భవిష్యత్తు బాగుండాలంటే..? | Financial security for a better future | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు బాగుండాలంటే..?

Published Mon, Feb 7 2022 12:19 AM | Last Updated on Mon, Feb 7 2022 12:19 AM

Financial security for a better future - Sakshi

‘ఈ రోజు గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం..?’ ఇలా అనుకుంటే అది భద్రతకు హామీనివ్వదు. రేపటి కోసం కొంత పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులోనూ నిశ్చితంగా ఉంటామని అర్థం చేసుకునే వారు కొందరే. కష్టపడి తెచ్చిందంతా ఖర్చు పెడుతూ.. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉండడం కుటుంబానికి ఏ మాత్రం భరోసానీయదు. చాలా మంది పొదుపును వాయిదా వేసుకుంటూ వెళతారు. ఆర్థిక ఇబ్బంది, అత్యవసర పరిస్థితి రానంత వరకు ఇదంతా సాఫీగానే అనిపిస్తుంది. కరోనా రాక ముందు వరకు చాలా మంది ఆరోగ్య బీమాను, అత్యవసర నిధిని నిర్లక్ష్యం చేసిన వారే. ఈ తరహా వ్యక్తుల్లో కొంత మందికి కనువిప్పు కలిగింది. ‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు’ అని కాకుండా.. ఎవరి భవిష్యత్తు కోసం వారే రక్షణాత్మకంగా వ్యవహరించాలి. భవిష్యత్తు కోసం ఎందుకు పొదుపు, మదుపులు అవసరమో అవగాహన కల్పించే ప్రాఫిట్‌ ప్లస్‌ కథనమే ఇది.   

జీవితం అంటే ఎప్పుడూ ఒకే తీరున, సాఫీగా సాగిపోదు. కొన్ని ఇబ్బందులు సర్వ సాధారణం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. కరోనా నియంత్రణకు 2020 మార్చి చివరి నుంచి నెలరోజులకుపైగా లాక్‌డౌన్‌లను విధించడం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలు కావచ్చు. భవిష్యత్తులో ఏ రోజు ఎలా ఉంటుందన్నది మన చేతుల్లో లేని అంశం. కాకపోతే ఏది వచ్చినా ఎదుర్కోగల సన్నద్ధతే మన చేతుల్లో ఉంటుంది. తగినంత పొదుపు ఉంటే, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆ సమయంలో ఇతరుల నుంచి ఆర్థిక సాయం కోసం అర్థించాల్సిన అవస్థ తప్పుతుంది. అందుకే పొదుపు, మదుపులను వాయిదా వేయవద్దు.

ఆదాయం ఆగిపోతుంది..
సంపాదన బండి ఏదో ఒకరోజు (రిటైర్మెంట్‌) ఆగిపోతుందని తెలిసిందే. కానీ, సంపాదన ఆగిపోయిన తర్వాతి రోజు నుంచి జీవితం ఎలా? ఈ విషయాన్ని తెలిసినా కానీ, చాలా మంది దాటవేస్తుంటారు. ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత కదా, చూసుకోవచ్చులే.. అనుకుంటూ రిటైర్మెంట్‌ ప్రణాళికను ఎక్కువ మంది వాయిదా వేస్తుంటారు. కానీ, ముందు నుంచే పొదుపు చేస్తే కాంపౌండింగ్‌తో తక్కువ మొత్తం అయినా పెద్ద నిధిగా సమకూరుతుంది. అదే 40–45 తర్వాత మొదలు పెడితే, ఉన్న కొద్ది కాలంలో ఎంత వెనుకేయగలరు?.. 60 ఏళ్ల తర్వాతి జీవించి ఉన్నంత కాలం అవసరాలను ఆ మొత్తం తీర్చగలదా? అని ఆలోచించాలి.  

ప్రశాంతత కోసం..
భద్రత, ప్రశాంతత ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేంత నిధి దగ్గర ఉంటే.. ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండొచ్చు. ఆఫీసులో కొంత మంది ఉద్యోగులను తీసేస్తున్నారన్న వార్త మీ చెవిన పడితే, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, పిల్లల స్కూల్‌ ఫీజులు పెరిగాయని తెలిస్తే.? ఇవన్నీ చిన్నవే అయినా ఎంతో కొంత ఆందోళనకు గురి చేసేవే. దేనిని అయినా టేక్‌ ఇట్‌ ఈజీ పాలసీగా ఎప్పుడు తీసుకుంటాం? తగినంత ఆర్థిక స్తోమత ఉన్నప్పుడే కదా! బ్యాంకులో బ్యాలన్స్‌ లేకుండా, సాగిపోయే వారికి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే ? కష్టకాలం మొదలవుతుంది. కావాల్సినంత పొదుపు చేయలేని వారిపై అంతర్లీనంగా ఒత్తిడి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక పొదుపు, మదుపు అవసరాన్ని గుర్తించాలి.  

అపరాధ భావం ఎందుకు?

చాలా మంది ముందుచూపు, ప్రణాళికలేమితో పొదుపును నిర్లక్ష్యం చేస్తుంటారు. అవగాహన ఉన్నా కానీ, పొదుపు చేయలేని వారు కూడా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు అవసరానికి సరిపడా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడుతుంటారు. కానీ, దీని వెనుక కారణం.. వారు పిసినారులని కాదు. తగినంత సంపద లేకపోవడమే. దీంతో వెళ్లిన ప్రతి చోటా పాకెట్‌ నుంచి ఖర్చు చేసేందుకు ధైర్యం చాలదు. కానీ, ఇది వారిపై, వారి జీవిత భాగస్వామి, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని గుర్తించాలి. చక్కని ఆర్థిక జీవనం అంటే.. తగినంత పొదుపు చేయడమే కాదు..
అవసరానికి సరిపడా, వివేకంగా ఖర్చు చేయడం కూడా. కనుక పొదుపును నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చును పూర్తిగా బంధించేయకూడదు.  

వారసత్వం విషయంలో...
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు అందరికీ లభిస్తాయన్న గ్యారంటీ ఉండదు. తమ పిల్లలకు భూమి/ఇల్లు రూపంలో ఆస్తిని ఇవ్వాలని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. తల్లిదండ్రుల నుంచి చెప్పుకోతగ్గ ఆస్తులు లభిస్తే.. వాటిని మెరుగ్గా నిర్వహించే ప్రణాళిక ఉండాలి. వారసత్వ ఆస్తుల్లేని వారు, తమ పిల్లలకు ఆస్తులను సమకూర్చిపెట్టాలని భావిస్తే.. ఇది అదనపు ప్రణాళిక అవుతుంది. ఇందుకోసం పెద్ద మొత్తమే ఇన్వెస్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆస్తుల విషయంలోనూ ప్రణాళికాయుతంగా నడుచుకోవాలి.   

పెద్ద లక్ష్యాలు
జీవితంలో ఎన్నో కీలకమైన లక్ష్యాలు ఎదురవుతాయి. వీటిల్లో కొన్ని తప్పించుకునేవి కావు. పిల్లల విద్యా ఖర్చు, వివాహాలు, ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్, పర్యటనలు ఇలా ఎన్నో ఉంటాయి. భవిష్యత్తు కోసం తగినంత కూడబెట్టలేకపోతే, రుణాలపై ఆధారపడితే చివరికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? అందుకని జీవితాన్ని చేయి దాటిపోనీయకుండా, భవిష్యత్తు పట్ల ముందు చూపుతో పొదుపు చేసుకుంటూ వెళ్లాలి.  

ఆర్థిక స్వేచ్ఛ
వేతనంపై ఇక ఆధారపడని రోజు ఒకటి జీవితంలో వస్తుంది. అప్పటికి కనీస అవసరాలకు సరిపడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేంత నిధిని సమకూర్చుకోవాలి. దీన్నే ఆర్థిక స్వాతంత్య్రంగా చెబుతారు. మీ అవసరాలకు వేరేవారిపై ఆధారపడకపోవడం. ఆర్జన ఆరంభించిన తొలినాళ్లలో ఎక్కువ మంది వద్ద ఎటువంటి నిధి (వారసత్వంగా ఉంటే తప్ప) ఉండదు. కనుక 100 శాతం వేతనంపైనే జీవనం ఆధారపడి ఉంటుంది. అయితే, కాలక్రమేణా బుట్టలోకి సంపద చేరాలి. అప్పుడే అవసరానికి కావాల్సినంత తీసుకోగలరు. ఒక వ్యక్తికి కుటుంబ ఖర్చులు నెలవారీగా రూ.40,000 అవుతున్నాయని అనుకుంటే.. 12 నెలలకు సరిపడా రూ.4.8 లక్షలు కనీసం అతని వద్ద ఉండాలి. రూ.48 లక్షలు ఉంటే 8–10 ఏళ్ల అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకని జీవితంలో కోరుకున్న దశ నుంచి కనీస అవసరాలను తీర్చుకునేందుకు సరిపడా నిధి ఏర్పడాలి. అందుకోసం ఆర్జన మొదలైన వెంటనే పొదుపు, మదుపు ప్రయాణాన్ని ఆరంభించాలి. దాంతో చాలా వేగంగా (50 ఏళ్లకే) ఆర్థిక స్వాతంత్య్ర స్థితిని చేరుకుంటారు.  

పురోగతి
జీవితానికి పురోగతి కీలకమైనది. ఉద్యోగం ఆరంభంలో బ్యాంకు బ్యాలన్స్‌ జీరోగా ఉన్నా.. 5–10 ఏళ్ల సర్వీసు తర్వాత తగినంత కనిపించాలి. అది పురోగతికి చిహ్నంలా మరింత ప్రేరణనిస్తుంది. ఉత్సాహంతో పనిచేసేందుకు సరిపడా బూస్ట్‌నిస్తుంది. పదేళ్ల కెరీర్‌ తర్వాత కూడా బ్యాంకు ఖాతా వెక్కిరిస్తోందంటే.. అది పురోగతికి చిహ్నం కాబోదు. నికర విలువ పెరగడం లేదంటే ‘ధనిక బానిస’ అనే అనుకోవాల్సి వస్తుంది. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు ఉన్నంతలో ఎంతో కొంత ఆదా చేసుకోవడమే ఆచరణ కావాలి. ప్రతి నెలా రూ.5,000 సిప్‌ ఆరంభించి 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేస్తే, 12 శాతం రాబడి రేటు ప్రకారం రూ.1.76 కోట్లు సమకూరుతుంది. 30 ఏళ్లలో మీరు చేసిన పెట్టుబడి రూ.18 లక్షలే. కానీ, వచ్చిన రాబడి రూ.1.58 కోట్లు.  

మెరుగైన మార్గం..  
చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా లేకపోవచ్చు. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉండొచ్చు. వెనుక కావాల్సినంత నిధితో బ్యాకప్‌ ప్రణాళిక లేకపోతే ఆలోచన వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన ఆదాయం, జీవనం కోసం ఉద్యోగం మారాలనుకుంటే కనీసం 2–3 ఏళ్లపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చినా.. జీవనానికి ఇబ్బంది ఎదురుకాకూడదు. మీ వద్ద నిధి ఉంటే, ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కనుక విజయంలోనూ ‘వెల్త్‌’ పాత్ర ఉంటుంది.  

రుణ ఊబిలోకి వెళ్లొద్దు..
రుణం తీసుకోవడం ఒక్కసారి మొదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని స్టాప్‌ చేయడం కష్టమే. ముందు ఇది చిన్నగానే మొదలు కావచ్చు. కొన్నేళ్లకు నియంత్రించలేనంత స్థాయికి చేరిపోతుంది. చివరికి బయట పడలేనంత ఊబిగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకనే క్రెడిట్‌ కార్డు అయినా, వ్యక్తిగత రుణం తీసుకుంటున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. రుణం తీసుకుంటున్నారంటే.. తగినంత పొదుపు లేకపోవడం వల్లే. పొదుపు లేకుండా రుణం బాటపడితే.. తిరిగి అప్పుల భారం నుంచి బయటకు వచ్చి, పొదుపు చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి రావచ్చు. కొందరికి అది అసాధ్యం కావచ్చు. కనుక డెట్‌కు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

అనుసరించాల్సిన ప్రణాళిక
► మెరుగైన జీవనం కోసమే ప్రణాళికాయుత ఆర్థిక జీవనం. ఇందులో ముందుగా తన కుటుంబ రక్షణ కోసం సరిపడా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవాలి.  
► 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిధిని అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుని ఉంచుకోవాలి. అవసరమైన వెంటనే తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.  

► ప్రతీ నెలా ఇంటికి తీసుకెళ్లే వేతనం (సంపాదన) నుంచి 20–40 శాతాన్ని ఈక్విటీల్లోకి మళ్లించాలి. మ్యూచువల్‌ ఫండ్స్, ఇండెక్స్‌ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.  
► పెట్టుబడుల్లో అస్థిరతలు తగ్గించేందుకు వీలుగా కొంత డెట్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. అప్పటికే ఈపీఎఫ్‌ రూపంలో చేస్తున్న డెట్‌ భాగాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.  
► ఎండోమెంట్, మనీబ్యాక్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమాను, పెట్టుబడిని కలపొద్దు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement