Retirement Plan
-
ఆర్థిక లక్ష్యాన్ని చేరేదెలా..?
స్థిరమైన ఆదాయం చాలా మందికి ఒక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం. రిటైర్మెంట్ ప్రణాళిక కావొచ్చు. లేదా ప్యాసివ్ ఆదాయ మార్గం కోరుకోవచ్చు. అప్పటికే వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని అనుకోవచ్చు. క్రమం తప్పకుండా ఆదాయం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవితానికీ స్థిరత్వాన్నిస్తుంది. ముందస్తు పింఛను ప్రణాళికలు లేని వారు రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే మార్గాలను ఆశ్రయించాల్సిందే. ఉద్యోగం/వృత్తి/ వ్యాపారాల్లో ఉన్న వారు సైతం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపించొచ్చు. కొన్ని రకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. ఈ తరహా వ్యక్తుల ముందు ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్, రాబడుల ఆధారంగా తమకు అనువైనవి ఎంపిక చేసుకోవడం ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) నెలవారీ ఆదాయం కోసం అందుబాటులోని డెట్ సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో పెట్టుబడులకు నూరు శాతం భారత ప్రభుత్వం హామీ ఉంటుంది. కనుక పెట్టుబడులు, రాబడుల విషయంలో ఎలాంటి రిస్క్ ఉండదు. రిస్క్ వద్దనుకునే వారికి అనువైనది. ప్రస్తుతం ఇందులో పెట్టుబడిపై 7.4 శాతం వార్షిక రాబడి అందుబాటులో ఉంది. ఈ ప్రకారం రూ. లక్ష పెట్టుబడిపై ప్రతి నెలా రూ.616 ఆదాయంగా అందుతుంది. ఇందులో డిపాజిట్ కాల వ్యవధి ఐదేళ్లు. గడువు తీరిన తర్వాత మరో ఐదేళ్లకు తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.9,00,000 వరకు, ఉమ్మడిగా అయితే రూ.15,00,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు, వడ్డీ రాబడికి ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. తమ వార్షిక ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సిందే. 10 ఏళ్లు నిండిన మైనర్ పేరిట కూడా ఖాతా ప్రారంభించొచ్చు. నెలవారీ వడ్డీని పోస్టల్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. గడువు కంటే ముందే ఈ పథకం నుంచి వైదొలిగేట్టు అయితే కొంత నష్టపోవాల్సి వస్తుంది. డిపాజిట్ చేసిన ఏడాది నుంచి మూడేళ్లలోపు అయితే పెట్టుబడిలో 2 శాతం, మూడేళ్ల తర్వాత ఒక శాతాన్ని కోత విధిస్తారు. దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు (జీ–సెక్‌లు)5–40 ఏళ్ల కాలంతో ఇవి ఉంటాయి. వీటిపై ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం పొందొచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయాల కోసం ఈ బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. వీటిల్లో రిస్క్ లేదనే చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లు ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ ఖాతాను ఉచితంగా తెరిచి, జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఎలాంటి చార్జీలు లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వ బాండ్లలో ఫిక్స్డ్, ఫ్లోటింగ్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ అని పలు రకాలున్నాయి. గడువు ముగిసే వరకు కొనసాగకుండా, మధ్యంతరంగా సెకండరీ మార్కెట్లో విక్రయించాలనుకుంటే అప్పటి వడ్డీ రేట్ల పరంగా చేతికి వచ్చే మొత్తంలో మార్పు ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు (జీ–సెక్‌లు) జారీ చేస్తుంటుంది. ఇందులో ట్రెజరీ బిల్లులు అన్నవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల వ్యవధితో వస్తాయి. వీటిల్లో వడ్డీ చెల్లింపులు ఉండవు. కూపన్ రేటు మేర ముందే ముఖ విలువలో తగ్గించి తీసుకుంటారు. కనుక ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీలు జారీ చేస్తుంటాయి.యాన్యుటీ ప్లాన్లుపెట్టుబడిపై మరుసటి నెల నుంచే ఆదాయాన్నిచ్చే ‘ఇమీడియెట్ యాన్యుటీ ప్లాన్’లను జీవిత బీమా కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. ఎల్ఐసీ నుంచి జీవన్ శాంతి, జీవన్ అక్షయ్ ఇవే తరహా ప్లాన్లు. ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్లలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసుకున్న కాలం వరకు స్థిరమైన రాబడులు ఇందులో వస్తాయి. వడ్డీ రేట్లలో అస్థిరతల ప్రభావం వీటి రాబడిపై ఉండవు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం వచ్చే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. జీవితకాలానికి ఈ యాన్యుటీ ప్లాన్లను తీసుకోవచ్చు. మరణానంతరం పెట్టుబడిని నామీనికి అందిస్తారు. వీటికి పన్ను పరమైన ప్రయోజనాలు లేవు. ఈ ప్లాన్ల నుంచి అందుకునే రాబడిపై 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు అని కూడా ఉంటాయి. అవి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వెంటనే కాకుండా.. నిరీ్ణత కాలం తర్వాత నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేవి.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)60 ఏళ్లు నిండిన వారికే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంది. పదవీ విరమణ తర్వాత ఆదాయం కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇందులో ఒకరు రూ.30లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దంపతులు అయితే ఉమ్మడిగా రూ.60 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. దీనిపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. అన్ని పోస్టాఫీసుల్లోనూ, కొన్ని బ్యాంక్ శాఖల్లో ఎస్సీఎస్ఎస్ ఖాతా తెరవొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో చేసే పెట్టుబడిపై అదే ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిని ఏ ఏడాదికి ఆ ఏడాదే పన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఆదాయ శ్లాబుకు అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి వస్తుంది. ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారికి కనీస వయోపరిమితి 55 ఏళ్లుగా ఉంది. రక్షణ దళాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు 50 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు)బ్యాంకుల్లో దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీ 7–9 శాతం మధ్య ఉంది. ప్రముఖ బ్యాంకుల్లో ఇది 7–8 శాతం మధ్య ఉంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొంచెం అదనంగా ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (నాన్ క్యుములేటివ్)లపై ప్రతి నెలా వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. కాకపోతే మరీ దీర్ఘకాలానికి (పదేళ్లకు మించిన) డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. వడ్డీ రాబడి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. రిస్క్ పరంగా చూస్తే.. బ్యాంక్ ఎఫ్డీలకు ఆర్బీఐ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రక్షణ ఉంటుంది. బ్యాంక్ సంక్షోభంలో పడితే ఒక బ్యాంక్ పరిధిలో ఒక ఖాతాదారు పేరిట ఎంత డిపాజిట్ ఉన్నప్పటికీ గరిష్టంగా రూ.5లక్షల వరకు వెనక్కి వస్తుంది. కనుక ఒక బ్యాంక్ పరిధిలో (ఎన్ని శాఖలైనా) రూ.5లక్షలే డిపాజిట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం.మంత్లీ ఇన్కమ్ ప్లాన్లుమ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మంత్లీ ఇన్కమ్ ప్లాన్లను (ఎంఐపీలు) ఆఫర్ చేస్తుంటాయి. ప్రధానంగా డెట్ సెక్యూరిటీల్లో, స్వల్పంగా (10–20శాతం) ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు స్థిరాదాయాన్ని అందిస్తాయి. వీటిల్లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. స్థిరంగానూ ఉండవు. మార్కెట్ ఆధారితంగా రాబడులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాబడులు మరీ తగ్గొచ్చు. వీటిల్లో రిస్క్ తక్కువ. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.కార్పొరేట్ డిపాజిట్లునాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) తమ డిపాజిట్ల ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. ఈ తరహా కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ల(నాన్ క్యుములేటివ్)లో ఇన్వెస్ట్ చేసుకుని, వీటి నుంచి నెలవారీ/మూడు నెలలు/ఆరు నెలలు/ఏడాదికి ఒకసారి చొప్పున ఆదాయం తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని బ్యాంక్ డిపాజిట్లతో పోల్చి చూడొచ్చు. బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ డిపాజిట్లలో ఎలాంటి హామీ ఉండదు. కనుక రిస్క్ తగ్గించుకునేందుకు ఏఏఏ రేటెడ్, ఏఏ మైనస్ రేటెడ్ డిపాజిట్లను ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత ఆర్థిక సంస్థ గత చరిత్రను ఇన్వెస్ట్ చేసే ముందు పరిశీలించాలి. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే కాస్త అధిక రాబడులు వీటిల్లో ఉంటాయి. వడ్డీ ఆదాయానికి ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలు డిపాజిట్లపై నిధులు సమీకరిస్తుంటాయి. ఇవి మెరుగైన రేటింగ్ కలిగిన సంస్థలు.సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ)ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లు గురించి తెలిసే ఉంటుంది. ఎంపిక చేసుకున్న పథకాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కలి్పంచేదే సిప్. దీనికి విరుద్ధంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి క్రమంగా కొంత చొప్పున ఉపసంహరించుకోవడమే ఎస్‌డబ్యూపీ. ఎంత మేర ఉపసంహరించుకోవాలన్నది ఇన్వెస్టర్ అభీష్టమే. తమ వద్దనున్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనువైన ఫండ్స్‌ను ముందుగా ఎంపిక చేసుకోవాలి. అందులో ఏకమొత్తంలో కాకుండా, ఆరు నుంచి 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు సగటుగా మారుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిరీ్ణత శాతం మేర ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. రాబడుల కంటే మూడు శాతం తక్కువ ఉపసంహరణకు పరిమితం కావాలి. దీనివల్ల ఈ మూడు శాతం తిరిగి పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. దీంతో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు వీలుంటుంది. మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది సూచన ప్రకారం.. ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌కు 35 శాతం కేటాయించే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ లేదా ఈక్విటీలకు 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయించే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిల్లో దీర్ఘకాలంలో రాబడులు 12–13 శాతం మేర ఉంటాయి. కనుక ఉపసంహరణ 6–9 శాతం మించకూడదు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవి అయితే ఈక్విటీ కేటాయింపులను 35 శాతానికే పరిమితం చేసి మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయిస్తాయి. వీటిల్లో దీర్ఘకాల రాబడి 9–10 శాతం మేర ఉంటుంది. కనుక 6 శాతం ఉపసంహరణకు పరిమితం కావాలి. ఇవే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా సరిపోతుంది. కానీ, డివిడెండ్ ఎప్పుడు ప్రకటించాలన్నది ఫండ్స్ సంస్థల అభీష్టం. అందుకే ఎస్‌డబ్ల్యూపీ మెరుగైన ఆప్షన్ అవుతుంది. వీటిల్లో పెట్టుబడులకు ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. కానీ, ఏడాదిలోపు విక్రయించిన పెట్టుబడులకు సంబంధించి లాభంపై 20 శాతం పన్ను, ఏడాది మించిన పెట్టుబడులు విక్రయించగా వచి్చన లాభంపై మొదటి రూ.1.25 లక్షల తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బాండ్ ల్యాడర్ పోర్ట్‌ఫోలియో వివిధ కాల వ్యవధులతో బాండ్లను కొనుగోలు చేయడం. అంటే ఒక్కో బాండ్ మెచ్యూరిటీ ఒకే తేదీతో కాకుండా, వరుస క్రమంలో ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఏడాది కాలానికి ఒకటి తీసుకుంటే, 13 నెలలు, 14 నెలలు, 15 నెలలు ఇలా అనమాట. గడువు తీరి చేతికి వచి్చన ప్రతి బాండ్ మెచ్యూరిటీ మొత్తంలో అసలుతో తిరిగి బాండ్ కొనుగోలు చేయాలి. వడ్డీ భాగాన్ని ఆదాయం కింద వినియోగించుకోవాలి. పీర్ టు పీర్ (పీ2పీ) లెండింగ్ పీ2పీ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి రుణం కావాల్సిన వారిని, అదే సమయంలో రుణంపై ఆదాయం కోరుకునే వారిని ఒకే వేదికగా కలుపుతాయి. బాండ్లు, ఎఫ్‌డీల కంటే పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువ రాబడికి మార్గం చూపుతాయి. కాకపోతే రుణం తీసుకునే వ్యక్తికి సంబందించి ఆర్థిక చరిత్ర ఈ సంస్థలకు పెద్దగా తెలియదు. కనుక రుణ ఎగవేతల రిస్క్ వీటిల్లో ఉంటుంది. వడ్డీ ఆదాయంలో కొంత పంచుకునేట్టు అయితే పీ2పీ సంస్థలు రుణం వసూలు బాధ్యతను తీసుకుంటున్నాయి. వీటిని గమనించాలి..→ నెలవారీ లేదా త్రైమాసికంవారీ స్థిరమైన ఆదాయానికి వీలుగా పెట్టుబడి సాధనం ఎంపికలో ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధి, వాటిపై ఆశిస్తున్న రాబడి, ఎంత రిస్క్ తీసుకోగలరు? ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. తమ ఆకాంక్షలకు సరిపోలే ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడుల వృద్ధికి, పెట్టుబడిపై స్థిరమైన రాబడికి మధ్య వ్యత్యాసం ఉంది. స్పష్టత తెచ్చుకోలేకపోతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. → రాబడిపై పన్ను బాధ్యతను తప్పకుండా గుర్తించాలి. పన్ను పోను నికర రాబడి ఎంతన్నది చూడాలి. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడి మొత్తాన్ని ఏదో ఒక సాధనంలో కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడాన్ని పరిశీలించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
35 ఏళ్లలోపు రిటైర్.. చేతిలో రూ. 41 కోట్లు.. ఈ గూగుల్ ఉద్యోగి ప్లాన్ తెలిస్తే..!
Google employee plan: సాధారణంగా యువత ఆలోచనలు ఇలా ఉంటాయి.. మంచి కంపెనీలో జాబ్ చేయాలి.. వృద్ధాప్యం వరకూ ఉద్యోగం చేసి బాగా సంపాదించాలి.. కుటుంబాలను సెటిల్ చేసి ఏ 60 ఏళ్లకో రిటైర్ కావాలి అనుకుంటారు. కానీ ఆ యువకుడు మాత్రం 35 ఏళ్లకే రిటైర్ కావాలనుకుంటున్నాడు. అతని ప్లానింగ్ తెలిస్తే అదిరిపోతారు. గూగుల్ (Google)లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల ఇతాన్ నున్లీ (Ethan Nguonly).. వీలైనంత తొందరంగా అంటే 35 ఏళ్లలోపే రిటైర్ కావాలనుకుంటున్నాడు. ఆ లోపు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 41 కోట్లు) సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎన్‌బీసీ నివేదించింది. ఇదీ చదవండి: వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు! ఆర్థిక భద్రత వైపు నున్లీ ప్రయాణం చిన్నతనం నుంచే ప్రారంభమైంది. తీర ప్రాంతంలో పెరిగిన నున్లీకి పెట్టుబడి ఆవశ్యకతను తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుండేవారు. పొదుపు ఖాతాలో డబ్బు దాచుకోవడం కంటే పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే లాభాల గురించి చెప్పేవారు. చిన్నతనం నుంచే ఆర్థిక పాఠాలు నేర్పించడంతో అతని ఆర్థిక దృక్పథాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. రెండేళ్లలోనే ఉన్నత విద్యాభ్యాసం ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలనే నున్లీ దృఢ సంకల్పం కేవలం రెండేళ్లలోనే బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తన కంప్యూటర్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసేలా చేసింది. అదే సమయంలో అతను పూర్తి సమయం ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఇన్ఫర్మేషన్, డేటా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాడు. గూగుల్‌లో పని చేయాలనే నున్లీ ఆకాంక్ష 2021 డిసెంబర్లో నిజమైంది. ఈ టెక్ దిగ్గజంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. బోనస్‌లు, స్టాక్ యూనిట్లతో కలిపుకొని నున్లీ మొత్తం వార్షిక ఆదాయం సుమారు 1,94,000 డాలర్లు (దాదాపు రూ. 1.60 కోట్లు). విస్తృతంగా పెట్టుబడులు చిన్న వయసులోనే రిటైర్ కావాలన్న తన ఆశయం కోసం నున్లీ శ్రద్ధగా పెట్టుబడి పెడుతున్నాడు. వివిధ రిటైర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లలో దాదాపు 1,35,000 డాలర్లు (దాదాపు రూ. 1.11 కోట్లు) ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాడు. తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో ఆస్తులను సంపాదించి రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టాడు. బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులతో కలిసి జీవించిన నున్లీ క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నియమావళికి కట్టుబడి 60,000 డాలర్లను పొదుపు చేయగలిగాడు.ఈ ఆర్థిక క్రమశిక్షణ ఫ్లోరిడాలోని రివర్‌వ్యూలో అతని మొదటి పెట్టుబడి ఆస్తిని పొందేందుకు దోహదపడింది. రాష్ట్రం వెలుపల రెంటల్ ప్రాపర్టీలను నిర్వహించడంలో సవాళ్లు ఎదురైనప్పటికీ, నున్లీ అంకితభావం ఫలించింది. తద్వారా అతను రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరపడేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత నున్లీ కాలిఫోర్నియాలోని లా పాల్మాలో మొదటి ఇంటిని కొన్నాడు. నున్లీ ఆర్థిక ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడుల కోసమే కేటాయించాడు. ఇలా ఆస్తులు కొనుగోలు చేస్తుండటంతో అధిక పెట్టుబడుల సంకల్పం సవాలుగా మారినప్పటికీ, నున్లీ తన టేక్-హోమ్ పేలో 35 శాతాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎదురుదెబ్బలే పాఠాలు పెట్టుబడులతో దూసుకెళ్తున్న నున్లీకి ఎదురుదెబ్బలూ తగిలాయి. 2021లో క్రిప్టోకరెన్సీలో మార్జిన్లో భారీగా పెట్టుబడి పెట్టినప్పుడు సుమారు 80,000 డాలర్లు నష్టపోయాడు. అయితే ఈ అనుభవం ఒక విలువైన పాఠంగా పనిచేసింది. దీర్ఘకాలిక పెట్టుబడులపై, ప్రత్యేకించి ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్లపై మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని అనుసరించేలా ప్రేరేపించింది. -
భవిష్యత్తు బాగుండాలంటే..?
‘ఈ రోజు గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం..?’ ఇలా అనుకుంటే అది భద్రతకు హామీనివ్వదు. రేపటి కోసం కొంత పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులోనూ నిశ్చితంగా ఉంటామని అర్థం చేసుకునే వారు కొందరే. కష్టపడి తెచ్చిందంతా ఖర్చు పెడుతూ.. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉండడం కుటుంబానికి ఏ మాత్రం భరోసానీయదు. చాలా మంది పొదుపును వాయిదా వేసుకుంటూ వెళతారు. ఆర్థిక ఇబ్బంది, అత్యవసర పరిస్థితి రానంత వరకు ఇదంతా సాఫీగానే అనిపిస్తుంది. కరోనా రాక ముందు వరకు చాలా మంది ఆరోగ్య బీమాను, అత్యవసర నిధిని నిర్లక్ష్యం చేసిన వారే. ఈ తరహా వ్యక్తుల్లో కొంత మందికి కనువిప్పు కలిగింది. ‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు’ అని కాకుండా.. ఎవరి భవిష్యత్తు కోసం వారే రక్షణాత్మకంగా వ్యవహరించాలి. భవిష్యత్తు కోసం ఎందుకు పొదుపు, మదుపులు అవసరమో అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. జీవితం అంటే ఎప్పుడూ ఒకే తీరున, సాఫీగా సాగిపోదు. కొన్ని ఇబ్బందులు సర్వ సాధారణం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. కరోనా నియంత్రణకు 2020 మార్చి చివరి నుంచి నెలరోజులకుపైగా లాక్డౌన్లను విధించడం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలు కావచ్చు. భవిష్యత్తులో ఏ రోజు ఎలా ఉంటుందన్నది మన చేతుల్లో లేని అంశం. కాకపోతే ఏది వచ్చినా ఎదుర్కోగల సన్నద్ధతే మన చేతుల్లో ఉంటుంది. తగినంత పొదుపు ఉంటే, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆ సమయంలో ఇతరుల నుంచి ఆర్థిక సాయం కోసం అర్థించాల్సిన అవస్థ తప్పుతుంది. అందుకే పొదుపు, మదుపులను వాయిదా వేయవద్దు. ఆదాయం ఆగిపోతుంది.. సంపాదన బండి ఏదో ఒకరోజు (రిటైర్మెంట్) ఆగిపోతుందని తెలిసిందే. కానీ, సంపాదన ఆగిపోయిన తర్వాతి రోజు నుంచి జీవితం ఎలా? ఈ విషయాన్ని తెలిసినా కానీ, చాలా మంది దాటవేస్తుంటారు. ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత కదా, చూసుకోవచ్చులే.. అనుకుంటూ రిటైర్మెంట్ ప్రణాళికను ఎక్కువ మంది వాయిదా వేస్తుంటారు. కానీ, ముందు నుంచే పొదుపు చేస్తే కాంపౌండింగ్‌తో తక్కువ మొత్తం అయినా పెద్ద నిధిగా సమకూరుతుంది. అదే 40–45 తర్వాత మొదలు పెడితే, ఉన్న కొద్ది కాలంలో ఎంత వెనుకేయగలరు?.. 60 ఏళ్ల తర్వాతి జీవించి ఉన్నంత కాలం అవసరాలను ఆ మొత్తం తీర్చగలదా? అని ఆలోచించాలి. ప్రశాంతత కోసం.. భద్రత, ప్రశాంతత ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేంత నిధి దగ్గర ఉంటే.. ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండొచ్చు. ఆఫీసులో కొంత మంది ఉద్యోగులను తీసేస్తున్నారన్న వార్త మీ చెవిన పడితే, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయని తెలిస్తే.? ఇవన్నీ చిన్నవే అయినా ఎంతో కొంత ఆందోళనకు గురి చేసేవే. దేనిని అయినా టేక్ ఇట్ ఈజీ పాలసీగా ఎప్పుడు తీసుకుంటాం? తగినంత ఆర్థిక స్తోమత ఉన్నప్పుడే కదా! బ్యాంకులో బ్యాలన్స్ లేకుండా, సాగిపోయే వారికి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే ? కష్టకాలం మొదలవుతుంది. కావాల్సినంత పొదుపు చేయలేని వారిపై అంతర్లీనంగా ఒత్తిడి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక పొదుపు, మదుపు అవసరాన్ని గుర్తించాలి. అపరాధ భావం ఎందుకు? చాలా మంది ముందుచూపు, ప్రణాళికలేమితో పొదుపును నిర్లక్ష్యం చేస్తుంటారు. అవగాహన ఉన్నా కానీ, పొదుపు చేయలేని వారు కూడా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు అవసరానికి సరిపడా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడుతుంటారు. కానీ, దీని వెనుక కారణం.. వారు పిసినారులని కాదు. తగినంత సంపద లేకపోవడమే. దీంతో వెళ్లిన ప్రతి చోటా పాకెట్ నుంచి ఖర్చు చేసేందుకు ధైర్యం చాలదు. కానీ, ఇది వారిపై, వారి జీవిత భాగస్వామి, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని గుర్తించాలి. చక్కని ఆర్థిక జీవనం అంటే.. తగినంత పొదుపు చేయడమే కాదు.. అవసరానికి సరిపడా, వివేకంగా ఖర్చు చేయడం కూడా. కనుక పొదుపును నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చును పూర్తిగా బంధించేయకూడదు. వారసత్వం విషయంలో... తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు అందరికీ లభిస్తాయన్న గ్యారంటీ ఉండదు. తమ పిల్లలకు భూమి/ఇల్లు రూపంలో ఆస్తిని ఇవ్వాలని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. తల్లిదండ్రుల నుంచి చెప్పుకోతగ్గ ఆస్తులు లభిస్తే.. వాటిని మెరుగ్గా నిర్వహించే ప్రణాళిక ఉండాలి. వారసత్వ ఆస్తుల్లేని వారు, తమ పిల్లలకు ఆస్తులను సమకూర్చిపెట్టాలని భావిస్తే.. ఇది అదనపు ప్రణాళిక అవుతుంది. ఇందుకోసం పెద్ద మొత్తమే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆస్తుల విషయంలోనూ ప్రణాళికాయుతంగా నడుచుకోవాలి. పెద్ద లక్ష్యాలు జీవితంలో ఎన్నో కీలకమైన లక్ష్యాలు ఎదురవుతాయి. వీటిల్లో కొన్ని తప్పించుకునేవి కావు. పిల్లల విద్యా ఖర్చు, వివాహాలు, ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్, పర్యటనలు ఇలా ఎన్నో ఉంటాయి. భవిష్యత్తు కోసం తగినంత కూడబెట్టలేకపోతే, రుణాలపై ఆధారపడితే చివరికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? అందుకని జీవితాన్ని చేయి దాటిపోనీయకుండా, భవిష్యత్తు పట్ల ముందు చూపుతో పొదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఆర్థిక స్వేచ్ఛ వేతనంపై ఇక ఆధారపడని రోజు ఒకటి జీవితంలో వస్తుంది. అప్పటికి కనీస అవసరాలకు సరిపడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేంత నిధిని సమకూర్చుకోవాలి. దీన్నే ఆర్థిక స్వాతంత్య్రంగా చెబుతారు. మీ అవసరాలకు వేరేవారిపై ఆధారపడకపోవడం. ఆర్జన ఆరంభించిన తొలినాళ్లలో ఎక్కువ మంది వద్ద ఎటువంటి నిధి (వారసత్వంగా ఉంటే తప్ప) ఉండదు. కనుక 100 శాతం వేతనంపైనే జీవనం ఆధారపడి ఉంటుంది. అయితే, కాలక్రమేణా బుట్టలోకి సంపద చేరాలి. అప్పుడే అవసరానికి కావాల్సినంత తీసుకోగలరు. ఒక వ్యక్తికి కుటుంబ ఖర్చులు నెలవారీగా రూ.40,000 అవుతున్నాయని అనుకుంటే.. 12 నెలలకు సరిపడా రూ.4.8 లక్షలు కనీసం అతని వద్ద ఉండాలి. రూ.48 లక్షలు ఉంటే 8–10 ఏళ్ల అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకని జీవితంలో కోరుకున్న దశ నుంచి కనీస అవసరాలను తీర్చుకునేందుకు సరిపడా నిధి ఏర్పడాలి. అందుకోసం ఆర్జన మొదలైన వెంటనే పొదుపు, మదుపు ప్రయాణాన్ని ఆరంభించాలి. దాంతో చాలా వేగంగా (50 ఏళ్లకే) ఆర్థిక స్వాతంత్య్ర స్థితిని చేరుకుంటారు. పురోగతి జీవితానికి పురోగతి కీలకమైనది. ఉద్యోగం ఆరంభంలో బ్యాంకు బ్యాలన్స్ జీరోగా ఉన్నా.. 5–10 ఏళ్ల సర్వీసు తర్వాత తగినంత కనిపించాలి. అది పురోగతికి చిహ్నంలా మరింత ప్రేరణనిస్తుంది. ఉత్సాహంతో పనిచేసేందుకు సరిపడా బూస్ట్‌నిస్తుంది. పదేళ్ల కెరీర్ తర్వాత కూడా బ్యాంకు ఖాతా వెక్కిరిస్తోందంటే.. అది పురోగతికి చిహ్నం కాబోదు. నికర విలువ పెరగడం లేదంటే ‘ధనిక బానిస’ అనే అనుకోవాల్సి వస్తుంది. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు ఉన్నంతలో ఎంతో కొంత ఆదా చేసుకోవడమే ఆచరణ కావాలి. ప్రతి నెలా రూ.5,000 సిప్ ఆరంభించి 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, 12 శాతం రాబడి రేటు ప్రకారం రూ.1.76 కోట్లు సమకూరుతుంది. 30 ఏళ్లలో మీరు చేసిన పెట్టుబడి రూ.18 లక్షలే. కానీ, వచ్చిన రాబడి రూ.1.58 కోట్లు. మెరుగైన మార్గం.. చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా లేకపోవచ్చు. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉండొచ్చు. వెనుక కావాల్సినంత నిధితో బ్యాకప్ ప్రణాళిక లేకపోతే ఆలోచన వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన ఆదాయం, జీవనం కోసం ఉద్యోగం మారాలనుకుంటే కనీసం 2–3 ఏళ్లపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చినా.. జీవనానికి ఇబ్బంది ఎదురుకాకూడదు. మీ వద్ద నిధి ఉంటే, ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కనుక విజయంలోనూ ‘వెల్త్’ పాత్ర ఉంటుంది. రుణ ఊబిలోకి వెళ్లొద్దు.. రుణం తీసుకోవడం ఒక్కసారి మొదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని స్టాప్ చేయడం కష్టమే. ముందు ఇది చిన్నగానే మొదలు కావచ్చు. కొన్నేళ్లకు నియంత్రించలేనంత స్థాయికి చేరిపోతుంది. చివరికి బయట పడలేనంత ఊబిగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకనే క్రెడిట్ కార్డు అయినా, వ్యక్తిగత రుణం తీసుకుంటున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. రుణం తీసుకుంటున్నారంటే.. తగినంత పొదుపు లేకపోవడం వల్లే. పొదుపు లేకుండా రుణం బాటపడితే.. తిరిగి అప్పుల భారం నుంచి బయటకు వచ్చి, పొదుపు చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి రావచ్చు. కొందరికి అది అసాధ్యం కావచ్చు. కనుక డెట్‌కు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుసరించాల్సిన ప్రణాళిక ► మెరుగైన జీవనం కోసమే ప్రణాళికాయుత ఆర్థిక జీవనం. ఇందులో ముందుగా తన కుటుంబ రక్షణ కోసం సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ► 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిధిని అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. అవసరమైన వెంటనే తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ► ప్రతీ నెలా ఇంటికి తీసుకెళ్లే వేతనం (సంపాదన) నుంచి 20–40 శాతాన్ని ఈక్విటీల్లోకి మళ్లించాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► పెట్టుబడుల్లో అస్థిరతలు తగ్గించేందుకు వీలుగా కొంత డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పటికే ఈపీఎఫ్ రూపంలో చేస్తున్న డెట్ భాగాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ► ఎండోమెంట్, మనీబ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమాను, పెట్టుబడిని కలపొద్దు. -
నిండు నూరేళ్లూ... హ్యాపీగా
♦ పెరుగుతున్న ఆయుర్దాయం; తగ్గుతున్న ఉద్యోగ కాలం ♦ తక్కువ వ్యవధిలోనే ఎక్కువ సంపదకు ప్రణాళిక కావాలి ♦ వయసులో ఉన్నప్పటి నుంచే రిటైర్మెంట్ ప్లాన్ తప్పనిసరి ♦ అధిక రాబడులను ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు బెటర్ ♦ అందుకోసం ఈక్విటీ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్లు చూడొచ్చు ♦ రిటైరయ్యాక అంతా ఒకేసారి వెనక్కి తీసుకోవద్దు ♦ అప్పుడే హాయిగా చివరి మజిలీ ఇదివరకట్లా కాదు. ఇప్పుడు పెద్ద వయసు వారి సంఖ్య పెరుగుతోంది. కారణం! సగటు ఆయుర్దాయం పెరిగింది. మన దేశంలోనే కాదు!! ప్రపంచమంతటా ఇదే ధోరణి. మరి వృద్ధాప్యంలో ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం లభించినపుడు... నిండు నూరేళ్లూ ఏ ఇబ్బందీ లేకుండా సౌకర్యవంతంగా జీవించాలి కదా? ప్రతి చిన్న దానికీ రాజీ పడకుండా... అవసరాలను చంపుకోకుండా జీవించాలి కదా? అలా చేయాలంటే చివరి మజిలీని చక్కగా డిజైన్ చేసుకోవాలి. అందుకు కాస్త ప్లానింగ్ ఉండాలి. అదెలాగో తెలియజేసేదే ఈ కథనం... మన దేశంలో 1997లో సగటు ఆయుర్దాయం 57 ఏళ్లు. అదిప్పుడు 70 ఏళ్లు దాటిపోయింది. పురుషులు సగటున 77 ఏళ్లు, మహిళలు 78 ఏళ్ల పాటు జీవించగలుగుతున్నారు. ఇవి సగటు లెక్కలే. కొందరు 80 నుంచి 90 ఏళ్ల వరకూ ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవిస్తున్నారు. కానీ ఏ ఉద్యోగమైనా 60 ఏళ్లకే రిటైర్ కావాల్సిందే. వృత్తి, వ్యాపారాలయితే మాత్రం ఆరోగ్యం సహకరించే వరకూ చేసుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న వైద్య రంగం, నూతన ఆవిష్కరణల వల్ల వచ్చే 20 ఏళ్లలో సగటు ఆయుర్దాయం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మరి వృద్ధాప్యంలో జీవించి ఉన్నంత వరకూ అవసరాలు చూసేదెవరు? యుక్త వయసులోనే పిల్లలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంటే సంక్షేమం చూసేది ఎవరు. అందుకే విశ్రాంత జీవనానికి యుక్త వయసు నుంచే సర్వసన్నద్ధం కావాలి. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం తగ్గుతున్న పని కాలం గతంతో పోలిస్తే నేడు ఆర్జన కాలం తక్కువగా ఉంటోంది. ఒకప్పుడు డిగ్రీ అయ్యాక 20–21 ఏళ్ల నుంచే సంపాదన మొదలు పెట్టేవారు. కానీ, ఇపుడు ఉన్నత డిగ్రీలు ఉద్యోగాలకు కీలక అర్హతగా మారుతుండడంతో 22–25 ఏళ్లకు గానీ ఉద్యోగం మొదలు పెట్టడం లేదు. పైగా ఎక్కువ కాలం పాటు కష్టపడకుండా త్వరగా రిటైర్మెంట్ తీసుకోవాలన్నది కొందరి ఆలోచన. అనారోగ్యం, పనిలో పెరిగిపోతున్న ఒత్తిళ్ల వంటి కారణాలూ ఉంటున్నాయి. ఇక వృద్ధాప్యంలోకి వచ్చిన వారికి కుటుంబ పరంగా తగినంత రక్షణ కూడా ఉండడం లేదు. భవిష్యత్తులో పిల్లలు తమ పెద్దల సంక్షేమ బాధ్యతను కూడా చూడకపోవచ్చన్న అభిప్రాయాన్ని క్రిసిల్ ఫండ్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం డైరెక్టర్ జిజు విద్యాదరణ్ వ్యక్తం చేశారు. ఒకవేళ చూసినా వారిపై ఆర్థికంగా చాలా భారం పడుతుందట!! అందుకే విశ్రాంత జీవనానికి చక్కటి ప్లాన్ అవసరం అన్నారాయన. పింఛనుకూ భరోసా లేదు పింఛనుకూ తగినంత భరోసా లేకుండా పోతోంది. ప్రభుత్వ రంగంలో 2004 మార్చి తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్‌ను ఎన్పీఎస్ పథకంతో ముడిపెట్టారు. ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్ తరహా పథకాలైనా ఉన్నాయి గానీ, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు, స్వయం ఉపాధిపై ఆధారపడిన వారికి ఎటువంటి సామాజిక భద్రతా పథకాలూ లేవు. రిటైర్మెంట్ తర్వాత కనీసం 20, 30 ఏళ్ల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్ అయిన తర్వాత ఖర్చులు తగ్గుతాయన్న ఆలోచన కొందరిలో ఉంటుంది. కానీ అప్పుడే పెరుగుతాయి. ముఖ్యంగా వైద్యం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. హెల్త్ పాలసీ తీసుకున్నా ప్రీమియం రూ.20 నుంచి రూ.30వేల మధ్య ఉంటుంది. ఉదాహరణకు 7 శాతం ద్రవ్యోల్బణం అంచనాతో 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఏడాదికి రూ.3 లక్షలు అవసరం అయితే... ఇదే వ్యక్తికి 80 ఏళ్ల వయసుకు వచ్చే సరికి రూ.96 లక్షలు కావాల్సి ఉంటుంది. ముందు నుంచే... విశ్రాంత జీవనంలో అవసరాలన్నింటినీ అవగాహన చేసుకున్న తర్వాత అందుకు పటిష్టమైన ప్రణాళికను యుక్త వయసు నుంచే ఆచరణలో పెట్టాలి. రిటైర్మెంట్ జీవనం కోసం చిన్న వయసు నుంచే ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే కాంపౌండింగ్ వల్ల భారీ నిధి సమకూరుతుంది. ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అంచనా వేసి, మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర, ఇతర రిస్క్‌లను పరిగణనలోకి తీసుకుని కావాల్సిన నిధి గురించి ఓ అంచనాకు రావచ్చు. ఆ తర్వాత అందుకు తగ్గ సంపదను సమకూర్చే సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నిధులను దారి మళ్లించొద్దు పింఛను కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే అవసరాలకు మళ్లించే పొరపాటు చేయకూడదు. కంపెనీ మారినప్పుడు ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకోకుండా కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవాలి. ఐదేళ్ల లోపు ఈపీఎఫ్ చందాలను వెనక్కి తీసుకుంటే వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌లో ముందస్తు నిధుల ఉపసంహరణ అవకాశాలను తప్పనిసరి సందర్భాల్లోనే వినియోగించుకోవాలన్నది నిపుణులు ఇచ్చే సూచన. ఇక రిటైర్మెంట్ నిధి కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు, అవసరమైనప్పుడు వాటిని సులభంగా వెనక్కి తీసుకునే వెసులుబాటును దుర్వినియోగం చేసుకోకూడదు. ఆర్జనను ఆపొద్దు విశ్రాంత జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే 60 ఏళ్లకే కష్టపడడాన్ని ఆపేసి కాలుపై కాలేసుకుని కూర్చుంటాననడం సరైంది కాదు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నట్టు... శరీరం సహకరించినంత వరకూ పనిచేసుకోవాలని, తద్వారా మరింత ఆర్థిక భద్రతకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. రాబడులను పెంచుకోవాలి... ఈక్విటీల్లో పెట్టుబడులు ద్రవ్యోల్బణం రేటును మించి వేగంగా వృద్ధి చెందుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది కీలకం. ఎందుకంటే వారి ఎన్పీఎస్ పథకంలో ఈక్విటీలో పెట్టుబడులు 15 శాతానికే పరిమితం. అందుకే వారు విడిగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించాలి. ఉద్యోగ పరంగా భద్రత ఎక్కువగా ఉంటుంది గనుక కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుని ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని నిపుణుల సూచన. తద్వారా దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవచ్చంటున్నారు. ఈపీఎఫ్ చందాదారులు కూడా ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించొచ్చు. నిధిని కాపాడుకోవడమూ ముఖ్యమే... ఉద్యోగ జీవితం నుంచి రిటైరయ్యాక విచ్చలవిడిగా ఖర్చు చేయడం తేలికే. అప్పటి వరకు పొదుపు చేసిన నిధి భారీ సంపదగా మారి ఉంటే ఖర్చు విషయంలో నియంత్రణలు అక్కర్లేదు కానీ... పరిమితంగా ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందే. రిటైర్ అయిన తర్వాత కూడా ఈక్విటీల్లో 20 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసుకోవాలనేది నిపుణుల సూచన. రిస్క్ తక్కువగా ఉండే ఈక్విటీ సాధనాలైన ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని వారు చెబుతున్నారు. మరోవైపు డెట్ పథకాలైన ఈపీఎఫ్, పీపీఎఫ్ నిధులను రిటైర్ అయిన వెంటనే వెనక్కి తీసుకోకుండా కొన్నాళ్లు పొడిగించుకోవడం కూడా సరైనదే. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి అధిక రాబడులను ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు పెట్టుకోవడం మరో ఆప్షన్. పన్ను ప్రయోజనాన్ని కల్పించే డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి క్రమానుగతంగా కొద్ది కొద్దిగా ఉపసంహరించుకోవడాన్నీ పరిశీలించొచ్చు. అదే సమయంలో అధిక రాబడుల కోసం భద్రత లేని సాధనాల్లో పెట్టుబడులు పెటొద్దు. -
హ్యాపీగా రిటైర్ అయిపోదాం!!
• స్థిరమైన ఆదాయాన్నిచ్చేందుకు రకరకాల ప్లాన్లు • కాస్త ముందు నుంచే పెట్టుబడి పెడితే ఉత్తమం • రిటైరయ్యేదాకా విత్‌డ్రా చేయకపోతే కావలసినంత నిధి అత్యధిక శాతం మంది ప్రైవేటు ఉద్యోగాల్లోనో... స్వయం ఉపాధి మీదో బతుకుతున్న మన దేశంలో రిటైర్మెంట్కు ఉండే ప్రాధాన్యం మామూలుది కాదు. ఎందుకంటే ప్రైవేటు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నుంచి పింఛను వచ్చే అవకాశం ఉన్నా... అది ఏ మూలకూ సరిపోదు. ఇక కంపెనీలైతే పెన్షన్ ఇవ్వవు. మరేంటి దారి? చాలా మందికి ఇదే సమస్య. ఉద్యోగం చేసినన్నాళ్లూ హాయిగా గడిపేసిన తాము... రిటైర్మెంట్ తరవాత పిల్లలపై ఆధారపడాలంటే వారికి సుతరామూ ఇష్టం ఉండదు. కొందరికి పిల్లలపై ఆధారపడే అవకాశమూ ఉండదు. ఇలాంటి వారు చేయాల్సింది ఒక్కటే!!. ముందుచూపుతో పెట్టుబడులు పెట్టాలి. వయసు పెరిగిన తరవాత వైద్య ఖర్చుల వంటివి కూడా జత అవుతాయి కనక... వీటికి తగ్గట్టు రిటైరీలకు తగిన ఆదాయాన్నిచ్చే మార్గాలేమైనా ఉన్నాయా? అవిచ్చే రాబడులేంటి? వాటిపై పన్నులెంత ఉంటాయి? ఈ వివరాలన్నీ తెలియజేసేదే ‘సాక్షి ప్రాఫిట్’ ప్రత్యేక కథనం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం రిటైర్మెంట్ పథకాలు ప్రధానంగా రెండు రకాలు. ఈపీఎఫ్, పీపీఎఫ్. పన్ను ఆదా బాండ్ల వంటి గ్యారంటీగా రాబడులనిచ్చేవి ఒక రకం. నేషనల్ పెన్షన్ సిస్టమ్, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు ఆఫర్ చేసే రిటైర్మెంట్ ప్లాన్లు వంటి మార్కెట్ ఆధారిత పాలసీలు రెండో రకం. మన ఆదాయం, మనం భరించగలిగే రిస్క్, ఆర్థిక అవసరాలు, మనం పనిచేసే ఉద్యోగం/స్వయం ఉపాధి వంటి అంశాల ఆధారంగా ఏ ఏ ప్లాన్లలో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి. అయితే మార్కెట్ ఆధారిత ప్లాన్లు, గ్యారంటీడ్ ప్లాన్లలో సమతూకంతో ఇన్వెస్ట్ చేస్తే చక్కని ప్రయోజనాలు పొందవచ్చన్నది నిపుణుల సలహా. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)... వేతన జీవులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఫండ్ సాధనం ఇది. ఉద్యోగి ప్రతినెలా మూలవేతనం, డీఏ కలిపితే వచ్చే మొత్తంలో 12 శాతాన్ని ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలో డిపాజిట్ చేస్తారు. నెలకు రూ.15,000 వరకూ వేతనం పొందే ఉద్యోగులకు ఇది తప్పనిసరి. అంతకు మించిన వేతనం ఉండే ఉద్యోగుల విషయంలో ఇది ఆప్షనల్. ఈ నిధిని ఈపీఎఫ్ఓ గానీ, కంపెనీకి చెందిన ట్రస్ట్ కానీ నిర్వహిస్తుంది. రాబడులు: 8 శాతం రేంజ్లో ఉంటాయి. పన్ను అంశాలు: పన్ను ప్రయోజనాల విషయంలో దీనిది అగ్రస్థానమే. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం ఏడాదికి రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. వడ్డీపై గానీ, విత్డ్రాయల్స్పై గానీ ఎలాంటి పన్ను పోటు ఉండదు. విత్‌డ్రాయల్స్: 58 సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ వీటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. అయితే ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం కొంత మొత్తంలో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్లస్ పాయింట్లు: పన్ను నియమాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు తీసుకొని ఖర్చు చేసే అలవాటున్నవారికి 58 సంవత్సరాల వరకూ ఉన్న లాకిన్ పీరియడ్ కళ్లెం వేస్తుంది. మైనస్ పాయింట్లు: ప్రభుత్వం తరచూ నిబంధనలు మారుస్తుండటం. పన్ను రహిత బాండ్లు... రిటైర్మెంట్ అవసరాల కోసం డిజైన్ చేయకపోయినా, 10/15/20 ఏళ్ల పాటు స్థిరమైన వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పన్ను రహిత బాండ్ల గురించి ఏటా అప్పటి బడ్జెట్లో ఆర్థిక మంత్రి వెల్లడిస్తారు. ఆర్ఈసీ, ఎన్హెచ్ఏఐ, పీఎఫ్సీ, ఎన్టీపీసీ, హడ్కో వంటి ప్రభుత్వ రంగ ఇన్ఫ్రా కంపెనీలు ఈ బాండ్లను జారీ చేస్తాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి 3-4 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇష్యూని బట్టి క్రెడిట్ రిస్క్‌ను మీరే మదింపు చేసుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పుడు పన్ను రహిత బాండ్లు రిటైర్మెంట్కు మంచి పోర్ట్‌ఫోలియో అని చెప్పవచ్చు. రాబడులు: సగటున 7-7.5% రేంజ్లో ఉంటాయి. పన్ను ప్రయోజనాలు: మెచ్యూరిటీ వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, ఆర్జించే వడ్డీపై పన్ను రాయితీలు లభిస్తాయి. మెచ్యూరిటీపై కూడా పన్నులేమీ ఉండవు. ప్రారంభ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్ను రాయితీలు లభించవు. మార్కెట్ ద్వారా ఈ బాండ్ల నుంచి వైదొలిగితే మాత్రం 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విత్‌డ్రాయల్స్: బాండ్ల కాలపరిమితి 10/15/20 ఏళ్లుగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతాయి. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్లు: క్రెడిట్ రిస్క్‌ను తగ్గించుకోవాలంటే ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ పన్ను రహిత బాండ్ల ద్వారా ఏటా వచ్చే వడ్డీని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు వస్తాయి. మైనస్ పాయింట్లు: ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని రోజులే అందుబాటులో ఉంటాయి. ఏ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించడానికి కొంత హోమ్‌వర్క్ చేయాలి. వీటికి సావరిన్ గ్యారంటీ ఉండదు. స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ బాండ్లు ట్రేడవుతాయి. కానీ లావాదేవీలు స్వల్పంగా ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పోస్టాఫీసుల్లో కానీ, ఎంపిక చేసిన బ్యాంకుల్లో కానీ రూ.100తో ఈ ఖాతాను తెరవవచ్చు. ఏడాదికి కనీ సంగా రూ.500, గరిష్టంగా రూ.లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. తర్వాత ఐదేళ్ల కాలానికి పొడిగించుకునే వెసులుబాటు ఉంది. రాబడులు: ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీరేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 8.1 శాతంగా ఉంది. భవిష్యత్తులో తగ్గే అవకాశాలున్నాయి. పన్ను ప్రయోజనాలు: ఈపీఎఫ్‌కు వర్తించే పన్ను ప్రయోజనాలే దీనికీ వర్తిస్తాయి. విత్‌డ్రాయల్స్: ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి ఏడవ ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాయల్స్‌ను అనుమతిస్తారు. విత్‌డ్రాయల్ చేసుకుంటున్న ఏడాదికి ముందున్న బ్యాలెన్స్‌లో సగం వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్లు: పన్ను నియమాలు ఓకే. మైనస్ పాయింట్లు: మూడునెలలకొకసారి వడ్డీరేట్లను మార్చడం, ఒడిదుడుకులకు గురయ్యే ప్రభుత్వ సెక్యూరిటీలతో అనుసంధానించడం, అటల్ పెన్షన్ యోజన అసంఘటిత రంగంలోని వ్యక్తుల కోసం భారత ప్రభుత్వం గత ఏడాది అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. 18-40 ఏళ్లలోపు, ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వ్యక్తులు అర్హులు. 60 ఏళ్లు వచ్చే వరకూ నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1,000/2,000/3,000/ 4,000/.5,000 వరకూ పెన్షన్ పొందవచ్చు. వ్యక్తి చెల్లించే ప్రీమియమ్‌ను బట్టి ఈ పెన్షన్ ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.42 చొప్పున 42 సంవత్సరాలు చెల్లిస్తే నెలకు రూ.1,000, రూ.210 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. ప్రధాన మంత్రి జన ధన్ యోజన స్కీమ్ కింద ప్రారంభించిన బ్యాంక్ ఖాతాలతో ఈ స్కీమ్‌ను అనుసంధానిస్తారు. ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ(పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తుంది. మార్కెట్ ఆధారిత స్కీమ్‌లు... నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) మార్కెట్ అనుసంధానిత రిటైర్మెంట్ స్కీమ్ ఇది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి రూ.1,000. ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎం తెంత ఇన్వెస్ట్ చేయాలో(అసెట్ అలొకేషన్) మనమే నిర్దేశించవచ్చు. ఈక్విటీలకు గరిష్ట పరిమితి 50 శాతంగా నిర్దేశించారు. నెలవారీ పోర్ట్‌ఫోలియో వివరాల వెల్లడి, రోజువారీ ఎన్ఏవీ ఆధారంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీకు సంతృప్తికరంగా లేకపోతే, ఫండ్ మేనేజర్‌ను, లేదా అసెట్ అలొకేషన్‌ను మార్చుకోవచ్చు. రాబడులు: మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పటివరకైతే వివిధ కేటగిరీల మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ఎన్పీఎస్ ప్లాన్లు మంచి రాబడులనే ఇచ్చాయని చెప్పొచ్చు. పన్నులు: ప్రారంభ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి రూ. 2లక్షల వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. కానీ రాబడులపై పన్ను పోటు ఉంటుందని గుర్తించాలి. ఫైనల్ మెచ్యురిటీలో 40 శాతం వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 40 శాతం సొమ్ములతో యాన్యుటీని (రిటైర్మెంట్ ప్లాన్స్‌ను) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నెల వారీ ఆదాయంపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ని అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం మీ ఆదాయానికి కలిపి పన్ను విధిస్తారు. మీరు కనుక అధిక పన్ను బ్రాకెట్లో ఉంటే మీకు పన్ను పోటు భారీగానే ఉంటుంది. విత్‌డ్రాయల్స్: ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించి పదేళ్లు పూర్తయితే 25 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంది. లేదంటే రిటైర్మెంట్ వయస్సు వరకూ మీ ఇన్వెస్ట్మెంట్స్ లాక్ అయి ఉంటాయి. ప్లస్ పాయింట్లు: వృత్తిగత ఫండ్ మేనేజర్లు దీనిని నిర్వహిస్తారు. వ్యయాలు తక్కువ. 0.25 శాతం లావాదేవీల, 0.01 శాతం ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఇది 2-3 శాతం రేంజ్లో ఉంటుంది. రాబడులు, వ్యయాలు, పారదర్శకత విషయంలో ఇది మంచి స్కీమ్. మైనస్ పాయింట్లు: తుది నిధుల వినియోగానికి సంబంధించి నియమనిబంధనలు సంతృప్తికరంగా లేవు. మెచ్యూరిటీలో 60 శాతం వరకూ మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బీమా సంస్థల రిటైర్మెంట్ ప్లాన్లు బీమా సంస్థలు ఆఫర్ చేసే రిటైర్మెంట్ ప్లాన్లు రెండు రకాలుగా ఉంటున్నాయి. 1.సంప్రదాయ/గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్లు 2. యులిప్‌లు రెండు ప్లాన్‌ల్లో స్థిరమైన వార్షిక ప్రీమియమ్‌లు 5/10/15 ఏళ్ల టర్మ్ (లేదా 60 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ) చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటైరైన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతుంది. రాబడులు: సంప్రదాయిక పెన్షన్ ప్లాన్లలో గ్యారంటీడ్ ఆడిషన్స్ లభిస్తాయి. వ్యయాలు అధికంగా ఉండడం వల్ల రాబడులు సగటున 4-6% రేంజ్లో ఉంటాయి. యులిప్‌లు కూడా అంతంత మాత్రం రాబడులనే ఇస్తాయి. ప్రీమియమ్ అలొకేషన్, పాలసీ నిర్వహణ, ఫండ్ మేనేజ్మెంట్, యొర్టాలిటీ చార్జీలు తదితర ఖర్చులు అధికంగా ఉంటాయి. పన్నులు: ఈ ప్లాన్లకు చెల్లించిన ప్రీమియమ్లకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. మెచ్యూరిటీపై కూడా పన్నులుండవు. నెలా నెలా తీసుకునే యాన్యుటీపై మాత్రం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. విత్‌డ్రాయల్స్: సంప్రదాయ ప్లాన్‌ల్లో ముందస్తుగా ఎగ్జిట్ కావడం ఉండదు. సరెండర్ చేస్తే చార్జీలు అధికంగా ఉంటాయి. ఇక యులిప్‌ల విషయానికొస్తే, ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు. చార్జీలు స్వల్పంగా ఉంటాయి. ప్లస్ పాయింట్లు: ప్రీమియమ్‌కు పన్ను మినహాయింపులు లభిస్తాయి. మైనస్ పాయింట్లు: ఈ ప్లాన్‌ల్లో పెద్దమొత్తంలో పోగుపడిన మీ నిధిని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండదు. ఈ మొత్తంలో మూడో వంతు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలు ఉంది. మిగిలిన దాంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ 80 సీ ప్రయోజనాలకనుగుణంగా ఉండేలా పలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ప్రత్యేక రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. యుటిఐ రిటైర్మెంట్ బెనిఫిట్ యూనిట్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ వంటి సీబీడీటీ -నోటిఫై చేసిన ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌లో ఏకమొత్తంలో గానీ, సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి, రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. రాబడులు: ఈ ఫండ్స్ రాబడులు 10-15 శాతం రేంజ్లో ఉన్నాయి. పన్నులు: స్పెషల్ రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 80సీ ప్రకారం. తుది విత్డ్రాయల్స్పై పన్నులు సాధారణ మ్యూచువల్ ఫండ్స్‌లాగానే ఉంటాయి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. డెట్ ఫండ్స్ అయితే 20 శాతం దీర్ఘకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విత్‌డ్రాయల్స్: వీటికి లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. రిటైర్మెంట్ వయస్సుకు ముందే విత్‌డ్రా చేసుకుంటే, 1 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. రిటైరైనప్పుడు ఏక మొత్తంలో సొమ్ములు తీసుకోవచ్చు. లేదా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా సొమ్ములను విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్లు: ఇతర మార్కెట్ అనుసంధానిత ప్లాన్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ ప్లాన్లు ఆరోగ్యకరమైన రాబడులనిస్తాయి. లిక్విడీటీ మెరుగ్గా ఉంటుంది. పన్నులు కూడా తక్కువ. మీకు ఇష్టంవచ్చిన రీతిగా మీ సొమ్ములను వాడుకునే వీలుంటుంది. మైనస్ పాయింట్లు: ఎన్‌పీఎస్‌తో పోల్చితే వ్యయాలు, ఫీజులు అధికంగా 2.5-3% ఉండడం, కొత్త ప్లాన్ల గురించి అంచనాకు రావడానికి ట్రాక్ రికార్డ్ ఉండకపోవడం. ఈ విషయాలు గమనించండి ఆరోగ్యకరమైన రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేయాలంటే. ♦ వీలైనంత చిన్న వయసులోనే రిటైర్మెంట్ కోసం మదుపు చేయడం ప్రారంభించండి. ఇలా చేస్తే చక్రవడ్డీ ప్రభావంతో అధిక రాబడులు పొందవచ్చు. ♦ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో క్రమశిక్షణను పాటించాలి. 60 ఏళ్లు వచ్చే వరకూ తప్పనిసరి అయితే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోకూడదు. ♦ ఒక వేళ మీరు ఉద్యోగస్తులైతే సింహభాగం ఈపీఎఫ్‌కు కేటాయించండి. మీ రిటైర్మెంట్ నిధుల్లో దాదాపు 70 శాతం దానికే కేటాయించండి. ♦ ఆ ఏడాది బడ్జెట్‌ను నిశితంగా పరిశీలించండి. పన్ను రహిత బాండ్ల గురించి ప్రకటనలు ఉన్నట్టైతే, పీపీఎఫ్‌కు తక్కువ మొత్తం కేటాయించండి. పన్ను రహిత బాండ్ల కోసం కేటాయించిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి. పన్ను రహిత బాండ్లు ఓపెన్ కాగానే వాటికి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదలాయించండి. ఒక వేళ పన్ను రహిత బాండ్ల ప్రస్తావన లేకుంటే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ♦ {దవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. ♦ రాబడులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్నుల విషయమై అవగాహన పెంచుకోండి. ♦ ఈపీఎఫ్ అవకాశం మీకు లేకుంటే, పీపీఎఫ్, పన్ను రహిత బాండ్లలలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ♦ మీ ఇన్వెస్ట్మెంట్స్ రాబడులు తీరు గమనించండి. కనీసం మూడు నెలలకొకసారైనా మదింపు చేయండి. -
పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్..
ఇండియా ఫస్ట్‌లైఫ్ పెన్షన్ ప్లాన్ ప్రైవేటు రంగ బీమా కంపెనీ ఇండియా ఫస్ట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 40 ఏళ్ల తర్వాత నుంచి ఎప్పుడైనా పెన్షన్ పొందే విధంగా ఈ పాలసీని రూపొందించారు. పెన్షన్ పొందడానికి వెస్టింగ్ ఏజ్ 40 నుంచి 80 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ పాలసీకి ప్రీమియం ఒకేసారిగా లేదా పరిమిత కాలానికి చెల్లించొచ్చు. 10 నుంచి 35 ఏళ్ల కాలపరిమితికి ప్రీమియం 5 నుంచి 10 ఏళ్లు చెల్లించొచ్చు. ప్రీమియం చెల్లించే ప్రారంభ సంవత్సరాల్లో 9 శాతం గ్యారంటీడ్ బోనస్‌ను అందిస్తుంది. ఆ తర్వాత కాలంలో కంపెనీ లాభాల ఆధారంగా బోనస్‌ను ఇస్తారు. ఐసీఐసీఐ బిజినెస్ సైకిల్ ఫండ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ బిజినెస్ సైకిల్ ఫండ్‌లో సిరీస్-3ని ప్రారంభించింది. ఇది క్లోజ్డ్ ఎండెడ్ మల్టీక్యాప్ ఈక్విటీ పథకం. ఈ పథకం లాకిన్ పిరియడ్ 1,125 రోజులుగా నిర్ణయించారు. కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ. 5,000. జనవరి 8న ప్రారంభమైన న్యూ ఫండ్ ఆఫర్ జనవరి 22న ముగుస్తుంది. స్టాన్‌చార్ట్ ఖాతాదారుల కోసం.. ప్రైవేటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టింది.‘లైఫ్‌లైన్’ పేరుతో ప్రారంభించిన ఈ ఆరోగ్య బీమా పాలసీ కింద కనిష్టంగా రూ. 2 లక్షల నుంచి గరిష్టంగా రూ. 1.5 కోట్ల వరకు బీమా రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా క్లాసిక్, ఎలైట్, సుప్రీం పేరుతో మూడు రకాల లైఫ్‌లైన్ పాలసీలను అందిస్తోంది. 11 తీవ్ర వ్యాధులకు బీమా రక్షణ కల్పిస్తుంది. రూ.3.64 లక్షల కోట్లకు ఈక్విటీ ఎంఎఫ్ నిర్వహణ ఆస్తులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల విలువ (ఏయూఎం) డిసెంబర్ చివరి నాటికి 29 శాతం వృద్ధితో రూ.3.64 లక్షల కోట్లకు పెరిగింది. ఈ విలువ గతేడాది డిసెంబర్లో రూ.2.83 లక్షల కోట్లుగా ఉంది. ఏయూఎం విలువ పెరుగుదలకు ఆయా స్కీమ్స్‌పై రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాధాన్యం పెరగడమే కారణం. ఈ విషయాలను అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) వెల్లడించింది. ఇక నవంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఏయూఎం విలువ రూ.3.62 లక్షల కోట్లుగా ఉంది. -
రిటైర్మెంట్ ప్లాన్ ఇలా బెటర్!
పొదుపు సలహా మా వారొక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మాకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం మాకు బాగానే గడిచిపోతోంది. అయితే మరో పదిహేనేళ్లకు ఆయన రిటైరవుతారు. ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటన్నది నా ఆందోళన. దయచేసి మాకు ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్ చెప్పగలరు. మా వారి జీతం నుంచి నేను నెలకు ఐదువేల వరకు ఆదా చేయగలను. - ఎన్.పి.లత, హైదరాబాద్ రిటైర్మెంట్ ప్లాన్ కోసం మీరు కేటాయించదలచిన ఈ మొత్తాన్ని ఈ కిందివిధంగా మదుపు చేస్తే మీ విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. పి.పి.ఎఫ్: ఈ ప్లాన్ కింద మీరు నెలకు రూ. 2000 చొప్పున పదిహేను సంవత్సరాలపాటు పొదుపు చేయండి. ఇది ఎటువంటి నష్టభయమూ లేని మార్గం. దీనికి సెక్షన్ 80 సి కింద దీనికి పన్ను రాయితీ ఉంది. వడ్డీపై ఎటువంటి పన్నూ లేదు. ప్రస్తుతం ఈ పథకంలో 8.7 శాతం వడ్డీ ఇస్తున్నారు. మనీ బ్యాక్ పాలసీలు/ఎన్పీఎస్: ఈ పథకం కింద మీరు నెలకు రూ.1500 వరకు మదుపు చేయవచ్చు. ఇది కూడా నష్టభయం లేని పథకమే. ఇందులో మదుపు చేయడం వల్ల బీమాతోపాటు మనం ఎంచుకున్న కాలవ్యవధి మేరకు విడతల వారీగా కొంత మొత్తం సొమ్ము చేతికి అందుతుంటుంది. దీనికి చెల్లించే ప్రీమియంకు పన్ను రాయితీ ఉంది. దీనితోబాటు నూతన పెన్షన్ పథకం కూడా ప్రయోజనకరమే. ఇందులో మంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్: పైన చెప్పుకున్న రెండూ స్వల్ప వడ్డీనిచ్చే నష్టభయం లేని పథకాలు కాబట్టి, మిగిలిన డబ్బును మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ ఆధారిత గోత్ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరం. పదిహేనేళ్ల కనీస వ్యవధిని ఎంచుకుంటే 15 నుంచి 18 శాతం వరకు వడ్డీ గ్యారంటీ ప్రయోజనాన్ని పొందవచ్చు. - రజని భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ పొదుపు సలహా -
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోండి ఇలా..
ఆర్థిక ఇబ్బందులనేవి జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సమయంలో ఎదురవ్వడం సాధారణమే. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడడం, ఉద్యోగం పోవడం, ఇలా ఎన్నో సమస్యలు అనుకోకుండా సంభవించి ఆర్థికంగా ఉక్కరిబిక్కిరి చేస్తుంటాయ్. అయితే ఆ పరిస్థితులు అకస్మాత్తుగా ఎదురయ్యేవరకు ఎక్కువమంది వీటి గురించి ఆలోచించరు. కానీ ముందుగానే వీటి గురించి ఆలోచించేవారు. అందుకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేవారూ... ఏదైనా అనుకోని ఇబ్బం దిలో పడ్డా... సులువుగా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఒకవేళ ఆర్థిక సమస్యల చట్రంలోకి వెళ్లినా... ‘తమకు అందుబాటులో ఉండే కొద్ది మొత్తాన్ని అయి నా... జాగ్రత్తగా వినియోగించుకుంటూ’ దాని నుంచి బయటపడతారు. మిగిలినవారు నిరాశ, ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొనడానికి దోహదపడే కొన్ని మార్గాలను పరిశీలిస్తే... బీమా ధీమా ఇక్కడ మొదటిగా చెప్పుకోవాల్సింది బీమా గురించి. సంపాదనలో ఉన్నప్పుడు పన్ను మినహాయింపు పొందే జీవిత బీమా ప్రణాళికను అనుసరిస్తే... కుటుంబ ఖజానాకు కొంత అదనపు డబ్బు సమకూరుతుంది. కొంచెం కొంచెంగా ఇలా పొదుపైన డబ్బు ఇబ్బందులు ఎదురయినప్పుడు ఎంతో అండగా ఉం టుంది. ఇక టర్మ్ పాలసీలు సైతం కుటుంబం మొత్తం భవిష్యత్‌కు భరోసాను ఇస్తుంది. కాలపరిమితి ముగిసిన తర్వాత రిటర్న్స్ ఏవీ రానప్పటికీ ప్రమాదాల వంటి సమయంలో భారీ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ ప్రీమియంకు ఈ ప్రొడక్టులు లభిస్తుండడం సానుకూలాంశం. వైద్య బీమాతో కుటుంబంపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సెక్షన్ 80డీ కింద వైద్య బీమా పథకాలకు చెల్లించే ప్రీమియం రూ.15,000పై, అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ. 20,000 వరకూ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. బడ్జెట్ వ్యయం పూర్తిగా అదుపులో ఉండాలి. ప్రతిపైసా కుటుంబ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చు చేయాలి. నెలవారీ సంపాదనకు మించి వ్యయం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరక్కుండా చూసుకోవాలి. ప్రతినెలా వ్యయాలు, భవిష్యత్ నెల ఆదాయం ప్రాతిపదికన దాదాపు ఖచ్చితమైన బడ్జెట్ రూపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి. ధరల పెరుగుదల అంశం సైతం బడ్జెట్లో ప్రతిబింబించాలి. దీనివల్ల మీ బడ్జెట్ అంచనా గాడి తప్పకుండా ఉంటుంది. మధ్యమధ్యలో ఒక్కసారి వేసుకున్న బడ్జెట్‌ను సరిచూసుకుంటూ, దాని ప్రకారమే వ్యయం జరుగుతోందా... లేదా? అన్న అంశాన్ని పరిశీలించుకోవాలి. రిటైర్మెంట్ ప్రణాళిక సంపాదిస్తున్న వయస్సులోనే పదవీ విరమణ అనంతర జీవన విధానం గురించి కూడా ఆలోచించడం మంచిది. సంపాదన ప్రారంభం నుంచే రిటైర్మెంట్ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక పొదుపు, మదుపు ప్రణాళికలు ఉండాలి. ఇక్కడ ‘చక్రీయ’ వడ్డీ విధానం మీ సొమ్ము భారీగా పెరగడానికి ఒక మంత్రంలా ఉపయోగపడుతుంది. సంపాదన సమయంలో కొంత డబ్బును ఈక్విటీల వంటి ‘రిస్క్’ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చినా... అదే సమయంలో రిటైర్మెంట్ అవసరాలకు గాను రిటర్న్స్‌కు భరోసా ఇచ్చే మరికొన్ని ఆర్థిక సాధనాలను ఎంచుకోవడం మంచిది. ఇక 55 ఏళ్లు వచ్చేసరికి ఈక్విటీల వంటి రిస్క్ సాధనాల్లో పెట్టిన డబ్బులో కొంత భాగం సురక్షిత ఆర్థిక సాధనాల్లోకి మార్చాలి. ఇక చివరిగా మరో సూచన- రిటైర్మెంట్కు ఉద్దేశించిన పొదుపు మొత్తాలన్నీ చివరకు (మెచ్యూరిటీ తరువాత) మీ అకౌంట్లో ఆటోమేటిక్‌గా జమయ్యే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ (ఈసీఎస్ మార్గం) విధానాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల పొదుపు, మదుపు డబ్బు తిరిగి పొందడంలో అనవసర వ్యయ, ప్రయాసల భారం తప్పుతుంది. -
ఈ పొదుపు సరిపోదు..
న్యూఢిల్లీ: పదవీ విరమణ తర్వాత ఒడిదుడుకుల్లేకుండా జీవించడానికి అవసరమైనంత సొమ్మును దాచుకోవడం లేదని 78% మంది భారతీయ ఉద్యోగులు అంటున్నారు. ఏటా 16% పొదుపు రేటుతో చైనా తర్వాతి స్థానంలో ఇండియా ఉన్నప్పటికీ, ఉద్యోగులు తమ భవిష్యత్తుపై గుబులుగా ఉండడం గమనార్హం. ఈ విషయాలను గ్లోబల్ ప్రొఫెషనల్ సేవల సంస్థ టవర్స్ వాట్సన్ నివేదిక తెలిపింది... రిటైర్మెంట్ తర్వాత అరకొర ఆదాయ సమస్యను అధిగమించడానికి తాము మరింత ఎక్కువ కాలం ఉద్యోగం చేయడం కంటే అధిక మొత్తాన్ని పొదుపు చేస్తామని అన్ని ఏజ్ గ్రూపుల్లోని ఉద్యోగులు తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది తాము మరి కొన్నేళ్లు అధికంగా ఉద్యోగం చేస్తామని చెప్పగా, 56 శాతం మంది పొదుపును పెంచుతామని తెలిపారు. దేశంలో రిటైర్మెంట్ వయసు అటూఇటుగా 60 ఏళ్లు. ఆర్థిక ప్రణాళికల్లో పదవీ విరమణ తర్వాతి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులు చెప్పారు. నలబై ఏళ్లలోపు ఉద్యోగులు సొంతింటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాతి అవసరాలకు రెండో ప్రాధాన్యమిస్తున్నారు. నలబై ఏళ్లు పైబడిన వారి ప్రాధాన్యం మాత్రం పదవీ విరమణ తర్వాతి అవసరాలకే. భారతీయ ఉద్యోగుల్లో సాపేక్షంగా యువతరమే అధికం. దీంతో, రిటైర్మెంట్ ప్లాన్లకు వారికి తగినంత సమయం ఉంది. ప్రభుత్వం, కంపెనీల యాజమాన్యాలు పొదుపును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టవర్స్ వాట్సన్ ఇండియా డెరైక్టర్ అనురాధా శ్రీరామ్ సూచించారు. -
మహిళకూ రిటైర్మెంట్ ప్లాన్ అవసరమే!
నాకు ఆరు నెలల క్రితం ఉద్యోగం వచ్చింది. ఇంకా పెళ్లి కాలేదు. నాకంటూ ఓ స్వంత ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్ అవసరాలు, రెండేళ్లలో పెళ్లి, అయిదేళ్లలో ఇల్లు, 18, 20 ఏళ్ల తర్వాత పిల్లల చదువులు, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్... వీటికోసం ఏ పొదుపు మార్గాలున్నాయి. ఎక్కువ రిస్కు భరించలేను. - రాగలలిత, హైదరాబాద్ రెండేళ్లలో పెళ్లి పెట్టుకుంటున్నారంటే బ్యాంకులో ప్రతి నెలా రికరింగ్ డిపాజిట్ వేసుకోవడం ఉత్తమ మార్గం. ఎందుకంటే స్వల్పకాలానికి మీరు మార్కెట్లోకి వెళ్లడం మంచిది కాదు. మీ జీతం వచ్చే బ్యాంకులో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ రాసిస్తే, బ్యాంక్ కంప్యూటర్లే ఆ మొత్తాన్ని బదిలీ చేస్తాయి. ఇక మీరు ఐదేళ్లలో ఇల్లు కొనాలంటే చేతిలో డౌన్‌పేమెంట్ కొంతకావాలి. ఆర్.డి.ద్వారా వచ్చే వడ్డీ హోమ్‌లోన్ స్వల్పతేడాతోనే ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పట్నుంచే దానికోసం కూడా ఆర్.డి. చేసుకోవడం మంచిది. ఇందులో చక్రవడ్డీ పరంగా చూస్తే హోమ్‌లోన్‌కు కట్టే వడ్డీ మీకు గిట్టుబాటు అయినట్లే. ఇక 18, 20 ఏళ్ల తర్వాత పిల్లల చదువులకి ప్లాన్ చేయాలనుకుంటే మదుపు అవకాశాలు పెరుగుతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో సొమ్ము దాచుకోవచ్చు. ఇది పన్ను రహితం. మీ ఆదాయంలో కొంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనూ పెట్టొచ్చు. ప్రతినెలా సిప్ మార్గంలో సొమ్ము దాచుకుంటూ పోతే దీర్ఘకాలానికి రిస్క్ పోయి మదుపు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి పిల్లల చదువులకు ఈ రెండు మార్గాలు ఉత్తమమైనవి. ఇక 35 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ గురించి మీరు ఆలోచించడం అభినందనీయం. మీ వయసు ఇంకా తక్కువే కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. షేర్ మార్కెట్‌పై అవగాహన వచ్చేవరకు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి. సుదీర్ఘ భవిష్యత్‌లో మార్కెట్ భారీగా వృద్ధి చెందే అవకాశం ఉన్నవి మార్కెట్, రియల్ ఎస్టేట్... ఈ రెండే. వీటిలో పెట్టుబడి మంచిదే. - వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు