చట్టంతో చెలగాటం!
♦ ‘స్విస్ చాలెంజ్’ కోసం ఏపీఐడీఈకి తూట్లు
♦ సింగపూర్ కంపెనీల కోసం అనేక నిబంధనల తొలగింపు
♦ ఆసక్తి స్థానంలో ‘అర్హత’ కండిషన్
♦ పారదర్శకత ఉండాలన్న నిబంధన హుష్‌కాకి
♦ ప్రభుత్వానిదే తుదినిర్ణయం అన్న కండిషన్‌కూ చెల్లుచీటి
♦ మన కోర్టుల్లో విచారణ జరిపే అవకాశం లేదు
♦ స్విస్ చాలెంజ్ టెండర్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు
♦ కొత్త తప్పులు.. 31న హైకోర్టు విచారణ నాటికి కొత్త చట్టానికి రూపు?
కె.జి.రాఘవేంద్రరెడ్డి, సాక్షి, కర్నూలు: అంతర్జాతీయ రాజధానిని నిర్మించే పేరుతో అంతర్జాతీయ కుంభకోణానికి తెరతీసిన సీఎం చంద్రబాబు అందుకోసం అడ్డువచ్చిన చట్టాలనూ మార్చేస్తున్నారు. స్విస్ చాలెంజ్ విధానంపైనా, సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టే తీరుపైనా హైకోర్టు అనేకమార్లు మొట్టికాయలు వేయడంతో ఆ పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. స్విస్‌చాలెంజ్‌కు అడ్డువస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) చట్టంలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. వాస్తవానికి ఈ చట్టంలో అతి ముఖ్యమైన అనేక నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు.
పారదర్శకత పాటించాలన్న నిబంధనను తొలగించడం చూస్తే ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనుకుంటున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఏ అంశంలోనైనా పభుత్వానిదే తుదినిర్ణయం అన్న నిబంధనను తొలగించేయడాన్ని బట్టి సింగపూర్ సంస్థలకు ఏ రీతిలో సాగిలపడిపోతోందో తెలుసుకోవచ్చు. ఆసక్తి ఉన్న బిడ్డర్లు స్థానంలో అర్హత ఉన్న బిడ్డర్లు అని చేర్చడం గమనిస్తే తాము అనుకున్న సింగపూర్ కంపెనీలకే బిడ్ దక్కేలా చేయడం కోసం ఎలా దిగజారుతున్నారో ఊహించవచ్చు. ఏపీఐడీఈ చట్టానికి చేస్తున్న మార్పులు చేర్పులలో ఇలాంటి వెన్నో కనిపిస్తాయి...
‘అర్హత’ పదం చేర్చడం వెనుక...
వాస్తవానికి 2001నాటి చట్టం సెక్షన్ 2 (ఎస్‌ఎస్)లో ప్రధాన బిడ్డర్ తన ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత.... ‘ఆసక్తి’ ఉన్న కంపెనీలు ‘ఏవైనా’ తమ ప్రతిపాదనలు సమర్పించవచ్చునని స్పష్టం చేస్తోంది. కొత్తగా తలపెట్టిన ముసాయిదా చట్టంలోని సెక్షన్ 2(ఎస్‌ఎస్)లో ఆసక్తికి బదులుగా ‘అర్హత’ అనే పదాన్ని ప్రభుత్వం చేర్చింది. ఇక్కడ ‘అర్హత’ అంటే గతంలో ఇతర రాష్ట్రాలలో రాజధానులు నిర్మించిన సంస్థలు కాబోలనుకుంటే పొరబడినట్లే. అర్హత అంటే విదేశాల్లో కాంట్రాక్టులు నిర్వహించిన అనుభవం అని సీఆర్‌డీఏ జారీచేసిన బిడ్డింగ్ ప్రకటనలో పేర్కొంది.
అంటే మన దేశంలో ఎంత ఘనమైన కాంట్రాక్టులు చేసిన సంస్థలైనా విదేశాలలో పనులు చేసిన అనుభవం లేకపోతే వాటికి పోటీలో పాల్గొనే అర్హత ఉండదన్నమాట. తాము ఎంపిక చేసిన సింగపూర్ సంస్థలనే ఆమోదించేందుకు అవసరమైన నిబంధనలను ఓ పథకం ప్రకారం చేర్చుతున్నారన్నమాట. తద్వారా హైకోర్టులో స్విస్ చాలెంజ్ అమలుపై పిటిషన్ వేసిన ఆదిత్య, ఎన్వీయన్ కంపెనీలను అర్హత లేదనే సాకుతో ప్రభుత్వం తప్పించనుందని తెలుస్తోంది.
పాత ప్రాజెక్టులకూ కొత్త చట్టం వర్తింపు
రాజధాని నిర్మాణానికి చేపట్టిన స్విస్‌చాలెంజ్ విధానంపై ఎదురవుతున్న విమర్శలను తప్పించుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అనేక తప్పులు చేస్తోంది. ఇందుకోసం చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం... ఈ చట్టాన్ని పాత ప్రాజెక్టులకూ వర్తింప చేయాలని నిర్ణయించింది. పాత చట్టంలో మార్పులు చేస్తూ తెస్తున్న ముసాయిదా ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్‌లో (ఏపీఐడీఈ)-2016లోని సెక్షన్ 18లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. వాస్తవానికి ఏదైనా కొత్త చట్టం తెస్తే అప్పటికే ఉన్న వాటికి వర్తింపచేయడం చాలా అరుదు. అయితే, ఇందుకు భిన్నంగా... అదీ అనేక విమర్శలు ఎదుర్కొంటున్న స్విస్ చాలెంజ్ విధానం విషయంలో పాత టెండర్లకు కొత్త చట్టం వర్తింపచేయడం ఇంకా అనుమానాలు రేకెత్తిస్తోంది.
ముసాయిదా ఏపీఐడీఈ-2016లోని సెక్షన్ 18 ఏం చెబుతుందంటే...‘‘ఈ చట్టం అమలులోకి వచ్చే సమయానికి ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇన్‌ఫ్రా అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉంటే...ఆ ప్రాజెక్టులకు కూడా ఈ చట్టమే వర్తిస్తుంది’’.....అంటే రాజధాని నిర్మాణానికి సంబంధించిన స్విస్ చాలెంజ్ ప్రాజెక్టుకు కూడా కొత్త చట్టమే వర్తిస్తుందన్నమాట. తద్వారా హైకోర్టులో కూడా ఆ ప్రకారం తాము చేసిన మొత్తం ప్రాసెస్ అంతా సరైనదేనని నమ్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అర్థమవుతోంది.
స్విస్ చాలెంజ్ నిర్వచనానికే తూట్లు...
స్విస్‌చాలెంజ్ అంటే ఏపీఐడీఈ-2001 చట్టంలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఈ చట్టం సెక్షన్ 2(ఎస్‌ఎస్) ప్రకారం....సుమోటోగా ఏదైనా సంస్థ ఒక ప్రాజెక్టుకు సంబంధించి తన ప్రతిపాదనలను సమర్పిస్తుంది. వాటిని అందరికీ అందుబాటులో ఉంచి... అంతకంటే మెరుగైనవి ఆసక్తి ఉన్న కంపెనీలు సమర్పించాలి.వీటిని బేరీజు వేసుకున్న తర్వాత.... తర్వాత మెరుగైన ప్రతిపాదనలను తాము కూడా చేసేందుకు మొదటగా ప్రతిపాదనలు సమర్పించిన సంస్థ అంగీకరిస్తే ప్రాజెక్టును ఆ సంస్థకు అప్పగించే విధానమే స్విస్ చాలెంజ్‌గా పేర్కొంది.
ప్రభుత్వం మాత్రం స్విస్‌చాలెంజ్‌పై ఏపీఐడీఈ-2001 చట్టం నిర్వచనానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. మొదట బిడ్డర్ సమర్పించిన ప్రతిపాదనలను యాజమాన్య హక్కుల పేరిట ఆదాయ వివరాలను బహిర్గతపరచలేదు. తద్వారా అంతకంటే మెరుగైన ప్రతిపాదనలు రాకుండా చేసింది. అంతేకాకుండా అసలు స్విస్ చాలెంజ్ నిర్వచనానికే ప్రభుత్వం తూట్లు పొడిచింది.
ఇక నేరుగా రంగంలోకి ప్రభుత్వం...
ఇప్పటివరకు రాజధాని నిర్మాణం విషయంలో సీఆర్‌డీఏను, ఇన్‌ఫ్రా అథారిటీని ప్రభుత్వం నామమాత్రంగా ముందు ఉంచింది. వాస్తవానికి సెక్షన్ 19(2) ప్రకారం మొదట ప్రధాన ప్రతిపాదక సంస్థ తన ప్రతిపాదనలను స్థానిక సంస్థకు (అంటే ఇక్కడ సీఆర్‌డీఏకు) సమర్పించాలి.సీఆర్‌డీఏ పరిశీలించి....తర్వాత ఇన్ఫ్రా అథారిటీకి పంపించాలి. ఆ తర్వాత కానీ ప్రభుత్వం ముందుకు ప్రతిపాదనలు రావు.
రాజధాని నిర్మాణ వ్యవహారంలో ప్రతిపాదనలు నేరుగా ప్రభుత్వానికి వెళ్లాయి. అక్కడి నుంచి ఇన్ఫ్రా అథారిటీకి.... అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి చేరాయి. దీనిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 19 (2)ను తొలగించి ఆ స్థానంలో సంబంధిత అథారిటీ అనుమతి అంటూ చేర్చారు. అయితే, ఇక్కడ అథారిటీ అంటే ప్రభుత్వమేనని కొత్త చట్టంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరడం సరైందేనని ప్రభుత్వం తేల్చిచెప్పనుందన్నమాట.
తప్పులను ఒప్పు చేసుకునేందుకే...
వాస్తవానికి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం అవలంభించిన స్విస్‌చాలెంజ్ మొత్తం ప్రక్రియను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇందుకోసం మొత్తం ప్రక్రియలో ఇప్పటివరకు ప్రభుత్వం అనుసరించిన తీరు ఏ విధంగా తప్పో పేర్కొంటూ అనేక అంశాలలో ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని ఉదహరిస్తూనే హైకోర్టు అనేక అంక్షితలు వేసింది. ఏపీఐడీఈ చట్టానికి భిన్నంగా మొత్తం స్విస్ చాలెంజ్ విధానం నడిచిందని మండిపడింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అసలు చట్టాన్నే మార్చేందుకు సిద్ధపడింది. న్యాయశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా చట్టాన్ని తెచ్చి మందబలంతో ఆమోదముద్రను వేయించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అక్టోబరు 31వ తేదీన మరోసారి హైకోర్టు దీనిపై విచారణ చేపట్టనున్నందున... ఈ లోగానే కొత్త చట్టాన్ని తీసుకరావాలనేది ఆలోచనగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి.
అన్నీ తొలగింపులే...
ఏపీఐడీఈ 2001 చట్టంలో ఏయే క్లాజులను తొలగిస్తారో తెలిపే భాగాలు
ప్రభుత్వం తలపెట్టిన కొత్త చట్టంలో పాత చట్టంలోని అనేక ముఖ్యమైన క్లాజులను తొలగించింది. తద్వారా అనేక అంశాల్లో తనకు అనుకూలమైన సింగపూర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. వాటిలో మచ్చుకు కొన్ని....
క్లాజ్ 9(1) తొలగింపు- ఈ క్లాజు ప్రకారం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు నిపుణులైన వ్యక్తులతో ప్రాజెక్టును మానిటరింగ్ చేసే అవకాశం ఇన్‌ఫ్రా అథారిటీకి ఉంది. దీని తొలగింపుతో నిర్మాణ పనులను పర్యవేక్షణను తొలగించినట్లు అయ్యింది. హా క్లాజ్ 11 తొలగింపు- ప్రస్తుత చట్టంలో ఈ క్లాజు కింద ఇన్‌ఫ్రా అథారిటీ అధికారాలను పేర్కొన్నారు. ఈ క్లాజును తొలగించడంతో దానికి ఎలాంటి అధికారాలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. హా క్లాజ్ 15 తొలగింపు- పాత చట్టంలో క్లాజు 15 ప్రకారం డిమాండ్-సప్లై ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఇన్‌ఫ్రా అథారిటీ నిర్ణయిస్తుంది. ఈ క్లాజును తొలగించడంతో రాష్ట్ర ప్రజల కు అవసరమైన ప్రాజెక్టులు ఏవి అనేది ఇన్‌ఫ్రా అథారిటీ నిర్ణయించే వెసులుబాటు లేదు.
తద్వారా రాజధాని నిర్మాణంలో కంపెనీకి ఏది లబ్ధి చేకూరుతుందో వాటిని మొదటగా నిర్మాణం చేపట్టే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఉదాహరణకు ప్రభుత్వశాఖల కార్యాలయాల కంటే ముందుగానే వాణిజ్య భవనాలను నిర్మించవచ్చునన్నమాట. హా క్లాజు 60 తొలగింపు - పాత చట్టంలోని క్లాజు 60 ప్రకారం వర్కింగ్ కేపిటల్‌పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ జరగాలి. ఆ నిబంధనను తొలగించారు. హా క్లాజు 62 తొలగింపు - అత్యంత కీలకమైన నిబంధన ఇది. ఇన్‌ఫ్రా అథారిటీ పారదర్శకత పాటించాలన్న నిబంధన ఇది. దీనికి మంగళం పలికారు. హా క్లాజు 65 - దీన్ని పూర్తిగా తొలగించారు.
ఇందులోని సబ్ సెక్షన్ 2 ప్రకారం ఏ విషయంలోనైనా తుది నిర్ణయాధికారం ప్రభుత్వానిదే. దీన్ని తొలగించడమంటే ప్రభుత్వం ఏ మేరకు సింగపూర్ కంపెనీలకు సాగిలపడుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. హా క్లాజు 78 తొలగింపు- ప్రస్తుత చట్టంలోని ఈ క్లాజు ప్రకారం.... ఇన్‌ఫ్రా అథారిటీ కానీ స్థానిక సంస్థ (అంటే ఇక్కడ సీఆర్‌డీఏ)కానీ కొన్ని రెగ్యులేషన్స్‌ను రూపొందించే అవకాశం ఉంది. దీనిని కొత్తగా తెస్తున్న చట్టంలో తొలగించడంతో సీఆర్‌డీఏ, ఇన్‌ఫ్రా అథారిటీకి ఎటువంటి అధికారాలు లేకుండా పోనున్నాయి.