చైనా స్మార్ట్‌ఫోన్స్‌ హవా | Raymond James & Associates Sells 3599 Shares of China Mobile Ltd | Sakshi
Sakshi News home page

చైనా స్మార్ట్‌ఫోన్స్‌ హవా

Published Thu, Feb 14 2019 12:46 AM | Last Updated on Thu, Feb 14 2019 8:09 AM

Raymond James & Associates Sells 3599 Shares of China Mobile Ltd - Sakshi

న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లో చైనా కంపెనీల ధాటికి ఎదురు నిలవలేక దేశీ సంస్థలు కుదేలవుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం దాకా ఆధిపత్యం కొనసాగించిన మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా, ఇంటెక్స్‌ వంటి దేశీ బ్రాండ్స్‌ అమ్మకాలు ప్రస్తుతం గణనీయంగా క్షీణించాయి. 2015లో స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లో దేశీ సంస్థల వాటా  43 శాతంగా ఉండగా.. 2018 నాటికి సింగిల్‌ డిజిట్‌ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి 10 స్మార్ట్‌ఫోన్స్‌లో 6 చైనా బ్రాండ్స్‌వే ఉంటున్నాయంటే పరిస్థితి అర్థమవుతుంది.  

చైనా కంపెనీల స్మార్ట్‌ వ్యూహాలు... 
చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు స్మార్ట్‌ వ్యూహాలనే అనుసరించాయి. వ్యయాలు నియంత్రణలో ఉండేలా ముందుగా చౌకైన ఆన్‌లైన్‌ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఫ్లాష్‌ సేల్స్‌ పేరిట తక్కువ రేటుకే బోలెడన్ని లేటెస్ట్‌ ఫీచర్స్‌ అంటూ ఊదరగొట్టి ముందుగా కస్టమర్స్‌కు చేరువయ్యాయి. ఇప్పుడు నిలదొక్కుకున్న తర్వాత ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌నూ ఏర్పాటు చేస్తున్నాయి. షావోమీ, వివో, ఒప్పో, వన్‌ ప్లస్‌ వంటి చైనా సంస్థలు అందుబాటు ధరల్లో లేటెస్ట్‌ ఫీచర్స్‌తో కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ దూకుడుగా దూసుకెళ్లిపోతున్నాయి. కొన్ని మోడల్స్‌ను భారత్‌లోనే అసెంబ్లింగ్‌ చేసి మేడ్‌ ఇన్‌ ఇండియా ఫోన్స్‌ అంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కొరియన్‌ దిగ్గజం శాంసంగ్‌ను కూడా అగ్రస్థానం నుంచి పడగొట్టాయి.  

మన బ్రాండ్స్‌ పతనానికి కారణాలేంటంటే.. 
ముందు నుంచీ చైనా బ్రాండ్స్‌ దూకుడుగా దూసుకెడుతుంటే.. మన సంస్థలు నింపాదిగా వ్యవహరించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నది పరిశ్రమ పరిశీలకులు విశ్లేషణ. 3జీ నుంచి 4జీ టెక్నాలజీకి మళ్లే క్రమంలో ఓవైపు మైక్రోమ్యాక్స్‌ వంటి భారతీయ బ్రాండ్స్‌ కాలం చెల్లిన 3జీ ఫోన్స్‌ నిల్వలను వదిలించుకునే ప్రయత్నాల్లో ఉంటే .. మరోవైపు చైనా కంపెనీలు చాలా వేగంగా కొంగొత్త 4జీ మోడల్స్‌ను ప్రవేశపెడుతూ మార్కెట్‌ను ఆక్రమించేశాయని వారు చెప్పారు. కొనుగోలుదారుల నాడిని పట్టుకోవడంలో కూడా భారతీయ బ్రాండ్స్‌ విఫలం కావడం మరో కారణం. చైనా కంపెనీలు  4జీ, డ్యూయల్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్, గ్లాస్‌ బ్యాక్‌ లాంటి కొత్త ఫీచర్స్‌తో ఫోన్స్‌ తెస్తుండగా.. అలాంటి వాటినే ప్రవేశపెట్టడంలో భారతీయ కంపెనీలు బాగా వెనకబడిపోయాయి.  ఇక ఆన్‌లైన్, ఫ్లాష్‌ సేల్స్‌తో చైనా కంపెనీలు తక్కువ ఖర్చులో ఎక్కువ మంది కొనుగోలుదారులకు వేగంగా చేరువయ్యాయి. ఆ తర్వాత కాస్త ఖరీదైన వ్యవహారమే ఆయినప్పటికీ.. క్రికెట్‌ మ్యాచ్‌ల స్పాన్సర్‌షిప్‌ వంటి వాటితో మార్కెటింగ్, అడ్వరై్టజింగ్‌ విషయాల్లో ముందుకెళ్లాయి. అదే సమయంలో దేశీ కంపెనీలు వాస్తవ పరిస్థితులను పూర్తిగా అంచనా వేయలేక, వెనుకబడిపోయాయని టెలికం పరిశ్రమ నిపుణుడు, ఫిన్‌ఎక్స్‌ప్రోస్‌ కన్సల్టింగ్‌ సంస్థ సీఈవో మోహన్‌ శుక్లా విశ్లేషించారు. చైనా బ్రాండ్లు దేశీ బ్రాండ్స్‌ను పూర్తిగా తుడిచిపెట్టేశాయి అని వ్యాఖ్యానించారు జెన్‌ బ్రాండ్‌ పేరిట ఫోన్స్‌ తయారు చేసే ఆప్టిమస్‌ సంస్థ చీఫ్‌ అశోక్‌ గుప్తా.  చైనా సంస్థలతో మన కంపెనీలు ఎక్కడా పోటీపడే పరిస్థితే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సంస్థ బ్లాక్‌బెర్రీ ఫోన్స్‌తో పాటు ఇతరత్రా బ్రాండ్స్‌ కోసం     కాంట్రాక్టు విధానంలో ఫోన్స్‌ తయారు చేసి ఇస్తోంది.  చైనా బ్రాండ్స్‌తో పోరాడటమంటే.. ఏకం గా ఆ దేశంతో యుద్ధానికి దిగినట్లేనని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పంకజ్‌ మహింద్రూ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి మారాలంటే దేశీయంగా చాంపియన్‌ బ్రాండ్స్‌ పుట్టుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశీ సంస్థలకు ప్రత్యేక తోడ్పాటునివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

ఆశాకిరణంగా జియో... 
చైనా కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లో పూర్తి ఆధిపత్యం సాధించినప్పటికీ, ఫీచర్‌ ఫోన్స్‌ విషయంలో మాత్రం దేశీ బ్రాండ్స్‌.. ముఖ్యంగా రిలయన్స్‌ జియో ముందు స్థానంలో ఉంది. మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను ఫోన్‌తో కూడా కలిపి ఇస్తుండటంతో రిలయన్స్‌ జియో ఫీచర్‌ ఫోన్స్‌ అమ్మకాలు బాగానే ఉన్నాయి. ఈ విభాగంలో జియోకి  ప్రస్తుతం 40 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 12 శాతం మార్కెట్‌ వాటాతో శాంసంగ్‌ రెండో స్థానంలో ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement