3rd Wave In India: Companies Give Work From Home, Covid Cases Increase In India - Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 2022.. నచ్చిన చోట నుంచి పనిచేసే వెసులుబాటు!

Published Tue, Jan 11 2022 4:38 AM | Last Updated on Tue, Jan 11 2022 12:05 PM

Third wave of Covid-19 sets in, India Inc sends staff back home - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం, కరోనా మూడో ఉధృతి ఖాయమన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ కంపెనీలు.. అత్యవసర విధానాలను అమలు చేయడంపై దృష్టి మళ్లించాయి. కరోనా కేసులు గతేడాది జూలై నుంచి తగ్గుముఖం పట్టడంతో ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులను (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌/డబ్ల్యూఎఫ్‌హెచ్‌) తిరిగి కార్యాలయాలకు క్రమంగా రప్పించుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి.


కానీ, ఒక్కసారిగా కరోనా రూపంలో మళ్లీ కేసుల తీవ్రతను చూసిన కంపెనీలు ఉన్న చోట నుంచే సౌకర్యవంతంగా పనిచేసే విధానాలను ఆచరణలో పెడుతున్నాయి. అత్యవసర ప్రయాణాలనే అనుమతిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోని కంపెనీలు గడిచిన కొన్ని నెలల కాలంలో కేసులు తక్కువగా ఉండడంతో హైబ్రిడ్‌ పని నమూనాను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కేసులు పెరగడం మొదలుకావడంతో తిరిగి పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పనివిధానానికి మారిపోవడం లేదంటే కీలకమైన సిబ్బంది వరకే కార్యాలయాలకు వచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి.

అత్యవసరమైతేనే ఆఫీసుకు..  
ఐటీసీ గత కొన్ని నెలలుగా గ్రూపు పరిధిలో హైబ్రిడ్‌ పని నమూనాను అమలు చేస్తోంది. ‘‘అత్యవసరమైన పనుల కోసమే కార్యాలయానికి రండి’’అంటూ తాజాగా ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, ముంబైలోని ఉద్యోగులకు సూచనలు జారీ చేసింది. ఇతర పట్టణాలు, కేంద్రాల్లో 30 శాతానికి ఉద్యోగుల హాజరును తగ్గించింది. అంటే ఏకకాలలో 30 శాతం మించి కార్యాలయంలో పని చేయకూడదు. మిగిలిన వారు తామున్న చోట నుంచే పనులను నిర్వహించాల్సి ఉంటుంది.



పూర్తి సన్నద్ధత..: కార్యాలయంలో ఉద్యోగుల హాజరు 50 శాతానికి మించకూడదన్న ప్రభుత్వ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నట్టు ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అదానీ విల్‌మార్‌ సీఈవో అంగ్షు మాలిక్‌ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తాము మెరుగ్గా సన్నద్ధమై ఉన్నట్టు చెప్పారు. ‘‘గత రెండేళ్లలో సరఫరా చైన్‌ సవాళ్లను చవిచూసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. దీంతో మా ఉత్పత్తులకు ఎటువంటి కొరత ఏర్పడకుండా మిగులు నిల్వలను సిద్ధం చేశాం’’ అని మాలిక్‌ వివరించారు.

గోద్రెజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఈ వారమే తన బృందాలకు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. అంతకుముందు ఈ సంస్థ హైబ్రిడ్‌ పని నమూనాను (ఇంటి నుంచి, కార్యాలయం నుంచి) అమలు చేసింది. 50% సిబ్బంది ఒక రోజు కార్యాలయానికి వచ్చి, మరుసటి రోజు ఇంటి నుంచి పని చేసేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సేల్స్‌ విభాగంలో సిబ్బందిని సైతం 100% ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించింది.

ప్రాంతాల వారీగా విధానం..   
చెన్నై కేంద్రంగా పనిచేసే శ్రీరామ్‌ గ్రూపు పరిధిలో 75 శాతం మంది ఉద్యోగులే కార్యాలయానికి వచ్చి పనిచేసే వారు. ఇక నుంచి 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘రాష్ట్రాల వారీగా పని విధానాలను అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎక్కువ మంది ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చాం. హైదరాబాద్‌లో కేసులు తక్కువ ఉండడంతో అక్కడ తక్కువ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తారు’’ అని శ్రీరామ్‌ గ్రూపు అధికార ప్రతినిధి తెలిపారు. ఇక ముంబైకు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, మహీంద్రా గ్రూపు, టాటా గ్రూపు, ఆదిత్య బిర్లా గ్రూపు తదితర కంపెనీల పరిధిలో కార్యాలయానికి వచ్చి కొద్ది మందే పనిచేస్తున్నారు.



ఉద్యోగులకు టీకా క్యాంపులు  
‘‘సౌకర్యవంతమైన పని విధానం అమలవుతోంది. నచ్చిన చోట నుంచి ఉద్యోగులు పనిచేయొచ్చు. అదే విధానం కొనసాగుతుంది’’ అని మహీంద్రా గ్రూపు సీనియర్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు. టాటా మోటార్స్‌ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయవచ్చని సూచించింది. కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులే ఉండేలా రొటేషన్‌ విధానంలో హైబ్రిడ్‌ పని విధానాన్ని అమలు చేస్తున్నట్టు టాటా మోటార్స్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

మారుతి సుజుకీ తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు ఇప్పిస్తోంది. బూస్టర్‌ డోసులను కూడా ఇప్పిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ రాజేష్‌ ఉప్పల్‌ తెలిపారు. స్టార్టప్‌లు ఉద్యోగుల రక్షణ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఓకేక్రెడిట్‌ అయితే ఉద్యోగులకు హెల్త్‌ కవరేజీని రూ.10 లక్షలకు పెంచింది. డెస్క్‌లో పనిచేసే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అనుమతించింది.

సంబంధిత వార్త: డామిట్‌.. కంపెనీల కథ అడ్డం తిరిగింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement