
ఆరుపదుల వయసులో రిటైర్ అవ్వాలంటే భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎంత కార్పస్ కావాలో తెలుసా? పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి విలువ తగ్గడం, ఖర్చులు పెరగడం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా ఇటీవల లింక్డ్ఇన్ పోస్ట్‌లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రిటైర్‌మెంట్ ప్లాన్‌కు సరిపడా డబ్బుకు సంబంధించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.
‘ఈ రోజు ఇండియాలో రిటైర్ కావడానికి ఎంత డబ్బు అవసరమో తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో చాలా రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియోలు ఈక్విటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలోనే ఉంటున్నాయి. కొందరు దీన్ని తొందరగా క్యాష్ చేసుకునేందుకు వీలుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌ల్లోకి మళ్లిస్తున్నారు. ఈక్విటీ నుంచి 12–14 శాతం, డెట్ నుంచి 5–7 శాతం కలిపి ఏడాదికి 10% మిశ్రమ రాబడిని అంచనా వేస్తున్నారు. క్రమంగా పన్నులు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. రిటైర్మెంట్ సమయంలో పెట్టుబడి ఆదాయంపై 20 శాతం పన్ను విధించడం, ద్రవ్యోల్బణం ఏటా మరో 6 శాతం ఉంటుండడంతో వాస్తవ రాబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రిటైర్మెంట్ ఫండ్‌పై కేవలం 2% నికర రియల్ రిటర్న్ మాత్రమే వస్తుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్
‘భారత్‌లో పదవీ విరమణ పొందిన తర్వాత సౌకర్యవంతమైన జీవనశైలి కోసం ప్రస్తుతానికి నెలకు కనీసం రూ.1.5 లక్షలు అవసరమవుతాయి. ఏటా మీకు రూ.20 లక్షలు అవసరం. 2% రియల్ రిటర్న్స్ అంటే.. మీ రిటైర్మెంట్ కార్పస్ కనీసం రూ.10 కోట్లు ఉండాలి. మీరు లగ్జరీగా జీవించాలంటే ఇది ఏమాత్రం సరిపోదు. హాయిగా బతకాలనుకుంటే ఇంకా ఎక్కువ లక్ష్యం పెట్టుకోవాలి. మీ రిటైర్మెంట్ ఫండ్ వార్షిక ఖర్చుకు 50 రెట్లు ఉండాలి. అంటే మీ కుటుంబం ఏటా రూ.10 లక్షలు ఖర్చు చేయాలంటే రూ.5 కోట్లు కావాలి. ఏడాదికి రూ.20 లక్షలు అంటే రూ.10 కోట్లు అవసరం’ అని తెలిపారు.