devaraju maharaju
-
తగిన గుర్తింపునకు నోచని ప్రజ్ఞాశాలి
కొందరు నిజాయతీగా సమా జానికి పనికొచ్చే రచనలు చేస్తారు. అటువంటి అరుదైన, విలువైన రచయిత కొడవటి గంటి రోహిణీ ప్రసాద్. అరవై మూడవ యేట అనూహ్యంగా 2012 సెప్టెంబర్ 8న బొంబాయిలో కన్నుమూసి, తెలుగు జాతికి దిగ్భ్రాంతిని కలుగ జేసిన ఆయన కృషి చిరస్మరణీయం.బాల్యంలో తండ్రి కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.) కల్పించిన వాతావరణం వల్ల రోహిణీ ప్రసాద్ పుస్తకాల వైపు, హేతువాద దృక్పథం వైపు, శాస్త్రీయ అవగాహన వైపు ఆకర్షితులయ్యారు. కానీ, సంగీతం వైపు, నాట్యం వైపు, అనువాదాల వైపు ఆకర్షితులు కావడం ఆశ్చర్యంగా తోస్తుంది. విశాఖలో చదువుకునే రోజుల్లో రోహిణీ ప్రసాద్ కర్ణాటక సంగీత వాయిద్యం వీణ నేర్చుకోవాలి. కానీ, ఆయన హిందుస్తానీ సంగీత వాద్యం – సితార్ నేర్చుకున్నారు. తర్వాత ముంబ యిలో ఉన్నప్పుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ శిష్యరికం చేసి సితార్ వాదనంలో ప్రావీణ్యం గడించారు. ముంబయిలో అక్కడి తెలుగువారితో కలిసి కూచిపూడి, భరత నాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలు కలగలిపి ‘కృష్ణ పారిజాతం’ బ్యాలేకు రూపకల్పన చేశారు. ఈ అణు భౌతిక శాస్త్రవేత్త ముంబాయిలో సితార్ కచేరీలు చేయడం మామూలై పోయినా, 1990లలో అమె రికాలోని పలు నగరాలలో తన కళా ప్రదర్శనలు కొన సాగించడం, సితార్ వాద్య కళాకారుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారని తెలిసినప్పుడు ఆశ్చర్య పోతాం. అంతేకాదు, రాగాల గూర్చి, సంగీత వాద్య పరికరాల గూర్చి ఎన్నో విలువైన వ్యాసాలు రాశారని తెలిసినప్పుడు మనసు ఉప్పొంగిపోయినా, వెంటనే చివుక్కుమంటుంది. అయ్యో! ఈయనకు రావాల్సిన గుర్తింపు రాకపోయెనే అనీ! తనకు సన్నిహితంగా తెలిసిన హిందుస్తానీ, కర్ణా టక సంగీత సమ్రాట్టుల జీవిత విశేషాలన్నీ 2000– 2012 మధ్య కాలంలో ‘ఈమాట డాట్ కామ్’లో ఆయన భద్రపరిచారు. ప్రధానంగా జరిగిన లోపమే మంటే ఆయన పుస్తకాలు వెంట వెంట రాకపోవడం. గ్రంథాలు వెలువడడం, గ్రంథాలయాల్లో లభ్యం కావడం, వచ్చే తరాలకు అందుబాటులో ఉండటం అవసరం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉండి కూడా రోహిణీ ప్రసాద్ ఆలోచనలు తెలుగు జాతికి అందాల్సి నంతగా అందలేదు. బడే గులాం అలీఖాన్, అల్లా ఉద్దీన్ ఖాన్, అహ్మద్ జాన్ ధిరక్వా, ప్రభా ఆత్రే, ఉస్తాద్ అమీర్ ఖాన్, విలాయత్ ఖాన్, ఈమని శంకరశాస్త్రి, నౌషాద్, ఓపీ నయ్యర్, సీఆర్ సుబ్బురామన్, ఘంట సాల, బాల మురళీ కృష్ణ వంటి మహా సంగీత విద్వాంసుల శైలులపై, వారి జీవిత విశేషాలపై రాసిన వ్యాసాలు ఇప్పటికైనా పుస్తక రూపంలో రావాలి. ఆ రకంగా మరణాంతరమైనా రోహిణీ ప్రసాద్ కృషి వెలుగులోకి వస్తుంది.రోహిణీ ప్రసాద్, తన తండ్రి కొ.కు. లాగా సృజ నాత్మక సాహిత్యంలో కృషి చేయలేదు. కానీ వైజ్ఞానిక సారస్వతంలో చేసిన కృషి తక్కువది కాదు. అలాగే తన సోదరి ఆర్. శాంతసుందరి లాగా అనువాదాల వైపు కూడా ఆకర్షితులయ్యారు. 1947 నుండి ఏడేళ్లపాటుచందమామ పత్రికలో అచ్చయిన పిల్లల కథలను ఆయన ఇంగ్లిష్‌లోకి అనువదించారు. బాల సాహిత్యం విలువను, సాహిత్యం విలువను, అనువాదాల విలు వను, సంగీత కళారూపాల విలువను గ్రహించడంతో పాటు సమాజంలో వైజ్ఞానిక అవగాహన ఎంతో అవ సరం అన్నది గ్రహించారు. అందుకే మరణానంతరం తన శరీరం మట్టిపాలు కాకుండా వైద్య పరిశోధనలకు ఉపయోగపడాలి అను కున్నారు.మూఢ విశ్వాసాలను బలపరిచే వారిపై వ్యంగ్యా స్త్రాలు సంధిస్తూనే... జరుగుతున్న సంఘటనల వెనుక ఎటువంటి భౌతిక శక్తులు పని చేస్తాయో హేతువాదులు వివరించగలగాలని సూచించారు. పుట్టిన ప్రతి ప్రాణి కలకాలం జీవించడానికి ప్రకృతి సూత్రాలు ఒప్పు కోవని, అయితే పనికొచ్చే పదార్థం జన్యు పదార్థమే గనక, దాన్ని తరువాతి తరం కోసం వాడుకుంటూఉండొచ్చని అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తగా, సంగీత కారుడిగా, సైన్స్ రచయితగా ఒక క్రమపద్ధతిలో నిరంతరం కృషి చేస్తూ వచ్చిన రోహిణీ ప్రసాద్ ఒక విష యాన్ని గట్టిగా నమ్మారు. ‘నీ పనికి నువ్వొక రూప మివ్వు. ఆ పనే మళ్ళీ నీకో రూపమిస్తుంది’ అని! జీవి తాంతం ఆయన ఆచరించిన సూత్రం అదే!‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ తన పుస్తకంలో రోహిణీ ప్రసాద్ ఇలా అంటారు... ‘మతాలన్నీ ఎప్పుడు ఎలా తలెత్తాయో అర్థం చేసుకుంటే అవి ఈ రోజుల్లో ఎందుకు నిరుపయోగమో అర్థమవుతుంది. మతం అపెండిక్స్ అని ఎవరో అన్నారు. నిజమే మన శరీరంలో పెద్ద పేగుకు చివర ఉన్న అపెండిక్స్ ఒకప్పుడు పని కొచ్చేదట. ఈనాడు దానివల్ల ఉపయోగమేమీ లేక పోగా, అప్పుడప్పుడు అపెండిసైటిస్ వ్యాధి కలిగిస్తూ ఉంటుంది. దాన్ని తొలగించడమే మంచిది. మతమనేది కూడా అంతే.’ మతం పట్ల స్పష్టమైన వైఖరి తెలియ జేశారాయన. మనకిప్పుడు వైజ్ఞానిక స్పృహ, వివేచన, ఇంగిత జ్ఞానం కలిగించే రచనలు కావాలి. డాక్టర్ రోహిణీ ప్రసాద్ అలాంటి రచనలే చేశారు. మనకు గొప్ప శాస్త్రవేత్తలు, మేధావులూ ఉన్నారు. కానీ సామా న్యుడి కోసం సైన్స్ రాసే రచయితలు ఎక్కువగా లేరు. ఉన్నా... వారు సైన్స్ సమాచారం ఇవ్వగలుగుతున్నారే గానీ, సమాజానికి అన్వయిస్తూ రాయలేక పోతున్నారు. విలువల్ని ప్రతిష్ఠాపించే చేవగల ఈయన మరణం వల్ల, తెలుగు సమాజానికి పెద్ద విఘాతమే. రోహిణీ ప్రసాద్ ఆశించిన సమాజానికి రూపకల్పన చేయాలి.డా‘‘ దేవరాజు మహారాజు, వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్ -
తొలి కులరహిత ద్రవిడోద్యమ మార్గదర్శి
దక్షిణ భారతదేశంలో కులాన్ని ప్రశ్నిస్తూ తొలిసారి గొంతెత్తిన కార్యకర్త అయోతీ థాస్. ఆది ద్రావిడ నేపథ్యం నుండి వచ్చిన ఆయన రాజకీయం, సాహిత్యం, మతం వంటి అనేక రంగాలలో అవిరళకృషి చేసినవారు. తమిళ పండితుడు.వృత్తి రీత్యా సిద్ధ వైద్యుడు. పందొమ్మిదవ శతాబ్దం చివరలో ఆది ద్రావిడ ప్రజల అభ్యున్నతి కోసం నడుం బిగించి 1891లో ‘కుల రహిత ద్రవిడ మహాసభ’ను స్థాపించారు. ఈ విషయంలో రెట్టమాలై శ్రీనివాసన్ అనే మరో సంఘ సంస్కర్త ఈయనకు సహకరించారు. బౌద్ధం స్వీకరించిన అయోతీ థాస్, పరయల (మాలల) అసలు మతం బౌద్ధమని తేల్చారు. అంద రినీ అందులోకి మారమని సూచించారు. కులరహిత సమాజం బౌద్ధం ద్వారానే సాధ్యమని ఉద్బోధించారు.1861–91 మధ్య కాలంలో క్రైస్తవులు, ముస్లింలు మినహా మిగిలిన వారందరినీ బలవంతంగా హిందువులుగానే పరిగణించేవారు. అయితే అయోతీ థాస్ ‘హిందూ’ అనే గుర్తింపును నిరాకరించారు. కారణమేమంటే హిందూను గుర్తిస్తే అందులో ఉన్న కుల నిర్మాణాన్ని, నిచ్చెన మెట్ల కుల సంస్కృతిని, అసమా నతలను స్వీకరించాలి. అందుకని ఆయన దాన్ని తిరస్కరించడంతో పాటు, తన అనుయాయులందరినీ తిరస్కరించమని సూచించారు. ఆయన రాజకీయంగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. తను స్థాపించిన ‘కుల రహిత ద్రవిడ మహా సభ’ పక్షాన 10 డిమాండ్లతో ఒక వినతి పత్రం తయారు చేసి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పంపారు. వారు వాటిని తమ 12వ సమావేశంలో చర్చించారు కూడా! అయితే, అందులో ఒక్క డిమాండుకు కూడా సుముఖత వ్యక్తపరచలేదు. ఆ డిమాండ్లలో ఉచిత విద్య, బంజరు భూముల కేటాయింపు, పరయల ఆలయ ప్రవేశం వంటివి ఉన్నాయి. ఆలయ ప్రవేశం ఇక్కడ భక్తికి సంబంధించిన విషయం కాదు. మనుషులుగా సమాన హోదా, సమాన హక్కుకు సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీతో పని కాలేదని అయోతీ థాస్ తన ప్రయత్నం మానుకోలేదు. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌కు పోటీగా 1884లో స్థాపితమైన ‘మద్రాస్ మహాజన సభ’కు కూడా అవే పది డిమాండ్ల వినతి పత్రం పంపించారు. కానీ, అక్కడా చుక్కెదురైంది. నిర్వాహక సభ్యులు ఆయనను ఘోరంగా అవమానించారు.జరిగిన అవమానంతో అయోతీ థాస్ తీవ్రమైన మనో వేదనకు గురయ్యారు. తాము హిందువులమే అయితే జాతి విచ క్షణ ఎందుకూ? కుల దూషణలెందుకూ? దేవుడు అందరి వాడైన ప్పుడు ఆలయ ప్రవేశం తమకెందుకు ఉండదూ? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆయన వాటికి సమాధానాలు కను గొనే ప్రయత్నంలో వేదాలు, బ్రాహ్మణత్వం, ఆచారాలు వంటి వాటి గూర్చి అధ్యయనం ప్రారంభించారు.1870 దశకంలో తన పాతికేళ్ళ ప్రాయంలో తమిళనాడు నీల గిరి ప్రాంతంలోని తోడర్–కొండ జాతులను సమైక్యపరిచి 1875లో ‘అద్వైతానంద సభ’కు రూపకల్పన చేశారు. అప్పుడే రెవరెండ్ జాన్ రతినమ్తో పరిచయం ఏర్పడింది. ఈయన మద్రాసులో ఆది ద్రావిడుల కోసం వెస్లియన్ మిషన్ పాఠశాల నిర్వహిస్తున్నాడు. ఆయన పరిచయంతో అయోతీ థాస్‌కు కొత్త ఉత్సాహం లభించింది. దాంతో 1885లో ‘ద్రవిడ పాండ్యన్’ అనే వార్తా పత్రికను ప్రారంభించారు. 1886లో ‘ఆది ద్రావిడులు హిందువులు కారు’ అని భారతదేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మ కమైన ప్రకటన చేశారు.1891లో ద్రవిడ మహాసభను స్థాపించి, ఆది ద్రావిడులకు ఒక పిలుపునిచ్చారు. వారంతా తమను తాము హిందువులుగా కాక, ‘కుల రహిత తమిళులు’గా ప్రకటించుకోవాలని కోరారు. ఆ రోజుల్లో అదొక సాహసోపేతమైన చర్య. ఒకసారి అయోతీ థాస్ తన అనుచరులతో థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడ యిన కల్నల్ హెచ్.ఎస్. ఆల్కాట్‌ను కలుసుకున్నారు. బౌద్ధం స్వీకరించాలన్న తన కోర్కెను ఆయనకు తెలియజేశారు. ఆయన అయోతీ థాస్ శ్రీలంకకు వెళ్లే ఏర్పాటు చేశాడు. శ్రీలంకలో అయోతీ థాస్ సింహళ బౌద్ధ భిక్షువు సుమంగళ నాయక్ నుండి ధమ్మదీక్ష స్వీకరించారు. చెన్నై తిరిగి వచ్చాక 1889లో ‘శాక్య బౌద్ధ సంఘాన్ని’ స్థాపించి, దాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేశారు. ఈయన అప్పుడు ఏర్పాటు చేసిన శాక్య బౌద్ధ సొసైటీయే కాల క్రమంలో ఇండియన్ బుద్ధిస్ట్ అసోసియేషన్‌గా మారిపోయింది. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా నిలిచిన ఆయన, రచయితగా చేసిన కృషి కూడా తక్కువది కాదు. అంబికయ్యన్ కథ, ఇంద్ర జాతి చరిత్ర, ఇంద్ర దేశ బౌద్ధ పండుగలు, తిరువళ్ళువర్ చరిత్ర వంటి డజనకు పైగా గ్రంథాలు రాశారు.‘అయోతీ థాస్’గా ప్రసిద్ధుడైన ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాత్తవరాయన్. అయోతీ థాస్ అనేది ఆయనకు ఆయనే పెట్టుకున్న పేరు. బాల్యంలో ఈయన అయోధ్య దాసర్ పండిట్ అనే ఉపాధ్యాయుడి వద్ద చదువు నేర్చుకున్నారు.తమిళం, ఇంగ్లిష్, పాళీ భాషలు, తత్వశాస్త్రం, సిద్ధ వైద్యం... ఇలా అనేక విషయాలు నేర్చుకున్నారు. అందువల్ల గురువుగారి పట్ల ఏర్పడ్డ గౌరవ భావంతో తన పేరు కూడా అయోధ్య దాసర్‌గా చెప్పుకునేవాడు. ఆ పేరే స్థిరపడి అయోతీ థాస్‌గా మారింది. తమిళ పలుకుబడి థాస్ అంటే తెలుగులో దాసుడు అనే అర్థం.వీరిది విద్యావంతుల కుటుంబం. ఈయన తండ్రి కాంత ప్పన్, ఫ్రాన్సిస్ వైటీ ఎల్లిస్ అనే బ్రిటిష్ అధికారి దగ్గర పని చేసేవాడు. తన కుటుంబం తరతరాలుగా భద్రపరచుకుంటూ వచ్చిన తాళపత్ర గంథాలు తిరుక్కురళ్, నాలడియార్లను ఫ్రాన్సిస్ ఎల్లిస్‌కు అందించాడు కాంతప్పన్. ఆయన వాటి విలువను గ్రహించి, ఇంగ్లిష్‌లోకి అనువదించాడు. తర్వాత పుస్తకాలుగా ముద్రించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ రకంగా తమిళుల సాంస్కృతిక సంపదైన తిరుక్కురళ్ వెలుగులోకి వచ్చింది. అయోతీ థాస్ 1845 మే 20న మద్రాసులోని రాయ పేటలో జన్మించారు. మళ్ళీ అదే మే నెల 5వ తేదీన 1914లో 69వ యేట కన్నుమూశారు. ఒక రకంగా పెరియార్, ద్రవిడర్ కళగమ్, బి.ఆర్. అంబేడ్కర్లకు ఈయనే స్ఫూర్తిప్రదాత! డా‘‘ దేవరాజు మహారాజు – వ్యాసకర్త సాహితీవేత్త, విశ్రాంత ప్రొఫెసర్(మెల్బోర్న్ నుంచి) -
మిగిలేది... మానవత్వ పరిమళమే!
సమాజం భ్రష్టు పట్టిపోయింది. మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. నిజమే! కాని, మానవత్వం గల మనుషులు కొందరైనా ఉన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. అయితే, సమాజంలో వీరి శాతాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్ లోని గ్రేమోత్ లోకల్ మార్కెట్లో ఒక దయార్ద్ర హృదయుడు తిరుగుతుంటాడు. రొయ్యల, చేపలూ లాగా అక్కడ ఫుడ్ మార్కెట్లో తాబేళ్ళను కూడా అమ్ముతారు. మనం చెప్పుకుంటున్న దయార్ద్ర హృదయుడు తాబేలు మాంసం కోసం రాడు. తాబేళ్ళను రక్షించడానికి వస్తుంటాడు. బేరమాడి మార్కెట్లో బతికి ఉన్న తాబేళ్ళన్నింటినీ కొంటాడు. వాటిని ట్రక్కులో వేసుకుని పోయి సముద్రంలోకి వదులుతాడు. అక్కడ తాబేళ్లు అంతరించి పోయే దశలో ఉన్నాయి. అందుకే ఈ పని! ఏదో విధంగా తమ పని గడిస్తే చాలుననుకుంటూ కాలుష్యాలు పెంచుతున్న మనుషుల మధ్య ఎంతో బాధ్యతతో ‘మనిషి’లా ప్రవర్తించే వారున్నారు. ‘ప్రపంచమేమీ గొడ్డుపోలేదు’ అని అన్నది అందుకే! పాపువా న్యూ గినియా – మార్కెట్ల దగ్గరా ఇలాంటి జీవ పరిరక్షకులు ఉన్నారు. ఇటీవల రాజస్థాన్ జైపూర్‌లో మానవత్వం మతాన్ని గెలిచింది. మధూలిక అనే ఒక 48 ఏళ్ల హిందూ మహిళ 13 మంది ముస్లింల ప్రాణాలు కాపాడింది. భర్త చనిపోయి, ఇద్దరు పిల్లలతో ఒక బట్టల కొట్టు నడుపుకుంటూ జీవిస్తోంది. ఆమె బట్టల కొట్టు ఉన్న ఆ వీధిలో ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారు. ఒకరోజు హిందూ వర్గానికి చెందిన గుంపు – శోభాయాత్ర ఊరేగింపు తీస్తూ అల్లర్లు సృష్టించింది. అందులో భాగంగా అక్కడ ఉన్న 13 మంది ముస్లింలపై దాడిచేయడానికి వారి వెంట పడ్డారు. ఇదంతా గమనించిన మధూలిక ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చిన ముస్లింలను తన కొట్టులోకి పంపి వెంటనే షట్టర్ వేసేసింది. తర్వాత హిందూ దుండగుల్ని ధైర్యంగా ఎదుర్కొని, చాకచక్యంగా వారిని వెనక్కి పంపించింది. ‘మానవత్వం అన్నిటికన్నా గొప్పదని భావించి, ముస్లిం సోదరులకు ఆశ్రయమిచ్చాన’ని– ఆ తర్వాత ఆమె పత్రికల వారికి చెప్పింది. ఒక సామాన్య మహిళ ఆచరణాత్మకంగా, ఎంతో గొప్ప సందేశం ఇచ్చింది. హైదరాబాదు పాత బస్తీలో గాజుల అంజయ్య అందరికీ తెలిసినవాడు. అతని మిత్రులలో చాలా మంది ముస్లింలే. 2022, ఏప్రిల్ 17న తన కొడుకు పెళ్ళికి మిత్రులందరినీ ఆహ్వానించాడు. అవి రంజాన్ రోజులు గనుక ‘రోజా’ పాటించే తన ముస్లిం మిత్రులెవరూ ఇబ్బంది పడకూడదని వారి కోసం నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. ఇఫ్తార్ విందూ ఏర్పాటు చేశాడు. వారంతా మరునాడు ఉపవాసం పాటించేందుకు ‘సహౌరీ’ ఏర్పాటు చేశాడు. స్వార్థప్రయోజనాల కోసం విద్వేషాలు నూరిపోసే వారి వలలో పడకూడదనీ, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకోవడం అందరి బాధ్యత అనీ పాతబస్తీ అంజయ్య ఎప్పుడూ చెబుతుంటాడు. ఇలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది. ఒక ముల్లాగారు తమ మసీదులో హిందూ అమ్మాయి వివాహం జరిపించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.ముస్లింల, క్రైస్తవుల సఖ్యత గూర్చి కూడా ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. ఇది 2022 ఏప్రిల్ 21న మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ముస్లింలు చర్చిలో నమాజు చదివారు. ఇఫ్తార్ విందుకోసం అజ్మల్ ఖాన్ అనే వ్యక్తి అన్ని మతాల మత పెద్దల్ని ఆహ్వానించాడు. అయితే, అక్కడ చర్చి ఫాదర్ ఆ విందు అహ్వానాన్ని అంగీకరించడమే కాకుండా, ఆ ఇఫ్తార్ విందు తమ చర్చిలోనే నిర్వహించాలని సూచించాడు. ఆ రకంగా తొలిసారి ఇస్తార్ విందు చర్చిలో, ఫాదర్ పర్యవేక్షణలో జరిగింది. పరమత సహనం, సహకారం అంటే ఇదే కదా! అసలైన భారతదేశపు ‘ఆత్మ’ అక్కడ తొణికిసలాడింది. ఆత్మ అంటే... ఆత్మ – పరమాత్మలు కావు. అంతరంగంలోని ఒక సమర్పణ భావం! ఆలోచనల ఐక్యత!! గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం. మనిషి మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమించడం. ఇక్కడ చెప్పుకున్న సంఘటనలన్నింటికీ ఒక అంతస్సూత్రం ఉంది. ‘దేవుడు లేడు – మతం అనేది వ్యక్తిగతం – మన చివరి గమ్యం – మానవవాదం’ అనేది సాధించడానికి... ఇలా మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయేమో!క్రమంగా తరతమ భేదాలు మరిచి, మనుషులంతా ఒక్కటే అనే విషయం జీర్ణించుకునేందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో? మనిషికి మనిషే ముఖ్యం – దేవుళ్ళు కాదు, అనే భావనలోకి సమాజం ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా ‘మన మార్గం సుదీర్ఘమైంది. రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. ఇరవై ఒకటవ శతాబ్దపు స్త్రీ – పురుషుల్ని అంటే మనల్ని మనం కొత్తగా తయారు చేసుకోవడానికి రోజు వారీగా కృషి చేస్తూనే ఉండాలి’ అన్న చే గువేరా మాటలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నిజమే– బూజు పట్టిన భావజాలాన్ని వదిలి, కొంచెం కొంచెంగా పైపైకి ఎదుగుతూనే ఉండాలి. పైకి ఎదిగితేనే (ఎగిరితేనే) అద్భుతమైన మానవత్వ దృశ్యాలు కనబడతాయి. నువ్వు బతికి ఉన్నావంటే...నీ జీవితపు విజయోత్సవాన్ని పంచుకోస్వర్గమనేది ఎక్కడైనా ఉంటే...దాన్ని భూమి మీదికి దించుకో–అని ఎలుగెత్తి చెబుతూ ముందుకు సాగాల్సి ఉంది.డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత -
కందుకూరి స్ఫూర్తిగా పోరాడాలి!
తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ‘కార్యశూరుడు వీరేశలింగం/ కదం తొక్కి పోరాడిన సింగం/ దురాచారాల దురాగతాలను / తుద ముట్టించిన అగ్ని తరంగం’ అన్నారు. ఇప్పుడు మనం అటువంటి కందుకూరి వారి 174వ జయంతి సంద ర్భంలో ఉన్నాం (ఏప్రిల్ 16). ‘ఉద్యోగంలో చేరడానికి అమావాస్యనాడే ఎందుకు వచ్చా’ వని అధికారి అడిగాడు. అందుకు వీరేశలింగం చెప్పిన సమాధానం అధికారి నోరు మూయించింది. ‘అయ్యా! అన్ని రోజులూ ఆ ఈశ్వరుడు సృష్టించినవనే చెబుతారు కదా? మరి అలాంటప్పుడు అన్ని రోజులూ మంచివే – అలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఉద్యోగంలో చేరినా, అది మంచి రోజే అవుతుంది’ అని తాపీగా సమాధానమిచ్చారు వీరేశలింగం. ఈ విషయం ‘మూఢ నమ్మకాలపై నా పోరాటం’ అనే గ్రంథంలో ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఆ గ్రంథంలో ఆయన అనేక ప్రహసనాలు రాశారు. శకునాలు, జోస్యాల వంటివాటిని నమ్మడం ఎంత అశాస్త్రీయమో కళ్లకు కట్టినట్లు వాటి ద్వారా వివరించారు. జ్యోతిష్యాన్ని నమ్మేవారు తాము నమ్మిన జోస్యాలు నిజం కానప్పుడు వాటిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. ఎప్పుడైనా ఒకటి అరా నిజమైతే వాటినే మళ్లీ పట్టుకుని వేలాడుతారు. ఒక విధంగా జ్యోతిష్యం చెడిపోయిన గడియారం లాంటిది. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని, ఆగిపోయిన గడి యారాన్ని నమ్మడం ఎంత మూర్ఖత్వమో, జ్యోతిష్యాన్ని నమ్మడం కూడా అంతే మూర్ఖత్వం! వాస్తవానికి మనం ఏదైనా విషయం ఊహించి చెబితే, అందులో కొంత మేరకు నిజమయ్యే అవకా శాలు ఉంటే ఉంటాయి. ఉండకపోతే ఉండవు. ఇకపోతే, దేవుడి విషయం చూద్దాం! ఒక కారుకు బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడిందని అనుకుందాం. ఆ ప్రమాదంలో బతికినవాళ్ళు ‘ఆ దేవుడి దయవల్ల బతికామని చెప్పుకుంటారు కదా? మరి చనిపోయిన వారిని ఎవరు చంపినట్టూ? ఆ దేవుడు చంపాడని చెప్పాలి కదా? కానీ చెప్పరు. ఒకవేళ ప్రమాదానికి గురయిన ఆ కారులోని వారంతా చనిపోతే మీడియాలో వార్త ఇలా ఉంటుంది. ‘కారు బ్రేకులు ఫెయిలై,అందులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృతి చెందారు’ అని ఉంటుంది. బ్రేకులు ఫెయిల్ కావడం హైలైట్ అవుతుందే తప్ప ఆ వార్తలో దేవుడి ప్రసక్తి ఉండదు. ప్రయాణికులు బతికితే ‘దేవుడి దయ’ వల్ల బతికారనడం, మరణిస్తే మాత్రం, తప్పు – బ్రేకులు ఫెయిల్ కావడంపై పెట్టడం ఏమైనా బాగుందా? తప్పు దేవుడి మీద పెట్టి, ఆయనే చంపేశాడని, అనుకునే ధైర్యం ఉండదు. ప్రజలు ఇలాంటి ధోరణికి అలవాటు పడిపోవడం వల్ల కదా దేవుడు, జ్యోతిష్యం, వాస్తు, ఆత్మ, పునర్జన్మ వంటి అంధ విశ్వాసాలు సమాజంలో సజా వుగా బతుకుతున్నాయి? ఇలాంటి విశ్వాసాల వల్లనే సమాజం రోగగ్రస్తమవుతూ ఉంది. మన జీవి తంలో మన చుట్టూ జరుగుతున్న విషయాలను నిశితంగా పరిశీలిస్తూ, హేతుబద్ధంగా విశ్లేషించు కుంటే నిజానిజాలు బయటపడతాయి. ‘దైవాన్నీ, జ్యోతిష్యాన్నీ నమ్మేవారు తమ సౌకర్యానుసారంగా ఆలోచనల్ని, విధివిధానాల్ని మార్చుకుంటూ ఉంటారని’ వీరేశలింగం పంతులు ఏనాడో చెప్పారు. మరి, మనవాళ్ళు ఏమైనా చెవికి ఎక్కించుకున్నారా? లేదే? గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా మూఢ నమ్మకాల్లో పడి పోతున్నారు. ఒక పెరియార్, ఒక కందుకూరి, ఒక తాపీ ధర్మారావు, ఒక గోరా వివేచన అనే దుడ్డు కర్రలతో జనాన్ని అదిలిస్తూనే వచ్చారు. మనం కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉండాలి. జన చైతన్యానికి దోహదం చేస్తూనే ఉండాలి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లోకి వద్దాం. ‘మహాభారత కాలంలోనే శాటిలైట్, ఇంటర్నెట్ ఉంది’ అని అన్నారు త్రిపుర ముఖ్యమంత్రి. ఇటువంటి మాటల ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్నవారూ తామేమిటో స్వయంగా నిరూపించుకుంటున్నారు. లేకపోతే అర్ధ సత్యాలతో, అబద్ధాలతో తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడండని ఈ దేశ ప్రజలకు స్వయంగా ఈ దేశ ప్రధాని చెబుతారా? ‘నేడే చూడండి’ అంటూ ఊళ్లల్లో ఓ మైకు రిక్షా తిరుగుతుండేది. ప్రధాని పదవి ఆ స్థాయికి చేరిందా? అదే ఎందుకు? గుజరాత్ అల్లర్లపై వచ్చిన ‘పర్జానియా’ పూర్తి హిందీ సినిమా యూట్యూబ్‌లో ఉంది. అది చూడమని చెప్పలేదెందుకూ? రేషన్ ఇవ్వడం చేత గాకే ఆయన భాషణ్‌లు ఇస్తుంటారని సగటు భారతీయుడికి అర్థమైంది. మూఢ నమ్మకాలు, జ్యోతిష్యం, వాస్తు, ఆవు పేడ, ఆవు మూత్రం వాటితో ఈ దేశ ప్రజల్ని విడగొట్టి, విభజించి, దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చాలన్న ఉద్దేశంతోనే విద్యారంగాన్ని కాషాయంలో ముంచుతున్నారు. ‘దేశం కాషాయీకరణ చెందితే తప్పేంటి?’ అని దేశ ద్వితీయ పౌరుడైన తెలుగువాడు ప్రశ్నిస్తుంటే – మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? లేక సాధారణ శకానికి పూర్వ కాలంలో ఉన్నామా? అని అనుమానపడాల్సి వస్తోంది. ఇప్పుడు బంతి బాధ్యతాయు తంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాల కోర్టులో ఉంది. ప్రశ్నించగల సామర్థ్యం, స్థైర్యం గల సామాన్య పౌరులు కూడా ప్రతి పక్షంలో ఉన్నట్టే – ప్రజాకవి వేమన, కందుకూరి వీరేశలింగం లాంటి వారి రచనల నుండి స్ఫూర్తిని పొందాల్సి ఉంది. డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త -
ఒక దేశం – ఒకే పువ్వు
ఎవరో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు వీచే ముందు గాలులు అనుమతి తీసుకోవాలని వీచే ముందు గాలులు తమ దిశ దశ ఏమిటో ఎటో వివరాలు తెలియ జేయాలని ఎవరో కొత్త చట్టం తెచ్చారు గాలులు ఎంత దూరం పోవాలనుకున్నాయో అవి ఎంత వేగంగా వీచాలనుకున్నాయో వివరాలు సమర్పించనిదే అనుమతి దొరకదని ఎవరో కొత్త చట్టం తెచ్చారు ఇప్పుడిక్కడ సుడిగాలులకు అనుమతి లేదు మేం కడుతున్న ఆ పేకమేడల్ని సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది అందువల్ల ఈ చట్టాలు సత్వరమే అమల్లోకొస్తున్నాయి! తమ చుట్టాలకు అనుగుణంగా ఎవరో ఇక్కడ కొత్త చట్టాలు తెచ్చారు ఒడ్డును తాకే కెరటాలక్కూడా ఒక హెచ్చరిక! ఎగిసెగిసి పడటం మళ్లీ తిరిగి వెళ్ళడం బలం పుంజుకుని మళ్లీ నీటి పిడికిళ్ళతో తిరిగి రావడం ఇవన్నీ ఇప్పుడిక కుదరదు తిరుగుబాట్లు, ఉద్యమాలు, హోరెత్తిపోవడాలు నిషిద్ధం ఎంతటి ఉధృతి ఉన్నా బుద్ధిగా ఒడ్డులోపల మాత్రమే నిశ్శబ్దంగా ప్రవహించాల్సి ఉంటుంది! తోటలోని మొక్కలన్నీ ఒకే విధంగా పూయాలని పూచే పూల రంగు కూడా ఒకటిగానే ఉండాలని కొత్త చట్టం అమలులో కొచ్చింది ఒకే రంగు మాత్రమే కాదు ఏ పువ్వు రంగు ఎంత గాఢంగా ఉండాలో కూడా వారు నియమించిన వారి అధికారులే నిర్ణయిస్తారట! ఒక దేశం – ఒకే పువ్వు!! ఈ చట్టాలు చేసిన గౌరవనీయులకు ఎవడు చెప్పాలి? తోటలో అన్ని మొక్కల పూలు ఒకే రకంగా ఉండవని – ఉండటానికి వీలే లేదని – ఒక రంగులో అనేక రంగులుంటాయని కూడా వారికి ఎవడు చెప్పాలి? గాలులు, కెరటాలు ఎవరి చట్టాలకూ లొంగవనీ గాలి ఎవరి పిడికిలిలోనో ఖైదీగా ఉండదని కెరటం ఎవరి జీవోలతోనో వెనక్కి మళ్ళదని ఎంతటి వారైనా సరే, వాటిని గమనిస్తూ వాటికి అనుగుణంగా బతకాల్సిందే తప్ప మరో మార్గం లేదని! లేకపోతే, అవి సృష్టించే సునామీలో అడ్రసు లేకుండా గల్లంతు కావల్సిందేనని నామరూపాలు లేకుండా నశించాల్సిందేనని వారికి ఎవరైనా చెప్పండి! కనీస గౌరవమైనా... కాపాడుకొమ్మని!! – డాక్టర్ దేవరాజు మహారాజు (దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమ నేపథ్యంలో) -
అతడు మానవవాద విప్లవకారుడు!
అలుపెరుగని సత్యాన్వేషి, కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, ప్రపంచ మానవ వాద విప్లవకారుడు ఎంఎన్ రాయ్– తీవ్ర జాతీయ వాదంలోంచి, ప్రపంచ కమ్యూనిస్ట్ రాజకీయాలతో మమేకమై, తర్వాత కాలంలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడయ్యారు. ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసుకోవాలంటే ఎంఎన్ రాయ్ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు (1917) కావడమేమిటీ? విచిత్రమని పిస్తుంది. కానీ అది వాస్తవం. ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనని ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండనివ్వలేదు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపనతో పాటూ భారత రాజ్యాంగ చిత్తుప్రతిని కూడా తయారు చేసి, ప్రచురించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన సమయానికే ఆయన ‘నూతన మానవ వాదాని’కి మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేశారు. ఒక జీవితకాలంలో ఒక వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేయగలిగా రన్నది అంతుపట్టని విషయం. డెహ్రాడూన్‌లో తన నివాసమున్న చోటనే ‘ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్’ను స్థాపించారు. ఇది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్ హౌస్’గా పేరు పొందింది. భారతీయ సమాజంలో మనువాదుల ప్రభావంతో శతాబ్దాలుగా వేళ్ళూనుకుని ఉన్న మతతత్వ భావనకి వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమన్నారు రాయ్. ఎంఎన్ రాయ్ అసలు పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య. 21 మార్చి 1887న పశ్చిమ బెంగాల్ 24 ఉత్తర పరగణాల్లో ఒక పూజారి కుటుంబంలో పుట్టారు. బాల్యంలో తండ్రి దీనబంధు భట్టాచార్య దగ్గరే సంస్కృతం, కొన్ని సనాతన శాస్త్రాలు చదువుకున్నారు. అప్పుడే అతనిలో కొత్త ఆలోచనలు ప్రారంభమయ్యాయి. 14 వ ఏట వెళ్ళి ‘అనుశీలన్ సమితి’ అనే విప్లవ సంస్థలో చేరారు. కానీ కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురయ్యింది. ఆ తర్వాత జతిన్ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు – అని తన గ్రంథం (చైనాలో నా అనుభవాలు)లో రాసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘జుగాంతర్’ సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ కాలంలో రాయ్ జర్మన్ల సహాయంతో బ్రిటిష్ వాళ్లను తరమడానికి ఆయుధాల సేకరణకు ప్రయత్నించారు. 1916లో రాయ్ అమెరికా చేరుకున్నారు. కానీ, బ్రిటిష్ గూఢచారులు అతని కదలికల్ని గమనిస్తూనే ఉన్నారు. రాయ్ శాన్ఫ్రాన్సిస్కోలో అడుగు పెట్టగానే అక్కడి ప్రాంతీయ వార్తా పత్రికలో రాయ్ గురించి ఓ సంచలన వార్త ప్రచురితమై ఉంది. ‘‘ప్రఖ్యాత బ్రాహ్మణ విప్లవకారుడు, ప్రమాదకారి అయిన జర్మన్ గూఢచారి నరేంద్రనాథ్ భట్టాచార్య అమెరికాలో అడుగు పెట్టాడ’’న్నది ఆ వార్త సారాంశం. దొరక్కుండా ఉండటానికి రాయ్ వెంటనే క్యాలిఫోర్నియాకు వెళ్ళిపోయారు. అక్కడ పేరు మార్చుకుని, మానవేంద్రనాథ్ రాయ్ (ఎంఎన్ రాయ్)గా చలా మణీ అయ్యారు. క్యాలిఫోర్నియా నుండి తప్పనిసరై మెక్సికో చేరుకున్నారు. అనతి కాలంలోనే అక్కడి సోషలిస్ట్‌లతో కలిసి ‘మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ’ని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్ళకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించగలిగారు. రాయ్ తర్వాత కాలంలో లెనిన్, స్టాలిన్లను కలిసి 1926లో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ స్థాపించారు. 1930లో ఆయన భారత దేశానికి తిరిగి రాగానే, బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆరేళ్ళు జైలు శిక్ష విధించింది. ఆ కాలంలోనే రాయ్ తొమ్మిది సంపుటాల ‘‘ప్రిజన్ డైరీలు’’ రాశారు. జైలు నుండి విడుదలైన తరువాత 1946లో రాయ్ డెహ్రా డూన్లో ‘ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్’ స్థాపించారు. ఆ సంస్థ ఆధునిక భౌతిక శాస్త్ర దృక్కోణంలో మానవ వాదాన్ని ప్రచారం చేసింది. పత్రికలు, పుస్తకాలు ముద్రించడం; సభలూ, సమావేశాలే కాదు, కార్యాశాలలు నిర్వహించడం నిరంతరం కొనసాగుతూ ఉండేవి. ఫలితంగానే బలమైన మానవ వాద సాహిత్యం వచ్చింది. రాయ్ జీవితం నుండి, ఆయన ప్రతి పాదించిన రాడికల్ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్ట్లు, కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్ వాదులు, పార్టీ రహిత కార్యకర్తలు ఎంతో మంది ప్రేరణ పొందారు. మతతత్వంపై పోరాడిన రాయ్, 25 జనవరి 1954న తన 67వ ఏట, గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుత క్లిష్ట పరి స్థితుల్లో మానవవాద ఆలోచనా ధోరణిని బలోపేతం చేసు కోవాల్సి ఉంది. ఈ బాధ్యత దేశంలోని యువతరానిదే! దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, జీవ శాస్త్రవేత్త. -
తెలుగు కథకు చార్మీనార్ నెల్లూరి
నెల్లూరి కేశవస్వామి కథల్లో ఆనాటి దేవిడీలు, కోఠీలు, దివాన్ ఖానాలు, నానా ఖానాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. నవాబులు, నవాబ్ పాషాలు, దుల్హన్ పాషాలు, బేగం సాహెబాలు, ఖాజీలు, హకీం సాబ్‌లు, ఇమామ్‌లు, మౌల్వీలు, ఉస్తాద్‌లు ఈ రోజు లేరు. వారు ధరించిన షల్వార్లు, దుపట్టాలు, కమీజులు, చమ్కీలు, ఘాఘ్రాలు వాడుకలో పెద్దగా లేవు. అయినా కేశవస్వామి సాహిత్యంలో ఇవన్నీ భద్రపరచబడి ఉన్నాయి. ఆయన కథలు చదువుతూ ఉంటే సాలార్జంగ్ మ్యూజియంలో గత వైభవ చిహ్నాల్ని చూసి తబ్బిబ్బయినట్లు ఉంటుంది. నెల్లూరి కేశవస్వామి (1920–1984) హైదరాబాదు దక్కన్లో పుట్టి, హైదరాబాదులోనే పెరిగి, ఇక్కడే నీటి పారుదల శాఖలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేసి, ఉన్నత శ్రేణి కథకుడిగా ఎదిగారు. నిజాం పాలన నాటి రోజుల్ని, స్వతంత్ర భారతంలో క్రమంగా మారుతూ వచ్చిన పరిస్థితుల్ని స్వయంగా చూసిన వ్యక్తి. ముఖ్యంగా 13–17 సెప్టెంబర్ 1948న యూనియన్ సైన్యాలు హైదరాబాద్ నగరాన్ని చుట్టు ముట్టి ఆక్రమించుకోవడం, నిజాం లొంగిపోయి తన స్వతంత్ర రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చెయ్యడం... వాటిని పూసగుచ్చినట్లు ‘యుగాంతం’ కథలో అక్షరీకరించిన రచయిత. ఫ్యూడల్ రాజ్యానికి చరమ గీతం పాడిన సృజనకారుడు. అప్పుడు జరిగిన మార్పుల్లో శుక్రవారం సెలవు ఆదివారానికి మారింది. దక్కన్ రేడియో ఆలిండియా రేడియో అయ్యింది. కల్దారు నాణాలు చెల్లకుండా పొయ్యాయి. పాఠశాలల్లో ఉరుదూ మీడియం మారిపోయింది. షేర్వాణీలు, రూమీ టోపీలు మాయమవుతూ వచ్చాయి. ఒక గొప్ప ఫ్యూడల్ రాచరికపు చిహ్నంగా చార్మీనార్ తలెత్తుకు నిలబడింది. అయితే కేశవస్వామి దాన్ని ఉన్నదున్నట్లుగా శ్లాఘించలేదు. ఆ వ్యవస్థలోని అవలక్షణాల్ని ఈసడిస్తూనే మనుషులుగా హిందూ ముస్లింల స్నేహాన్ని ఆకాంక్షించారు. ఒక చారిత్రిక నేపథ్యాన్ని ఒక సాంస్కృతిక నేప«థ్యాన్ని తన కథల్లో నిక్షిప్తం చేస్తూనే, ఒక మహారచయిత ఎదగాల్సిన స్థాయికి ఎదిగారు. కానీ ఎందువల్లనో ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంది. నెల్లూరి కేశవస్వామి కథల్లో నాటి కట్టడాలు, భవనాలు, తినుబండారాలు, ఆస్తులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆనాటి దేవిడీలు, కోఠీలు, దివాన్ ఖానాలు, నానా ఖానాలు ఈ అరవైయేళ్ళలో చాలావరకు ధ్వంసమైపొయ్యాయి. నాటి నవాబులు, నవాబ్ పాషాలు, దుల్హన్ పాషాలు, బేగం సాహెబాలు, ఖాజీలు, హకీం సాబ్‌లు, షేక్ ఇమామ్‌లు, మౌజ్జన్లు, మౌల్వీలు, మామాలు, ఉస్తాద్‌లు ఈ రోజు లేరు. వారు ధరించిన షల్వార్లు, దుపట్టాలు, కమీజులు, చమ్కీలు, ఘాఘ్రాలు వాడుకలో పెద్దగా లేవు. అయినా కేశవస్వామి సాహిత్యంలో ఇవన్నీ భద్రపరచబడి ఉన్నాయి. ఆయన కథలు చదువుతూ ఉంటే సాలార్జంగ్ మ్యూజియంలో గత వైభవ చిహ్నాల్ని చూసి తబ్బిబ్బయినట్లు ఉంటుంది. హైదరాబాదులోని ఇన్ని సాంస్కృతిక వైరుధ్యాలు ఇంత ప్రతిభావంతంగా మరే తెలుగు రచయిత తమ కథల్లో వ్యక్తీకరించలేదని అంటే అతిశయోక్తి కాదు. దలావర్, నజ్మీ, అమీనా లిబ్నా, హసన్, రజియా, కమల్‌రాయ్, బిల్కిస్, మహబూబ్రాయ్ సక్సేనా, ఇక్బాల్, గులాం, రమణి, బిందు, రాధ వంటి పాత్రలు ఈయన కథల్లో కనిపిస్తాయి. డబీర్‌పురా, మీర్ ఆలంమండి, చార్ కమాన్ లాంటి సంఘటనా స్థలాలు తారసపడతాయి. చాయ్, పాన్, ఖూబానీకా మీఠా, నవాజ్, షర్బత్, ఈద్ లాంటి మాటలు నాటి సాంస్కృతిక చిహ్నాలుగా ఇప్పటికీ మనకు హైదరాబాద్‌లో వినిపిస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో మామూలుగా వినిపించే తఖల్, చాదర్, ఖుష్కా, మెహద్ జౌహారీ, పాతెహా... ముస్లిం పరదాల వెనుక, బుర్ఖాల వెనక, వినబడే అనేకానేక మాటలు, పలుకుబళ్ళు, సామెతలు, నానుడులు, జీవనగాథలు, వెతలు కేశవస్వామి కథల్లో నమోదై ఉన్నాయి. కేవలం ఆయన మాత్రమే ఎలా నమోదు చేయగలిగారంటే ఆయనకు చిన్నప్పటి నుండి బాల్య స్నేహితులు ఎక్కువ మంది ముస్లింలు ఉండటం, తెలుగుతో పాటు ఉరుదూ కూడా ధారాళంగా మాట్లాడగలగడం, ఇంజనీర్‌గా ఉన్నతోద్యోగంలో ఉండడం వల్ల నవాబ్‌లతో స్నేహం పెరగడం, వారితో విందులు, వినోదాలలో పాలు పంచుకోవడం వగైరా ఎన్నో కారణాలున్నాయి. భాష పట్ల, మానవ ప్రవృత్తి పట్ల, రచయితగా ఒక పరిశీలనా దృష్టి ఉండటం వల్ల ఆయన హైద్రాబాద్ సంస్కృతి నేపథ్యంలోంచి కథలు రాయగలిగారు. ఆయనకు మాత్రమే వీలయ్యింది. తన కెదురైన జీవితాన్ని రచయితగా అశ్రద్ధ చేయలేదు. హిందూ ముస్లిం విభేదాల్ని పక్కన పెట్టి, షియా సున్నీ భేదం పక్కన పెట్టి మేం ‘‘కేవలం మనుషులం’’ అని ప్రకటించి ఒక ప్రేమికుల జంట ఒకటవుతారు. మతాలు మారకుండానే భార్యా భర్తలుగా మనగలమని ‘కేవలం మనుషులం’ కథలో ధైర్యంగా ప్రకటిస్తారు. ‘వంశాంకురం’ కథ మత సంప్రదాయాలకు అతీతమైన మానవీయ సంబంధాలను ఎలుగెత్తి చాటింది. హైద్రాబాద్ డబీర్‌పురాలోని అమీన అనే అమ్మాయి దుబాయ్‌లో షేక్ ఇంట్లో ఆయన అనేక మంది భార్యల్లో ఒకతి కావడం, విముక్తి కోసం పెనుగులాడడం ‘ఆఖరి కోరిక’లో వివరించబడింది. నవాబుల ఇళ్ళలో సంగీత సాహిత్యాల అభిరుచి, ఆ స్థాయి, ఆ దర్జా వర్ణించాలంటే సామాన్యులకు వీలుకాదు. ఆ వాతావరణంలో మెలిగి, ఆ మనుషుల అంతరాత్మలు అధ్యయనం చేసిన కేశవస్వామి లాంటి వారికే సాధ్యం! ‘రూహీ–ఆపా’ చదివితే ఆయన కథాకథన వైభవం పాఠకుడి మనసులో జీవితాంతం నిలిచిపోతుంది. నవాబుల ఇళ్ళలో దాసీలను ఆటవస్తువులుగా వాడుకునే ఆచారాలన్నీ తిరస్కరించిన సుల్తాన్ అనే విద్యావంతుడు దాసీనే పెండ్లాడి అలీఘడ్ పారిపోయి ఉద్యోగిగా స్థిరపడడం ‘విముక్తి’లో చూస్తాం. ‘ప్రతీకారం’లో పాషా నవాబు గారి అక్రమ సంతానం లచ్చూ అనే హిందూ మహిళకు పుడతాడు. అతను నవాబు కొడుకైనా వారసత్వ హక్కులేవీ ఉండవు. ఆ కసితో ప్రతీకారం తీసుకోవాలను కుంటాడు. నవాబుగారి అసలు కోడలు గుడ్డీరాణిని తన బాహువుల్లోకి ఆకర్షిస్తాడు. మరో కథ ‘అదృష్టం’లో నవాబు పశుబలంతో సర్రాఫ్ (కాషియర్) భార్య శీలాన్ని హరిస్తే, నవాబు రెండో భార్య తనకన్నా పన్నెండేళ్ళు చిన్నవాడైన సర్రాఫ్ కొడుకుని చేరదీసి, పెండ్లి చేసుకుంటుంది. చట్టానికి దొరకకుండా, ఆస్తిపాస్తులు ఇతరులకు పోకుండా, ముస్లిం మత ఆచారాల ప్రకారం జాగ్రత్త పడుతుంది. షరీఫా అనేది అద్భుతమైన కథ, రాత్రి మందు పార్టీలో పాల్గొన్న ఒకతను ఇంటికి వెళుతూ ఉంటే రిక్షావాడు ఆపి, రిక్షాలో ఉన్న వేశ్యను చూపిస్తాడు. ఆమె అతణ్ణి తన గదికి తీసుకువెళ్ళి, బట్టలిప్పుకుని పక్కన కూర్చుంటుంది. అతను ఆమె వక్షోజం తాకుతాడు. అతని ముఖం మీద పాలు చిమ్ముతాయి. ఆమె అతనికి క్షమాపణ చెప్పి, పరదా వెనుక ఏడుస్తున్న చంటి వాడికి పాలు కుడుపుతుంది. అతను తన జేబులోని డబ్బంతా తీసి ఆమె చేతిలో కుక్కి వడివడిగా బయటపడతాడు. బయట ఉన్న రిక్షావాడు ‘‘వెళ్ళొద్దు సాబ్, నా భార్య మొండి ముండ సాబ్, నేను సర్ది చెబుతాను సాబ్’’ అని ప్రాధేయపడతాడు. ‘‘నేనెవరి దగ్గరా భిక్షం తీసుకోను’’ అని బయటకి వచ్చిన షరీఫా క్రోధంగా కేకలేస్తుంది. ‘ఆ ఇచ్చిన డబ్బు తనకు కాదని చంటిబాబుకు కానుక’ అని చెప్పి, విటుడు చీకటిలో మాయమవుతాడు. నాలుగు పేజీల చిన్న కథలో ఒక పూర్తి జీవితాన్ని చిత్రించిన తీరు ఒక అద్భుతమైతే, ప్రతి పేజీలో ఒక మలుపుతో ఉత్కంఠ భరితంగా రాయడం మరో ఎత్తు. బీదరికం, ఆకలి చెప్పకుండానే చెప్పడం, సెక్స్కథలా నడిపించి దాన్ని మాతృత్వంలోకి మళ్ళించడం, భర్త అనుమతితో వ్యభిచరించి డబ్బు గడిస్తున్న స్త్రీకి కూడా ఒక నీతి ఉండడం, చివరిగా వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఆ విటుడు డబ్బిచ్చి చంటి బాలుడికి కానుక అనడం వల్ల, రచయిత ఉదాత్తంగా, హుందాగా కథను ముగించినట్లయ్యింది. ఇది హైదరాబాదు పాతబస్తీలోని సందుల్లోంచి తీసుకున్న ఇతివృత్తమైనా, ఇందులో విశ్వజనీనత ఉంది. మానవ జీవితంలోని దైన్యం, విషాదం ఉన్నాయి. మనం మనుషులమని గర్వంగా చెప్పుకో గలిగే అంశమూ ఉంది. హైద్రాబాద్ సాంస్కృతిక చిహ్నంగా చార్మీనార్ నిలబడినట్లే కేశవస్వామి కథల సంపుటి ‘చార్మీనార్’ కూడా అలాగే నిలబడింది. ఇందులో హైదరాబాద్ తెలుగు భాష ఒక మినార్, సంస్కృతి ఒక మినార్, రాజకీయ నేపథ్యం ఒక మినారయితే సామాజికాంశాలు మరో మినార్! డాక్టర్ దేవరాజు మహారాజు 9908633949 -
కలం గళంపై అధికారం హజం
భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారంటున్న రచయితల, కళాకారుల మనో భావాలను, ఆవేదనను, ఆకాంక్షలను అర్థం చేసుకునే ప్రయత్నమైనా జైట్లీ చేయలేదు. పైగా హత్యలు కరెక్టు, నిరసన తెలియజేయడమే తప్పు అన్నట్లుగా మాట్లాడారు. 'మారే జాయేంగే రావణ్, జయ్ హోంగే రామ్/ పర్ జో, పూల్ బనాయింగె ఓ ఇతిహాస్ మె బందర్ కహలాయింగె' అన్నారు ఆధునిక హిందీ కవి 'అజ్ఞేయ' రావణుడు మరణిస్తాడు, రాముడు విజయుడవు తాడు. వంతెన నిర్మించిన వారిని మాత్రం కోతులని పిలుస్తారు. నేడు రచయితల పరిస్థితీ అలాగే ఉంది. 'అవార్డులు వాపసు చేస్తున్న రచయితలంతా ఇక ముందు రాయడం మానేస్తారా?' అని కేంద్ర సాంస్కృ తిక మంత్రి మహేశ్‌శర్మ ప్రశ్నించారు. ఒక రచయితపై ఒత్తిడి చేసి 'నేను చచ్చిపోయాను'అని ప్రకటన చేయించిన ఘటనను అది గుర్తుకు తెస్తోంది. అవార్డులను వాపసు చేసిన రచయితలు ఇక రాయకూడదు, వారి భావజాలం ప్రజల్లోకి వెళ్లకూడదు అనే భావన సదరు మంత్రి మనసులో బలంగా ఉన్నది. సుప్రీంకోర్టు న్యాయవాదైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు. 'అవార్డులు వెనక్కిచ్చి కొందరు మరో రకమైన రాజకీయం చేయదలచారు, ఇదంతా ముందస్తుగా తయారు చేసిన పేపరు తిరుగు బాటు, ఇది రచయితల మేధోపరమైన అసహనం'అన్నారు. రచయితలు, హేతువాదులు చేసిన రాజకీ యం ఏమిటో మాత్రం ఆయన చెప్పలేదు. ఇతరుల ఆలోచనల మీద, ఆహారపు అలవాట్ల మీద అసహనం ప్రకటిస్తున్నవారి గురించి, అలాంటి వారు చేసిన హత్యల గురించి జైట్లీ మాట్లాడరు. పైగా ఆ హత్యలు జరిగిన చోట అధికా రంలో ఉన్నవారిని వదిలి కేంద్రాన్ని ఎందుకు విమర్శి స్తారూ? అంటూ ప్రశ్నలు సంధిం చారు. అయ్యా, జైట్లీ గారూ! జరుగుతున్న దౌర్జన్యాలన్నీ తమ పార్టీ సోదర సంస్థలు చేసినవేననేది బహిరంగ రహస్యం. జరుగుతున్న దాడులన్నీ వామపక్షవాదులు, హేతువాదులు, మైనారిటీలపైనేననేది అంతకంటే బహి రంగ రహస్యం. ఇందిర ఎమర్జెన్సీ, 1989 భగల్పూర్ అల్లర్లు, 1994 నాటి సిక్కుల ఊచకోత వంటి సంద ర్భాల్లో ఈ రచయితలేం చేశారని అసహనంగా ప్రశ్నిస్తూ కోర్టు దబాయింపులకు దిగారు. కానీ ఇది కోర్టు కాదు. జీవితం! జీవితం గురించి చెప్పగల అవగాహన, అధికా రమూ మీకంటే రచయితలకే ఎక్కువగా ఉంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని, సిక్కుల ఊచకోతను, గుజరాత్ గాయాన్ని, భగల్పూర్ అల్లర్లను రచయితలు ఖండించారు. అవార్డును తిరిగిచ్చేసిన వారిలో ఒకరైన నయనతారా సెహెగల్ (88) స్వయానా ఇందిరాగాంధీకి మేనకోడలు. ఆమె ఎమర్జెన్సీని ఖండించడమే కాదు, 'ఒకే పార్టీ దేశాన్ని పాలిస్తూ ఉండటమేమిటి' అని పలు మార్లు ప్రశ్నించారు కూడా. ఏ దేవుడూ అఘాయిత్యాల్ని ఆపడంలేదు. రచయితలు, హేతువాదులు, మానవతా వాదులు, అభ్యుదయకాముకులు, విప్లవకారులు... పేరే దైనా మనిషిలోని చెడుపైన మంచి ఎప్పుడూ యుద్ధం ప్రకటిస్తూనే ఉంది. విజయం సాధిస్తూనే ఉంది. మారు తున్న పరిస్థితులకనుగుణంగా కలాలు కూడా మారుతు న్నాయి. శాంతిని, ధర్మాన్ని, విలువలను పరిరక్షించడమే ఎప్పుడూ కలాల ధ్యేయంగా ఉంటోంది. మీ రాజకీయా లతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంటే సరిదిద్దుకునేలా చేస్తున్నది వీరుగాక మరెవరు? వక్రబుద్ధితో మనిషే దుర్మార్గాలు చేస్తున్నాడు, మనిషే వాటిని సరిచేస్తు న్నాడు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చెప్పినా చెల్లు తుందనుకుంటే పొరపాటు. సామాన్యుడి విచక్షణా జ్ఞానం గొప్పది. దాని ముందు నిలిచే మాట ఏదైనా చెప్పండి. పంజాబీ రచయిత్రి దలీప్ కౌర్ తివానా 'పద్మశ్రీ'ని తిరిగిచ్చేస్తూ... అందుకు కారణాలుగా హేతు వాదుల హత్యలు, దాద్రి ఘటన, హిందుత్వవాదుల దౌర్జన్యాలు, వగైరాలను చె బుతూ గతంలో జరిగిన సిక్కులఊచకోతను కూడా పేర్కొన్నారు. అంతే, జైట్లీ లోని న్యాయవాది 'సిక్కులపై హత్యాకాండ రచయిత్రికి 31 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చిందా?'అంటూ రెచ్చిపో యారు. ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛను అణచివే స్తోందని అవార్డులను వెనక్కు పంపుతున్న రచయితల, కళాకారుల మనోభావాలను గానీ, వారి ఆవేదనను, ఆకాంక్షలనుగానీ అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయ లేదు. పైగా హత్యలు కరెక్టు, నిరసన తెలియజేయడమే తప్పు అన్నట్లుగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అధిపతి 'ఏ లోగ్ (రచయితల) సెక్యు లర్ హాతోమె ఖేల్ ర హే హై...' లౌకికవాదుల చేతుల్లో ఆటబొమ్మలయ్యారు. తామంతా లౌకకవాదులు కార నేగా? అంటే భారత్‌ను హిందూ దేశంగా మార్చదలి చారా? అధికారంలో ఉన్న పెద్దలు కాస్త ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అమెరికాకు వెళ్లి 'నాకు మీ సర్టిఫికెట్ కావాలి'అని అడుక్కున్న ప్రధానికి దేశంలోని మేధావుల అసంతృప్తి పట్టదేం? ప్రతి చిన్న దానికి పెద్ద ఉపన్యాసం ఇచ్చే ఆయనకు ఈ పెద్దాళ్లు చేసిన హత్యలు చిన్నవిగా కనిపించాయా? దీనిపై 'మన్‌కీ బాత్' వినిపించరేం? తాజా సమాచారం ప్రకారం, 'కనుమరుగౌతున్న భావప్రకటనా స్వేచ్ఛను నిరసిస్తూ భారత రచయితలు తమ అత్యున్నత పురస్కా రాలను వెనక్కి పంపిస్తున్నారు. ఇది ఒక రకంగా మోదీ ప్రభుత్వంపై అంసతృప్తే!!'అని 'టైమ్స్'పత్రిక ప్రపంచదేశాలకు చాటి చెప్పింది. (వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 9908633949)