పదవీ విరమణ తర్వాత సమకూర్చుకున్న నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు 3బకెట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? – అనురాగ్
వివిధ కాలాల్లోని అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవడమే మూడు బకెట్ల విధానం. రానున్న ఏడాది, ఏడాదిన్నర కాలం పాటు క్రమం తప్పకుండా (రెగ్యులర్) ఆదాయం పొందేందుకు సరిపడా నిధిని ఒక బకెట్‌గా ఏర్పాటు చేసుకోవాలి. అంటే స్వల్పకాలం కోసం కనుక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడ రాబడులు అన్నది ద్వితీయ ప్రాధాన్యమే అవుతుంది. కనుక ఈ బకెట్‌కు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఇక వచ్చే మూడు, నాలుగేళ్ల కోసం ఉద్దేశించినది రెండో బకెట్ అవుతుంది. ఈ నిధి క్రమం తప్పకుండా వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రాబడులు మోస్తరుగా ఉంటే చాలు. అనవసర రిస్క్‌లు తీసుకోవడం సరికాదు. కనుక అధిక నాణ్యత డెట్ సాధనాలైన షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక దీర్ఘకాలం నిధికి ఉద్దేశించినదే మూడో బకెట్. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనే రాబడులు అవసరం అవుతాయి. కనుక డెట్‌తోపాటు కొంత పెట్టుబడిని ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపినదే 3బకెట్ స్ట్రాటజీ అవుతుంది. మొదటి ఏడాదిన్నర అవసరాల కోసం ఉద్దేశించిన నిధిని రెండు నాణ్యమైన లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ ఫండ్స్ నుంచి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవాలి. దాంతో ప్రతీ నెలా అవసరమైనంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తమ రిటైర్మెంట్ నిధిలో ఒక వంతును ఒకటి లేదా రెండు నాణ్యమైన మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇవి దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడులను ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడిన షార్ట్ డ్యురేషన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కూడా చక్కగా సరిపోతుంది. ఇలాంటి స్ట్రాటజీతో రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకున్న తర్వాత నిర్ణీత కాలానికోసారి కేటాయింపులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏడాది ఆరంభంలో మొత్తం నిధిలో ఈక్విటీ పెట్టుబడుల వాటాను మూడింట ఒక వంతుకు మించకుండా మార్పులు చేసుకోవాలి. అంతకుమించి ఈక్విటీ పెట్టుబడుల విలువ ఉంటే ఆ మేరకు వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ఆరంభంలో తమ నిధిపై వార్షికంగా 4–5% మించి ఉపసంహరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుమించితే మీ నిధి తొందరగా తరిగిపోతుంది.
పదేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. ఇందుకు ఇండెక్స్‌ఫండ్ లేదా ఈటీఎఫ్ లేదా యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ ఫండ్ వీటిల్లో దేనిని ఎంపిక చేసుకోవాలి? పదేళ్ల కాలానికి ఎక్స్‌పెన్స్ రేషియో పాత్ర ఏ మేరకు ఉంటుంది? – రవి
రిటైల్ ఇన్వెస్టర్లు ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని నేను అయితే ప్రోత్సహించను. దీనికి కారణం ఇది వినియోగపరంగా అంత అనుకూలమైనది కాదు. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ విధానం మరింత సౌకర్యమైనది. ప్రతీ నెలా ఫలానా తేదీన రూ.10,000 మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే చాలు. సరిగ్గా ప్రతీ నెలా అదే రోజున ఎంపిక చేసుకున్న పథకంలోకి పెట్టుబడి వెళుతుంది. విశ్వసనీయమైన ఇండెక్స్ ఫండ్స్ అన్నవి ప్రస్తుతానికి లార్జ్‌క్యాప్ విభాగంలోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అన్నవి వాటి పనితీరును నిరూపించుకుంటే అప్పుడు వాటిని పరిశీలించొచ్చు. కానీ, ఇప్పటికైతే యాక్టివ్‌గా నిర్వహించే ఫ్లెక్సీక్యాప్ అనుకూలమైనది. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఒక పథకం 50 శాతం రాబడి ఇచ్చి, 2 శాతం ఎక్స్‌పెన్స్ రేషియో వసూలు చేస్తున్నట్టయితే.. అదే సమయంలో 50 శాతం రాబడిని అందించే మరో పథకం 1 శాతం ఎక్స్‌పెన్స్ రేషియోను రాబడుతున్నట్టయితే.. అప్పుడు ఒక శాతం రాబడి పథకమే మెరుగైనది అవుతుంది.
- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతనిచ్చే 3 బకెట్ స్ట్రాటజీ వివరాలు
Published Mon, Nov 29 2021 8:41 AM | Last Updated on Mon, Nov 29 2021 8:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment