
న్యూఢిల్లీ: ఐపీఎల్–2021 అన్ని లీగ్ మ్యాచ్‌లను ముంబైలోనే నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నాలుగు పెద్ద మైదానాలు (వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్, రిలయన్స్) అందుబాటులో ఉండటం వల్ల ఏర్పాట్లు సులభతరం కావడంతో పాటు ఒకే నగరంలో ‘బయో సెక్యూర్ బబుల్’ను సమస్యలు లేకుండా సిద్ధం చేయవచ్చని బీసీసీఐ భావించింది. అయితే ముంబైతో పాటు మహారాష్ట్రలో కూడా కోవిడ్–19 కేసులు ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి మారిపోయింది. ‘ఐపీఎల్ నిర్వహణ కోసం వేర్వేరు నగరాల పేర్లను పరిశీలిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా నగరాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లు ఎలాగూ అహ్మదాబాద్ లోనే జరుగుతాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇక్కడ చదవండి: అటు యూసుఫ్... ఇటు వినయ్...