రూప్ రేఖా వర్మ; కరపత్రాలు పంచుతూ...; అవగాహన కల్పిస్తూ...
విశ్రాంత జీవనం అంటేనే ఎన్నో అనుభవాలతో కూడుకున్నది. పోరాటాల జీవనమైతే వాటి ఫలితాల గురించి నలుగురికి తెలియజేసి, సమస్యల పరిష్కార దిశగా సాగమని సూచనలు చేస్తారు. 79 ఏళ్ల రూప్ రేఖా వర్మ జీవనం పోరాటాల ప్రయాణమే. లక్నో వీధుల్లో నిలబడి అన్యాయాలను ప్రతిఘటించమని, న్యాయంగా జీవించమని వీధుల్లో కరపత్రాలను పంపిణీ చేసి మరీ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అంతేకాదు.. కేరళ జర్నలిస్ట్ కప్పన్‌కు ఉత్తర్ ప్రదేశ్‌లో బెయిల్ ఇచ్చేందుకు ఈ వయసులోనూ ధైర్యంగా ముందుకొచ్చి వార్తల్లో నిలిచారు.
లేమి నుంచే పోరాటం..
తను చదువుకున్నప్పటి రోజుల గురించి వివరిస్తూ ‘యూనివర్శిటీలో ఎం.ఏ. చేస్తున్నప్పుడు టీచర్లతో, సీనియర్లతో మాట్లాడాలన్నా భయమేసేది. కానీ, అక్కడ అమ్మాయిల కోసం ఏమాత్రం సౌకర్యాలు ఉండేవి కావు. ముఖ్యంగా ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేవి కావు. చాలా కష్టంగా అనిపించేది. ఇలా భయపడితే లాభం లేదు. ఏదైనా తెగింపుతోనే సాధ్యం అనుకున్నాను. అలాగే, కాలేజీ సమస్యలపై గళమెత్తాను. దీంతో టాయ్‌లెట్స్ మాత్రమే కాదు ఉమెన్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. ఇది అప్పటి రోజుల్లో పెద్ద విజయమే. ఆ తర్వాత అదే యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరాను.
అధ్యాపకురాలిగా...
‘ఎక్కువగా సామాజిక సమస్యలపైనే విద్యార్థులకు బోధన ఉండేది’ అంటూ 40 ఏళ్లు యూనివర్శిటీ అనుభవాలను మన ముందుంచుతోంది ఈ అధ్యాపకురాలు. మూడేళ్ల పాటు జీతం లేకుండా ప్రత్యేకంగా ఉమెన్ రీసెర్చ్ సెంటర్‌ను సైతం నిర్వహించారు. అదే సమయంలో కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రీసెర్చ్ అకడమిక్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయడంతో పాటు లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేసింది. ‘సిలబస్‌కు మించి సమాజంపై అవగాహనకు పుస్తకాలే దోహదం చేశాయి. సాహిత్యంపై ఆసక్తి, తత్త్వశాస్త్ర అధ్యయనం వల్ల అభ్యుదయ భావాలు అభివృద్ధి చెందాయి’ అని తనకు కలిగిన ఆలోచనల గురించి నలుగురితో పంచుకుంటోంది. తన∙హయాంలో అప్లికేషన్ ఫారమ్‌లో అప్పటివరకు తండ్రి పేరు మాత్రమే ఉండేదని, ఆ తర్వాత కాలంలో తల్లిపేరు కూడా చేర్చేలా చేశామని వివరిస్తుంది.
హత్యారోపణలు
‘దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి నా వయసు నాలుగేళ్లు. మా నాన్న డాక్టర్‌గా సేవలు అందజేసేవాడు. నాటì స్వాతంత్య్ర రోజుల్లో సమస్యలను చూస్తూ, కథలు వింటూ పెరిగాను. ఇంట్లోనూ దేశానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ చర్చల్లో ఉండేవి. కాలేజీలోనూ ఏ కార్యక్రమమైనా చర్చావేదిక ఉంటే అక్కడ తప్పక నేనుండేదాన్ని. మతం పేరుతో, కులం పేరుతో అల్లర్లు సృష్టించేవారుండేవారు. ఏదో విధమైన గొడవలకు విద్యార్థులను ప్రేరేపించేవారు. ఆ అల్లర్లు ఎలా ఉండేవంటే.. నా మీద హత్యారోపణలు కూడా వచ్చాయి. నా పైన తప్పుడు కేసులు పెట్టారు. నాపైన దుష్ప్రచారాలతో కూడిన ఉత్తరాలు ఇంటింటికీ పంపించారు. యూనివర్శిటీలో ఉద్యోగానికి, బోధించడానికి అవన్నీ అడ్డు పడ్డాయి. ఏడాదిన్నరపాటు కోర్టులో పోరాటం చేసి నెగ్గాను. సమాజం, విద్యార్థులు నాకు తోడుగా నిలిచారు. దీంతో నా గురించి చాలా మందికి తెలిసింది..’ అంటూ తాను సమస్యలను ఎదుర్కొన్న విధం గురించి వివరిస్తారు.
పెళ్లి వ్యాపారం కాదు..
వివాహ వ్యవస్థ గురించి తెలియజేస్తూ ‘మన సమాజంలో అమ్మాయిల పెళ్లికి సంబంధించి ఎప్పుడూ తప్పుడు ఆలోచనలే ఉంటాయి. ఆడపిల్లకు వయసు వస్తే చాలు పెళ్లెప్పుడు అని ప్రశ్నిస్తుంటారు. ఎవరో తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో అని చెబుతారు. ‘నో’ చెబితే ఎందుకు చేసుకోవు.. అని నిలదీస్తారు. పెళ్లి అంటే వ్యాపారం కాదు కదా! నేనెవరినీ ఇష్టపడలేదు. ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను. లేదంటే లేదు’ అని ఇంట్లోవారికి గట్టిగానే చెప్పాను. దీంతో ఎవరూ నా ఆలోచనకు విరుద్ధంగా ప్రవర్తించలేకపోయారు’ అని తన ఒంటరి జీవితం గురించి వివరించే రూప్ రేఖా వర్మ 1980లో ‘సాజీ దునియా’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. సమస్యలపై ఒంటరిగా పోరాడటం మొదలుపెట్టారు. ‘మొదట్లో ఆ సంస్థలో చాలా కొద్దిమంది మాత్రమే చేరారు. ఏం చేసైనా సమతా సమాజాన్ని సృష్టించడమే లక్ష్యంగా కొనసాగుతాను’ అని చెబుతారు.
వీధి వీధిలో అవగాహన..
ప్రభుత్వాలు, వారి అణచివేత, సమాజంలో వివక్ష విధానాలపై కాలేజీ రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్న రేఖా వర్మ ‘అధ్యాపకురాలిగా ఉన్నప్పటి నుంచే వీధుల్లో కరప్రతాలు పంచుతూనే ఉన్నాను’ అని తెలియజేస్తారు. ‘లక్నో వీధుల్లో నిలబడి స్వాతంత్య్రానికి ముందు భారతీయులు సమష్టి్టగా జరిపిన విప్లవాల గురించి కథనాలున్న కరపత్రాలను పంచుతున్నాను. సంఘటితంగా పోరాటం చేస్తేనే ఏదైనా మనకు చేరువ అవుతుంది అని చెప్పడమే నా లక్ష్యం. కులం, మతం అనే వివక్ష, ద్వేషం వదిలేసి మిగిలిన జీవిత సమస్యలపై దృష్టి పెట్టండి. వాటి పరిష్కారానికి చేయీ చేయీ కలపండి. దేశంలో పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఉద్యమించండి. విభేదాలు విడిచిపెట్టి, ఒక్కతాటి పైకి వస్తేనే దేశం పురోగమిస్తుంది’ అని చాటుతోంది ఈ అధ్యాపకురాలు.
ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ కష్టపడ్డాం ఇక విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడిపేద్దాం అని చాలామంది అనుకుంటారు. కానీ, లక్నో యూనివర్శిటీకి వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేసి రిటైర్ అయిన రూప్ రేఖా వర్మ మాత్రం మంచి పనికి అసలు రిటైర్మెంట్ లేదనుకుంది. ఎనిమిది పదుల వయసుకు చేరువలో ఉన్న రూప్ రేఖ ఈ సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకుంది. అన్యాయాలపై పోరాటం చేయడానికి అవగాహనే లక్ష్యంగా సాగాలని వీధి వీధి తిరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment