దేశీయ కంపెనీలపై సీఎం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని కంపెనీలను గడ్డిపోచలా తీసిపారేశారు. ఒక్క సిటీ కట్టిన అనుభవమైనా వారికుందా? అని ఎద్దేవా చేశారు. అవకాశమిస్తే మరో మురికివాడను కడతారని ఎగతాళి చేశారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో... దేశంలో ప్రఖ్యాత కంపెనీలుండగా రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు ఎందుకిస్తున్నారని అడిగిన విలేకరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశంలో ఏ కంపెనీకైనా ఒక సిటీ నిర్మించిన అనుభవం ఉందా? నీకు ఏం అనుభవం ఉంది? నీకు అవకాశమిస్తే నువ్వు కడతావా? ఓ స్లమ్ నిర్మిస్తావు’ అంటూ రుసరుసలాడారు.
సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ఇవ్వకపోతే రాజధానికి ఇంత విలువ వచ్చేదా? అని ఎదురు ప్రశ్నించారు. దేశంలో పెద్ద కంపెనీలైన ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు సచివాలయం కడుతుంటే కుంగిపోయిందని రాస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. పరిపాలనా యంత్రాంగాన్ని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా చేస్తున్నారని... దీన్నెలా ఆపాలో, కొన్ని పత్రికలను ఎలా డీల్ చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. తాము పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తుంటే... లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇష్టానుసారం రాస్తున్నారని, ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తునిలో రైలు తగులబెట్టిన వారిని అరెస్టుచేస్తే అడ్డుకుంటున్నారని, నాయకులందరూ వాళ్లకి మద్దతిస్తున్నారని విమర్శించారు.
అవకాశమిస్తే మురికివాడ కడతారు
Published Sat, Jun 25 2016 1:38 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement