కలం గళంపై అధికారం హజం
భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారంటున్న రచయితల, కళాకారుల మనో భావాలను, ఆవేదనను, ఆకాంక్షలను అర్థం చేసుకునే ప్రయత్నమైనా జైట్లీ చేయలేదు. పైగా హత్యలు కరెక్టు, నిరసన తెలియజేయడమే తప్పు అన్నట్లుగా మాట్లాడారు.
'మారే జాయేంగే రావణ్, జయ్ హోంగే రామ్/ పర్ జో, పూల్ బనాయింగె ఓ ఇతిహాస్ మె బందర్ కహలాయింగె' అన్నారు ఆధునిక హిందీ కవి 'అజ్ఞేయ' రావణుడు మరణిస్తాడు, రాముడు విజయుడవు తాడు. వంతెన నిర్మించిన వారిని మాత్రం కోతులని పిలుస్తారు. నేడు రచయితల పరిస్థితీ అలాగే ఉంది. 'అవార్డులు వాపసు చేస్తున్న రచయితలంతా ఇక ముందు రాయడం మానేస్తారా?' అని కేంద్ర సాంస్కృ తిక మంత్రి మహేశ్‌శర్మ ప్రశ్నించారు. ఒక రచయితపై ఒత్తిడి చేసి 'నేను చచ్చిపోయాను'అని ప్రకటన చేయించిన ఘటనను అది గుర్తుకు తెస్తోంది. అవార్డులను వాపసు చేసిన రచయితలు ఇక రాయకూడదు, వారి భావజాలం ప్రజల్లోకి వెళ్లకూడదు అనే భావన సదరు మంత్రి మనసులో బలంగా ఉన్నది. సుప్రీంకోర్టు న్యాయవాదైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు.
'అవార్డులు వెనక్కిచ్చి కొందరు మరో రకమైన రాజకీయం చేయదలచారు, ఇదంతా ముందస్తుగా తయారు చేసిన పేపరు తిరుగు బాటు, ఇది రచయితల మేధోపరమైన అసహనం'అన్నారు. రచయితలు, హేతువాదులు చేసిన రాజకీ యం ఏమిటో మాత్రం ఆయన చెప్పలేదు. ఇతరుల ఆలోచనల మీద, ఆహారపు అలవాట్ల మీద అసహనం ప్రకటిస్తున్నవారి గురించి, అలాంటి వారు చేసిన హత్యల గురించి జైట్లీ మాట్లాడరు. పైగా ఆ హత్యలు జరిగిన చోట అధికా రంలో ఉన్నవారిని వదిలి కేంద్రాన్ని ఎందుకు విమర్శి స్తారూ? అంటూ ప్రశ్నలు సంధిం చారు. అయ్యా, జైట్లీ గారూ! జరుగుతున్న దౌర్జన్యాలన్నీ తమ పార్టీ సోదర సంస్థలు చేసినవేననేది బహిరంగ రహస్యం. జరుగుతున్న దాడులన్నీ వామపక్షవాదులు, హేతువాదులు, మైనారిటీలపైనేననేది అంతకంటే బహి రంగ రహస్యం. ఇందిర ఎమర్జెన్సీ, 1989 భగల్‌పూర్ అల్లర్లు, 1994 నాటి సిక్కుల ఊచకోత వంటి సంద ర్భాల్లో ఈ రచయితలేం చేశారని అసహనంగా ప్రశ్నిస్తూ కోర్టు దబాయింపులకు దిగారు. కానీ ఇది కోర్టు కాదు. జీవితం! జీవితం గురించి చెప్పగల అవగాహన, అధికా రమూ మీకంటే రచయితలకే ఎక్కువగా ఉంది.
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని, సిక్కుల ఊచకోతను, గుజరాత్ గాయాన్ని, భగల్‌పూర్ అల్లర్లను రచయితలు ఖండించారు. అవార్డును తిరిగిచ్చేసిన వారిలో ఒకరైన నయనతారా సెహెగల్ (88) స్వయానా ఇందిరాగాంధీకి మేనకోడలు. ఆమె ఎమర్జెన్సీని ఖండించడమే కాదు, 'ఒకే పార్టీ దేశాన్ని పాలిస్తూ ఉండటమేమిటి' అని పలు మార్లు ప్రశ్నించారు కూడా. ఏ దేవుడూ అఘాయిత్యాల్ని ఆపడంలేదు. రచయితలు, హేతువాదులు, మానవతా వాదులు, అభ్యుదయకాముకులు, విప్లవకారులు... పేరే దైనా మనిషిలోని చెడుపైన మంచి ఎప్పుడూ యుద్ధం ప్రకటిస్తూనే ఉంది. విజయం సాధిస్తూనే ఉంది.
మారు తున్న పరిస్థితులకనుగుణంగా కలాలు కూడా మారుతు న్నాయి. శాంతిని, ధర్మాన్ని, విలువలను పరిరక్షించడమే ఎప్పుడూ కలాల ధ్యేయంగా ఉంటోంది. మీ రాజకీయా లతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంటే సరిదిద్దుకునేలా చేస్తున్నది వీరుగాక మరెవరు? వక్రబుద్ధితో మనిషే దుర్మార్గాలు చేస్తున్నాడు, మనిషే వాటిని సరిచేస్తు న్నాడు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చెప్పినా చెల్లు తుందనుకుంటే పొరపాటు. సామాన్యుడి విచక్షణా జ్ఞానం గొప్పది. దాని ముందు నిలిచే మాట ఏదైనా చెప్పండి. పంజాబీ రచయిత్రి దలీప్ కౌర్ తివానా 'పద్మశ్రీ'ని తిరిగిచ్చేస్తూ... అందుకు కారణాలుగా హేతు వాదుల హత్యలు, దాద్రి ఘటన, హిందుత్వవాదుల దౌర్జన్యాలు, వగైరాలను చె బుతూ గతంలో జరిగిన సిక్కులఊచకోతను కూడా పేర్కొన్నారు. అంతే, జైట్లీ లోని న్యాయవాది 'సిక్కులపై హత్యాకాండ రచయిత్రికి 31 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చిందా?'అంటూ రెచ్చిపో యారు. ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛను అణచివే స్తోందని అవార్డులను వెనక్కు పంపుతున్న రచయితల, కళాకారుల మనోభావాలను గానీ, వారి ఆవేదనను, ఆకాంక్షలనుగానీ అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయ లేదు. పైగా హత్యలు కరెక్టు, నిరసన తెలియజేయడమే తప్పు అన్నట్లుగా మాట్లాడారు.
ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి 'ఏ లోగ్ (రచయితల) సెక్యు లర్ హాతోమె ఖేల్ ర హే హై...' లౌకికవాదుల చేతుల్లో ఆటబొమ్మలయ్యారు. తామంతా లౌకకవాదులు కార నేగా? అంటే భారత్‌ను హిందూ దేశంగా మార్చదలి చారా? అధికారంలో ఉన్న పెద్దలు కాస్త ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అమెరికాకు వెళ్లి 'నాకు మీ సర్టిఫికెట్ కావాలి'అని అడుక్కున్న ప్రధానికి దేశంలోని మేధావుల అసంతృప్తి పట్టదేం? ప్రతి చిన్న దానికి పెద్ద ఉపన్యాసం ఇచ్చే ఆయనకు ఈ పెద్దాళ్లు చేసిన హత్యలు చిన్నవిగా కనిపించాయా? దీనిపై 'మన్‌కీ బాత్' వినిపించరేం? తాజా సమాచారం ప్రకారం, 'కనుమరుగౌతున్న భావప్రకటనా స్వేచ్ఛను నిరసిస్తూ భారత రచయితలు తమ అత్యున్నత పురస్కా రాలను వెనక్కి పంపిస్తున్నారు. ఇది ఒక రకంగా మోదీ ప్రభుత్వంపై అంసతృప్తే!!'అని 'టైమ్స్'పత్రిక ప్రపంచదేశాలకు చాటి చెప్పింది.
(వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 9908633949)