జీవో కాపీలు చూపిస్తున్న కాశీ బాలమునికుమారి తదితరులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థాపించిన హితకారిణి సమాజానికి సంబంధించిన ఆస్తులను సర్కారు స్వాధీనం చేసుకుంటుందంటూ పచ్చ మీడియాలో రాసిన గలీజు రాతల్లో వాస్తవం లేదని హితకారిణి సమాజం చైర్‌పర్సన్ కాశీ బాలమునికుమారి చెప్పారు. హితకారిణి సమాజం ట్రస్టు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఎవరి మెప్పు పొందడానికి ఇటువంటి రాతలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. నిజాలు తెలుసుకోకుండా భూముల స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ రాయడం ఎంతవరకు సబబని నిలదీశారు. కందుకూరి వీరేశలింగం పంతులు ఏ లక్ష్యంతో ఈ సమాజాన్ని స్థాపించారో.. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను మహిళలకే అందిస్తున్నారని చెప్పారు. అందుకే దళిత మహిళ అయిన తనను ఈ హితకారిణి సమాజానికి చైర్‌పర్సన్‌ను చేసి అభివృద్ధి పథంలో నడిపించాలని ఆదేశించారని తెలిపారు.
పచ్చ మీడియాపై లీగల్ చర్యలు
ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసి, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు జీతాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసుతో చర్యలు తీసుకున్నారని చెప్పారు. హితకారిణి సమాజం ఆస్తులను ప్రభుత్వం తీసుకోలేదని బాలమునికుమారి స్పష్టం చేశారు. హితకారిణి సమాజంలో అద్దెకిచ్చిన దుకాణాలపై పెత్తనం తమకే ఇవ్వాలంటూ విద్యాశాఖ పట్టుబడుతోందని రాయడం కూడా సత్యదూరమని చెప్పారు.
ఆ దుకాణాల అజమాయిషీ ఎప్పటికీ హితకారిణి సమాజం అధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. విలీనం చేసుకుంటున్నప్పుడే ఆస్తులు తమకు అవసరం లేదని, కేవలం విద్యాసంస్థలను అభివృద్ధి చేయడానికే విలీనం చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా పచ్చ మీడియాలో అసత్య కథనం ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై చట్టప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజమహేంద్రవరం నగరంలోని దానవాయిపేట, ఇన్నీసుపేటలోని సమాజం ప్రాంగణాలన్నీ కలిపి 31 ఎకరాల్లో ఉండగా.. వీటి విలువ దాదాపు రూ.200 కోట్లని, ఇంత విలువైన భూములను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యాశాఖ భూములు ఇచ్చేయాలని పట్టుబడుతున్నట్టు తప్పుడు కథనం రాయడం మంచిది కాదన్నారు.
సమాజం ఆస్తులను భద్రంగా కాపాడుతున్నామని, కందుకూరి ఆశయాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. ఆ భూములను స్వాధీనం చేయాలంటూ దేవదాయ, ధర్మదాయ శాఖ జీవో జారీ చేసినట్లు రాయడం కూడా సరికాదన్నారు. ఉద్దేశపూర్వకంగా కందుకూరి విద్యాసంస్థలపై, హితకారిణి సమాజంపై తప్పుడు కథనాలు రాస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈనాడు చైర్మన్ రామోజీరావుకి వయసు మీదపడటంతో పత్రిక బాధ్యత చూడలేకపోతున్నారేమోనని, అందుకే ఆ పత్రికలో ఇటీవల తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని విమర్శించారు. హితకారిణి సమాజం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, దీనిపై తప్పుడు కథనాలు రాయడం అందరికీ ఆగ్రహం కలిగిస్తుందని పేర్కొన్నారు.
హితకారిణి సమాజం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు దేవులపల్లి సరితారాణి, గుడాల ఆదిలక్ష్మి, దూనబోయిన అరుణకుమారి, ఉల్లూరి రాజు, మద్దు సతీష్, కందుకూరి రాజ్యలక్ష్మి ఎంబీఏ మహిళా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ విద్యాప్రతిమ, కందుకూరి రాజ్యలక్ష్మి డీఈడీ మహిళా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ విజయభాను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment