నవ్యతా ప్రయోక్త, సంస్కర్త, శతాధిక గ్రంథకర్త కందుకూరి వీరేశలింగం పంతులు సాహితీ ప్రీతితో, సంస్కరణ దృక్పథంతో స్పృశించని శాఖలేదు.. చేపట్టని ప్రక్రియలేదు. ఆయన ప్రజ్ఞ బహుముఖాలుగా విస్తరించింది. ఆంధ్ర సాహిత్యంలో కవుల చరిత్రలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్ర, శాస్త్ర వాజ్మయాది ప్రక్రియలన్నింటికీ ఆద్యులయ్యారు. సాహిత్యాన్ని ఆయన సంఘ సంస్క రణకు ఉపకరణంగా చేసుకున్నారు. ఆనాటి సంఘంలో గూడు కట్టుకొన్న మూఢాచారాలను పారద్రోలారు.
తెలుగు నాటకరంగం దినోత్సవ నేపథ్యం..
తెలుగు నాటకరంగానికి వీరేంశలింగం కృషి గణ నీయమైంది. 19వ శతాబ్దిలో బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, కన్యాశుల్కం, అంటరానితనం, వేశ్యావృత్తి వంటి దురాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. అప్పట్లో సామాజిక చైతన్యంతో, సంస్కరణ దృక్పధంతో ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు శ్రవ్యకావ్యాల కంటే నాటకాలు శక్తివం తమైనవన్న ఆలోచనతో వీరేశలింగం 16 నాటకాలను రచించారు.
వీరేశలింగంగారి నాటకాల్లో బ్రాహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, అభిజ్ఞాన శాకుంతలం, సత్యహరిశ్చంద్ర, రత్నావళి వంటివి ప్రసిద్ధాలు. బ్రాహ్మ వివాహం నాటకం ఆయనకు మంచి పేరును తెచ్చింది. ఈ నాటకంలో ముక్కుపచ్చలారని బాలికను, కన్యాశుల్కానికి ఆశపడి ముసలివాడికిచ్చి పెళ్లి చేయడాన్ని అధిక్షేపించారు. ముసలివాళ్ల పెళ్లి ఆశను అవహేళన చేసి ప్రేక్షకుల కళ్లు తెరిపించారు. డబ్బు కక్కుర్తితో కన్యాశుల్కానికి ఆశపడి పిల్లల జీవితాలను నాశనం చేసే తల్లిదండ్రులను, పెళ్లిళ్ల పేరయ్యలను తీవ్రంగా నిరసించారు. వీరేశలింగంకి పేరు తెచ్చిన మరో నాటకం వ్యవహార ధర్మబోధిని. ఈ నాటకంలో న్యాయాధికారుల అవినీతిని, న్యాయవాదుల మోసాలను, వాదిప్రతివాదుల దుశ్చర్యలను బట్టబయలు చేశారు.
తెలుగు నాటకరంగం దినోత్సవంపై 2000లో పెద్ది రామారావు యవనిక త్రైమాసిక పత్రిక ద్వారా చర్చలు జరిగాయి. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలుగు నాటకరంగం దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం అవసరం అన్న ఆలోచన నాటకరంగ కళాకారులు, విమర్శకుల్లో కలిగింది. వ్యవహారిక భాషలో నాటకాలు రాసిన తొలినాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడు, నాటక సమాజ స్థాపకుడైన వీరేశలింగం జయంతిని ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగం దినోత్సవంగా ఏర్పాటు చేయాలని నాటకరంగం ప్రముఖులంతా ఏకాభి ప్రాయానికి వచ్చారు. కొన్ని నాటక రంగం సంస్థలు 2001 నుంచి వీరేశలింగం జయంతిని తెలుగు నాటకరంగం దినోత్సవంగా జరిపారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డాక్టర్ కేవీ రమణాచారి నాటక కళాకారుల అభిమతం మేరకు వీరేశలింగం జయంతిని తెలుగు నాటకరంగం దినోత్సవంగా గుర్తించాలని 2007 మార్చిలో ప్రస్తావించారు. వైఎస్సార్ వెంటనే స్పందించి 2007 మార్చిలో వీరేశలింగం దినో త్సవాన్ని ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటకరంగం దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్వర్తులు జారీ చేశారు. 2007 ఏప్రిల్ 16న ప్రభుత్వం అధికారికంగా తొలిసారిగా తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించింది. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నాటక రంగంలో విశేష కృషి చేసిన కళాకారులకు సన్మానాలు, జిల్లా, రాష్ట్రస్థాయి పురస్కారా లతో సత్కరించాలని తీర్మానించారు. ప్రముఖ నాటక కళాకారుల జయంతి, వర్ధంతులను నిర్వహించి ప్రజల్లో నాటకకళ పట్ల ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో తెలుగు నాటకరంగ దినోత్సవం ఆవిర్భ వించింది. కరోనా తగ్గిన తర్వాత తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలు నాటక రంగ దినోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించగలవని ఆశిద్దాం..!
డాక్టర్ పీవీ సుబ్బారావు
వ్యాసకర్త సాహితీ విమర్శకులు
మొబైల్ : 98491 77594
Comments
Please login to add a commentAdd a comment