Domestic companies
-
ఆఫీస్ స్పేస్‌లో.. దేశీ కంపెనీల హవా
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల వినియోగంలో దేశీ కంపెనీల వాటా గణనీయంగా మెరుగుపడింది. 2022కు ముందు తొమ్మిది పట్టణాల్లోని మొత్తం ఆఫీస్ వసతుల్లో దేశీ కంపెనీల వాటా మూడింట ఒక వంతే ఉండగా, ఆ తర్వాత (2022 నుంచి 2024లో మొదటి ఆరు నెలలు) చోటుచేసుకున్న 154 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) లీజు లావాదేవీల్లో దేశీ కంపెనీల వాటా 47 శాతానికి (72 మిలియన్ ఎస్ఎఫ్టీ) చేరుకుంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా, కోచి, అహ్మదాబాద్‌కు సంబంధించి గణాంకాలను ఈ నివేదికలో సీబీఆర్ఈ వెల్లడించింది. ‘‘వృద్ధి, వ్యాపార కార్యకలాపాల విస్తరణ పట్ల దేశీ కంపెనీల అంకిత భావాన్ని ఈ గణంకాలు తెలియజేస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఆఫీస్ వసతుల్లో దేశీ కంపెనీల వాటా మరింత పెరుగుతుంది. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎంతో వేగంగా విస్తరిస్తోంది. నైపుణ్య మానవవనరులు దండిగా ఉన్నాయి. డిమాండ్‌ను కీలకంగా ఇవే నడిపిస్తున్నాయి. వ్యాపారంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా అధిక నాణ్యత, సౌకర్యవంతమైన పని వాతావరణానికి భారత కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ పేర్కొన్నారు. టాప్–9 పట్టణాల్లో 2026 నాటికి అదనంగా 189 మిలియన్ ఎస్ఎఫ్టీల ప్రీమియం ఆఫీస్ వసతి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మెరుగుపడిన సామర్థ్యాలు.. అంతర్జాతీయ అనిశి్చతుల్లోనూ దేశ ఆర్థిక భవిష్యత్ వృద్ధి పట్ల స్థానిక కంపెనీల్లో ఉన్న ఆశాభావాన్ని సీబీఆర్ఈ డేటా తెలియజేస్తోందని భీవ్ వర్క్‌స్పేసెస్ వ్యవస్థాపకుడు, సీఈవో శేషురావు పప్లికర్ పేర్కొన్నారు. ‘‘ఇది దేశ వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ పరిణతిని తెలియజేస్తోంది. స్థిరమైన వృద్ధిలో దేశీ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తోంది. మరిన్ని భారత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నందున, ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుంది’’అని శేషురావు వివరించారు. స్థానిక కంపెనీల సామర్థ్యాలను ఈ డిమాండ్ ధోరణులు తెలియజేస్తున్నట్టు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన బ్రహ్మ గ్రూప్ ఏవీపీ (ఆపరేషన్స్) ఆశిష్ శర్మ అన్నారు. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ రంగాల మద్దతుతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ పుంజుకున్నట్టు చెప్పారు. -
విదేశాల్లో నేరుగా దేశీ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు తమ షేర్లను నేరుగా విదేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి కోవిడ్–19 సహాయక ప్యాకేజీ కింద 2020 మేలోనే ప్రకటించినప్పటికీ, దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. ‘ఐఎఫ్ఎస్సీ ఎక్సే్చంజీల్లో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‘ అని ఆమె చెప్పారు. సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, మెరుగైన వేల్యుయేషన్స్ దక్కించుకునేందుకు దీనితో తోడ్పాటు లభించగలదని మంత్రి పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలుత గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో లిస్ట్ అయ్యేందుకు, ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్‌కు అనుమతినివ్వొచ్చని పేర్కొన్నారు. ఈ జాబితాలో బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనవి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. స్టార్టప్‌లు.. రిలయన్స్‌కు బూస్ట్.. కొత్త పాలసీతో యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), విదేశాల్లో లిస్టింగ్‌పై కసరత్తు చేస్తున్న రిలయన్స్ డిజిటల్ విభాగానికి ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయ సంస్థలు.. ప్రధానంగా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్ట్ కావాల్సి ఉంటోంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలు ఇదే బాటలో లిస్ట్ అయ్యాయి. విదేశాల్లో లిస్టింగ్ వల్ల భారతీయ కంపెనీలు వివిధ దేశాల్లోని ఎక్సే్చంజీల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. -
క్యూ1లో పీఈ పెట్టుబడులు డీలా!
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్లో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు దేశీ కంపెనీలలో 17 శాతం క్షీణించాయి. వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో 6.72 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 53,000 కోట్లు)కు పరిమితమయ్యాయి. డీల్స్ సైతం 15 శాతం నీరసించి 344కు చేరాయి. గతేడాది(2021–22) క్యూ1లో 8.13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇక గతేడాది జనవరి–మార్చి(క్యూ4)లో తరలివచ్చిన 8.97 బిలియన్ డాలర్లతో పోలిస్తే త్రైమాసికవారీగా 25 శాతం తగ్గాయి. లావాదేవీల సమీక్షా సంస్థ, లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ గ్రూప్ కంపెనీ రెఫినిటివ్ వెల్లడించిన గణాంకాలివి. కాగా.. ఈ క్యాలండర్ ఏడాది(2022)లో తొలి ఆరు నెలల(జనవరి–జూన్)ను పరిగణిస్తే.. దేశీ కంపెనీలలో పీఈ పెట్టుబడులు 26 శాతం పుంజుకుని 15.7 బిలియన్ డాలర్లను తాకాయి. టెక్నాలజీ స్పీడ్ 2022 జనవరి–జూన్ మధ్య పీఈ పెట్టుబడుల్లో టెక్నాలజీ రంగానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. మొత్తం పెట్టుబడుల్లో 73 శాతానికిపైగా అంటే 6.53 బిలియన్ డాలర్లను టెక్ రంగం సొంతం చేసుకుంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇండియా ఆధారిత ఫండ్స్ రెట్టింపునకుపైగా 7 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు రెఫినిటివ్ పేర్కొంది. ఈ పెట్టుబడులు సైతం వెచ్చించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇక పరిశ్రమలవారీగా చూస్తే ఇంటర్నెట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, రవాణా గరిష్టంగా పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే బయోటెక్నాలజీ, మెడికల్– హెల్త్ విభాగాలకు పెట్టుబడులు భారీగా నీరసించాయి. కాగా.. తొలి అర్ధభాగంలో 10 పీఈ డీల్స్‌లో వెర్సే ఇన్నోవేషన్(82.77 కోట్ల డాలర్లు), థింక్ అండ్ లెర్న్(80 కోట్ల డాలర్లు), బండిల్ టెక్నాలజీస్(70 కోట్ల డాలర్లు), టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ(49.47 కోట్ల డాలర్లు), ఎన్‌టెక్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్(330 కోట్ల డాలర్లు), డెల్హివరీ(30.4 కోట్ల డాలర్లు) బిజీబీస్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్(30 కోట్ల డాలర్లు) చోటు చేసుకున్నాయి. -
వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇక అవసరమైతేనే ఆఫీస్‌కి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం, కరోనా మూడో ఉధృతి ఖాయమన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ కంపెనీలు.. అత్యవసర విధానాలను అమలు చేయడంపై దృష్టి మళ్లించాయి. కరోనా కేసులు గతేడాది జూలై నుంచి తగ్గుముఖం పట్టడంతో ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులను (వర్క్ ఫ్రమ్ హోమ్/డబ్ల్యూఎఫ్‌హెచ్) తిరిగి కార్యాలయాలకు క్రమంగా రప్పించుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. కానీ, ఒక్కసారిగా కరోనా రూపంలో మళ్లీ కేసుల తీవ్రతను చూసిన కంపెనీలు ఉన్న చోట నుంచే సౌకర్యవంతంగా పనిచేసే విధానాలను ఆచరణలో పెడుతున్నాయి. అత్యవసర ప్రయాణాలనే అనుమతిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోని కంపెనీలు గడిచిన కొన్ని నెలల కాలంలో కేసులు తక్కువగా ఉండడంతో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కేసులు పెరగడం మొదలుకావడంతో తిరిగి పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పనివిధానానికి మారిపోవడం లేదంటే కీలకమైన సిబ్బంది వరకే కార్యాలయాలకు వచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అత్యవసరమైతేనే ఆఫీసుకు.. ఐటీసీ గత కొన్ని నెలలుగా గ్రూపు పరిధిలో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తోంది. ‘‘అత్యవసరమైన పనుల కోసమే కార్యాలయానికి రండి’’అంటూ తాజాగా ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబైలోని ఉద్యోగులకు సూచనలు జారీ చేసింది. ఇతర పట్టణాలు, కేంద్రాల్లో 30 శాతానికి ఉద్యోగుల హాజరును తగ్గించింది. అంటే ఏకకాలలో 30 శాతం మించి కార్యాలయంలో పని చేయకూడదు. మిగిలిన వారు తామున్న చోట నుంచే పనులను నిర్వహించాల్సి ఉంటుంది. పూర్తి సన్నద్ధత..: కార్యాలయంలో ఉద్యోగుల హాజరు 50 శాతానికి మించకూడదన్న ప్రభుత్వ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్ సీఈవో అంగ్షు మాలిక్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తాము మెరుగ్గా సన్నద్ధమై ఉన్నట్టు చెప్పారు. ‘‘గత రెండేళ్లలో సరఫరా చైన్ సవాళ్లను చవిచూసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. దీంతో మా ఉత్పత్తులకు ఎటువంటి కొరత ఏర్పడకుండా మిగులు నిల్వలను సిద్ధం చేశాం’’ అని మాలిక్ వివరించారు. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ వారమే తన బృందాలకు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. అంతకుముందు ఈ సంస్థ హైబ్రిడ్ పని నమూనాను (ఇంటి నుంచి, కార్యాలయం నుంచి) అమలు చేసింది. 50% సిబ్బంది ఒక రోజు కార్యాలయానికి వచ్చి, మరుసటి రోజు ఇంటి నుంచి పని చేసేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సేల్స్ విభాగంలో సిబ్బందిని సైతం 100% ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించింది. ప్రాంతాల వారీగా విధానం.. చెన్నై కేంద్రంగా పనిచేసే శ్రీరామ్ గ్రూపు పరిధిలో 75 శాతం మంది ఉద్యోగులే కార్యాలయానికి వచ్చి పనిచేసే వారు. ఇక నుంచి 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘రాష్ట్రాల వారీగా పని విధానాలను అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎక్కువ మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాం. హైదరాబాద్‌లో కేసులు తక్కువ ఉండడంతో అక్కడ తక్కువ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తారు’’ అని శ్రీరామ్ గ్రూపు అధికార ప్రతినిధి తెలిపారు. ఇక ముంబైకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా గ్రూపు, టాటా గ్రూపు, ఆదిత్య బిర్లా గ్రూపు తదితర కంపెనీల పరిధిలో కార్యాలయానికి వచ్చి కొద్ది మందే పనిచేస్తున్నారు. ఉద్యోగులకు టీకా క్యాంపులు ‘‘సౌకర్యవంతమైన పని విధానం అమలవుతోంది. నచ్చిన చోట నుంచి ఉద్యోగులు పనిచేయొచ్చు. అదే విధానం కొనసాగుతుంది’’ అని మహీంద్రా గ్రూపు సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. టాటా మోటార్స్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయవచ్చని సూచించింది. కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులే ఉండేలా రొటేషన్ విధానంలో హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేస్తున్నట్టు టాటా మోటార్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మారుతి సుజుకీ తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు ఇప్పిస్తోంది. బూస్టర్ డోసులను కూడా ఇప్పిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజేష్ ఉప్పల్ తెలిపారు. స్టార్టప్‌లు ఉద్యోగుల రక్షణ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఓకేక్రెడిట్ అయితే ఉద్యోగులకు హెల్త్ కవరేజీని రూ.10 లక్షలకు పెంచింది. డెస్క్‌లో పనిచేసే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతించింది. సంబంధిత వార్త: డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు రెట్టింపు
ముంబై: దేశీ కంపెనీలు ఈ ఏడాది జూన్‌లో విదేశాల్లో ప్రత్యక్షంగా పెట్టిన పెట్టుబడులు 2.80 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్ నాటి 1.39 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అయితే, వార్షికంగా పెరిగినప్పటికీ నెలవారీగా చూసినప్పుడు ఈ ఏడాది మేలో నమోదైన 6.71 బిలియన్ డాలర్ల కన్నా జూన్‌లో పెట్టుబడులు సుమారు 58 శాతం తక్కువ కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం మొత్తం పెట్టుబడుల్లో 1.17 బిలియన్ డాలర్లు పూచీకత్తు రూపంలో, 1.21 బిలియన్ డాలర్లు రుణంగాను, మరో 427 మిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి రూపంలోను నమోదైంది. భారీ పెట్టుబడుల్లో టాటా స్టీల్ .. సింగపూర్‌లోని తమ అనుబంధ సంస్థలో 1 బిలియన్ డాలర్లు, విప్రో తమ అమెరికా విభాగంలో 787 మిలియన్ డాలర్లు, టాటా పవర్ .. మారిషస్‌లోని యూనిట్లో 131 మిలియన్ డాలర్లు మొదలైన డీల్స్ ఉన్నాయి. డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ విదేశ్, పహార్పూర్ కూలింగ్ టవర్స్, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదలైనవి విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవి 45 మిలియన్ డాలర్ల నుంచి 56 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇది ప్రాథమిక డేటా మాత్రమేనని, అధీకృత డీలర్ బ్యాంకుల నివేదికలను బట్టి మారవచ్చని ఆర్బీఐ పేర్కొంది. -
స్వతంత్ర డైరెక్టర్లు.. గుడ్‌బై!!
దేశీ కార్పొరేట్ రంగంలో తాజాగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు, అవకతవకలు... బోర్డు రూమ్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. స్కామ్‌ల పాపం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కంపెనీల నుంచి వైదొలగుతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో మొత్తం 126 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆ సంఖ్య రెట్టింపై 291కి పెరగడం తాజా పరిస్థితికి నిదర్శనం. ఈ వివరాలను ఎన్ఎస్ఈఇన్ఫోబేస్ డాట్‌కామ్ వెల్లడించింది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్(ఎన్ఎస్ఈ), ప్రైమ్ డేటాబేస్ కలసి ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. తాజా నివేదికలో స్వతంత్ర డైరెక్టర్ల విషయమై కీలకాంశాలు వెలుగుచూశాయి. సాధారణంగా ఒక కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌లో మూడో వంతు ఇండిపెండెంట్(స్వతంత్ర) డైరెక్టర్లుంటారు. కంపెనీలను వదిలిపోతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్లలో సగం మంది వారి పదవీకాలం పూర్తవ్వడంతో వైదొలుగుతున్నారు. ఆరోగ్య, వ్యక్తిగత లేదా ఇతర వృత్తులు, వ్యాపకాల్లో స్థిరపడటం వంటి కారణాలతో చాలా మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 291 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. దీంట్లో 146 మంది తమ పదవీ కాలం పూర్తవ్వడంతో రాజీనామా చేయగా, మళ్లీ ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేదంటూ 36 మంది వైదొలిగారు. ఇతర వృత్తుల్లో స్థిరపడేందుకు రాజీనామా చేసిన వారి సంఖ్య 26గా ఉంది. సెబీ, కంపెనీల చట్టం ప్రకారం తగిన అర్హతలు లేకపోవడంతో 17 మంది రాజీనామా చేశా రు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, ఆసక్తి లేదంటూ రాజీనామా చేసిన వాళ్ల సంఖ్య 40. యాజమాన్యం మారడంతో ఆరుగురు రాజీనామా చేశారు. కాగా, జెట్ ఎ యిర్‌వేస్ కంపెనీలో ఇబ్బందులు తలెత్తగానే పలువు రు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నుంచి కూడా ఇండిపెండెట్ డైరెక్టర్లు వైదొలిగారు. ఇష్టపడని పదవి.. గతంలో ఇతర కంపెనీలకు ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేసిన వాళ్లు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవులు నిర్వహించినవాళ్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా రావడానికి ఇష్టపడటం లేదు. కంపెనీల్లో అవకతవకలు ఉంటాయేమోనన్న అనుమానాలతో ఈ పదవులను వారు తిరస్కరిస్తున్నారు. కంపెనీ ప్రమోటర్లు, యాజమాన్యం తీసుకునే నిర్ణయాలకు బలికావలసి వస్తుందనే భయాలతో పలువురు ఈ పదవులను నిరాకరిస్తున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా చేరితే, ఒకవేళ కంపెనీ లోటుపాట్లు వెల్లడైన పక్షంలో, అప్పటివరకూ తాము సంపాదించుకున్న పేరు, నమ్మకం అన్నీ కోల్పోవలసి వస్తుందని, న్యాయ వివాదాలు ఎదుర్కోవలసి వస్తుందని, అందుకే ఈ పదవులకు దూరంగా ఉంటున్నామని పలువురు పేర్కొన్నారు. ఇదిలాఉంటే... భారత్‌లో పలు కంపెనీలు కుటుంబాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దీంతో ఇండిపెండెంట్ డైరెక్టర్లు ప్రమోటర్ల దయ మీదనే ఆధారపడక తప్పటం లేదు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పితే.. ప్రత్యేక తీర్మానం ద్వారా వీరిని సాగనంపే అవకాశాలున్నాయి. ఒకవేళ కంపెనీ అవకతవకల విషయమై తెలిసి కూడా స్పందించకపోతే, వీరి ఆస్తులను కూడా కంపెనీల వ్యవహారాల శాఖ స్తంభింపజేసే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్ల పదవి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని విశ్లేషకులంటున్నారు. వంద శాతం పూర్తిగా నమ్మకం కుదిరితేనే ఈ పదవికి ముందుకొస్తున్నారని చెబుతున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ విధులేంటి? ► ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్...తన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కంపెనీ, వాటాదారులు ముఖ్యంగా మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం బాథ్యతాయుతంగా మెలగాలి. ► తన హోదాను స్వలాభం కోసం దుర్వినియోగం చేయకూడదు. అలాగే తన స్వలాభం కోసం కంపెనీకి నష్టం వచ్చేలా ప్రవర్తించకూడదు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సవ్యంగా సాగేలా తగిన తోడ్పాటునందించాల్సి ఉంటుంది. ► కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ► ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలాగా కంపెనీ రోజువారీ కార్యకలాపాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లు చూడాల్సిన పని ఉండదు. వారికి అధికారాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ► డైరెక్టర్ల సమావేశాలకే కాకుండా బోర్డ్ నియమించే కమిటీల్లో సభ్యుడిగా ఉంటూ, ఈ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కావలసి ఉంటుంది. కంపెనీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే వాటిని వెలుగులోకి తేవలసి ఉంటుంది. ► కంపెనీకి సంబంధించిన రహస్యాలను (టెక్నాలజీ, భవిష్యత్తు నిర్ణయాలు, ఇతర కంపెనీలతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు తదితర అంశాలను) లీక్ చేయకూడదు. ఇక ప్రత్యేక తీర్మానం ద్వారానే ఇండిపెండెంట్ డైరెక్టర్లను తొలగించే వీలుంది. ప్రశ్నించే అధికారం ఉండాలి... ప్రమోటర్లు, వాటాదారుల ఆధిపత్యం ఉన్న కంపెనీల్లో ‘నిజమైన’ ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఎవరూ ఉండరు. ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాను పునఃపరిశీలించాలి. భారత కుటుంబ వ్యాపారాల్లో మెజార్టీ వాటా ప్రమోటర్ గ్రూప్‌దే. ఇలాంటి కంపెనీల్లో డైరెక్టర్ల స్వతంత్రత చాలా కష్టసాధ్యమైన విషయం. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ ఇండిపెండెంట్ డైరెక్టర్ల బాధ్యత అయినప్పటికీ, ప్రమోటర్ గ్రూప్ చర్యలను, నిర్ణయాలను ప్రశ్నించే అధికారం వారికి ఉండాలి. – ప్రణవ్ హల్దియా, ఎమ్డీ, ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ సత్యం స్కామ్ నుంచి... సత్యం కంప్యూటర్స్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర కీలకమైందని ప్రభుత్వం గుర్తించింది. అప్పటి వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఉత్సవ విగ్రహాలేనని చెప్పవచ్చు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 2013 నాటి కంపెనీల చట్టంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనల విషయమై పలు మార్పులు, చేర్పులు చేసింది. మరోవైపు ఇండిపెండెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్న రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ తరచుగా సమావేశాలు జరుపుతూ, కంపెనీ స్థితిగతులపై చర్చించాల్సి ఉంటుంది. కానీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీలో నాలుగేళ్ల కాలంలో ఇలాంటి ఒక్క సమావేశం కూడా జరగలేదంటే కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇక లిస్టైన కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మూడు నుంచి ఐదో వంతు వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లుండాలి. టాప్1000 కంపెనీల్లో కనీసం ఒక మహిళ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండితీరాలి. -
చైనా స్మార్ట్‌ఫోన్స్ హవా
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో చైనా కంపెనీల ధాటికి ఎదురు నిలవలేక దేశీ సంస్థలు కుదేలవుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం దాకా ఆధిపత్యం కొనసాగించిన మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా, ఇంటెక్స్ వంటి దేశీ బ్రాండ్స్ అమ్మకాలు ప్రస్తుతం గణనీయంగా క్షీణించాయి. 2015లో స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో దేశీ సంస్థల వాటా 43 శాతంగా ఉండగా.. 2018 నాటికి సింగిల్ డిజిట్ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి 10 స్మార్ట్‌ఫోన్స్‌లో 6 చైనా బ్రాండ్స్‌వే ఉంటున్నాయంటే పరిస్థితి అర్థమవుతుంది. చైనా కంపెనీల స్మార్ట్ వ్యూహాలు... చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు స్మార్ట్ వ్యూహాలనే అనుసరించాయి. వ్యయాలు నియంత్రణలో ఉండేలా ముందుగా చౌకైన ఆన్లైన్ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఫ్లాష్ సేల్స్ పేరిట తక్కువ రేటుకే బోలెడన్ని లేటెస్ట్ ఫీచర్స్ అంటూ ఊదరగొట్టి ముందుగా కస్టమర్స్‌కు చేరువయ్యాయి. ఇప్పుడు నిలదొక్కుకున్న తర్వాత ఆఫ్‌లైన్ స్టోర్స్‌నూ ఏర్పాటు చేస్తున్నాయి. షావోమీ, వివో, ఒప్పో, వన్ ప్లస్ వంటి చైనా సంస్థలు అందుబాటు ధరల్లో లేటెస్ట్ ఫీచర్స్‌తో కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ దూకుడుగా దూసుకెళ్లిపోతున్నాయి. కొన్ని మోడల్స్‌ను భారత్‌లోనే అసెంబ్లింగ్ చేసి మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ అంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కొరియన్ దిగ్గజం శాంసంగ్‌ను కూడా అగ్రస్థానం నుంచి పడగొట్టాయి. మన బ్రాండ్స్ పతనానికి కారణాలేంటంటే.. ముందు నుంచీ చైనా బ్రాండ్స్ దూకుడుగా దూసుకెడుతుంటే.. మన సంస్థలు నింపాదిగా వ్యవహరించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నది పరిశ్రమ పరిశీలకులు విశ్లేషణ. 3జీ నుంచి 4జీ టెక్నాలజీకి మళ్లే క్రమంలో ఓవైపు మైక్రోమ్యాక్స్ వంటి భారతీయ బ్రాండ్స్ కాలం చెల్లిన 3జీ ఫోన్స్ నిల్వలను వదిలించుకునే ప్రయత్నాల్లో ఉంటే .. మరోవైపు చైనా కంపెనీలు చాలా వేగంగా కొంగొత్త 4జీ మోడల్స్‌ను ప్రవేశపెడుతూ మార్కెట్‌ను ఆక్రమించేశాయని వారు చెప్పారు. కొనుగోలుదారుల నాడిని పట్టుకోవడంలో కూడా భారతీయ బ్రాండ్స్ విఫలం కావడం మరో కారణం. చైనా కంపెనీలు 4జీ, డ్యూయల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, గ్లాస్ బ్యాక్ లాంటి కొత్త ఫీచర్స్‌తో ఫోన్స్ తెస్తుండగా.. అలాంటి వాటినే ప్రవేశపెట్టడంలో భారతీయ కంపెనీలు బాగా వెనకబడిపోయాయి. ఇక ఆన్లైన్, ఫ్లాష్ సేల్స్‌తో చైనా కంపెనీలు తక్కువ ఖర్చులో ఎక్కువ మంది కొనుగోలుదారులకు వేగంగా చేరువయ్యాయి. ఆ తర్వాత కాస్త ఖరీదైన వ్యవహారమే ఆయినప్పటికీ.. క్రికెట్ మ్యాచ్‌ల స్పాన్సర్షిప్ వంటి వాటితో మార్కెటింగ్, అడ్వరై్టజింగ్ విషయాల్లో ముందుకెళ్లాయి. అదే సమయంలో దేశీ కంపెనీలు వాస్తవ పరిస్థితులను పూర్తిగా అంచనా వేయలేక, వెనుకబడిపోయాయని టెలికం పరిశ్రమ నిపుణుడు, ఫిన్ఎక్స్ప్రోస్ కన్సల్టింగ్ సంస్థ సీఈవో మోహన్ శుక్లా విశ్లేషించారు. చైనా బ్రాండ్లు దేశీ బ్రాండ్స్‌ను పూర్తిగా తుడిచిపెట్టేశాయి అని వ్యాఖ్యానించారు జెన్ బ్రాండ్ పేరిట ఫోన్స్ తయారు చేసే ఆప్టిమస్ సంస్థ చీఫ్ అశోక్ గుప్తా. చైనా సంస్థలతో మన కంపెనీలు ఎక్కడా పోటీపడే పరిస్థితే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సంస్థ బ్లాక్‌బెర్రీ ఫోన్స్‌తో పాటు ఇతరత్రా బ్రాండ్స్ కోసం కాంట్రాక్టు విధానంలో ఫోన్స్ తయారు చేసి ఇస్తోంది. చైనా బ్రాండ్స్‌తో పోరాడటమంటే.. ఏకం గా ఆ దేశంతో యుద్ధానికి దిగినట్లేనని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహింద్రూ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి మారాలంటే దేశీయంగా చాంపియన్ బ్రాండ్స్ పుట్టుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశీ సంస్థలకు ప్రత్యేక తోడ్పాటునివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఆశాకిరణంగా జియో... చైనా కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో పూర్తి ఆధిపత్యం సాధించినప్పటికీ, ఫీచర్ ఫోన్స్ విషయంలో మాత్రం దేశీ బ్రాండ్స్.. ముఖ్యంగా రిలయన్స్ జియో ముందు స్థానంలో ఉంది. మొబైల్ ఫోన్ సర్వీసులను ఫోన్‌తో కూడా కలిపి ఇస్తుండటంతో రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్స్ అమ్మకాలు బాగానే ఉన్నాయి. ఈ విభాగంలో జియోకి ప్రస్తుతం 40 శాతం మార్కెట్ వాటా ఉంది. 12 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. -
అవకాశమిస్తే మురికివాడ కడతారు
దేశీయ కంపెనీలపై సీఎం సంచలన వ్యాఖ్యలు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని కంపెనీలను గడ్డిపోచలా తీసిపారేశారు. ఒక్క సిటీ కట్టిన అనుభవమైనా వారికుందా? అని ఎద్దేవా చేశారు. అవకాశమిస్తే మరో మురికివాడను కడతారని ఎగతాళి చేశారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో... దేశంలో ప్రఖ్యాత కంపెనీలుండగా రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు ఎందుకిస్తున్నారని అడిగిన విలేకరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశంలో ఏ కంపెనీకైనా ఒక సిటీ నిర్మించిన అనుభవం ఉందా? నీకు ఏం అనుభవం ఉంది? నీకు అవకాశమిస్తే నువ్వు కడతావా? ఓ స్లమ్ నిర్మిస్తావు’ అంటూ రుసరుసలాడారు. సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ఇవ్వకపోతే రాజధానికి ఇంత విలువ వచ్చేదా? అని ఎదురు ప్రశ్నించారు. దేశంలో పెద్ద కంపెనీలైన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు సచివాలయం కడుతుంటే కుంగిపోయిందని రాస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. పరిపాలనా యంత్రాంగాన్ని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా చేస్తున్నారని... దీన్నెలా ఆపాలో, కొన్ని పత్రికలను ఎలా డీల్ చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. తాము పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తుంటే... లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇష్టానుసారం రాస్తున్నారని, ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తునిలో రైలు తగులబెట్టిన వారిని అరెస్టుచేస్తే అడ్డుకుంటున్నారని, నాయకులందరూ వాళ్లకి మద్దతిస్తున్నారని విమర్శించారు. -
వారంలో రిలయన్స్ ‘లైఫ్’ మొబైల్స్!
ఈ నెల 28 నుంచి రూ.10 వేల శ్రేణిలో 5 మోడళ్లు * నవంబర్‌లో రూ. 4వేల శ్రేణిలో హ్యాండ్సెట్లు * వచ్చే జనవరి నుంచి జియో 4జీ సర్వీసులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్తో దూసుకురావటానికి సన్నాహాలు చేస్తున్న రిలయన్స్ జియో... 4జీ ఇంటర్నెట్ సేవలకన్నా ముందు తన బ్రాండ్‌తో మొబైల్ హ్యాండ్సెట్లను మార్కెట్లోకి విడుదల చేయటానికి సిద్ధమవుతోంది. లైఫ్(ఎల్వైఎఫ్) బ్రాండ్‌తో ఈ నెల 28 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను విక్రయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశవ్యాప్తంగా 1,50,000కుపైగా వివిధ రిటైల్ ఔట్లెట్లలో ఇవి లభిస్తాయి. రిలయన్స్ జియో లైఫ్ బ్రాండ్‌తో తొలుత రూ.10 వేల శ్రేణిలో 5 మోడళ్లను ప్రవేశపెడుతోంది. 5 అంగుళాల స్క్రీన్, 2 జీబీ ర్యామ్ వీటి ప్రత్యేకతలు. నవంబర్‌లో రూ.4 వేలు ఆపై శ్రేణిలో మరిన్ని మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది. మొత్తమ్మీద రూ.4 వేలు- 25 వేల మధ్య ఈ ఫోన్లు లభిస్తాయి. వాస్తవానికి భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో రూ.4-12 వేల శ్రేణిలో లభించే మోడళ్ల వాటా ఏకంగా 78 శాతం వరకూ ఉంది. అందుకే జియో సైతం ఈ శ్రేణి లో అధిక మోడళ్లను తేనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 100 రోజుల్లో 10 కోట్ల యూనిట్లు విక్రయించాలని జియో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. లక్ష్యాన్ని చేరుకోగానే వాణిజ్య పరంగా 4జీ సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఫోన్లను విక్రయించేందుకు తమ సంస్థతో రిలయన్స్ జియోకు ఒప్పందం కుదిరినట్లు రిటైల్ చైన్ ‘బిగ్ సి’ చైర్మన్ బాలు చౌదరి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. కొత్త సంవత్సరంలో 4జీ వాణిజ్య సర్వీసులు... ఇక 4జీ సర్వీసులను ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ టీం వివిధ ప్రాంతాల్లో పరీక్షిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో పరీక్షించాలని అన్ని ఏర్పాట్లూ చేసుకున్నా... సాంకేతిక కారణాల వల్ల ఆఖరి క్షణంలో రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూపులో దాదాపు లక్ష మందికి పైగా వివిధ స్థాయిల్లో ఉద్యోగులున్నారని, నెట్వర్క్ స్థిరీకరణ పూర్తి కాగానే వారందరికీ జియో లైఫ్ ఫోన్లను ఇస్తారని ఆ గ్రూపు అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘నెట్వర్క్ పనితీరుపై వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తాం. సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే సరిచేసి డిసెంబర్‌కల్లా 4జీని ప్రయోగాత్మకంగా లాంచ్ చేయాలని జియో కృతనిశ్చయంతో ఉంది. వాణిజ్య కార్యకలాపాలకు మాత్రం 2016-17 తొలి ఏడాది అవుతుంది’’ అని ఆయన తెలిపారు. 2016 జనవరిలోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని మరో అధికారి చెప్పారు. అతి తక్కువ ధరకు డేటా, వాయిస్ ప్యాక్‌లను అందించడం ద్వారా మార్కెట్లో పట్టు సాధించాలన్నది సంస్థ ఆలోచన. దశలవారీగా విస్తరణ.. అసలైన 4జీ అనుభూతి అందించేందుకు వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీని జియో వినియోగిస్తోంది. దీంతో కాల్స్ వేగంగా కనెక్ట్ అవుతాయి. మాట్లాడుతూనే నెట్ సర్ఫింగ్, డౌన్‌లోడ్‌ను కొనసాగించొచ్చు. కాల్ మాట్లాడుతూ ఒక క్లిక్‌తో వీడియో కాల్‌ను అందుకోవచ్చు. ఒకేసారి ఏడుగురితో ఆడియో కాన్ఫరెన్స్, నలుగురితో వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం ఉంటుంది. జియో తొలుత సాధారణ పౌరులకు(బీటూసీ) సేవలందించి, తర్వాత వ్యాపార సంస్థలకు ప్రత్యేక ప్యాకేజీలను పరిచయం చేస్తుందని సమాచారం. ఫైబర్ టు హోం సేవల ద్వారా భారీ గృహ సముదాయాలున్న కాంప్లెక్సులు, గేటెడ్ కమ్యూనిటీలకు తక్కువ ధరకే 4జీని ఆఫర్ చేయనుందని తెలుస్తోంది. మొబైల్ మనీ విభాగంలోకి సైతం కంపెనీ ప్రవేశించనుంది. దేశీ కంపెనీలు సైతం... హ్యాండ్సెట్లను సరఫరా చేసేందుకు 28 కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని ఇటీవల డిజిటల్ ఇండియా వీక్ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. ఇప్పటికే దిగ్గజ సంస్థలైన జెడ్‌టీఈ, అల్కాటెల్ వన్ టచ్, హువావే, కె-టచ్ కంపెనీలతో జియో చేతులు కలిపింది. జియోనీ తన నిర్ణయాన్నింకా వెల్లడించలేదు. మైక్రోమ్యాక్స్, లావా, సెల్కాన్, ఇంటెక్స్ తదితర దేశీ కంపెనీలు కూడా హ్యాండ్సెట్లను సరఫరా చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు స్మార్ట్ఫోన్లతో పాటు డాంగిల్స్, వైఫై రూటర్లు, 4జీ హాట్‌స్పాట్స్‌ను అందించనున్నాయి. -
డబ్బు నల్లగా జారుకునేదిలా..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్: వ్యక్తులైనా ,సంస్థలైనా నల్ల ధనాన్ని విదేశాలకు పంపించడానికి ఎంచుకునే ఏకైక మార్గం కార్పొరేట్ నిర్మాణ వ్యవస్థ. లెక్కకు మిక్కిలి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను నమోదు చేయడం, వాటికి అంచెలంచెలుగా సబ్సిడరీలను ఏర్పాటు చేయటం, లావాదేవీలను సంస్థల మధ్య గొలుసుకట్టుగా పేర్చటం, విదేశాల్లో సమాంతర వ్యవస్థలు నెలకొల్పడం, బ్యాంకుల ద్వారా దర్జాగా డ్రా చేసుకోవడం..ఇదీ స్థూలంగా నల్ల కుబేరుల సంపద సృష్టి రహస్యం.నల్ల ధనం మూలాల్లోకి వెళితే.. దేశీయ కంపెనీలు ఒక ఏడాదిలో ఆర్జించిన లాభాలపై 30 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాలి. సర్‌ఛార్జీ, విద్యా సెస్సులతో కలుపుకుంటే ఇది 33.9 శాతానికి పెరుగుతుంది. లాభరాశిలో మూడొం తులు పన్ను చెల్లించాల్సి రావడం తలకు మించిన భారం కావడంతో పన్ను ఎగవేత దారిని ఎంచుకోవడమే నల్లధనం సృష్టికి ప్రధాన కారణం అవుతోంది. సాధారణంగా వ్యాపార లావాదేవీలను వాస్తవ విలువ కన్నా తగ్గించికానీ,అసలే నమోదు చేయకపోవడం వల్లకానీ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడుతుంటాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు, జ్యువెలరీ వ్యాపారులు, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఎన్జీవోలు, విదేశీ వాణిజ్యం చేసే సంస్థలు ప్రధానంగా పన్ను ఎగవేత మార్గాలను ఎంచుకుంటారనీ 2012లో నల్ల ధనంపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొంది. ప్రధానంగా లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టికల్లో కంపెనీలు చేసే తారుమారు తతంగం కథా కమామీషు ఇదీ.. విక్రయాలు, రాబడులు: పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా పేరుగాంచిన మారిషస్, కేమాన్ ఐలాండ్, హాంకాంగ్, వర్జిన్ ఐలాండ్ లాంటి దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి విక్రయాలను అక్కడికి మళ్లించటం, షెల్ కంపెనీల ద్వారా డమ్మీ లావాదేవీలు నెరపడం, ట్రస్టులు, హిందూ అవిభాజ్య కంపెనీలను (హెచ్‌యూఎఫ్) ఏర్పాటు చేసి లావాదేవీలను నెరపడం ద్వారా నల్లధనం పేరుకుపోతోంది. విదేశీ సంస్థలకు మార్కెటింగ్ వ్యయాల రూపంలో, ప్రకటనలు, కమిషన్ రూపంలో దేశీ సంస్థలు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తాయి. ఇదే సొమ్ము నాన్ టాక్సబుల్ రిసీట్స్ (విరాళాలు, ట్రస్టులు, లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థలలకు పంపించే డబ్బు) ద్వారా మళ్లీ ఇండియాలోకి ప్రవేశిస్తుంది. లేదా విదేశాల్లోనే బ్యాంకు ఖాతాల్లో ఉండిపోతోంది. మూలధనం: కంపెనీలు జారీచేసే షేర్లకు దరఖాస్తుచేసే డబ్బు, షేర్ల కోసం అధిక ప్రీమియంగా చెల్లించే మొత్తం, విదేశీ సంస్థలు ద్వారా పోగైన షేర్ క్యాపిటల్, నకిలీ బహుమానాలు, బోగస్ మూలధన లాభాలు, నకిలీ ఆస్తులను పెంచడం ద్వారా నల్లధనం దర్జాగా మళ్లీ ఖాతాల్లోకి వస్తోంది. ఇన్వెస్ట్మెంట్ స్కీంలు... కొంత మంది వ్యక్తులు ఒక గ్రూప్‌గా కలసి ఆకర్షణీయమైన ఇన్వెస్ట్మెంట్ స్కీంలను ప్రవేశపెడతారు. ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడులకు అధిక రాబడులిస్తామని ఆశ పెడతారు. తమ బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సిందిగా సూచిస్తారు. ఇన్వెస్టర్‌కు వచ్చే ప్రతిఫలానికి భరోసాగా పోస్ట్ డేటెడ్ చెక్కును జారీ చేస్తారు. అనంతరం బ్యాంకులోని నగదును గ్రూప్ సభ్యులు తమ తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకుంటారు. ఈ ధనాన్ని విదేశాల్లో తాము ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాకు వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా మళ్లిస్తారు. అక్కడి నుండి మరో దేశంలోని మరో ఖాతాకి మళ్లిస్తూ నెట్‌వర్క్‌ను విస్తృత పరుస్తారు. విదేశాల్లోని బ్యాంకులు తమ ఖాతాదారులకు ప్రపంచంలో ఎక్కడైనా విని యోగించే క్రెడిట్, డెబిట్ కార్డులను జారీ చేస్తాయి. ఈ కార్డులతో ఇండియాలోనే దర్జాగా డబ్బును డ్రా చేసుకుంటారు. స్మర్ఫింగ్.. బ్యాంకుల కళ్లు కప్పి ఖాతాల్లో డబ్బు దాచుకునే ప్రక్రియనే ‘స్మర్ఫింగ్’ అంటారు. బ్యాంకు ఖాతాలను నిరంతరం పర్యవేక్షించే అధికారులు నగదు డిపాజిట్, విత్ డ్రాయల్ లావాదేవీలకు ఒక పరిమితి పెట్టుకుంటారు. ఉదాహరణకు రూ. పది లక్షలు ఆపైన డిపాజిట్ కానీ విత్ డ్రాయల్ కానీ అయిన ఖాతాలను అబ్జర్వేషన్లో ఉంచుతుంటారు. అయితే స్మర్ఫింగ్ చేసే నల్ల కుబేరులు రూ. పది లక్షల కన్నా తక్కువ డిపాజిట్ చేసి బ్యాంకు దృష్టి నుంచి తప్పించుకుంటారు. ఇలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని విదేశాల్లోని తమ బ్యాంకు ఖాతాలకు వైర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. హవాలా మార్గంలో... ఎక్స్ అనే ఓ వ్యక్తి ఇండియలో అనైతిక మార్గాల ద్వారా రూ.10 కోట్లు సంపాదించాడనుకోండి. దీన్ని విదేశాలకు తరలించేందుకు ‘హవాలా’ మార్గాన్ని ఎంచుకుంటారు. స్థానిక హవాలా ఆపరేటర్ కొంత కమిషన్ తీసుకొని ఈ రూ. 10 కోట్లను విదేశాల్లో ఎక్స్ అనే వ్యక్తి ఏర్పాటు చేసుకున్న బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తాడు. విదేశాల్లో ఎక్స్ ప్రమోట్ చేసిన కంపెనీ ఇండియాలోని ఎక్స్ కంపెనీలో షేర్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంది. ఇండియాలోని ఎక్స్ కంపెనీ విదేశీ ఎక్స్ సంస్థకు డివిడెండ్ రూపంలో భారీ మొత్తం చెల్లిస్తుంది. అక్కడ పనిచేసే ఉద్యోగులకు భారీ వేతనాలు ఇవ్వడం ద్వారా బ్లాక్ మనీ వైట్ అయిపోతుంది. ఈ మొత్తాన్ని ఎక్స్ తన ఆదాయ పన్ను రిటర్న్‌లో పొందుపరస్తాడు.