెచ్చిపెట్టే సమస్యలు చిత్రిస్తూ, ఇలా చిన్న నవలికలో , శాస్త్రీయ దృష్టి, తర్క బుద్ధి చదువుకున్న తరాల వారు స్వీకరించి, ఎలా పాత సమాజంతో సంఘర్షిస్తున్నదీ వ్యవహారిక భాషలో చెప్పిన తొలి కాల్పనిక వచన నవలా రచన. మన కాలపు ఏ ప్రయాణ సాధనాలు, సమాచార సాధనాలు ఏర్పడని ఒక పాత కాలంలో, ఎంత మన రాజధాని అయినా మదరాసు వెళ్ళి రావడం అంటే, రైలు బళ్లు లేని కాలంలో ఓడ మీద మదరాసు వెళ్లిన పట్టుదల, శ్రమకి ఓర్చగల స్వభావం గల వాడే అయినా తల్లి చిన్నప్పుడు భూత వైద్యాల పేరిట చేయించిన అనేక స్నానాలు, చిట్కా వైద్యాల వల్ల చిన్నప్పట్నుంచీ అనారోగ్యవంతుడు. మదరాసు వెళ్ళాలి అంటే, పడవ మీద ధవళేశ్వరం నుంచి కాకినాడ వచ్చి, అక్కడ నుంచి మరొక పడవలో కాకినాడ సముద్రం లో ఉండే పెద్ద ఓడ (యాంకరేజి పోర్ట్ అంటారు– అక్కడ సాధారణమైన ఓడ రేవు ఉండదు ఎందుకంటే, కాకినాడ సముద్రం సహజంగా లోతు తక్కువ)లో వెళ్లాలి. మదరాసు వెళ్లడం కోసం తన ప్రయాణ వివరాలు స్వీయచరిత్రలో చెప్తారు. అలాంటి కష్టతరమైన ప్రయాణాల కాలంలోనే విశాల మానవ సంబంధాలు నిర్మించుకున్న బుద్ధి కుశలుడు కందుకూరి. రచనా ప్రతిభ – సామాజిక దృష్టి 1900 నుంచి 1917 దాకా మనకు మహా భారత కథను ప్రదర్శన యోగ్య నాటకాలుగా రాయడం ఒక కవిద్వయం వల్ల జరిగింది. వారే తిరుపతి వెంకట కవులు. అంతకు ముందరి తెలుగు మహా భారత ఇతిహాస రచన, చదువుకునే, లేదా చదివి చెప్పే పౌరాణిక పద్ధతికి చెందినది. కవిత్రయం రాసిన చదువుకోదగిన మహా భారత తెలుగు రచన తరువాత, చూసే వారి కోసం మహా భారత నాటక రచనోద్యమం చేసిన కవిద్వయం తిరుపతి వెంకట కవులు, అయితే వీరి ప్రామాణిక కృషికి ముందరే, కందుకూరి, తొలిసారిగా, మహాభారత కథ తీసుకుని ‘‘దక్షిణ గోగ్రహణము’’ అన్న నాటకం రాశారు. నాటకాలు రాయడం వీరికి శక్తివంతంగా అలవడ్డది. గురజాడ, కందుకూరి కన్నా పద్నాలుగేళ్లు చిన్నవారు. పద్నాలుగేళ్లు తరువాత పుట్టి, కందుకూరి కన్నా నాలుగేళ్లు ముందరే కన్ను మూసిన గురజాడ ఆధునిక సాహిత్య వైతాళికత్వానికి ఉదాహరణ అయిన తన 1892 కన్యాశుల్కం నాటకంలో ముందు మాటలోనే కందుకూరి వారి నాటకం (1876–80) బ్రాహ్మ వివాహము లేదా పెద్దయ్యగారి పెళ్లి ని ప్రస్తావించి, ఆ నాటకానికి, తన నాటకానికి పోలికలు లేవు అంటారు. కానీ తొలి కన్యాశుల్కం వరకూ చూస్తే, ఇద్దరికీ సమాన దృష్టి వేశ్యా వ్యతిరేకత. వేశ్యలు ఉండకూడదు అన్నది కందుకూరి జీవితకాల దృష్టి, అయితే వేశ్యలు సంఘంలో ఏర్పడే క్రమాన్ని మార్చే శక్తి వారికి లేదు. ఆ వృత్తిలో స్త్రీలు ఉండరాదు అన్నది వారి దృష్టి కాగా, మొదటి కూర్పు కన్యాశుల్కంలో ఇంచు మించు గురజాడ దృష్టి కూడా అదే. ప్రసంగాలు, ప్రదర్శన రచనలుగా, నాటకాలు, ప్రహసనాలు, తన సొంత రచనలే కాక ప్రాచీన భారతీయ, పాశ్చాత్య సాహిత్యం నుంచి కూడా అనువాదాలు చేసిన తీరిక లేని రచయిత కందుకూరి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, శ్రీ హర్షుని రత్నావళి, షేక్సి్పయర్ నాటకాలు, షేక్సి్పయర్ నాటకాలకు చార్లెస్ అండ్ లాంబ్ దంపతులు కథలుగా రాసిన వాటికి తెలుగు అనువాదాలు, ఆర్. బి. షెరిడన్ నాటకాలు, విలియం కౌపర్ కవిత్వం, జొనాథన్ స్విఫ్ట్ గలివర్ ట్రావెల్స్ ఆధారంగా సత్యరాజా పూర్వ దేశ యాత్రలు, జాన్ అక్సేన్ ఫర్డ్, చార్లెస్ షెల్బీ కామెడీ నాటికలకు ప్రహసన రూప తెలుగు అనువాదాలు, సంప్రదాయ ధిక్కారం చేసే అభాగ్యోపాఖ్యానం, సరస్వతీ నారద విలాపము, మహారణ్య పురాధిపత్యము, ఏసప్ కథలు, ఇలా ఇటు భారతీయ, అటు ప్రపంచ సాహిత్య చదువరిగా, రచయితగా కందుకూరి సృజన, ధారణ, పాండిత్యం అపారం. ఆధునిక తెలుగు వచన వికాసానికి పలు రంగాలలో పునాదులు వేసిన కారణంగా, కందుకూరి వారిని, పింగళి లక్ష్మీకాంతం గారు గద్య తిక్కన అని పిలిచారు. పద్యానికి పదమూడో శతాబ్దంలో తిక్కన చేసిన విశేష సేవ పదిహేను పర్వాల మహాభారతంలో వేల పద్యాలుగా ఉన్నది. మళ్లీ అయిదు వందల ఏళ్ల తరువాత, పంతొమ్మిదో శతాబ్దంలో అవసరమైన వచన రచనా ( సాహిత్య, సామాజిక, పత్రికా, వ్యవహారిక, నాటక రంగాలలో) వికాసానికి అంతటి కృషి చేసిన వారిగా కందుకూరిని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గౌరవించి ఇలా సంబోధించారు. అందుకే, వందకు పైగా వారి సమగ్ర రచనల్లో పద్య కావ్యాలు, అనువాద పద్య కావ్యాలు, నాటకాలు, ప్రహసనాలు, ఆంగ్ల నాటకానువాదాలు, నవలలు, కథా రచన, పత్రికా నిర్వహణ, వ్యాసాలు, ఆరోగ్య సంరక్షణ సూత్రాలు, కవుల చరిత్ర, జీవిత చరిత్ర, సాహిత్య విమర్శ, చిన్నయ సూరి రచించిన సంధి, విగ్రహము, వ్యాకరణం సరళ తెలుగు సేత, దేశ చరిత్రలు, తెలుగు వాచకాలు, లక్షణ గ్రంథాలు, శాస్త్రీయ విషయ రచనలు – ఎటు చూసినా కందుకూరి ఆలోచన, ఆధునికత, అభ్యుదయ ముద్రలు కనిపిస్తాయి. కందుకూరి – గురజాడ నాటక సాంఘిక వచనానికి ఆద్యులుగా గురజాడని స్వీకరించడం చేయాల్సి ఉంది. వచన నవలా రచనలో కందుకూరి 1883కి రాసిన సత్యవతీ చరిత్రంలోనే చెప్పికోదగ్గ వ్యవహరిక భాష ఉందని, మనం ఇప్పుడు చెప్పాలి. అంతకు పదేళ్లు ముందరే వెలువడిన , కందుకూరి వారి సాంఘిక నాటకాలు అయిన ‘బ్రాహ్మ వివాహము లేదా పేరయ్యగారి పెళ్లి’లో గానీ, ‘వ్యవహార ధర్మ బోధిని’లోని సాంఘిక నాటక వచనాన్ని, అలాగే సాంఘిక నవలల్లో ( ముఖ్యంగా 1883 నాటి సత్యవతీ చరిత్రములో కందుకూరి భాష) వీటిని మనం సక్రమంగా పరిశీలిస్తే, 1940ల నుంచీ మనం ఏర్పరచుకుంటూ వచ్చిన గురజాడ అంటే సాహిత్య ఆధునికత, కందుకూరి అంటే సాంఘిక సంస్కరణ అన్న మూస ఆలోచన పద్ధతులు అంత సరైనవి కావు అని తెలుస్తుంది. ఇక గురజాడ వారికి కందుకూరి పట్ల గౌరవ భావం ఉన్నది. అందుకే కన్యాశుల్కం నాటకం మొదటి అంకంలోనే వెంకటేశం వేసంగి సెలవుల్లో చదువుకోవడానికి ఉపవాచకంగా ‘రాజశేఖర చరిత్రము’ గిరీశం డిక్టేషన్ ఇచ్చిన పుస్తకాల జాబితాలో ఉంటుంది. ఇక వీరయ్య గారు, రాజమంద్రంలో వితంతువుల మఠం, వంటి ప్రస్తావనలు కూడా గురజాడ నాటకంలో కనిపిస్తాయి. 1892 కన్యాశుల్కం నాటకం కన్నా ముందరే, కందుకూరి వారి బ్రాహ్మ వివాహము, అలాగే కోర్టు కెళ్లే న్యాయవాదుల వంచనా వ్యవస్థను వ్యవహార ధర్మ బోధిని (1879–80)లో స్పష్టమైన వ్యవహరిక భాషలో చెప్పారు కందుకూరి. నిజానికి, కందుకూరి రాసిన బ్రాహ్మ వివాహము, వ్యవహార ధర్మబోధిని నాటకాలలోని ఘట్టాలే, కొంత కలిసిపోయి గురజాడ సృజనలో కొత్త వెలుగులతో, కన్యాశుల్కం నాటకంలో కనిపిస్తాయి. ‘ఆబోరు’ వంటి మాటలు ఇద్దరి నాటకాల్లోనూ ఉన్నవి. ( ఈ మాటకి అర్థం చాలాకాలం ఎవరూ చెప్పలేక పోయారు. ఇది ‘ఆబ్రూ’ అనే హిందూస్తానీ మాట, దీని అర్థం ప్రతిష్ట, గౌరవం అని). ఒకప్పుడు నవాబులు పాలించిన దృష్టాంతాలుగా, భారత దేశపు అనేక భాషల్లో మనకు హిందూస్తానీ పదాలు ఇలా కలిసిపోయి కనిపిస్తాయి. గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఈ వాడుక ఇప్పటికీ ఉన్నది. కావ్యవాది – కార్య వాది కందుకూరి ఈ రచనలు జరుగుతున్న కాలానికే, పసితనంలో ఆడపిల్లల పెళ్లిళ్లు, ముసలి భర్తలు కొద్ది కాలంలో చనిపోవడంవల్ల సమాజంలో ఏర్పడే బాల వితంతువుల సమస్య కందుకూరి వారి మనసులో ఒక పరిష్కారం దిశగా రూపం తీసుకుంటున్న సంగతి తెలుస్తుంది. రచనా రూపంగా సంస్కరణ కోరడం వీరేశలింగం గారి స్వభావంలో ఒక భాగం మాత్రమే. అసలు విషయం కార్యాచరణ. 1879 సంవత్సరంలో ఆగస్ట్ 3, అక్టోబర్ 12 తేదీల్లో, రాజమండ్రిలో గల విజయనగరం మహారాజావారి బాలికా పాఠశాలలో, ‘‘అతి బాల్య వివాహము’’ విషయంపై పిల్లల వయసు రీత్యా ఎందుకు చేయకూడదో చెప్పడమే కాక, అవి శాస్త్ర సమ్మతం అని చెప్పే వారికి, కాదు అంటూ, ఆ శాస్త్రాల నుంచే ఎన్నో ఉదాహరణలు చూపి, ఛాందస సమాజానికి గొంతులో వెలక్కాయ పడ్డ ప్రసంగం చేశారు, ముప్ఫైఒక్కేళ్ళ కందుకూరి. ఈయన కేవలం భావ విప్లవం మాత్రమే కాకుండా, ఆచరణ శీలి కూడా కావడం వల్ల సంస్కరణ ప్రణాళిక వేగం పెరిగింది. ఇదే 1881లో కందుకూరి రాజమండ్రి ఇన్నీసు పేటలో బాలికా పాఠశాల స్థాపించారు. ఒక నాటక సమాజం మొదలు పెట్టి, అంతకు ముందు ధార్వాడ నాటక సమాజం వారు ప్రదర్శించిన చోటనే, ‘చమత్కార రత్నావళి’ రచించి, ప్రదర్శనలు చేయించారు. తెలుగు ప్రాంతాల్లో తొలి నాళ్ల నాటక ప్రదర్శనల్లో ఇవి భాగం. ఇదే ఏడాది డిసెంబర్ 11న కందుకూరి తమ మిత్రులతో కలిసి, దక్షిణ భారత దేశంలోనే తొలి వితంతు వివాహం చేశారు. సానుకూల భావనలున్నా, మదరాసు అంటే ఉమ్మడి మదరాసు రాష్ట్ర రాజధానిలో కూడా, వితంతు వివాహం జరిపించే సాహసం ఎవరికీ లేదు. అటువంటి పరిస్థితుల్లో, సంఘ సంస్కరణ గోదావరిగా రాజమండ్రిని, యావత్ దక్షిణ భారత దేశానికే మార్గదర్శకంగా నిలిపారు కందుకూరి. వారి పట్టుదల, చిన్నప్పుడు తల్లి వీలు కాదన్న పుస్తకం ఎలా అయినా చదివినట్టే, వద్దన్న అరటికాయలు మొత్తం గెల అంతా తానే తిన్నట్టే, ఈ వితంతు వివాహాల విషయంలో కూడా వారిది అంతే మంకు పట్టు. బాల్య వివాహాలు చేయవచ్చు, వితంతు వివాహాలు చేయరాదు అనే సంప్రదాయ సమాజనికి వాదానికి వాదంతో, వేదాలు, పురాణాలు, స్మృతులు, శ్రుతుల నుంచే ఎలా ఈ బాల్య వివాహాలు కూడదో, వితంతు వివాహాలు సంప్రదాయ సమ్మతమో చెప్పడంలో, కందుకూరి, అక్కడ బెంగాల్ సమాజంలో, మన తెలుగు నాటకన్నా దశాబ్దాల ముందే ఈ వివాహాలు జరిగినప్పుడు, అక్కడ రాజా రామ్మోహన్ రాయి, ఈశ్వర చంద్ర విద్యా సాగర్ వంటి వారు ఉదహరించిన భారతీయ ప్రాచీన రచనలైన మనుస్మృతి, పరాశర çస్మృతి, యాజ్ఞవల్క్య çస్మతృతి నుంచి ఉదాహరణలు ఇచ్చారు. ఇంత మౌలిక ప్రతిఘటన ఓ పక్క జ్ఞానపరంగానూ, మరోపక్క ఆచరణపరంగానూ ఎదుర్కోవడం, తెలుగు సంప్రదాయ సమాజానికి సాధ్యం కాలేదు. మొదటి వితంతు వివాహం జరిగిన మూడు రోజులకే రెండో వితంతు వివాహం, మూడో వివాహం అక్టోబర్ 1882లో జరిపిన కార్య ధీర శూర వీరేశలింగం, ఏ మహారాజో, సేనానో, యుద్ధ వీరుడో కాదు, కేవలం సామాన్య తెలుగు పండితుడు. అదీ మనం ఇవాళ చూస్తున్న చిత్రంలోని వయసుమళ్లిన మనిషి కారు– తను ముప్ఫై మూడేళ్ళ నిండు యవ్వనుడు. అక్షర వ్యూహాలు పేర్చి, సమాజ దుష్ట శక్తులను ఎదుర్కొన్న సాంఘిక పోరాట తంత్రజ్ఞుడు. రాజ్యలక్ష్మమ్మ గారి సహచర్యం ఈ సాంఘిక పోరాటంలో, భర్తకి తగిన భార్య రాజ్యలక్ష్మమ్మగారు. తన భర్త చేస్తున్నది సమాజ హితం కోసం అని ఎరిగిన ఆమె బంధువుల బెదిరింపులు, బహిష్కారాలు, ఆంక్షలు లక్ష్య పెట్టలేదు. ఆమె పట్ల కందుకూరి వారికి చాలా గౌరవం. జీవితకాల కృషిలో అడుగులో అడుగు వేసి నడిచిన వీరిద్దరికీ పిల్లలు లేరు. ఆయనకి అన్నివిధాలా దన్నుగా నిలిచిన రాజ్యలక్ష్మమ్మ 1910లో కన్ను మూశారు. అది వీరేశలింగం గారికి తీరని నష్టం. ఆమె సమాధి తన సమాధి కన్నా ఎత్తుగా ఉండాలని అలా కట్టించి, అక్కడ ఆమెకి ఇష్టమైన పూల మొక్కలు పెంచిన ప్రేమపూర్ణుడు కందుకూరి. తన స్వీయ చరిత్రను ఆయన ఆమెకే అంకితం ఇచ్చారు. ఆ అంకిత రచన చాలు ఆయన హృదయంలో ఆమె స్థానం ఏమిటో తెలియచెప్పడానికి. ( వారి చేతి రాతలోనే దీనిని పొందు పరుస్తున్నాను). ‘‘నేను చేసిన సమస్త ప్రయత్నములలోను ఛాయ వలె నాతోడ ఉండి నన్ను ప్రోత్సాహపరచుచు ధర్మ మార్గానుసరణమునందు నా తోడ గూడ సకల కష్టములను సంతోషపూర్వకముగాసహించుచు సత్యమైన సహధర్మచారిణియయి తల్లి బిడ్డకు వలె నవ్యాజానురాగము తోడసహస్ర హస్తములతో సదా నాకు సంరక్షణము చేయుచు ఏబది సంవత్సరముల కాలము నా ప్రాణమునకు ప్రాణమయి యుండిన నా యర్ధాంగ లక్ష్మి యైన రాజ్యలక్ష్మికి దీనిని నేనంకితము చేయుచున్నాడను’’జాతీయ సాంఘిక సంస్కరణ మహాసభలు 1885లో జాతీయ కాంగ్రెస్ ఏర్పడినాక, సాంఘిక సంస్కరణ, రాజకీయ స్వాతంత్య్రం కన్నా ముందే అవసరం అన్న చైతన్యం దేశం ఎల్లెడలా ఏర్పడసాగింది. ఇలా అఖిల భారత సాంఘిక పరిస్థితులు చర్చించిన జాతీయ సంస్కరణ మహాసభలు 1889లో మొదలై, దేశంలో పలు ముఖ్య నగరాలలో జరుగుతూ వచ్చాయి. జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడె, జస్టిస్ కె. టి. తెలాంగ్, బాబు నరేంద్రనాథ్ సేన్, డా. మహేంద్రలాల్ సర్కార్, జి.ఎస్. ఖర్పడే, జస్టిస్ ఎస్. సుబ్రహ్మణ్య అయ్యర్ , ఆర్.జి.భండార్కర్, రావుబహదూర్ వామనరావు ఎం. కోలాత్కర్ , రాయ్ బహదూర్ లాలా బైజ్ నాథ్, మన్మోహన్ ఘోష్, జస్టిస్ ఎం..జి. చందావర్కర్ వంటి జాతీయ స్థాయి సంస్కరణరంగ నాయకులు పాల్గొన్నారు. వారితో కలిసి పనిచేశారు కందుకూరి. సోషల్ రిఫార్మ్ కాంగ్రెస్ వార్షిక మహాసభలు 1898లో మద్రాసులో జరిగాయి. ఆ మహాసభలకు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ కందుకూరి, మదరాసుకు వచ్చిన తెలుగేతర భిన్న ప్రాంతాల సంస్కరణోద్యమ నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి ఇంగ్లిష్‌లో ప్రసంగం చేశారు. శాస్త్రీయ ఆవిష్కరణల కన్నా, సాంఘిక సంస్కరణ చాలా కష్టమైనది అన్న ప్రధాన అభిప్రాయం ఈ ఆంగ్లోపన్యాసంలో కందుకూరి తెలిపారు. ఇంతవరకూ ఇలా ఒక ఆంగ్ల ప్రసంగం కందుకూరి వారు చేసినది ఒకటి ఉన్నది అన్నది బయటికి రాలేదు. కందుకూరి శతవర్ధంతి కృషిలో భాగంగా, మొజాయిక్ సాహిత్య సంస్థ పరిశోధనలో ఇది లభించింది. ఈ ఏడాదే, కందుకూరి వారి ఈ నూత్న లభ్య రచన, ఆంగ్ల మూలమూ, తెలుగు అనువాదమూ కూడా పత్రికలలో ప్రచురితమయ్యాయి. సమగ్ర రచనలు – గౌరవాలు తన యాభై ఏళ్ల వయసుకే, తన సమగ్ర రచనలు, పది సంపుటాలుగా ప్రచురించి, దీని కోసమై మదరాసులో రెండేళ్లు కాలం ఉద్యోగానికి సెలవు పెట్టి గడిపి, ఈ సమగ్ర సంపుటాన్ని ఆ రోజుల్లో పదిహేను రూపాయలకు విక్రయం చేసేవారు ఆయన. తెలుగు పండితుని నెల జీతం ముప్ఫై రూపాయలు కాగా, తన రచనలు పత్రికల తపాలా ఖర్చులకు అంత సొమ్మూ, ప్రతి నెలా వారికి ఖర్చు అయ్యేది. 1893కే వారికి రావు బహదూర్ బిరుదు లభించింది. 1898లో ‘దక్షిణభారత విద్యాసాగరులు’ అని జస్టిస్ రనడె, ఇతర సంఘ సంస్కర్తలు, సోషల్ రిఫార్మ్ జాతీయ మహాసభల్లో కందుకూరి వారికి బిరుద ప్రదానం చేశారు. తన కాలపు సాహిత్యంలోనే తన ప్రస్తావనలు 1899 నుంచి 1904 వరకూ రాజమండ్రి నుంచి బదిలీ మీద వెళ్లి, మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితునిగా పని చేశారు. కందుకూరి ప్రస్తావనలు తన కన్యాశుల్కం నాటకంలో గురజాడ వారు చేయగా, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి, ఏకంగా, కందుకూరి, రాజ్యలక్ష్మమ్మ దంపతులను వారి జీవితకాలంలోనే, సజీవ పాత్రలుగా, తన అసంపూర్తి నవల ‘చంద్రిక కథ’లో 1900 ప్రాంతాల్లో రాయడం విశేషం. దీన్ని 1970 ప్రాంతాల్లో తెలుగు సాహిత్య పరిశోధకుడు బంగోరె తన మిత్రులతో కలిసి తెలుగు అనువాదం చేసి అందించారు. ఇలా ఇటు తెలుగు మహాకవి గురజాడ తన కన్యాశుల్కంలోనూ, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి తన చంద్రిక కథలోనూ వీరేశలింగంగారి ప్రస్తావనలను వారి జీవితకాలంలోనే చేశారు. ఇటువంటి గౌరవం, ప్రపంచ సాహిత్యంలోనే అరుదు. కడపటి దశ హితకారిణీ సమాజం ట్రస్ట్ డీడ్ రాయడం, తన యావదాస్తినీ ట్రస్ట్‌కి అప్పగించడం అనారోగ్యం, ముసలితనం, కొన్ని కోర్ట్ కేసులు ఇలా సతమతమవుతూ ఉన్నా, కవుల చరిత్ర ప్రచురణ, వారికి పట్టుదలతో కూడిన లక్ష్యం. ఈ లక్ష్యం కోసం పని చేస్తూనే, వారు వెళ్ళిపోయారు. మదరాసు పరసువాక్కంలో వేదవిలాస్ అని కొమర్రాజు లక్ష్మణరావుగారిల్లు. ఎప్పుడు కందుకూరి వారు మదరాసు వెళ్లినా వారి బస అక్కడే. యువకులైన కొమర్రాజు కూడా తెలుగు సాంఘిక చరిత్రలో చాలా ఆసక్తి గల వారు. కవుల చరిత్ర మూడో భాగం ప్రూఫులు సరి చూస్తూ, కందుకూరి, 27 మే 1919న మదరాసులోనే కన్ను మూశారు. మరణ సమయంలో వారి వద్ద ఉన్నది, మృతి ప్రకటన చేసినది డాక్టర్ అచంట లక్ష్మీపతి. అంత్య క్రియల సమయాన దగ్గర ఉన్నది అప్పటికి యువకులైన కాశీనాథుని నాగేశ్వర రావు, అక్కిరాజు ఉమాకాంత విద్యా శేఖరులు తదితర మదరాసు తెలుగు ప్రముఖులు. శతవర్ధంతి ఉత్సవాలు ఇక వర్తమానానికి వస్తే, విశాఖలో మొజాయిక్ సాహిత్య సంస్థ, ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కల్నల్ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు మద్దతుతో ఈ శతవర్ధంతి ప్రారంభ సభలు గత సంవత్సరం మే 27న పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సాహిత్య వేత్తలతో ఒకరోజు సభగా జరిపింది. సాహితీ స్రవంతి రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఇతర నగరాల్లో కందుకూరి వైతాళిక పాత్రకు గుర్తింపుగా శతాధిక సంస్థల సమన్వయంతో భారీ సభలు నిర్వహించారు. చెన్నై తెలుగు వాణి పేరిట, చెన్నైలోని తెలుగు సమాజం ఈ శతవర్ధంతి తమ కర్తవ్యం అని కూడా భావించి, ఈ విశాఖ సభలకు వచ్చిన డా. తూమాటి సంజీవరావు, తమ సంస్థ అధ్యక్షులు తిరునగరి భాస్కర్ తదితర మిత్రులతో కలసి కృషి చేసి, ఈ వర్ధంతి సంవత్సరంలో, పుదుచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్నారావు, పుదుచ్చేరి ప్రభుత్వం పాక్షిక ప్రోత్సాహంతో, దాదాపు కందుకూరి వారి గురించిన సమాచారం అలభ్యంగా ఉన్న రోజుల్లో, ఏడువందల యాభై పేజీలుగా రెండు పుస్తకాలుగా విçస్తృత సమాచారాన్ని అందుబాటులోని తెచ్చారు. వీటిలో మొదటి పుస్తకం చెన్నైలో గత ఏడాది అక్టోబర్‌లో విడుదల కాగా, రెండో పుస్తకం, ఈ ఏడాది మే 25న విడుదలైంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు, లక్ష రూపాయల చొప్పున కందుకూరి శత వర్ధంతి సభలు జరపడానికి నిధులు అందజేసింది. కేంద్ర సాహిత్య అకాడెమీ, విశాఖలో మొజాయిక్ సంస్థ ద్వారా కందుకూరివారి కృషి గురించిన లిటరరీ ఫోరం నిర్వహణకు సహకారం అందించారు. ఈ ఏడాది జూన్ 1న సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీ, మొజాయిక్ సాహిత్య సంస్థ నిర్వహణలో జరిగే శతవర్ధంతి ముగింపు సభలో, విశాఖలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. రాయన గిరిధర్ గౌడ్ గీసిన చిత్రపట ఆవిష్కరణ, కందుకూరి శతవర్ధంతి చిత్రమాల, సత్యవతీ చరిత్రం ఆంగ్లానువాదం ఆవిష్కరణలు, కందుకూరి ఏకాంకిక ‘అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం’ ప్రదర్శన ఈ సభలో చోటు చేసుకుంటున్నాయి. కొత్త అంచనాల అవసరం స్త్రీల పట్ల తండ్రి ప్రేమతో, తల్లి మనసుతో కందుకూరి తన సమస్త రచనల్లో వారి విద్య, చక్కని పెళ్లి, తల్లి, బిడ్డల భద్రత, సంఘంలో మూఢాచారాల వల్ల వారి అభివృద్ధికి కలిగే అవరోధాల పట్ల ఆగ్రహం, అలాగే భాషకి, భావాలకు శాస్త్రీయత నేర్పిన పునరుజ్జీవన ప్రదాతగా మనం కందుకూరి వీరేశలింగాన్ని దర్శించాలి. కందుకూరి అంటే ఒక సంస్కరణ మూస, గురజాడ అంటే సాహిత్య మూసగా, మనం దాదాపు 1940ల నుంచి ఆలోచనలు చేస్తున్న తీరులో మార్పు అవసరం ఉన్నది. నరహరిసెట్టి గోపాలకృష్ణమ్మగారిలా శ్రీ రంగరాజ చరిత్ర (1872) పేరిట, ఒక నవల రాసిన వారో, కవి జీవితములు (1893) ముందు రాసిన గురజాడ శ్రీరామ మూర్తి గారో, ఏదో ఒక రంగంలో తప్పక కందుకూరి కన్నా ముందుగా అడుగులు వేసి ఉంటారు. ఎందుకంటే, ఇది పలు ప్రతిభలు ఏక కాలంలో పనిచేసే మానవ సమాజం కాబట్టి. కానీ, కందుకూరి వారిలా, భిన్న రంగాలలో (పద్యం, ప్రహసనం, నవల, అనువాదం, జీవిత చరిత్ర, విద్యాలయాల స్థాపన, మహిళలకు ఆరోగ్య బోధినులు, కవి చరిత్రలు, వ్యాకరణ పరిష్కరణం, తెలుగు, ఆంగ్ల ప్రసంగాలు, పత్రికా రచన, సంపాదక ప్రచురణ కర్త బాధ్యతలు, నాటక ప్రక్రియకు తొలి అడుగులు, తర్క చింతన, శాస్త్రీయ దృష్టి, బ్రహ్మ సామాజికునిగా ఏకేశ్వరోపాసన, భాష ఆధునీకరణ, సాంఘిక సంస్కరణ కార్యాచరణ, తొలి వితంతు వివాహాలు, అంతే కాక ఆంగ్లానువాదం జరిగి లండన్ సమాజం మెచ్చుకున్న తొలి భారతీయనవల ‘రాజశేఖర చరిత్రం’ ( 1878లోనే ‘ఫార్చ్యూన్స్ వీల్’ పేరిట అన్న ఖ్యాతి కూడా వీరిదే) సమాజాన్ని ఇలా సమూలంగా ప్రభావితం చేసిన వ్యక్తులు అరుదు. కందుకూరి వారి సమాజ సంక్షేమకర భావనలకు, ఆచరణకు, వందేళ్ల కాలం గడిచిన సందర్భంలో, నేడు కొన్ని కొత్త సమస్యలు వచ్చినా, ఆన్ని రంగాలలో వారు ఆశించిన ప్రగతి నెలకొన్నది. అందుకే విజయవంతమైన వారి భావాచరణలకు సమాజం జయమాల సమర్పిస్తున్నది. వారు కన్నుమూసిన ఈ శతాబ్ది కాలంలో, వారికి నివాళి అర్పించని తెలుగు సాహితీవేత్త, సాంఘిక ప్రముఖులు లేరు. అదీ కందుకూరి ప్రజాస్వామిక స్వభావం. ఆ విధంగా కందుకూరి తన సమూల కార్యాచరణ ద్వారా తెలుగు వారికి పునరుజ్జీవన ప్రదాత. వారి శతవర్ధంతి సందర్భంగా వారు ప్రాతః స్మరణీయులు అని తలచి, రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో వారి అధీకృత (అఫిషియల్) ఛాయాచిత్రాన్ని ఏర్పరచి, విద్యార్థులకు నిరంతర స్ఫూర్తి, అలాగే వారి సర్వ రచనల పునర్ముద్రణ, ఆ రచనలపై జరిగే పరిశోధనలకు తగిన సహాయం అందించే సానుకూల దృక్పథంతో తెలుగు ప్రజలు, ఎన్నికైన ప్రభుత్వాలు పని చేస్తే, ఉత్తమ సామాజిక చైతన్యం నేటి తరాలకు అందడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. – రామతీర్థ -
దేశవ్యాప్తంగా వీరేశలింగం శతవర్థంతి వేడుకలు
-
ఆధునికతకు అక్షరాది కందుకూరి
తెలుగు సమాజంలో ఏ ఒక్క వ్యక్తి పుట్టుకతో అయినా ఇదిగో ఆధునికత మొదలు ఇతనితో అని చెప్పగలమా అంటే, అది ఒక్క కందుకూరి వీరేశలింగం విషయంలోనే సాధ్యం. ఆయన శతవర్ధంతి వత్సరం మే, ఇరవై ఏడున ఆరంభం అవుతున్నది. ఏ చదువులు లేకుండా అజ్ఞానంలో, బలైపోతున్న పసి ఆడపిల్లల జీవితాలు, యుక్తవయసు వచ్చేలోపే బాల వితంతువులుగా లక్షలాదిమంది బాలికలు సమాజంలో ఉండటం, వీటిని ఎవరు సహించినా, తాను వ్యతిరేకినంటూ, వీటిని ప్రశ్నించడానికి 1881లో రాజమండ్రి సోషల్ ప్రావి న్షియల్ క్లబ్లో కందుకూరి వీరేశలింగం ఒక ప్రసంగం చేశారు. దీనికి ప్రధాన ప్రేరణ, ఈ బాల్య వివాహాల జాడ్యం దేశమంతటా ఉండటం. 1880లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం, తొమ్మిదేళ్ల వయసులో భార్య అంటే ఏమో ఎరుగని వయసు బాలురు, పసి భార్యలను పోగొట్టుకున్న వారు దేశంలో 14,773 మంది ఉన్నారు. అదే సంవత్సరం, తొమ్మిదేండ్ల వయసు ఉన్న బాలికలు, తమ భర్తలను పోగొట్టుకున్న వారు, 78,976 మంది లెక్క తేలారు. వీళ్ళు కాకుండా, తరుణ వయసుకొచ్చిన 2,07,388 మంది బాలికలు తమ యవ్వనారంభ జీవితాలను వితంతువులుగా మొదలెడుతున్నారు. ఇవీ సంప్రదాయ భారతదేశపు సంఘం చేస్తున్న దుర్మార్గ పరంపర. ఇది కేవలం తెలుగు ప్రాంతాలకే చెందినదిగా, కొందరు భావించి, గురజాడ (1887–1892 నాటక రచనా కాలం ప్రదర్శన 1892లో) కన్యాశుల్కం నాటకం రాసే నాటికే, ఈ సమస్య లేదు అని చెప్తూ ఉంటారు. అది వాస్తవదూరం. ఈ అగ్రవర్ణ మూర్ఖత్వాన్ని నిరసిస్తూ, గురజాడ వాడిన వాటికన్నా, కటువైన మాటల్లో, ఈ బాల్య వివాహ దురాచారాన్ని రూపుమాపితే గానీ సమాజం బాగుపడదని విశ్వసించిన నాటికి, వీరేశలింగం వయసుడిగిన ముసలివారు కారు. ఆయన వయసు అప్పుడు కేవలం 33ఏళ్ళు. మనం తరచూ చూసే వృద్ధ కందుకూరి ఫోటోకి, ఈ అతి బాల్య వివాహాలపట్ల నిరసన తెలుపుతూ, తొలి వితంతు వివాహాన్ని 1881లో దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జరిపించిన వ్యక్తి రూపానికి పొలికే లేదు. దక్షిణ భారత రామ్‌మోహన్‌రాయ్‌గా గుర్తింపదగ్గ ఆధునికుడు వీరేశలింగం. కేవలం అక్షరయోధుడే కాదు, ఆచరణసేనాని కందుకూరి. ప్రసంగాలు, రచనలే కాదు – పెళ్లిళ్లు జరగాలి– అదీ కందుకూరి కార్యదీక్ష. ఆయన రచనలన్నీ, సాంఘికమౌఢ్యాన్ని పేల్చివేసే మందుపాతరలు. ఏకబిగిన వితంతు వివాహదీక్షతో, సంఘసంస్కరణలో జాతీయస్థాయి సంస్కర్తగా తన జీవితకాలంలోనే ఎదిగారు కందుకూరి. అప్పటి జాతీయ సంఘ సంస్కర్తలతో కలిసి, తన కార్యాచరణలో ఉన్నారు. ఈ భిన్న ప్రాంతాల ప్రముఖులు, జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడె అధ్యక్షతలో, దేశంలోని ప్రధాన నగరాల్లో జాతీయ సామాజిక సంస్కరణ సభలను నిర్వహించేవారు. ఈ మేధావులు సంఘసంస్కరణ మన రాజకీయాకాంక్షలతోబాటుగా, అంతకన్నా వేగంగా సాగాలని, అప్పుడే భారతీయ సమాజం ఆధునికం కాగలదని విశ్వసించి ఆచరించినవారు. 1898లో మదరాసులో జరిగిన మహాసభలకు కందుకూరిని అధ్యక్షులను చేసి గౌరవించారు. ఇక్కడ అధ్యక్షహోదాలో ఆంగ్లంలో ప్రసంగించారు కందుకూరి. ఇక్కడే జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడే ‘దక్షిణ భారత విద్యాసాగరునిగా’ కందుకూరికి బిరుదునిచ్చారు. అరుదైన ఈ ఆంగ్ల ప్రసంగ పూర్తిపాఠం, ఇటీవల లభ్యమైంది. దీనిని మే 27న, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం హాల్లో ఒక రోజుపాటు జరిగే శతవర్ధంతి వత్సర ప్రారంభోత్సవంలో విడుదలచేసి ఈ ప్రతిని ప్రదర్శనయోగ్యంగా విజయనగరంలోని గురజాడ స్మారక మందిరానికి, అలాగే, రాజమండ్రిలోని కందుకూరి దంపతుల సమాధి ఉన్న ఆనందాశ్రమానికి, ప్రదర్శన నిమిత్తం జాతికి సమర్పించడం జరుగుతుంది. ‘వ్యాకరణాల సంకెల’ అని, 1895లోనే ‘‘సరస్వతీ నారద విలాపం’’లో రాసిన కందుకూరి, ‘కవితా ఓ కవితా’లో ‘వ్యాకరణల సంకెళ్లు, శ్మశానాల వంటి నిఘంటువులు, చంధస్సర్ప పరిష్వంగం’ అన్న శ్రీశ్రీ కన్నా 45 ఏళ్లు ముందరే, సాహిత్య సరస్వతి భాష బరువుల కింద నలిగి రోదిస్తున్నదని చెప్పిన వాస్తవిక వాది. వీరి రచనల సమగ్ర ప్రచురణలు, వీలైతే నేటి తరాల కోసం, కాస్త సరళ భాషలో తీసుకురావడం, అలాగే, పలు తెలుగు నగరాల్లో కందుకూరి శతవర్ధంతి సందర్భంగా ‘కందుకూరి జయమాల’ సాహిత్య, సాంస్కృతిక సభల నిర్వహణ, ప్రస్తుతం తెలుగు జాతి బాధ్యత. (మే 27న కందుకూరి శతవర్ధంతి సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మొజాయిక్ సాహిత్య సంస్థ, అరసం సంయుక్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా) రామతీర్థ ,వ్యాసకర్త కవి, విమర్శకుడు 98492 00385 -
ఆక్రమణలో ‘కందుకూరి’ ఆస్తులు
తుంగపాడు వద్ద స్థానికులు ఆక్రమించిన కందుకూరి వీరేశలింగం పంతులు భూమిఅరుస్తాడు.. ఏడుస్తాడు.. తిరగబడతాడు అని తెలిసినా పక్కవాడి ఆస్తులు కొట్టేసే మానుష రూపంలో ఉన్న రాబందులకు ఉలకని, పలకని దేవుడి ఆస్తులు ఒక లెక్కా? హుండీలో డబ్బులు నొక్కేసినా అడగడు.. ఆయన నిత్య ధూప, దీప, నైవేద్యాల కోసం ధార్మికులు రాసిచ్చిన మాన్యాలు కొల్లగొడుతున్నా అడగడు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాల ఆస్తులు ఎన్నో అన్యాక్రాంతమవుతున్నాయి. సాక్షి, తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం: సమాజ హితం కోసం యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. వితంతు వివాహాలు, స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కందుకూరి 1906 డిసెంబర్ 15న ‘హితకారిణి’ సమాజాన్ని ఏర్పాటు చేసి, నిర్వహణకు తన యావదాస్తిని బదలాయించారు. రాజమహేంద్రవరం నగరంలో 30.37 ఏకరాల్లో కందుకూరి వీరేశలింగం ఆస్తిక స్కూల్, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, కందుకూరి రాజ్యలక్ష్మి పేరుతో మహిళా కళాశాలలు ఉన్నాయి. ఇందులో మహిళా కళాశాల ప్రాంగణంలో రాజేంద్రనగర్ వైపు సర్వే నంబర్ 255లో 400 గజాలు ఆక్రమణకు గురైంది. కళాశాలలో అటెండర్‌గా పని చేసిన వ్యక్తే ఆ స్థలాన్ని ఆక్రమించారు. దీనిపై హితకారిణి సమాజం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఆ స్థలం హితకారిణికే చెందుతుందని తీర్పునిచ్చింది. అయితే సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణలో ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం సుమారు రూ.40 వేలు పలుకుతోంది. రాజానగరంలో 4.70 ఎకరాల ఆక్రమణ కందుకూరి తన 20.60 ఎకరాల వ్యవసాయ భూములనూ హితకారిణికి బదలాయించారు. తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో సర్వే నంబర్ 93/2లో 4.30 ఎకరాలు, ఇంజవరం గ్రామం సర్వే నంబర్ 42/3లో 3.20 ఎకరాలు, రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామం సర్వే నంబర్ 850లో 4.70 ఎకరాలు, అదే గ్రామంలోని సర్వే నంబర్ 866లో 2.52 ఎకరాలు, ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో సర్వే నంబర్ 84/3లో 3.08 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం మాధవయ్యపాలెంలో సర్వే నంబర్ 3/1బిలో 2.52 ఎకరాలను కందుకూరి వీరేశలింగం పంతులు హితకారిణి సమాజానికి బదలాయించారు. అయితే రాజానగరం మండలం తుంగపాడు వద్ద సర్వే నంబర్ 850లో ఉన్న 4.70 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమి ఎకరం విలువ దాదాపు రూ.30 లక్షలు ఉంది. స్థానికులు కొందరు ఆ పొలాన్ని ఆక్రమించడంపై హితకారిణి సమాజం అధికారులు కోర్టుల్లో వేసిన కేసులు విచారణలో ఉన్నాయి. మిగతా పొలాలు అన్నీ లీజుకు ఇచ్చారు. ఇప్పటికే రాజమహేంద్రవరం నగరంలో ఉన్న అత్యంత విలువైన భూములు కొన్ని గతంలో అతి తక్కువ ధరకే పెద్దలకు కేటాయించారని, ఇక మిగిలి ఉన్న భూములనైనా దేవాదాయశాఖ అధికారులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
మరోసారి మూడుముళ్లు పడిన ఆ రాత్రి..
బాల్య వివాహాలను నిరసిస్తూ ... వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ మహాకవి గురజాడ తన కన్యాశుల్కం నాటకం ద్వారా జాతిని జాగృతం చేశారు. సాహిత్యపరంగా గురజాడ యుద్ధం ప్రకటించగా కందుకూరి వీరేశలింగం ఈ దుష్ట సంప్రదాయంపై పిడికిలి బిగించారు. ప్రతిఘటనలు ఎదురైనా తన సతీమణి రాజ్యలక్ష్మి సహకారంతో రాష్ట్రంలోనే తొలి వితంతు వివాహం 1881 డిసెంబర్ 11వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలో జరిపించారు. ఆ బృహత్తర ఘట్టానికి ... చరిత్ర మలుపు తిప్పిన ఆ చారిత్రక శుభ ఘడియకు రాజమహేంద్రవరం వేదికగా నిలవడం జిల్లావాసులు గర్వించదగ్గ విషయం. ఈ వివాహానికి బాలిక తల్లే సూత్రధారిగా మారి ముందడుగు వేయడం ఓ విప్లవం. 136 సంవత్సరాల కిందట జరిగిన ఈ పరిణామం జాతి మలుపునకు దారితీసింది. రాజమహేంద్రవరం కల్చరల్ : ‘ఇప్పుడు యీ వెధవ ఇంగిలీషు చదువు నుంచి ఆ ఫకీరు వెధవ దాన్ని లేవదీసుకుపోయాడుగాని.. వైధవ్యం అనుభవించిన వాళ్లంతా పూర్వకాలంలో యెంత ప్రతిష్ఠగా బతికారు కాదు..’ ‘ప్రారబ్ధం చాలకపోతే (వైధవ్యం) ప్రతివాళ్లకీ వస్తుంది. చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా రాసినరాత యెవడైనా తప్పించగలడా?’ ‘వెధవముండలకి పెళ్లి చెయ్యడపు పోయీకాలం పట్టుకుందేవి పెద్దపెద్ద వాళ్ళకి కూడాను?’ ‘అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంతలాభం కలిగింది? భూవులకు దావా తెచ్చామా లేదా?’....... మహాకవి గురజాడ ‘కన్యాశుల్కం’లో అగ్నిహోత్రావధానులు నోట పలికించిన ఈ మాటలు చాలు, నాటి సమాజంలోని దురాచారాలను చూపడానికి. అగ్నిహోత్రావధానులు పాత్ర ఆకాశం నుంచి ఊడిపడలేదు. నాటి సమాజంలోని దుర్నీతిని కళ్ళారాచూసిన గురజాడ కలం ద్వారా ఈ బ్రహ్మాస్త్రాలు సంధిస్తే, కందుకూరి సంస్కరణోద్యమం ద్వారా ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశాడు. ముక్కుపచ్చలారని బాలికను, డబ్బుకోసం కాటికి కాళ్లుచాపుకున్న వాడికి అంటగట్టడం, ఆ బాలిక వివాహం అంటే అర్థం తెలుసుకునేలోపునే వితంతువు అయితే, ఆడదాని తల రాత అంతేనని సమాధానం చెప్పడంనాడు పరిపాటి. తీవ్ర ప్రతిఘటనల మధ్య.. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం చేపట్టిన వితంతు వివాహాలకు అసాధారణమైన ప్రతిఘటనలు ఎదురయ్యాయి. వంటవాళ్లు, మంత్రాలు చెప్పేవారిని సైతం అడ్డుకున్నారు. కందుకూరి సతీమణి రాజ్యలక్ష్మిద్వారా భర్తమీద ఈ ప్రయత్నాలు వదులుకోమని ఒత్తిడి తెచ్చారు.. అయినా, ఆమె కందుకూరికి బాసటగా నిలబడ్డారు. నాటి విద్యార్థిలోకం కందుకూరికి అండగా నిలబడింది. రాష్ట్రంలోనే తొలి వితంతు వివాహం 1881 డిసెంబర్ 11వ తేదీ రాత్రి జరిగింది. కందుకూరి ప్రాణాలు తీయడానికి కూడా నాటి కుహనా పండితులు కొందరు వెనుకాడలేదు. సుమారు 136 సంవత్సరాలకు ముందు జరిగిన ఈ పునర్వివాహానికి మంత్రాలు చదివే యాజకునికి వంద రూపాయలు ఇవ్వవలసి వచ్చిందని కందుకూరి స్వీయచరిత్రలో వివరించారు. ఆ రోజుల్లో వందరూపాయలంటే, నేటి విలువ ఎంతో ఆర్థిక నిపుణులు అంచనా వేయవచ్చును. తొలి వితంతు వివాహానికి నాటి విద్యార్థిలోకం అండగా నిలిచింది. రక్షకభటశాఖ పూర్తి సహకారం అందించింది అన్నిటికీ మించి అర్ధాంగి పూర్తి సహకారం తోడైంది. కందుకూరి స్వీయచరిత్రలో వితంతు వివాహం ‘కృష్ణామండలం, తిరువూరు డిప్యూటీ తహసీల్దారు దర్భా బ్రహ్మానందము గారు తమ తాలూకాలోని గ్రామములో పండ్రెండేళ్ల యీడుగల ఒక వితంతువు (గౌరమ్మ) యున్నదని, తగు మనుష్యులను పంపగలిగినయెడల తల్లిని సమ్మతిపరచి యా చిన్నదానిని వారివెంట బంపునట్లు ప్రయత్నము చేసెదననియు, నాకొక లేఖను వ్రాసిరి. ఈ విషయమయి కొంత యుత్తరప్రత్యుత్తరములు జరిగిన తరువాత నా మిత్రుడు తిరువూరు నుండి 1881వ సంవత్సరం నవంబరు నెల అయిదవ తేదీన నాకిట్లు వ్రాసెను. ‘ఇక్కడకు మీ మనుష్యులను పంపుతోడనే తన కొమరితను మీ వద్దకు బంపెదనని యామె వాగ్దానము చేసినది. ఈ చిన్నదానిని వెంట బెట్టుకుని పోవుటకు నమ్మదగినవారును, ఋజువర్తనులను, దృఢచిత్తులునయిన మనుష్యులనుబంపుడు. వివాహము నిజముగా జరుగువరకు వారెందు నిమిత్తము వచ్చిరో యాపని యక్కడ నెవ్వరికి తెలియకుండవలెను. ఈ పని నిమిత్తము యిద్దరికంటె నెక్కువ మనుష్యులను పంపవలదని సీతమ్మ (బాలవితంతువుతల్లి) మిమ్ములను కోరుచున్నది. విశాఖపట్టణములో రక్షకశాఖయందిరువది రెండు సంవత్సరముల ప్రాయముగల యొక చిన్నవాని భార్య యాకస్మికముగా మరణమునొందుట తటస్తించినది. అతడు చిరకాలము నా శిక్షణలో నుంచి పెరిగినవాడగుటచే వితంతు వివాహములు మొదలయిన కొత్తమార్పులందు ఆసక్తియు నుత్సాహము కలవాడు. వరుడు గోగులపాటి శ్రీరాములుగారని తెలిసిన తోడనే మా పట్టణమున యాతని బంధువులు మొదలయినవారు వచ్చి, వివాహము చేసుకోవలదని హితోపదేశము చేసి, కార్యము గానక మరలిపోవుచు వచ్చిరి. ‘మహాసంక్షోభమున’ 1881వ సంవత్సరము డిసెంబర్ 11వ తేదీ రాత్రి రాజమహేంద్రవరములో మొదటి స్త్రీపు పునర్వివాహము జరిగినది. పలువురు మార్గాంతరము లేక, ప్రాయశ్చిత్తములు చేయించుకొనిరి’ 11న వార్షికోత్సవం కందుకూరి జన్మగృహంలో ఈ చరిత్రాత్మక సంఘటనకు ఆనవాలుగా తొలి వితంతు వివాహానికి గుర్తుగా కొన్నిశిల్పాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం కందుకూరి జన్మగృహంలో జరిగే తొలి వితంతు వివాహ వార్షికోత్సవంలో డాక్టర్ అరిపిరాల నారాయణరావు, వై.యస్.నరసింహారావు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ( కందుకూరి జన్మగృహంలో తొలి వితంతు వివాహానికి ఆనవాలుగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ) -
ప్రాభవాన్ని కోల్పోతున్న కందుకూరి సంస్థలు
-
కలమే కరవాలం.. సంస్కరణే కలకాలం...
శతాధిక గ్రంథకర్త, సం స్కర్త, నవ్యతా ప్రయోక్త కందుకూరి వీరేశలింగం 1848 ఏప్రిల్ 16వ తేదీన పున్నమ్మ, సుబ్బారాయు డు దంపతులకు రాజమం డ్రిలో జన్మించారు. సాహి తీ ప్రీతితో, సంస్కరణ దృ క్పథంతో ఆయన స్పృశిం చని శాఖలేదు, చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. ఆంధ్ర సాహిత్యంలో నవల, నాటకం, ప్రహసనం, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, కవుల చరిత్ర, వ్యాసం, శాస్త్రవాజ్ఞయ గ్రంథాల ప్రక్రి యలన్నింటికీ శ్రీకారం చుట్టి, సుసంపన్నం చేశాడు. సాహిత్యాన్ని సంఘ సంస్కరణకు ఉపకరణగా చేసుకున్నాడు. కలాన్ని కరవాలంగా ఝళిపించాడు. అవినీతిపరుల అక్రమాలు, అన్యాయాలు, దుండ గాలు, దౌష్ట్యాలను అరికట్టేందుకు పత్రికాధిపతిగా భగీరథ ప్రయత్నం చేశాడు. స్త్రీ జనోద్ధారకుడిగా 1874లో తొలి బాలికా పాఠశాలను ధవళేశ్వరంలో స్థాపించాడు. ఊరూరా బాలికా పాఠశాలలను స్థాపించి, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. మహిళాభ్యు దయ దృక్పథంతో తొలి వితంతు వివాహాన్ని ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య 1881 డిసెంబర్లో జరిపించాడు. దాదాపు 55 వితంతు వివాహాలను చేయించాడు. స్త్రీ జనోద్ధారకుడిగా ఆయన కీర్తి ఆంధ్రదేశమంతటా విస్తరించింది. ఆయన సంస్క రణ, గంధం రాష్ట్ర పరిధిని దాటి జాతీయ స్థాయిలో గుబాళించింది, ఆయన అమేయమైన వ్యక్తిత్వం 19వ శతాబ్ది సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది వేసింది. ఆయన జయంతిని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయన నాటక సాహిత్య కృషిని నాలుగు విభా గాలుగా వర్గీకరించవచ్చు. 1. అనువాద నాటకాలు, 2, పౌరాణిక నాటకాలు, 3. సాంఘిక నాటకాలు, 4. ప్రహసనాలు. అనువాద నాటకాలకు 19వ శతాబ్దంలో అధిక ప్రాధాన్యముండేది. ప్రదర్శన ప్రాధాన్య దృష్టితో కందుకూరి... ‘షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ అనే అంగ్ల నాటకాన్ని ‘చమత్కార రత్నావళి’ పేరుతో (1880) అనువదించి విద్యార్థుల చేత ప్రదర్శిపజేసి మెప్పు పొందారు. వీరేశలింగం గారు రచించిన పౌరాణిక నాటకాల్లో ‘సత్యహరి శ్చంద్ర’ నాటకం విల క్షణమైనది. అందులో వశిష్ట విశ్వామిత్రుల సం వాదం ఆయన కల్పన. అప్పట్లో ఆ నాటకం ఎంతో ప్రసిద్ధి పొందింది. మహాభారత ఇతివృత్తం ఆధారంగా ‘దక్షిణ గోగ్రహణం’ నాటకాన్ని రచించి పాఠకుల మెప్పు పొందాడు. సామాజిక ప్రయోజ నానికి సాంఘిక నాటకం గొప్ప ఉపకరణమని 19వ శతాబ్దిలోనే గుర్తించిన గొప్ప క్రాంతిదర్శి వీరేశలిం గం. వ్యవహారిక భాషలో జాతిని జాగృతం చేసే సంకల్పంతో సామాజిక ప్రయోజనాత్మకాలైన ‘వ్యవ హార ధర్మబోధిని’, ‘బాల్యవివాహం’, ‘స్త్రీ పునర్వి వాహం’ వంటి సాంఘిక నాటకాలు రచించిన మహ నీయుడు. 20వ శతాబ్దిలో విస్తృతంగా అభివృద్ధి చెందిన సాంఘిక నాటకరంగానికి మార్గదర్శకుడ య్యాడు. ఆంగ్ల సాహిత్యంలో ఫార్స్ ప్రక్రియ ఆధారంగా తెలుగులో ప్రహసన ప్రక్రియకు రూప కల్పన చేశాడు. హాస్యస్ఫోరకమైన వ్యంగ్య అధిక్షే పాత్మక ప్రక్రియ ప్రహసనం. దాదాపు 50 ప్రహసనా లను రచించాడు. అప్పటి సమాజంలో ఏ అధికారి లంచం తీసుకున్నా, అక్రమానికి పాల్పడ్డా ప్రహసన రూపంలో ఆయన అధిక్షేపించేవారు. ఆయన ప్రహసనాలు సమకాలీనుల, తదనం తర సాహితీ విమర్శకుల మెప్పు పొందాయి. అయి తే ప్రహసనాల్లో మృదుహాస్యం మృగ్యమై కటు వ్యంగ్య హాస్యం కదనుతొక్కిన కారణంగా వీరేశలిం గం కొందరి దృష్టిలో విరోధిగా మారాడు. ఎవరేమ న్నా ఆయన రచనల్లో విలక్షణమైనవి, సామాజిక ప్రయోజనాలను సాధించినవి ప్రహసనాలనడం నిస్సందేహం. తెలుగు సాహిత్యంలో ప్రక్రియలన్నింటినీ సుసంపన్నం చేసిన ప్రతిభావంతుడు, హేతువాద దృష్టితో మూఢ విశ్వాసాలను నిరసించిన సంస్కర్త, మహిళాభ్యుదయ కాముకుడైన మహోన్నత వ్యక్తి కందుకూరి జయంతిని తెలుగు నాటకరంగ దినోత్స వంగా ప్రభుత్వం నిర్వహించడం ఆవశ్యకం. (నేడు కందుకూరి వీరేశలింగం 167వ జయంతి) వ్యాసకర్త రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ మొబైల్ : 98491 77594 -
తెలుగులో జీవిత చరిత్ర రచనకు ఆద్యుడు?
స్వీయ చరిత్ర ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన వచన, సాహితీ ప్రక్రియల్లో స్వీయ చరిత్ర ఒకటి. స్వీయ చరిత్రనే ఆత్మకథ అని కూడా పిలుస్తారు. తెలుగులో స్వీయ చరిత్రకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం. నిర్వచనాలు: స్వీయచరిత్ర అంటే ఆత్మకథనం. ఆత్మ కథను రాయడం చాలా కష్టం. తమ గురించి తాము రాసుకునే దాన్ని ఆత్మకథ అంటారు. సమాజంలోని విభిన్న రంగాల్లో విశిష్టమైన సేవ చేసినవారు తమ అనుభవాలను, జ్ఞాపకాలను భావితరాలకు అందించే ప్రయత్నమే స్వీయచరిత్ర. స్వీయచరిత్ర ప్రత్యక్ష కథనం. జీవిత చరిత్ర పరోక్ష కథనం. జీవిత చరిత్ర ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన వచన సాహితీ ప్రక్రియల్లో జీవిత చరిత్ర ఒకటి. బయోగ్రఫీ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా తెలుగులో జీవితచరిత్ర అనే పదం స్థిరపడింది. స్వీయచరిత్ర ఆత్మాశ్రయం అయితే జీవిత చరిత్ర పరాశ్రయం. లోకంలో మహాపురుషుల విశిష్టతను అందరికీ తెలియజేయడం కోసం రాసేది జీవితచరిత్ర. చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, వైజ్ఞా నిక, సామాజిక, కళా రంగాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించిన వ్యక్తుల జీవితాలను గురించి తెలిపే రచనల్ని జీవిత చరిత్రలు అంటారు. కవులు, రాజకీయ నాయకులు, శాస్త్రజ్ఞులు .. ఇలా ఎవరికి సంబంధించిన జీవిత వ్యక్తిత్వాలనైనా ఇతరులకు తెలిసేలా మరొకరు రాయడమే జీవిత చరిత్ర. జీవిత చరిత్రలో కల్పనకు తావు లేదు. వాస్తవాలను యథాతథంగా రాసినప్పుడే జీవిత చరిత్రకు ప్రామాణికత ఉంటుంది. తెలుగునాట జీవిత చరిత్ర ప్రక్రియకు ఆద్యుడు - కందుకూరి వీరేశలింగం. తెలుగు సాహిత్యంలో ఎక్కువ జీవిత చరిత్రలు రాసినవారు - గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వ్యాసం ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన వచన సాహితీ ప్రక్రియల్లో సూక్ష్మమైంది, క్లిష్టతరమైంది వ్యాసం. ఆంగ్లంలో ఉటట్చడ అనే పదానికి తెలుగులో సమానార్థక పదం వ్యాసం. తెలుగులో వ్యాసం అనే పదానికి విభాగం లేదా విస్తరించు అనే అర్థాలు ఉన్నాయి. {పపంచంలో వ్యాసం మొదటిసారిగా ఫ్రెంచి సాహిత్యంలో వచ్చింది. {పపంచ సాహిత్యంలో వ్యాస ప్రక్రియకు ఆద్యుడు - మాన్‌టైన్ (16వ శతాబ్దం) వ్యాసాన్ని హిందీలో నిబంధ్, ప్రబంధ్, లలిత ప్రబంధ్ అని వ్యవహరిస్తారు. వ్యాసాన్ని ఒడియా, పంజాబీ, మలయాళీ భాషల్లో నిబంధ్, ప్రబంధ్ అని పిలుస్తారు. నిర్వచనాలు: ఏదైనా ఒక అంశంపై విరివిగా రాయడం వ్యాసం. - శబ్ద రత్నాకరం కవికి గీటురాయి గద్యం అయితే, గద్యానికి గీటురాయి వ్యాసం - రామచంద్ర శుక్లా వ్యాసమంటే విషయ విశ్లేషణ - ఇలువలూరి కామేశ్వరరావు విమర్శ విమర్శ అనే పదాన్ని ఆంగ్లంలో ఇటజ్టీజీఛిజీటఝ అంటారు. విమర్శ అనేది సంస్కృత పదం. మృశ్ అనే ధాతువుకు పరామర్శించడం, ఆలోచించడం, పరిశీలించడం, చర్చించడం, వివేచించడం లాంటి అర్థాలున్నాయి. ప్రస్తుతం విమర్శ, సమీక్ష, మీమాంస, సమాలోచన, అనుశీలన, పరిశీలన మొదలైన పదాలన్నింటినీ సమానార్థకాలుగా ఉపయోగిస్తున్నారు. విమర్శ సృజనాత్మక ప్రక్రియ కాదు. ఒక సృజనాత్మక ప్రక్రియను నిశితంగా విపులీకరిం చేది విమర్శ. దీనిపై సంస్కృత, పాశ్చాత్య భాషల ప్రభావం బాగా కనిపిస్తుంది. తెలుగులో ఆధునిక విమర్శకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం. వివేకవర్థని లాంటి పత్రికల ద్వారా విమర్శకు ఆయన ఎనలేని సేవ చేశారు. 1876లో కందుకూరి వీరేశలింగం.. కొక్కొండ వెంకటరత్నం రాసిన విగ్రహతంత్రం అనే గ్రంథంపై ‘విగ్రహతంత్ర విమర్శనం’ అనే పేరుతో ఆధునిక విమర్శకు శ్రీకారం చుట్టారు. గతంలో అడిగిన ప్రశ్నలు 1. నా జీవనయానం ఎవరి ఆత్మకథ? 1) దాశరథి కృష్ణమాచార్యులు 2) దాశరథి రంగాచార్యులు 3) తాపీ ధర్మారావు 4) టంగుటూరి ప్రకాశం 2. తెలుగులో జీవిత చరిత్ర రచనకు ఆద్యుడు? 1) కందుకూరి వీరేశలింగం 2) కొక్కొండ వెంకటరత్నం 3) గుర్రం జాషువా 4) గురజాడ శ్రీరామమూర్తి 3. ఆధునిక వ్యాసాలను పోలిన తన రచనలకు కందుకూరి వీరేశలింగం ఏమని పేరు పెట్టారు? 1) ప్రమేయాలు 2) సంగ్రహాలు 3) ఉపన్యాసాలు 4) నవ్య వ్యాసాలు 4. తెలుగు తొలి నవలా విమర్శన గ్రంథం? 1) విగ్రహతంత్ర విమర్శనం 2) వివేక చంద్రిక వ్యాఖ్య 3) కవిత్వ తత్త్వవిచారం 4) నవలా శిల్పం సమాధానాలు: 1) 2; 2) 1; 3) 3; 4) 2. ముఖ్యమైన స్వీయ చరిత్రలు - రచయితలు 1. స్వీయచరిత్ర (1906) కందుకూరి వీరేశలింగం 2. స్వీయ చరిత్రం (1910) చిలకమర్తి లక్ష్మీనరసింహం 3. జాతక చర్య (పద్య రూపం) తిరుపతి వేంకట కవులు 4. నా కథ (పద్య రూపం) గుర్రం జాషువా 5. అనుభవాలు - జ్ఞాపకాలు }పాద సుబ్రహ్మణ్యశాస్త్రి 6. యాభై సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు 7. నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం 8. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న 9. హంపీ నుంచి హరప్పా దాకా తిరుమల రామచంద్ర 10. కూలీ నుంచి కళాప్రపూర్ణ వరకు యస్.టి. జ్ఞానానంద కవి 11. నా అంతరంగ కథనం బుచ్చిబాబు (శివరాజు వేంకట సుబ్బారావు) 12. అనంతం (చారిత్రాత్మక ఆత్మకథ) }రంగం శ్రీనివాసరావు 13. నేను - నా దేశం దర్శి చెంచయ్య 14. రాలూ రప్పలూ తాపీ ధర్మారావు 15. నా జీవనయానం దాశరథి రంగాచార్యులు 16. {పజ్ఞా ప్రభాకరం వేటూరి ప్రభాకరశాస్త్రి 17. శతపత్రం గడియారం రామకృష్ణశర్మ ప్రసిద్ధ జీవిత చరిత్రలు - రచయితలు 1. కందుకూరి వీరేశలింగం 1. విక్టోరియా రాణి చరిత్ర 2. జీసస్ చరిత్ర 3. రాజా రామ్మోహన్రాయ్ చరిత్ర 4. ఆంధ్ర కవుల చరిత్ర 2. కొత్తపల్లి వీరభద్రరావు సి.పి.బ్రౌన్ జీవిత చరిత్ర 3. గుర్రం జాషువా (పద్యరూప 1. క్రీస్తు చరిత్ర (1963) జీవిత చరిత్రలు) 2. నేతాజీ 3. బాపూజీ 4. నిడదవోలు వెంకట్రావు చిన్నయసూరి 5. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య 1. శరత్‌బాబు 2. సరోజినీదేవి 3. కట్టమంచి రామలింగారెడ్డి 4. ఆచార్య రంగ 5. వల్లభాయ్ పటేల్ 6. గుంటూరు లక్ష్మీకాంతం నాయన చరిత్ర (శ్రీకావ్యకంఠ గణపతి శాస్త్రి జీవిత చరిత్ర) 7. ముదిగంటి జగ్గన్న నెహ్రూ చరిత్ర 8. తోలేటి వెంకట సుబ్బారావు కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర (1894) 9. ఉండేలమాల కొండారెడ్డి నేతాజీ జీవిత చరిత్ర (1948) 10. ముదిగొండ వీరభద్రమూర్తి ఆంధ్ర కేసరి ముఖ్యమైన అంశాలు తెలుగులో తొలి విమర్శకుడు - కందుకూరి వీరేశలింగం తెలుగులో తొలి విమర్శన గ్రంథం - విగ్రహతంత్ర విమర్శనం తెలుగులో తొలి నవలా విమర్శకుడు - కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి తెలుగులో నవలలపై వచ్చిన తొలి విమర్శన గ్రంథం - వివేకచంద్రికా విమర్శనం ‘విమర్శకాగ్రేసర’ అనే బిరుదు ఉన్నవారు - కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి ఆధునిక సాహిత్య విమర్శలో నూతన ధోరణులు ప్రవేశపెట్టినవారు - కట్టమంచి రామలింగారెడ్డి ఆధునిక విమర్శనాశాస్త్ర పితామహుడు - కట్టమంచి రామలింగారెడ్డి ప్రసిద్ధ విమర్శ గ్రంథాలు 1. విగ్రహతంత్ర విమర్శనం - కందుకూరి వీరేశలింగం 2. సాహిత్య ప్రయోజనం - కొడవటిగంటి కుటుంబరావు 3. వ్యాసవాహిని, సమీక్షణం - సి.నారాయణ రెడ్డి 4. సాహిత్య కౌముది - గంటూరు శేషేంద్రశర్మ మాదిరి ప్రశ్నలు 1. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు గ్రంథకర్త? 1) వేదుల సుబ్రహ్మణ్యం 2) జి.వి. సుబ్రహ్మణ్యం 3) జి.వి. కృష్ణారావు 4) నాళం కృష్ణారావు 2. కనుపర్తి వరలక్ష్మమ్మ శారద లేఖలకు ప్రేరణ 1) సాంత్వన లేఖలు 2) వసంత లేఖలు 3) భారతీ లేఖలు 4) ప్రేమ లేఖలు 3. ఇంగ్లిష్‌లోని టాట్లర్కు సమానార్థకమైన తెలుగులో వచ్చిన వ్యాసాలు? 1) వదరుబోతు 2) సాక్షి 3) లక్ష్మీరంజన వ్యాసావళి 4) బారిస్టరు గారి బాతాఖానీ 4. సత్య కథనానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సాహిత్య ప్రక్రియ? 1) కథానిక 2) నవల 3) ఆత్మకథ 4) గల్పిక 5. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన తొలి వ్యాస సంపుటి ‘హిత సూచని’లో వ్యాసానికి బదులుగా వాడిన పదం? 1) వచన ప్రబంధం 2) ప్రమేయం 3) గద్య ప్రబంధం 4) సంగ్రహములు 6. ఆత్మకథను ‘నా కథ’ పేరుతో పద్య రూపంలో రచించిన కవి? 1) విశ్వనాథ సత్యనారాయణ 2) నాయని సుబ్బారావు 3) గుర్రం జాషువా 4) కరుణశ్రీ 7. తెలుగులో ప్రసిద్ధ ఆత్మకథగా నిలిచిన ‘నేను - నా దేశం’ ఎవరిది? 1) టంగుటూరి ప్రకాశం 2) గుంటూరు శేషేంద్రశర్మ 3) తిరుమల రామచంద్ర 4) దర్శి చెంచయ్య 8. తెలుగునాట పాఠకులను కడుపుబ్బా నవ్వించిన ‘జంఘాలశాస్త్రి’ పాత్ర ఏ రచనలోనిది? 1) శారద లేఖలు 2) వసంత లేఖలు 3) సాక్షి వ్యాసాలు 4) కన్యాశుల్కం 9. తెలుగులో ఆధునిక విమర్శనా ధోరణులను ప్రవేశపెట్టిన ‘కవిత్వతత్త్వ విచారం’ అనే పరిశోధన గ్రంథాన్ని ఎవరు రాశారు? 1) కట్టమంచి రామలింగారెడ్డి 2) కందుకూరి వీరేశలింగం 3) విశ్వనాథ సత్యనారాయణ 4) దేవులపల్లి రామానుజరావు 10. ‘కవికి గీటురాయి గద్యమైతే - గద్యానికి గీటురాయి వ్యాసం’ అని ఎవరన్నారు? 1) ఇలవలూరి కామేశ్వరరావు 2) శ్రీరామచంద్ర శుక్లా 3) శ్రీరామచంద్ర వర్మ 4) వల్లంపాటి వెంకటసుబ్బయ్య సమాధానాలు: 1) 2; 2) 2; 3) 1; 4) 3; 5) 2; 6) 3; 7) 4; 8) 3; 9) 1; 10) 2.