ఈ పొదుపు సరిపోదు..
న్యూఢిల్లీ: పదవీ విరమణ తర్వాత ఒడిదుడుకుల్లేకుండా జీవించడానికి అవసరమైనంత సొమ్మును దాచుకోవడం లేదని 78% మంది భారతీయ ఉద్యోగులు అంటున్నారు. ఏటా 16% పొదుపు రేటుతో చైనా తర్వాతి స్థానంలో ఇండియా ఉన్నప్పటికీ, ఉద్యోగులు తమ భవిష్యత్తుపై గుబులుగా ఉండడం గమనార్హం. ఈ విషయాలను గ్లోబల్ ప్రొఫెషనల్ సేవల సంస్థ టవర్స్ వాట్సన్ నివేదిక తెలిపింది...
రిటైర్మెంట్ తర్వాత అరకొర ఆదాయ సమస్యను అధిగమించడానికి తాము మరింత ఎక్కువ కాలం ఉద్యోగం చేయడం కంటే అధిక మొత్తాన్ని పొదుపు చేస్తామని అన్ని ఏజ్ గ్రూపుల్లోని ఉద్యోగులు తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది తాము మరి కొన్నేళ్లు అధికంగా ఉద్యోగం చేస్తామని చెప్పగా, 56 శాతం మంది పొదుపును పెంచుతామని తెలిపారు.
దేశంలో రిటైర్మెంట్ వయసు అటూఇటుగా 60 ఏళ్లు. ఆర్థిక ప్రణాళికల్లో పదవీ విరమణ తర్వాతి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులు చెప్పారు.
నలబై ఏళ్లలోపు ఉద్యోగులు సొంతింటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాతి అవసరాలకు రెండో ప్రాధాన్యమిస్తున్నారు. నలబై ఏళ్లు పైబడిన వారి ప్రాధాన్యం మాత్రం పదవీ విరమణ తర్వాతి అవసరాలకే.
భారతీయ ఉద్యోగుల్లో సాపేక్షంగా యువతరమే అధికం. దీంతో, రిటైర్మెంట్ ప్లాన్లకు వారికి తగినంత సమయం ఉంది. ప్రభుత్వం, కంపెనీల యాజమాన్యాలు పొదుపును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టవర్స్ వాట్సన్ ఇండియా డెరైక్టర్ అనురాధా శ్రీరామ్ సూచించారు.