బాల్య యవ్వనాలు , తొలి నాళ్ళ జీవితం | Kandukuri Veeresalingam Pantulu Life Store | Sakshi
Sakshi News home page

బాల్య యవ్వనాలు , తొలి నాళ్ళ జీవితం

Published Sun, May 26 2019 1:24 PM | Last Updated on Sun, May 26 2019 1:24 PM

Kandukuri Veeresalingam Pantulu Life Store - Sakshi

కందుకూరి వీరేశలింగం తెలుగు జన జీవన గొదావరిలో లేచి నిలిచిన అభ్యుదయ ఆది శిఖరం. ఏడు కొండలున్న తెలుగు వారికి ఎనిమిదో కొండలా తాను భాసిల్లాడు. పందొమ్మిదో శతాబ్దంలో  భూస్వామ్య యుగ లక్షణాల ప్రపంచం, మరింత ప్రజా చైతన్య దాయకం అయిన పారిశ్రామిక యుగం దిశగా అడుగులు వేస్తున్నది. 1852, 1854 ప్రాంతాలలో బ్రిటిష్‌ పాలిత భారతదేశంలో మొదలైన  రవాణా, వార్తా సౌకర్యాలుగా,  రైలు బళ్లు, తపాలా శాఖ వంటివి యావద్దేశాన్ని కలుపుతున్నాయి. పూటకూళ్ల ఇళ్లు వెలుస్తున్నాయి. అంతవరకూ గ్రామీణ  జీవనంలో ఉన్న యువతకి, ఆంగ్ల చదువులతో మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇవన్నీ  ఏర్పడడానికి ముందే, ఇంకా కచ్చితంగా చెప్పాలీ అంటే, 1857 మొదటి స్వాతంత్య్ర పోరాటానికి తొమ్మిదేళ్ల ముందే కందుకూరి వీరేశలింగం పుట్టుక. పేరు బాగా స్థితిమంతులైన  తమ తాతగారిదే. వారి ఇల్లు ఒక వీధిలో గుమ్మం ఉంటే, మరొక వీధిలో పెరటి గుమ్మం ఉండేంత విశాలం.

బాల్య యవ్వనాలు  – తొలి నాళ్ళ జీవితం  
తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, పెదతండ్రి పెంపకంలో పెరిగారు. బాల్య వివాహాలను తాను పెద్దయ్యాక వ్యతిరేకించినా, ఆయనకు పదమూడో ఏటనే అద్దంకి వారి  తొమ్మిదేళ్ల అమ్మాయి బాపమ్మతో పెళ్లి జరిగింది. వీరేశలింగం గారి తల్లి ఆధునిక స్వభావం, ఎటువంటిది అంటే, బాపమ్మ అనే పేరు కన్నా రాజ్యలక్ష్మి అన్న పేరు తన కోడలికి బాగుంటుందని, అలా పేరు మార్చిన అత్తగారు. వీరేశలింగం చదువు అంతా వీధిబడుల్లోనే నడిచింది. ఇంటినిండా, తాత వీరేశలింగం అప్పట్లో ప్రత్యేకంగా వ్రాయసగాళ్ళచే రాయించి పెట్టిన తాటాకు గ్రంథాలుగా ప్రాచీన సాహిత్యం చూరుకి వేలాడదీసి భద్రంగా దాచిన మూటల్లో ఉండేది. ఇలా తమ ఇంట ప్రాచీన సాహిత్యం ఉండేదని, 1873లో తాను రాసిన ‘రాజశేఖర చరిత్రము’లో మూడు పేజీలకు పైగా వర్ణించిన రాజశేఖరుని గృహం, తమ ఇల్లే్ల అని తన ‘స్వీయ చరిత్ర’లో  చెప్తారు. ఈ పుస్తకాలన్నీ  చిన్నప్పుడే తమ ఇంటికి వచ్చే పౌరాణికుల సహాయంతో చదివేసిన బాల కందుకూరి ఏకసంథాగ్రాహి. చదివినది బాగా గుర్తు పెట్టుకుంటారు.
 
తమ ఇంట ఉన్న  గ్రంథాల్లో ‘వసుచరిత్ర’ లేదని, అది తను చదువుతానని తల్లి పున్నమ్మని అడుగుతారు ఒకసారి. ఆమె తెలివైన మహిళ కావడంతో, కొడుకుని ఒక ప్రశ్న వేస్తుంది. ‘నాయనా, ఆ గ్రంథం నీకు పాఠ్య పుస్తకమా?’  అని. కాదని చెప్తారు. మరి రెండు రూపాయలు పెట్టి ఇప్పుడా పుస్తకం కొనడం ఎందుకని ఆమె అందుకు అంగీకరించదు. ఆ రోజుల్లో  తల్లి,  బాల వీరేశలింగానికి  నెలకు అర్ధరూపాయి జేబు ఖర్చుగా ఇచ్చేది. ఎలాగైనా ‘వసుచరిత్ర’ చదవాలి అన్న పట్టుదల గల బాల కందుకూరి, ఆ పుస్తకాల షాపు యజమానితో,  తను నెలకు అర్థ రూపాయి ఇస్తాను అని, బదులుగా ఆ  పుస్తకాన్ని ఇక్కడే షాపులో కూచుని చదువుకునేందుకు అనుమతించాలని  కోరి, ఆ పని చేస్తూ ఉంటారు. ఇలా  షాపులో కూచుని ‘వసుచరిత్ర’ చదువుతున్న సంగతి, తను, తన స్నేహితులు ఇంట్లో తెలీనివ్వరు. కానీ  కొన్నాళ్ళకు, కొడుకు స్కూలుకి సరిగా వెళ్ళడం లేదన్న సంగతి తల్లికి తెలిసి, అడిగే సరికి, నిజం చెప్తారు కందుకూరి. తల్లి, అతనికి అప్పుడా పుస్తకం కొని ఇచ్చింది, అలా ఉండేది చదువు విషయంలో  కందుకూరి పట్టుదల.

కందుకూరి వారింట, కొన్నేళ్లకు  పెదతండ్రి మరణించాక, ఈయనే ఇంటి పెద్ద. ఇంటి వద్ద తమ నాయనమ్మ, అమ్మ, పెద్దమ్మ, తన భార్య నలుగురు స్త్రీలు. నాలుగు భిన్న స్వభావాలు, ఇవన్నీ వీరేశలింగం గారికి చిన్నతనం నుంచే అనుభవంలో ఉన్నాయి. తర్క బుద్ధి, శాస్త్రీయ వివేచన ఏర్పడుతున్న సమాజంలో  బాలుడు, యువకుడు కందుకూరి. భూత వైద్యాల మీద తగని గురి వారి తల్లి పున్నమ్మకి. ప్రజారోగ్య వ్యవస్థలు ఏవీ ఇంకా ఏర్పడలేదు, గోసాయి చిట్కా వైద్యాలు, పూతలు, భస్మాలు, రక్షరేకులు, ఇదీ  కందుకూరి బతికిన పంధొమ్మిదో శతాబ్దపు సమాజం. ఒకసారి వారి తోటలో అరటిచెట్టు సరిగా బోదె నడుమ గెల వేసింది. అలా వేసిన గెల తింటే ఇంటి యజమానికి అరిష్టం అంటే, వినకుండా, ఆ గెల బాగా  ఎదిగాక, రోజూ, ఆ గెల అయిపోయిందాకా, ఆ అరటి  కాయలే వండించుకుని తింటూ, పైగా వచ్చే పోయే వారికి అందరికీ, ఈ విషయాన్ని చెప్పి, అటువంటి అరిష్టాలు ఏమీ ఉండవు అన్న  శాస్త్రీయ దృష్టిని రోజూ ప్రచారం చేసే వారు. ఇటువంటి సంఘటనల వల్ల తెలిసేదేమిటి అంటే, యువ కందుకూరి వ్యక్తిత్వం, మూఢాచారాల పట్ల ఆయనలో ఏర్పడుతున్న వ్యతిరేకత. తాను కోరంగిలోని ఆంగ్ల పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా  చేరవల్సి వస్తే, సరిగ్గా అమావాస్య రోజునే వెళ్ళి ఉద్యోగంలో చేరుతానని బలవంతం చేసి, అలాగే పంతం నెగ్గించుకున్న యువకుడు కందుకూరి.
 
ఇవాళ మనం సీవీ రాసి ఉద్యోగాలకు దరఖాస్తుగా పంపుతున్నాము. అలానే అప్పట్లోనే ఒక పద్య రూప సీవీ రాశారు యువ కందుకూరి. వారి ఆత్మవిశ్వాసానికి ఇది ప్రతీక. ‘‘వివేక వర్ధని’’ ప్రారంభ సంచికలో ఇది అచ్చు వేశారు పాతికేళ్ళ  కందుకూరి. దీనికి అనుగుణంగానే వారి సాహిత్య, సాంఘిక జీవితం గడిచింది. ‘‘బ్రాహ్మణుడను హూణ భాష నేరిచి యందు నే బ్రవేశ పరీక్షనిచ్చినాడ  నాంధ్రమున నొకింత యభిరుచిగలవాడదేశాభివృద్ధికై లేశమైన బ్రాలుమాలక పాటుపడ నిచ్ఛ గలవాడగవితా పటిమ కొంత గలుగువాడ నోపిక సర్వ జనోపయోగములైన విషయమ్ములను, నీతి విషయములును సులభ శైలి నందరకు తెలియునట్టు కఠిన సంధులు లోనుగా గలవి విడిచివ్రాయుదు నొక్కప్పుడన్య దేశీయములను లోనుగా గల వానిని బూని గూర్తు’’  తమ ఇంటి దగ్గరి గోపాలకృష్ణ స్వామి ఆలయ విరాట్‌ పేరిట , వేణుగోపాల శతకము, మార్కండేయ శతకము తన ఇరవై రెండేళ్లకే రాశారు కందుకూరి (ఈ శతకాలు నష్టమై పోయాయి కానీ, వారి ‘అభాగ్యోపాఖ్యానం’ అనే ఆక్షేప ప్రబంధంలో ఈ  శతక పద్యం కొంత భాగాన్ని ఉదహరించారు. కానీ ఇటువంటి రచనల వల్ల ప్రయోజనం ఉండదు అని గ్రహించడానికి ఆయనకు అట్టే కాలం పట్టలేదు. 1873 కాలానికి పాతికేళ్ల కందుకూరి, నవల రాయడానికి పూనుకున్నారు. ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌ నవల ‘వికార్‌ ఆఫ్‌ ద  వేక్‌ ఫీల్డ్‌’ చదివి, దాని అనువాదం చేద్దామనుకుని, చివరికి, కొంత ప్రేరణ ఉన్నా, 1870ల్లో గోదావరి జిల్లాల జీవితం చెప్పే ఒక వాస్తవిక జీవన చిత్రణను రాయడం విశేషం.

కందుకూరి నవల ‘రాజశేఖర చరిత్రము’ను ఆయన 1874లో మొదలుపెట్టి నడిపిన ‘‘వివేక వర్ధని’’ పత్రికలోనే ధారావాహికగా అచ్చు అయింది. ఆంగ్ల సాహిత్యం బాగా చదువుతున్న కారణంగా, చదివిన పద్ధతుల్లో తానూ రచనా చేయాలన్న అభిలాష సహజంగానే యువ కందుకూరిలో ఏర్పడింది.. దానికి తగిన రచనా ప్రణాళిక, వారి ‘రాజశేఖర చరిత్రము’. ఈ నవలలోనే గోదావరి జిల్లాల జీవితం సహజ వర్ణనలతో నడిపారు. తన ప్రవర్ధమాన దశలోనే రాసిన ఈ నవలలో తొలిసారిగా సమాజంలో స్త్రీల దుస్థితి, వారి సమస్యలు, సంప్రదాయ సమాజపు వెనుకచూపు ఇవన్నీ చిత్రిస్తారు. వ్యవహరిక భాషలో 1883లో వారు రాసిన రెండో రచన ‘సత్యవతీ  చరిత్రము’ అనే నవలిక కొంచెం చదువుకున్న అమ్మాయి సత్యవతి రెండో కోడలుగా వస్తే, ఆ గ్రామీణ కుటుంబాలలో వచ్చే మార్పులు, అత్తగార్లు  తెచ్చిపెట్టే సమస్యలు చిత్రిస్తూ,  ఇలా చిన్న నవలికలో , శాస్త్రీయ దృష్టి, తర్క బుద్ధి  చదువుకున్న తరాల వారు స్వీకరించి, ఎలా పాత సమాజంతో  సంఘర్షిస్తున్నదీ  వ్యవహారిక  భాషలో  చెప్పిన తొలి కాల్పనిక వచన నవలా రచన.

మన కాలపు ఏ ప్రయాణ సాధనాలు, సమాచార సాధనాలు ఏర్పడని ఒక  పాత కాలంలో,  ఎంత మన రాజధాని అయినా మదరాసు వెళ్ళి రావడం అంటే, రైలు బళ్లు లేని కాలంలో ఓడ మీద మదరాసు వెళ్లిన పట్టుదల, శ్రమకి ఓర్చగల స్వభావం గల వాడే అయినా తల్లి చిన్నప్పుడు భూత వైద్యాల పేరిట చేయించిన అనేక స్నానాలు, చిట్కా వైద్యాల వల్ల చిన్నప్పట్నుంచీ అనారోగ్యవంతుడు. మదరాసు వెళ్ళాలి అంటే, పడవ మీద ధవళేశ్వరం నుంచి కాకినాడ వచ్చి, అక్కడ నుంచి మరొక పడవలో కాకినాడ సముద్రం లో ఉండే పెద్ద ఓడ (యాంకరేజి పోర్ట్‌ అంటారు– అక్కడ సాధారణమైన ఓడ రేవు ఉండదు ఎందుకంటే,  కాకినాడ సముద్రం సహజంగా లోతు తక్కువ)లో వెళ్లాలి. మదరాసు వెళ్లడం కోసం తన ప్రయాణ వివరాలు స్వీయచరిత్రలో చెప్తారు. అలాంటి కష్టతరమైన  ప్రయాణాల కాలంలోనే విశాల మానవ సంబంధాలు నిర్మించుకున్న బుద్ధి కుశలుడు  కందుకూరి.

రచనా ప్రతిభ – సామాజిక  దృష్టి 
1900 నుంచి 1917 దాకా మనకు మహా భారత కథను ప్రదర్శన యోగ్య నాటకాలుగా రాయడం ఒక కవిద్వయం వల్ల జరిగింది. వారే తిరుపతి వెంకట కవులు. అంతకు ముందరి  తెలుగు మహా భారత ఇతిహాస  రచన, చదువుకునే, లేదా చదివి చెప్పే పౌరాణిక పద్ధతికి చెందినది. కవిత్రయం రాసిన  చదువుకోదగిన మహా భారత తెలుగు రచన తరువాత,  చూసే వారి కోసం మహా భారత నాటక రచనోద్యమం చేసిన కవిద్వయం తిరుపతి వెంకట కవులు, అయితే వీరి ప్రామాణిక  కృషికి ముందరే, కందుకూరి, తొలిసారిగా, మహాభారత కథ తీసుకుని ‘‘దక్షిణ గోగ్రహణము’’ అన్న నాటకం రాశారు.  నాటకాలు రాయడం వీరికి శక్తివంతంగా అలవడ్డది.

గురజాడ, కందుకూరి కన్నా  పద్నాలుగేళ్లు చిన్నవారు. పద్నాలుగేళ్లు తరువాత పుట్టి, కందుకూరి కన్నా నాలుగేళ్లు ముందరే కన్ను మూసిన గురజాడ ఆధునిక సాహిత్య వైతాళికత్వానికి ఉదాహరణ అయిన  తన  1892 కన్యాశుల్కం నాటకంలో ముందు మాటలోనే కందుకూరి వారి నాటకం (1876–80)  బ్రాహ్మ వివాహము లేదా పెద్దయ్యగారి పెళ్లి ని  ప్రస్తావించి, ఆ నాటకానికి, తన నాటకానికి పోలికలు లేవు అంటారు. కానీ తొలి కన్యాశుల్కం వరకూ చూస్తే, ఇద్దరికీ సమాన దృష్టి వేశ్యా వ్యతిరేకత. వేశ్యలు ఉండకూడదు అన్నది కందుకూరి జీవితకాల దృష్టి, అయితే వేశ్యలు సంఘంలో ఏర్పడే క్రమాన్ని మార్చే శక్తి వారికి లేదు. ఆ వృత్తిలో స్త్రీలు ఉండరాదు అన్నది వారి దృష్టి కాగా, మొదటి కూర్పు కన్యాశుల్కంలో ఇంచు మించు గురజాడ దృష్టి కూడా అదే.

ప్రసంగాలు, ప్రదర్శన  రచనలుగా, నాటకాలు, ప్రహసనాలు, తన సొంత రచనలే కాక ప్రాచీన భారతీయ, పాశ్చాత్య సాహిత్యం నుంచి కూడా అనువాదాలు చేసిన తీరిక లేని రచయిత కందుకూరి.  కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, శ్రీ హర్షుని రత్నావళి, షేక్సి్పయర్‌ నాటకాలు, షేక్సి్పయర్‌ నాటకాలకు చార్లెస్‌ అండ్‌ లాంబ్‌ దంపతులు కథలుగా రాసిన వాటికి తెలుగు అనువాదాలు, ఆర్‌. బి. షెరిడన్‌ నాటకాలు, విలియం కౌపర్‌ కవిత్వం,  జొనాథన్‌ స్విఫ్ట్‌  గలివర్‌ ట్రావెల్స్‌ ఆధారంగా సత్యరాజా పూర్వ దేశ యాత్రలు,  జాన్‌ అక్సేన్‌ ఫర్డ్, చార్లెస్‌ షెల్బీ కామెడీ నాటికలకు ప్రహసన రూప తెలుగు అనువాదాలు,  సంప్రదాయ ధిక్కారం చేసే అభాగ్యోపాఖ్యానం, సరస్వతీ నారద విలాపము, మహారణ్య పురాధిపత్యము,  ఏసప్‌ కథలు, ఇలా ఇటు భారతీయ, అటు ప్రపంచ సాహిత్య చదువరిగా, రచయితగా కందుకూరి సృజన,  ధారణ, పాండిత్యం అపారం. ఆధునిక తెలుగు వచన వికాసానికి  పలు రంగాలలో పునాదులు వేసిన కారణంగా, కందుకూరి వారిని, పింగళి లక్ష్మీకాంతం గారు గద్య తిక్కన అని పిలిచారు. పద్యానికి  పదమూడో శతాబ్దంలో తిక్కన చేసిన విశేష సేవ పదిహేను పర్వాల మహాభారతంలో వేల పద్యాలుగా ఉన్నది.  మళ్లీ అయిదు వందల ఏళ్ల తరువాత, పంతొమ్మిదో శతాబ్దంలో అవసరమైన వచన రచనా ( సాహిత్య, సామాజిక, పత్రికా, వ్యవహారిక, నాటక రంగాలలో) వికాసానికి అంతటి కృషి చేసిన వారిగా  కందుకూరిని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గౌరవించి ఇలా సంబోధించారు.
 
అందుకే, వందకు పైగా వారి సమగ్ర రచనల్లో పద్య కావ్యాలు, అనువాద పద్య కావ్యాలు, నాటకాలు, ప్రహసనాలు, ఆంగ్ల నాటకానువాదాలు, నవలలు, కథా రచన, పత్రికా నిర్వహణ,  వ్యాసాలు, ఆరోగ్య సంరక్షణ సూత్రాలు, కవుల చరిత్ర, జీవిత చరిత్ర, సాహిత్య విమర్శ,  చిన్నయ సూరి రచించిన  సంధి,  విగ్రహము, వ్యాకరణం సరళ తెలుగు సేత,  దేశ చరిత్రలు, తెలుగు వాచకాలు, లక్షణ గ్రంథాలు, శాస్త్రీయ  విషయ రచనలు – ఎటు చూసినా కందుకూరి ఆలోచన, ఆధునికత, అభ్యుదయ ముద్రలు కనిపిస్తాయి.

కందుకూరి – గురజాడ  
నాటక సాంఘిక వచనానికి ఆద్యులుగా  గురజాడని  స్వీకరించడం చేయాల్సి ఉంది. వచన నవలా రచనలో కందుకూరి  1883కి రాసిన సత్యవతీ చరిత్రంలోనే  చెప్పికోదగ్గ  వ్యవహరిక భాష ఉందని, మనం ఇప్పుడు చెప్పాలి.  అంతకు  పదేళ్లు ముందరే వెలువడిన , కందుకూరి వారి  సాంఘిక నాటకాలు అయిన  ‘బ్రాహ్మ  వివాహము లేదా పేరయ్యగారి పెళ్లి’లో గానీ,  ‘వ్యవహార ధర్మ  బోధిని’లోని సాంఘిక నాటక వచనాన్ని, అలాగే సాంఘిక నవలల్లో ( ముఖ్యంగా  1883 నాటి సత్యవతీ చరిత్రములో కందుకూరి భాష) వీటిని మనం సక్రమంగా పరిశీలిస్తే, 1940ల నుంచీ  మనం ఏర్పరచుకుంటూ వచ్చిన గురజాడ అంటే సాహిత్య ఆధునికత, కందుకూరి అంటే సాంఘిక సంస్కరణ అన్న మూస ఆలోచన పద్ధతులు అంత సరైనవి కావు అని తెలుస్తుంది.
 
ఇక గురజాడ వారికి కందుకూరి పట్ల గౌరవ భావం ఉన్నది. అందుకే కన్యాశుల్కం నాటకం మొదటి అంకంలోనే వెంకటేశం వేసంగి సెలవుల్లో చదువుకోవడానికి ఉపవాచకంగా ‘రాజశేఖర చరిత్రము’ గిరీశం డిక్టేషన్‌ ఇచ్చిన పుస్తకాల జాబితాలో ఉంటుంది. ఇక వీరయ్య గారు, రాజమంద్రంలో వితంతువుల మఠం, వంటి  ప్రస్తావనలు కూడా గురజాడ నాటకంలో కనిపిస్తాయి. 1892 కన్యాశుల్కం నాటకం కన్నా ముందరే, కందుకూరి వారి బ్రాహ్మ వివాహము, అలాగే  కోర్టు కెళ్లే న్యాయవాదుల వంచనా వ్యవస్థను వ్యవహార ధర్మ బోధిని (1879–80)లో స్పష్టమైన వ్యవహరిక భాషలో చెప్పారు కందుకూరి. నిజానికి, కందుకూరి రాసిన బ్రాహ్మ వివాహము, వ్యవహార ధర్మబోధిని నాటకాలలోని ఘట్టాలే, కొంత కలిసిపోయి గురజాడ సృజనలో కొత్త వెలుగులతో, కన్యాశుల్కం నాటకంలో కనిపిస్తాయి. ‘ఆబోరు’ వంటి మాటలు ఇద్దరి నాటకాల్లోనూ ఉన్నవి. ( ఈ మాటకి అర్థం చాలాకాలం ఎవరూ చెప్పలేక పోయారు. ఇది  ‘ఆబ్రూ’ అనే హిందూస్తానీ మాట, దీని అర్థం ప్రతిష్ట, గౌరవం అని). ఒకప్పుడు నవాబులు పాలించిన దృష్టాంతాలుగా, భారత దేశపు అనేక భాషల్లో మనకు హిందూస్తానీ పదాలు ఇలా కలిసిపోయి కనిపిస్తాయి. గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఈ వాడుక ఇప్పటికీ ఉన్నది.

కావ్యవాది – కార్య వాది  కందుకూరి  
ఈ రచనలు జరుగుతున్న కాలానికే, పసితనంలో ఆడపిల్లల పెళ్లిళ్లు, ముసలి భర్తలు కొద్ది కాలంలో చనిపోవడంవల్ల సమాజంలో ఏర్పడే బాల వితంతువుల సమస్య కందుకూరి వారి మనసులో ఒక పరిష్కారం దిశగా రూపం తీసుకుంటున్న సంగతి తెలుస్తుంది. రచనా రూపంగా సంస్కరణ కోరడం  వీరేశలింగం గారి స్వభావంలో ఒక భాగం మాత్రమే. అసలు విషయం కార్యాచరణ. 1879  సంవత్సరంలో  ఆగస్ట్‌ 3,  అక్టోబర్‌ 12 తేదీల్లో,  రాజమండ్రిలో గల విజయనగరం మహారాజావారి బాలికా పాఠశాలలో,  ‘‘అతి బాల్య వివాహము’’ విషయంపై  పిల్లల వయసు రీత్యా ఎందుకు చేయకూడదో చెప్పడమే కాక, అవి శాస్త్ర సమ్మతం అని చెప్పే వారికి, కాదు అంటూ, ఆ శాస్త్రాల నుంచే ఎన్నో ఉదాహరణలు చూపి, ఛాందస  సమాజానికి గొంతులో వెలక్కాయ పడ్డ ప్రసంగం చేశారు, ముప్ఫైఒక్కేళ్ళ కందుకూరి.

ఈయన కేవలం భావ విప్లవం మాత్రమే కాకుండా, ఆచరణ శీలి కూడా కావడం వల్ల సంస్కరణ ప్రణాళిక  వేగం పెరిగింది. ఇదే 1881లో  కందుకూరి రాజమండ్రి ఇన్నీసు పేటలో బాలికా పాఠశాల  స్థాపించారు. ఒక నాటక సమాజం మొదలు పెట్టి, అంతకు ముందు ధార్వాడ నాటక సమాజం వారు ప్రదర్శించిన చోటనే,  ‘చమత్కార రత్నావళి’ రచించి, ప్రదర్శనలు చేయించారు. తెలుగు ప్రాంతాల్లో తొలి నాళ్ల నాటక ప్రదర్శనల్లో ఇవి భాగం. ఇదే  ఏడాది  డిసెంబర్‌ 11న కందుకూరి తమ మిత్రులతో కలిసి,  దక్షిణ భారత దేశంలోనే తొలి వితంతు వివాహం చేశారు. సానుకూల భావనలున్నా, మదరాసు అంటే ఉమ్మడి మదరాసు రాష్ట్ర రాజధానిలో కూడా, వితంతు వివాహం జరిపించే సాహసం ఎవరికీ లేదు.  అటువంటి పరిస్థితుల్లో,  సంఘ సంస్కరణ గోదావరిగా రాజమండ్రిని, యావత్‌ దక్షిణ భారత దేశానికే మార్గదర్శకంగా నిలిపారు కందుకూరి. వారి పట్టుదల, చిన్నప్పుడు తల్లి వీలు కాదన్న పుస్తకం ఎలా అయినా  చదివినట్టే, వద్దన్న అరటికాయలు మొత్తం గెల అంతా తానే తిన్నట్టే, ఈ వితంతు వివాహాల విషయంలో కూడా వారిది అంతే మంకు పట్టు.

బాల్య వివాహాలు చేయవచ్చు, వితంతు వివాహాలు చేయరాదు అనే సంప్రదాయ సమాజనికి  వాదానికి వాదంతో, వేదాలు, పురాణాలు, స్మృతులు, శ్రుతుల నుంచే ఎలా ఈ బాల్య వివాహాలు కూడదో,   వితంతు వివాహాలు సంప్రదాయ సమ్మతమో చెప్పడంలో, కందుకూరి, అక్కడ బెంగాల్‌ సమాజంలో, మన తెలుగు నాటకన్నా దశాబ్దాల ముందే ఈ వివాహాలు జరిగినప్పుడు, అక్కడ రాజా రామ్‌మోహన్‌ రాయి, ఈశ్వర చంద్ర విద్యా సాగర్‌ వంటి వారు ఉదహరించిన భారతీయ ప్రాచీన రచనలైన  మనుస్మృతి,   పరాశర çస్మృతి, యాజ్ఞవల్క్య çస్మతృతి నుంచి ఉదాహరణలు ఇచ్చారు.

ఇంత మౌలిక ప్రతిఘటన ఓ పక్క జ్ఞానపరంగానూ, మరోపక్క ఆచరణపరంగానూ ఎదుర్కోవడం, తెలుగు సంప్రదాయ సమాజానికి సాధ్యం కాలేదు. మొదటి వితంతు వివాహం జరిగిన మూడు రోజులకే రెండో వితంతు వివాహం, మూడో వివాహం అక్టోబర్‌ 1882లో జరిపిన కార్య ధీర శూర వీరేశలింగం, ఏ మహారాజో,  సేనానో, యుద్ధ  వీరుడో కాదు,  కేవలం సామాన్య తెలుగు పండితుడు. అదీ  మనం ఇవాళ చూస్తున్న చిత్రంలోని వయసుమళ్లిన  మనిషి కారు– తను ముప్ఫై మూడేళ్ళ నిండు యవ్వనుడు. అక్షర వ్యూహాలు పేర్చి, సమాజ దుష్ట శక్తులను ఎదుర్కొన్న సాంఘిక పోరాట తంత్రజ్ఞుడు.

రాజ్యలక్ష్మమ్మ గారి సహచర్యం  
ఈ సాంఘిక పోరాటంలో, భర్తకి  తగిన భార్య రాజ్యలక్ష్మమ్మగారు. తన భర్త చేస్తున్నది సమాజ హితం కోసం అని ఎరిగిన ఆమె బంధువుల బెదిరింపులు, బహిష్కారాలు, ఆంక్షలు లక్ష్య పెట్టలేదు. ఆమె పట్ల కందుకూరి వారికి చాలా గౌరవం. జీవితకాల కృషిలో అడుగులో అడుగు వేసి నడిచిన వీరిద్దరికీ పిల్లలు లేరు. ఆయనకి అన్నివిధాలా దన్నుగా నిలిచిన రాజ్యలక్ష్మమ్మ  1910లో కన్ను మూశారు. అది వీరేశలింగం గారికి తీరని నష్టం. ఆమె సమాధి తన  సమాధి కన్నా ఎత్తుగా ఉండాలని అలా కట్టించి, అక్కడ ఆమెకి ఇష్టమైన పూల మొక్కలు పెంచిన  ప్రేమపూర్ణుడు  కందుకూరి. తన స్వీయ చరిత్రను ఆయన ఆమెకే అంకితం ఇచ్చారు.

ఆ అంకిత రచన చాలు ఆయన హృదయంలో ఆమె స్థానం ఏమిటో  తెలియచెప్పడానికి. ( వారి చేతి రాతలోనే  దీనిని  పొందు పరుస్తున్నాను). ‘‘నేను చేసిన సమస్త ప్రయత్నములలోను ఛాయ వలె నాతోడ ఉండి నన్ను ప్రోత్సాహపరచుచు ధర్మ మార్గానుసరణమునందు నా తోడ గూడ సకల కష్టములను సంతోషపూర్వకముగాసహించుచు సత్యమైన సహధర్మచారిణియయి తల్లి బిడ్డకు వలె నవ్యాజానురాగము తోడసహస్ర హస్తములతో సదా నాకు సంరక్షణము చేయుచు ఏబది సంవత్సరముల కాలము నా ప్రాణమునకు ప్రాణమయి యుండిన నా యర్ధాంగ లక్ష్మి యైన రాజ్యలక్ష్మికి దీనిని నేనంకితము చేయుచున్నాడను’’జాతీయ సాంఘిక సంస్కరణ మహాసభలు 1885లో జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడినాక, సాంఘిక సంస్కరణ, రాజకీయ స్వాతంత్య్రం కన్నా ముందే  అవసరం అన్న  చైతన్యం దేశం ఎల్లెడలా ఏర్పడసాగింది.

ఇలా అఖిల భారత సాంఘిక పరిస్థితులు  చర్చించిన జాతీయ సంస్కరణ మహాసభలు 1889లో మొదలై, దేశంలో పలు ముఖ్య నగరాలలో జరుగుతూ వచ్చాయి. జస్టిస్‌ మహదేవ్‌ గోవింద్‌ రనడె, జస్టిస్‌ కె. టి. తెలాంగ్, బాబు నరేంద్రనాథ్‌ సేన్,  డా. మహేంద్రలాల్‌ సర్కార్,  జి.ఎస్‌. ఖర్పడే,  జస్టిస్‌ ఎస్‌. సుబ్రహ్మణ్య అయ్యర్‌ , ఆర్‌.జి.భండార్కర్, రావుబహదూర్‌  వామనరావు ఎం. కోలాత్కర్‌ , రాయ్‌ బహదూర్‌ లాలా బైజ్‌ నాథ్, మన్‌మోహన్‌ ఘోష్,  జస్టిస్‌ ఎం..జి. చందావర్కర్‌ వంటి జాతీయ స్థాయి సంస్కరణరంగ నాయకులు పాల్గొన్నారు. వారితో కలిసి పనిచేశారు కందుకూరి. సోషల్‌ రిఫార్మ్‌ కాంగ్రెస్‌ వార్షిక మహాసభలు 1898లో మద్రాసులో జరిగాయి. ఆ మహాసభలకు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ కందుకూరి, మదరాసుకు వచ్చిన తెలుగేతర భిన్న ప్రాంతాల  సంస్కరణోద్యమ నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి ఇంగ్లిష్‌లో ప్రసంగం చేశారు. శాస్త్రీయ ఆవిష్కరణల కన్నా, సాంఘిక సంస్కరణ చాలా కష్టమైనది అన్న ప్రధాన అభిప్రాయం ఈ ఆంగ్లోపన్యాసంలో కందుకూరి తెలిపారు. ఇంతవరకూ ఇలా ఒక ఆంగ్ల ప్రసంగం  కందుకూరి వారు చేసినది ఒకటి ఉన్నది అన్నది బయటికి రాలేదు. కందుకూరి శతవర్ధంతి  కృషిలో భాగంగా, మొజాయిక్‌ సాహిత్య సంస్థ పరిశోధనలో ఇది లభించింది. ఈ ఏడాదే, కందుకూరి వారి ఈ నూత్న లభ్య  రచన, ఆంగ్ల మూలమూ, తెలుగు అనువాదమూ కూడా పత్రికలలో ప్రచురితమయ్యాయి.

సమగ్ర రచనలు – గౌరవాలు 
తన యాభై ఏళ్ల వయసుకే, తన సమగ్ర రచనలు, పది సంపుటాలుగా ప్రచురించి, దీని కోసమై మదరాసులో రెండేళ్లు కాలం ఉద్యోగానికి సెలవు పెట్టి గడిపి, ఈ సమగ్ర సంపుటాన్ని ఆ రోజుల్లో పదిహేను  రూపాయలకు విక్రయం చేసేవారు ఆయన. తెలుగు పండితుని నెల జీతం ముప్ఫై రూపాయలు కాగా, తన  రచనలు పత్రికల తపాలా ఖర్చులకు అంత సొమ్మూ,  ప్రతి నెలా వారికి ఖర్చు అయ్యేది. 1893కే వారికి  రావు బహదూర్‌ బిరుదు లభించింది. 1898లో  ‘దక్షిణభారత  విద్యాసాగరులు’ అని జస్టిస్‌ రనడె, ఇతర  సంఘ సంస్కర్తలు, సోషల్‌ రిఫార్మ్‌ జాతీయ మహాసభల్లో  కందుకూరి వారికి బిరుద ప్రదానం చేశారు.

తన కాలపు సాహిత్యంలోనే తన ప్రస్తావనలు   
1899 నుంచి 1904 వరకూ రాజమండ్రి నుంచి బదిలీ మీద వెళ్లి,  మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో   తెలుగు పండితునిగా పని చేశారు. కందుకూరి ప్రస్తావనలు తన కన్యాశుల్కం నాటకంలో గురజాడ వారు చేయగా, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి, ఏకంగా, కందుకూరి, రాజ్యలక్ష్మమ్మ దంపతులను వారి జీవితకాలంలోనే, సజీవ పాత్రలుగా, తన అసంపూర్తి నవల ‘చంద్రిక కథ’లో 1900 ప్రాంతాల్లో రాయడం  విశేషం. దీన్ని 1970 ప్రాంతాల్లో తెలుగు సాహిత్య పరిశోధకుడు బంగోరె తన మిత్రులతో కలిసి తెలుగు అనువాదం చేసి అందించారు. ఇలా ఇటు తెలుగు మహాకవి గురజాడ తన కన్యాశుల్కంలోనూ, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి తన చంద్రిక కథలోనూ వీరేశలింగంగారి ప్రస్తావనలను వారి  జీవితకాలంలోనే చేశారు. ఇటువంటి గౌరవం, ప్రపంచ సాహిత్యంలోనే అరుదు.

కడపటి దశ                                
హితకారిణీ సమాజం ట్రస్ట్‌ డీడ్‌ రాయడం, తన యావదాస్తినీ ట్రస్ట్‌కి అప్పగించడం అనారోగ్యం, ముసలితనం, కొన్ని కోర్ట్‌ కేసులు ఇలా సతమతమవుతూ ఉన్నా, కవుల చరిత్ర ప్రచురణ, వారికి పట్టుదలతో కూడిన లక్ష్యం. ఈ లక్ష్యం కోసం పని చేస్తూనే, వారు వెళ్ళిపోయారు. మదరాసు పరసువాక్కంలో వేదవిలాస్‌ అని కొమర్రాజు లక్ష్మణరావుగారిల్లు. ఎప్పుడు కందుకూరి వారు మదరాసు వెళ్లినా వారి బస అక్కడే. యువకులైన కొమర్రాజు కూడా తెలుగు సాంఘిక చరిత్రలో చాలా ఆసక్తి గల వారు. కవుల చరిత్ర మూడో భాగం ప్రూఫులు సరి చూస్తూ,  కందుకూరి, 27 మే 1919న మదరాసులోనే  కన్ను మూశారు. మరణ సమయంలో వారి వద్ద ఉన్నది, మృతి ప్రకటన చేసినది డాక్టర్‌ అచంట లక్ష్మీపతి.  అంత్య క్రియల సమయాన దగ్గర ఉన్నది అప్పటికి యువకులైన కాశీనాథుని నాగేశ్వర రావు, అక్కిరాజు  ఉమాకాంత విద్యా శేఖరులు తదితర మదరాసు తెలుగు ప్రముఖులు.

శతవర్ధంతి ఉత్సవాలు  
ఇక వర్తమానానికి వస్తే, విశాఖలో మొజాయిక్‌ సాహిత్య సంస్థ, ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ కల్నల్‌ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు మద్దతుతో ఈ శతవర్ధంతి ప్రారంభ సభలు గత సంవత్సరం మే 27న  పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సాహిత్య వేత్తలతో ఒకరోజు సభగా జరిపింది. సాహితీ స్రవంతి  రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఇతర నగరాల్లో కందుకూరి వైతాళిక పాత్రకు గుర్తింపుగా శతాధిక సంస్థల సమన్వయంతో భారీ సభలు నిర్వహించారు. చెన్నై తెలుగు వాణి పేరిట,  చెన్నైలోని తెలుగు సమాజం ఈ శతవర్ధంతి తమ కర్తవ్యం అని కూడా భావించి, ఈ  విశాఖ సభలకు  వచ్చిన డా. తూమాటి సంజీవరావు, తమ సంస్థ అధ్యక్షులు తిరునగరి భాస్కర్‌ తదితర మిత్రులతో కలసి కృషి చేసి, ఈ వర్ధంతి సంవత్సరంలో, పుదుచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్నారావు, పుదుచ్చేరి ప్రభుత్వం పాక్షిక ప్రోత్సాహంతో,  దాదాపు  కందుకూరి వారి గురించిన సమాచారం అలభ్యంగా ఉన్న రోజుల్లో, ఏడువందల యాభై పేజీలుగా  రెండు పుస్తకాలుగా విçస్తృత సమాచారాన్ని అందుబాటులోని తెచ్చారు. వీటిలో మొదటి పుస్తకం చెన్నైలో గత ఏడాది అక్టోబర్‌లో విడుదల కాగా, రెండో పుస్తకం, ఈ ఏడాది మే 25న విడుదలైంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు, లక్ష రూపాయల చొప్పున కందుకూరి శత వర్ధంతి సభలు జరపడానికి  నిధులు అందజేసింది. కేంద్ర సాహిత్య అకాడెమీ, విశాఖలో మొజాయిక్‌ సంస్థ ద్వారా కందుకూరివారి కృషి గురించిన లిటరరీ ఫోరం నిర్వహణకు సహకారం అందించారు. ఈ ఏడాది జూన్‌ 1న సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీ,  మొజాయిక్‌ సాహిత్య సంస్థ నిర్వహణలో జరిగే శతవర్ధంతి ముగింపు సభలో, విశాఖలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.  రాయన గిరిధర్‌ గౌడ్‌  గీసిన చిత్రపట ఆవిష్కరణ, కందుకూరి శతవర్ధంతి చిత్రమాల, సత్యవతీ చరిత్రం ఆంగ్లానువాదం ఆవిష్కరణలు, కందుకూరి ఏకాంకిక ‘అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం’ ప్రదర్శన ఈ సభలో  చోటు చేసుకుంటున్నాయి.

కొత్త అంచనాల అవసరం 
స్త్రీల పట్ల తండ్రి ప్రేమతో, తల్లి మనసుతో కందుకూరి తన సమస్త రచనల్లో వారి విద్య,  చక్కని పెళ్లి,  తల్లి, బిడ్డల భద్రత, సంఘంలో మూఢాచారాల వల్ల వారి అభివృద్ధికి కలిగే అవరోధాల పట్ల ఆగ్రహం, అలాగే భాషకి, భావాలకు శాస్త్రీయత నేర్పిన పునరుజ్జీవన ప్రదాతగా మనం కందుకూరి వీరేశలింగాన్ని దర్శించాలి.    కందుకూరి అంటే ఒక సంస్కరణ మూస, గురజాడ అంటే సాహిత్య మూసగా, మనం దాదాపు 1940ల నుంచి ఆలోచనలు చేస్తున్న తీరులో మార్పు అవసరం ఉన్నది. నరహరిసెట్టి గోపాలకృష్ణమ్మగారిలా  శ్రీ రంగరాజ  చరిత్ర (1872) పేరిట, ఒక నవల రాసిన వారో, కవి  జీవితములు (1893) ముందు రాసిన గురజాడ శ్రీరామ మూర్తి గారో, ఏదో  ఒక రంగంలో తప్పక  కందుకూరి కన్నా ముందుగా అడుగులు వేసి ఉంటారు. ఎందుకంటే, ఇది పలు ప్రతిభలు ఏక కాలంలో పనిచేసే మానవ సమాజం కాబట్టి. 

కానీ, కందుకూరి వారిలా, భిన్న రంగాలలో (పద్యం, ప్రహసనం, నవల, అనువాదం, జీవిత చరిత్ర, విద్యాలయాల స్థాపన, మహిళలకు ఆరోగ్య బోధినులు, కవి చరిత్రలు, వ్యాకరణ పరిష్కరణం, తెలుగు, ఆంగ్ల ప్రసంగాలు, పత్రికా రచన, సంపాదక ప్రచురణ కర్త బాధ్యతలు, నాటక ప్రక్రియకు తొలి అడుగులు, తర్క చింతన, శాస్త్రీయ దృష్టి,  బ్రహ్మ సామాజికునిగా ఏకేశ్వరోపాసన, భాష ఆధునీకరణ, సాంఘిక సంస్కరణ కార్యాచరణ, తొలి వితంతు వివాహాలు, అంతే కాక ఆంగ్లానువాదం జరిగి లండన్‌ సమాజం  మెచ్చుకున్న తొలి భారతీయనవల ‘రాజశేఖర చరిత్రం’ ( 1878లోనే  ‘ఫార్చ్యూన్స్‌ వీల్‌’ పేరిట అన్న ఖ్యాతి కూడా వీరిదే)  సమాజాన్ని  ఇలా సమూలంగా ప్రభావితం చేసిన వ్యక్తులు అరుదు. కందుకూరి వారి సమాజ సంక్షేమకర భావనలకు, ఆచరణకు, వందేళ్ల కాలం గడిచిన సందర్భంలో, నేడు కొన్ని కొత్త సమస్యలు వచ్చినా, ఆన్ని రంగాలలో వారు ఆశించిన  ప్రగతి నెలకొన్నది. అందుకే విజయవంతమైన వారి భావాచరణలకు సమాజం జయమాల సమర్పిస్తున్నది. వారు కన్నుమూసిన ఈ శతాబ్ది కాలంలో, వారికి నివాళి అర్పించని తెలుగు సాహితీవేత్త, సాంఘిక ప్రముఖులు లేరు. అదీ కందుకూరి ప్రజాస్వామిక స్వభావం.

ఆ విధంగా  కందుకూరి తన  సమూల కార్యాచరణ ద్వారా తెలుగు వారికి  పునరుజ్జీవన ప్రదాత. వారి శతవర్ధంతి సందర్భంగా వారు ప్రాతః స్మరణీయులు అని తలచి, రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో వారి   అధీకృత  (అఫిషియల్‌) ఛాయాచిత్రాన్ని ఏర్పరచి, విద్యార్థులకు నిరంతర స్ఫూర్తి, అలాగే వారి సర్వ రచనల పునర్ముద్రణ, ఆ రచనలపై జరిగే పరిశోధనలకు తగిన సహాయం అందించే సానుకూల దృక్పథంతో  తెలుగు ప్రజలు, ఎన్నికైన ప్రభుత్వాలు పని చేస్తే, ఉత్తమ సామాజిక చైతన్యం నేటి తరాలకు అందడానికి మంచి మార్గం ఏర్పడుతుంది.  – రామతీర్థ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement