ముందే రిటైర్మెంటా.. 20 ప్లస్‌లో ఆరంభిస్తే సాధ్యమే | The effect of early retirement schemes on youth employment | Sakshi
Sakshi News home page

ముందే రిటైర్మెంటా.. 20 ప్లస్‌లో ఆరంభిస్తే సాధ్యమే

Published Mon, Jan 23 2023 12:30 AM | Last Updated on Mon, Jan 23 2023 4:52 AM

 The effect of early retirement schemes on youth employment - Sakshi

నేటి తరం యువత 60 ఏళ్లు వచ్చే వరకు కష్టపడాలని అనుకోవడం లేదు. కెరీర్‌ను ముందుగానే ముగించాలని కోరుకుంటోంది. ముందస్తు రిటైర్మెంట్‌ ఆకాంక్ష క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా రిటైర్‌ అయితే, అప్పటి నుంచి తమ అభిరుచులకు అనుగుణంగా స్వేచ్ఛగా జీవించొచ్చనే కాన్సెప్ట్‌ ఆదరణకు నోచుకుంటోంది. తోటి వారిని చూసి దీనికి ఆకర్షితులయ్యే వారూ ఉంటున్నారు. కానీ, ఇది ఎలా సాధ్యం? ఇదే ఎక్కువ మందికి ఎదురయ్యే ప్రశ్న.

దీనిపై స్పష్టత తెచ్చుకోలేక, తర్వాత చూద్దాంలే.. అని అనుకుని కెరీర్‌లో సాగిపోయేవారూ ఉన్నారు. ఉద్యోగ, వృత్తి బాధ్యతలకు ముందస్తుగా విరమణ పలికి, నచ్చినట్టు జీవించడం అంటే వినడానికి ఎంతో ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, దీన్ని చేరుకోవాలంటే సరైన లెక్కలు, ప్రణాళికలు కావాలి. వాటిని ఆచరణలో పెట్టినప్పుడు లక్ష్యం సఫలమవుతుంది. ఇందుకు ఏం చేయవచ్చన్నది అవగాహన కల్పించే కథనం ఇది.

రిటైర్మెంట్‌ అన్నది అన్నింటిలోకి చివరి లక్ష్యం అవుతుంది. దీనికంటే ముందు జీవితంలో నెరవేర్చాల్సిన, సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు తదితరాలు. వీటిని సాధించేందుకు సరైన దిశలోనే అడుగులు వేస్తున్నారా? రిటైర్మెంట్‌ కంటే ముందుగా ఎదురయ్యే లక్ష్యాలకు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక అవసరం. వీటిని చేరుకునేందుకు కావాల్సినంత, సరైన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. లేకపోతే జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యాల విషయంలో ఏ మాత్రం లెక్కలు తప్పినా, రిటైర్మెంట్‌ లక్ష్యం విషయంలో రాజీ పడాల్సి రావచ్చు.

ఎవరైనా కానీ, ముందుగా ఎదురుపడే అవసరం గురించే ఆలోచిస్తారు. అందుకే ముందే రిటైర్మెంట్‌ తీసుకోవాలంటే, దానికంటే ముందు ఎదురయ్యే వాటి గురించి కూడా ప్రణాళిక వేసుకోవాలి. జీవితంలో కీలకమైన లక్ష్యాలు సాధించలేకపోతే రిటైర్మెంట్‌ సాధ్యం కాదన్న సూక్ష్మాన్ని గుర్తించాలి. ‘‘సురక్షితమైన భవిష్యత్తుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత మీ జీవన శైలి పదవీ విరమణ తర్వాత దిగజారిపోకూడదు. వైద్య చికిత్సలకు అవసరమైనంత నిధి ఉండాలి. పిల్లల విద్య, వారి వివాహాలు, కారు కొనుగోలు, సెలవుల్లో పర్యటనలు వీటన్నింటికీ ఏర్పాట్లు ఉండాలి’’అని హమ్‌ ఫౌజీ సీఈవో సంజీవ్‌ గోవిలా సూచించారు.

ఎంత కావాలి..?
విశ్రాంత జీవనం కోసం సమకూర్చుకోవాల్సిన నిధి విషయంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే సమకూర్చుకున్న నిధి ఏ మూలకూ చాలకపోవచ్చు. అదే జరిగితే పేరుకే రిటైర్మెంట్‌ అవుతుంది. ఆ తర్వాత ఖర్చులకు చాలక మళ్లీ ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకుని రిటైర్మెంట్‌ కోసం కావాల్సిన నిధిని పక్కా అంచనా వేయాలి. ఈ విషయంలో నిపుణుల సాయం ఎంతో అవసరం పడుతుంది. రిటైర్మెంట్‌కు సంబంధించి కావాల్సిన నిధిని అంచనా వేయడం అత్యంత ముఖ్యమైనదని రైట్‌ హారిజాన్స్‌ ఫండ్‌ మేనేజర్‌ అనిల్‌ రెగో పేర్కొన్నారు.

ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం నెలవారీ ఖర్చులు రూ.25,000 ఉన్నాయని అనుకుందాం. అతడు ఏ వయసులో రిటైర్‌ అయితే ఆ తర్వాత జీవనానికి ఎంత మొత్తం కావాలన్నది ఇక్కడి పట్టికలో చూడొచ్చు. ప్రస్తుత నెలవారీ వ్యయాలకు ఏటా సగటున 5 శాతం ద్రవ్యోల్బణం ప్రభావం పరిగణనలోకి తీసుకుని రిటైరయ్యే నాటికి ఎంత కావాలో వేసిన అంచనాలు ఇవి. పట్టికలోని నెలవారీ పెట్టుబడిని ఏడాదికోసారి 8 శాతం పెంచుతూ వెళ్లాలి. పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి వస్తుందన్న అంచనా. రిటైర్మెంట్‌ నాటికి సమకూరిన ఫండ్‌పై ఆ తర్వాత ఏటా 7 శాతం రాబడి వస్తుందని అనుకుంటే, ఇంత మొత్తం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

అవసరాలు వేర్వేరు..
రిటైర్మెంట్‌కు తక్కువ వ్యవధి ఉన్నప్పుడు నెలవారీ పెట్టుబడికి ఎక్కువ మొత్తం అవసరపడుతుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన జీవనశైలి, అవసరాలు, ఖర్చులు ఉంటుంటాయి. కనుక నెలవారీ ఎంత మొత్తం, ఏడాదికి ఎంత చొప్పున కావాలన్నది ఎవరికి వారు అంచనాకు రావాలి. ఏడాదికి తమ ఖర్చులు, తమ ఆరోగ్య అవసరాలు, ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉన్నాయా? పిల్లలు ఎంత మంది? వారికి ఏ స్థాయి ఖర్చులో విద్య చెప్పించాలని అనుకుంటున్నారు? సొంతింటి ప్రణాళిక, వాహనం ఇత్యాది అవసరాలన్నింటినీ ఒక జాబితాగా రాసుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక సలహాదారు లేదంటే పెట్టుబడి సలహాదారును సంప్రదించాలి.

వారు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, నెలవారీగా దేనికి ఎంత మొత్తం పొదుపు, మదుపు చేయాలి, ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి? అనేది ఒక ప్రణాళిక రూపొందించి ఇస్తారు. దీనికోసం ద్రవ్యోల్బణం, జీవిత కాలం తదితర అంశాలను వారు విశ్లేషిస్తారు. వారిచ్చిన ప్రణాళిక ప్రకారం సాగిపోవాలి. 30 ఏళ్ల వ్యక్తి నెలవారీ ఖర్చులు రూ.30,000 ఉన్నాయని అనుకుంటే ఏ వయసులో రిటైర్మెంట్‌ అయితే ఎంత మొత్తం కావాలో ఇక్కడి టేబుల్‌లో చూడొచ్చు. పైన టేబుల్‌ మాదిరే జీవిత కాలం 90 ఏళ్లకు అనుకుని, ఏటా పెట్టుబడిపై 10 శాతం రాబడి అంచనా ప్రకారం, ఏటా పెట్టుబడి 8 శాతం పెంచుతూ వెళ్లే విధంగా, రిటైర్మెంట్‌ తర్వాత 7 శాతం రాబడి కోసం సమకూర్చుకోవాల్సిన నిధి అంచనాలు ఇవి.

అప్రమత్తత
రిటైర్మెంట్‌కు మరో ఐదేళ్లు ఉందనగా పెట్టుబడుల విషయంలో అప్రమత్తం కావాలి. ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వారు మార్కెట్‌ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణమైన వ్యూహాన్ని అమల్లో పెట్టాలి. ఉదాహరణకు 2008 మార్కెట్‌ పతనం, 2020 మార్కెట్‌ పతనం గుర్తుండే ఉంటాయి. 2020 మార్కెట్‌ పతనం తర్వాత స్టాక్స్‌ రికవరీకి ఏడాది సమయం పట్టింది. కొన్ని స్టాక్స్‌ పూర్తిగా కోలుకుని కొత్త గరిష్టాలకు చేరుకుంటే, కొన్ని ఆలస్యంగా రికవరీ అయ్యాయి. అందుకుని రిటైర్మెంట్‌కు మరో మూడు–ఐదేళ్లు ఉందనగా, మార్కెట్‌ సైకిల్‌ను అర్థం చేసుకోవాలి.

భారీ దిద్దుబాటు వచ్చి దిద్దుబాటు వచ్చి చాలా ఏళ్లు అయ్యిందా? మార్కెట్ల వ్యాల్యూషన్లు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో చలిస్తున్నాయా? ఇలాంటి అంశాలపై నిపుణుల సాయంతో అంచనాకు రావాలి. మూడు ఐదేళ్ల ముందు నుంచి ఏటా నిర్ణీత శాతం చొప్పున ఈక్విటీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ డెట్‌ సాధనాల్లోకి మళ్లించుకోవాలి. రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఈక్విటీల్లో కొంత మేర పెట్టుబడులు అవసరంపడతాయి.

ఎందుకంటే ముందుగా రిటైర్మెంట్‌ తీసుకుంటున్నారు. ఆ తర్వాత కనీసం 25 ఏళ్ల నుంచి 35–40 ఏళ్ల పాటు జీవించి ఉండే వారికి ఈక్విటీలు తప్పనిసరి. అప్పుడే కార్పస్‌ కరిగిపోకుండా ఉంటుంది. అందుకుని నిపుణులు సూచించిన మేర ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించి, మిగిలిన మొత్తాన్ని క్రమంగా వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఊహించని విధంగా రిటైర్మెంట్‌ నాటికి మార్కెట్లు భారీ దిద్దుబాటుకు గురైతే అప్పుడు రిటైర్మెంట్‌ లక్ష్యాన్ని ఏడాది నుంచి మూడేళ్ల పాటు వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. అందుకుని సాధ్యమైన మేర లక్ష్యం వాయిదా పడకూడదంటే ముందస్తు జాగ్రత్తలు తప్పదు.

అవరోధాలు..
ముందుగా పదవీ విమరణ తీసుకునే వారికి సంపాదించే కాలం ఇతరులతో పోలిస్తే తక్కువ ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలంలో సమకూర్చుకోవాల్సినంత 20–25 ఏళ్లకే సాధించాలి. రిటైర్మెంట్‌ తర్వాత ఇతరులపై ఆధారపడకూడదు. పైగా ముందస్తు రిటైర్మెంట్‌ అంటే ఉదాహరణకు 55 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకుంటారని అనుకుందాం. అక్కడి నుంచి కనీసం 80 ఏళ్ల వరకు జీవించి ఉంటారని అనుకుంటే, 35 ఏళ్ల కాలానికి అవసరాలు తీర్చేంత ఫండ్‌ కావాలి. 25–30 ఏళ్లకు కెరీర్‌ ఆరంభిస్తే.. అక్కడి నుంచి ముందస్తు రిటైర్మెంట్‌కు 30–25 ఏళ్లే మిగిలి ఉంటుంది.

తక్కువ కాలంలో ఎక్కువ కాలానికి ఫండింగ్‌ ఏర్పాటు చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదన్నది గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణతో, ఎటువంటి దుబారాకు చోటు ఇవ్వకుండా సంపాదనలో అధిక భాగం భవిష్యత్తుకు పొదుపు చేసుకున్నప్పుడు లక్ష్యం సాకారం అవుతుంది. ఉదాహరణకు పిల్లల విద్య కోసం బడ్జెట్‌ వేసుకుంటే, ఆ బడ్జెట్‌ మించకుండా దాన్ని అధిగమించాలి. లేదంటే వేరే లక్ష్యం కోసం ఉద్దేశించిన మొత్తం నుంచి దానికి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు గొలుసుకట్టు మాదిరి ఒకదాని కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది. లేదంటే రుణం తప్పదు.

రాబడి రేటు కీలకం
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ రూపంలో (సిప్‌) ఇన్వెస్ట్‌ చేసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు అందుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే, పెట్టుబడుల విధానంలో చిన్న మార్పుతోనూ మెరుగైన నిధిని సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మనకు ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగే మొత్తానికి అనుగుణంగా సిప్‌ పెట్టుబడినీ పెంచుకుంటూ వెళ్లాలి. ఏడాదికోసారి ఆర్జన పెరిగినప్పుడు పెట్టుబడిని పెంచుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. ఖర్చులు కూడా ద్రవ్యోల్బణ ప్రభావంతో ఏటా పెరుగుతూ ఉంటాయి.

ఖర్చులు పెరిగాయని పెట్టుబడుల విషయంలో రాజీ పడితే లక్ష్యం సాకారం కాదు. అనవసర ఖర్చులను తగ్గించుకుని అయినా అనుకున్న మేర, ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లాలి. ఏటా ఆదాయం అనుకున్న మేర పెరగకపోతే ఎలా? దీనికి సంబంధించి కూడా ప్లాన్‌–బి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్రస్తుత జీవనశైలిలో పూర్తి రాజీ పడకూడదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రెండింటినీ సమన్వయం చేసుకునే విధంగా ఆచరణ ఉండాలి. అలాగే, ఏటా పెట్టుబడిని పెంచడం ఒక్కటి కాకుండా, పెట్టుబడి సాధనాల మధ్య సమతూకం కూడా ఉండాలి.

అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాల్సిందే. పెట్టుబడులకు కనీసం 20 ఏళ్లు అంతకుమించి కాలం ఉంటే అగ్రెస్సివ్‌ ప్రణాళిక వేసుకోవచ్చు. ఈక్విటీలకు 75 శాతం నుంచి 100 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌ ప్లాన్‌లోనూ 75 శాతం ఈక్విటీ పెట్టుబడులకు ఆప్షన్‌ ఉంది. ఎంత ఎక్కువ కాలం ఉంటే కాంపౌండింగ్‌ వల్ల అంత పెద్ద మొత్తం సమకూరుతుంది.

రిటైర్మెంట్‌కు సంబంధించి అధిక రిస్క్‌ తీసుకునే వారికి సాధారణంగా 70–80 శాతం ఈక్విటీలు, మిగిలిన 20 శాతం మేర స్థిరాదాయ (డెట్‌) పథకాలను నిపుణులు సూచిస్తుంటారు. నిజానికి చాలా మంది విషయంలో గమనిస్తే అన్నింటికంటే ఆలస్యంగా మొదలు పెట్టేది రిటైర్మెంట్‌ కోసమే అవుతోంది. ఎక్కువ మంది చేసే పెద్ద తప్పిదం ఇదే. ఆర్జన మొదలైన మొదటి నెల నుంచే రిటైర్మెంట్‌ కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ ఆరంభించిన వారు చాలా సులభంగా కావాల్సిన నిధిని సమకూర్చుకోగలరు. అంతేకాదు, కాంపౌండింగ్‌ పవర్‌తో ముందస్తు రిటైర్మెంట్‌ వీరికి చాలా సులభం అవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ ఈ లక్ష్యం భారంగా మారుతుంది.

రిస్క్‌లు–రక్షణ
ముందస్తు రిటైర్మెంట్‌ లక్ష్యం పెట్టుకున్న వారు రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణాలు తీసుకున్నా, రిటైర్మెంట్‌ పెట్టుబడుల ప్రణాళికకు అవరోధంగా లేకుండా ఉండాలి. రిటైర్మెంట్‌ నాటికి తీర్చేలా ఉండాలి. మరీ ముఖ్యంగా ముందస్తు రిటైర్మెంట్‌ తీసుకునే వారు ఉద్యోగం భద్రత అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. రుణాలపై మారటోరియం ఆప్షన్‌ తీసుకున్న వారు ఎందరో ఉన్నారు.

ఇలాంటి ఊహించని పరిణామాలు ఎదురైతే ప్రణాళిక వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ విధమైన రిస్క్‌లను ఎదుర్కొనే ప్రణాళిక కూడా కావాలి. అలాగే, రోడ్డు ప్రమాదంలో గాయపడి వైకల్యం పాలై ఆర్జన ఆగిపోయే పరిస్థితి వస్తే..? అనుకున్నదంతా తలకిందులైపోతుంది. దీనికి సంబంధించి బీమా కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. అలాగే, మనకు ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబాన్ని ఆదుకునే జీవిత బీమా, ఆస్పత్రిలో వైద్యం కోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకుని చాలా ముందుగానే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

గమనిక: ఇక్కడ పట్టికల్లో ఇచ్చిన అంచనాలు అన్నీ కూడా పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి ప్రకారం వేసిన అంచనాలు. కానీ, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో 12 శాతం వార్షిక రాబడి సాధ్యమే. కనుక ఆ ప్రకారం చూస్తే చేయాల్సిన నెలావారీ పెట్టుబడి 10 శాతం తక్కువైనా అనుకున్న కార్పస్‌ను సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement