కోల్‌కతా: విశ్రాంత జీవనం (రిటైర్మెంట్ తర్వాత) కోసం సన్నద్ధతతో తూర్పు భారత్ ప్రజలు ఇతర ప్రాంతాల వారితో పోల్చితే ముందున్నారు. ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్‌లో సున్నా నుంచి నూరు వరకు స్కేల్‌పై ఉత్తర భారత్ 54 పాయింట్ల వద్ద ఉంది. అదే దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలు రిటైర్మెంట్ జీవితానికి సన్నద్ధతలో 48 పాయింట్ల వద్దే ఉన్నాయి. పశ్చిమ భారత్ 49 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
జాతీయ సగటు 49 పాయింట్లుగా ఉంది. కాంటార్‌తో కలసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం’ నాలుగో ఎడిషన్ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. పట్టణ వాసుల్లో రిటైర్మెంట్ సన్నద్ధత ఎలా ఉంది, దీనిపై వారిలో ఉన్న అవగాహన, ఆకాంక్షలు, రిటైర్మెంట్ సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, ప్రణాళికల గురించి ఈ అధ్యయనం తెలుసుకునే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 28 పట్టణాల్లో 25–65 ఏళ్ల వయసులోని వారి అభిప్రాయాలు తెలుసుకుంది.
అధ్యయనం వివరాలు..
తూర్పు భారత్‌లో 72 శాతం మంది రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతేడాది ఇది 67 శాతంగా ఉంది. ఇదే ప్రాంతంలో 82 శాతం మంది ఆరోగ్యం కాపాడుకుంటామని నమ్మకంగా చెప్పారు. 67 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్‌ను రిటైర్మెంట్ భద్రత కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఎన్‌పీఎస్ ఖాతా ఉంది. ఈ ప్రాంతంలో జీవిత బీమాపై 97 శాతం మందికి, హెల్త్ ఇన్సూరెన్స్‌పై 90 శాతం మందికి అవగాహన ఉంది.
పశ్చిమ భారత్‌లో 66 శాతం మంది, ఉత్తర భారత్‌లో 60 శాతం, దక్షిణ భారత్‌లో 58 శాతం మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు.
తూర్పు భారత్‌లో 56 శాతం మంది 35 ఏళ్లలోపే రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టడాన్ని సమర్థించారు. 50 ఏళ్లకు పైబడిన వారిలో 94 శాతం మంది ముందుగా రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు ప్రారంభించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
కనీస అవసరాలను తీర్చుకునే విషయంలో 62 శాతం మంది, పిల్లల భవిష్యత్ విషయమై 64 శాతం మందిలో ఆందోళన కనిపించింది.
94 శాతం మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సహకారం విషయంలో విశ్వాసాన్ని వ్యక్తం చేయగా, 64 శాతం మంది ఒంటరితనం విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పర్యావరణం పట్ల 76 శాతం మందిలో ఆందోళన కనిపించింది.
తూర్పు భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరు రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు.
ప్రతి ముగ్గురిలో ఒకరు వైద్య అవసరాలు, పిల్లల భవిష్యత్‌కూ తమ ప్రణాళికల్లో భాగంగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
పెరుగుతున్న ప్రాధాన్యత..
జీవనకాలం పెరుగుతుండడంతో భారతీయులకు రిటైర్మెంట్ ప్రణాళిక అత్యంత కీలకంగా మారుతోంది. మా అధ్యయనంలో గుర్తించిన అంశాలు మారుతున్న రిటైర్మెంట్ అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయి. దేశవ్యాప్తంగా రిటైర్మెంట్ విషయమై సమగ్రమైన విధానాన్ని అనుసరించేందుకు ఈ అధ్యయనం స్ఫూర్తినిస్తుంది.
– ఈవీపీ రాహుల్ తల్వార్,మ్యాక్స్‌లైఫ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment