సందర్భం
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది.
యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు.
ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది.
పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు.
అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది.
సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు.
విభిన్న షిఫ్ట్ సిస్టవ్‌ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్‌ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది.
సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు.
కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్‌ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్‌షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి.
ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి.
డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి
వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు
(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment