పాట్నా: పలువురు మేధావులు, రచయితలు దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోందంటూ, తమకు లభించిన జాతీయ అవార్డులను తిరిగి ఇస్తున్నారు. తాజాగా పలువురు సినీ దర్శకులు తమ అవార్డులను వెనక్కి ఇచ్చారు. దీనిపై కేంద్ర ఆర్ధీక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. అవార్డులను వెనక్కి ఇవ్వడం బీజేపీకి వ్యతిరేకంగా చేపడుతున్న మతిలేని చర్యగా అభివర్ణించారు. అవార్డులను వెనక్కి ఇచ్చిన వారిలో కొందరు గత సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వారణాసిలో ప్రచారం నిర్వహించారని తెలిపారు.
అవార్డులను వెనక్కి ఇవ్వడం అనేది మరో రకమైన రాజకీయ చర్యగా జైట్లీ అభివర్ణించారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంగా దీనిని చూడాలన్నారు. గత యూపీఏ పాలనలో జరిగిన లక్షల కోట్ల రూపాయల అవినీతి సమయంలో దేశంలో పాలన సక్రమంగా ఉందని ఈ మేధావులు భావించారా? అని జైట్లీ ఎద్దేవా చేశారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్కు చెందిన విద్యార్ధులు తమ ఆందోళనను విరమించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపిన మంత్రి, కేంద్ర ప్రభుత్వం ఎఫ్టీఐఐని అత్యున్నతమైన సంస్థగా తీర్చిదిద్దుతుందని అన్నారు.