ఇదో అమరప్రేమ గాథ | Chandrababu love on the Singapore | Sakshi
Sakshi News home page

ఇదో అమరప్రేమ గాథ

Published Sat, Jan 7 2017 3:39 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

ఇదో అమరప్రేమ గాథ - Sakshi

ఇదో అమరప్రేమ గాథ

హైకోర్టు అక్షింతలతో టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దయినా మళ్లీ అవే నిబంధనలు
సింగపూర్‌ కన్సార్టియంకు అనుకూలంగా ఏపీఐఈడీఏ–2001 చట్ట సవరణ
రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో పాత ప్రతిపాదనలకే మళ్లీ ఆమోదం
మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికకు స్విస్‌ చాలెంజ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సర్కార్‌
అమరావతి నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీకి అప్పగించడమే లక్ష్యం


సాక్షి, అమరావతి
ప్రభుత్వం తప్పు చేసింది... హైకోర్టు మొట్టికాయలు వేసింది... తప్పును దిద్దుకోవాల్సిన ప్రభుత్వం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీ చేతిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు సూచనలను సైతం తోసిరాజంటున్నారు. ఎవరెన్ని చెప్పినా సింగపూర్‌ కంపెనీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నట్లుగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును సింగపూర్‌ కన్సార్టియం (అసెండాస్‌–సిన్‌బ్రిడ్జి–సెమ్బ్‌కార్ప్‌)కు అప్పగించడానికి ఈనెల 3న జారీ చేసిన స్విస్‌ చాలెంజ్‌ టెండర్‌ నోటిఫికేషనే అందుకు తార్కాణం. రాజధాని ఏర్పాటు ప్రకటన వెలువడక ముందే ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’కు పాల్పడి తక్కువ ధరలకే భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు అండ్‌ కో.. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులోనూ అదే తరహాలో కాజేసేందుకు వ్యూహం పన్నింది.

ఆదాయ వివరాలు రహస్యంగా ఉంచుతూ సింగపూర్‌ కన్సార్టియం చేసిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసి.. జూలై 17న స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో తొలుత టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. టెండర్‌ విధానంలో లొసుగులపై సెప్టెంబరు 12న ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. దాంతో టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేసిన ప్రభుత్వం.. తప్పులను దిద్దుకోవాల్సింది పోయి మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తోంది. సింగపూర్‌ కన్సార్టియంకు అనుకూలంగా నిబంధనలు రూపొందించేందుకు తొలుత ఏపీఐఈడీఏ(ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎనేబ్లింగ్‌ యాక్ట్‌)–2001ను వక్రీకరించిన ప్రభుత్వం.. తాజాగా ఆ చట్టాన్నే సవరించింది. హైకోర్టు ఎత్తిచూపిన తప్పులను దిద్దుకోకుండా సింగపూర్‌ సంస్థలు తొలుత అందించిన ప్రతిపాదనల ఆధారంగానే రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక కోసం ఈనెల 3న స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

హైకోర్టు మొట్టికాయలు వేసినా...
రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండా స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడాన్ని గతేడాది సెప్టెంబరు 12న హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. టెండర్‌ ప్రక్రియను నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఇంతలోనే తేరుకున్న ప్రభుత్వం.. టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టుకు విన్నవించింది. స్విస్‌ ఛాలెంజ్‌ టెండర్‌ ప్రక్రియను నిలుపుదల చేస్తూ సెప్టెంబరు 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలు.. సర్కార్‌ బుట్టదాఖలు చేసిన తీరు. ఇదీ..

హైకోర్టు అభ్యంతరం–1: ఒకరు చేసిన సవాలుపై మరొకరు స్పందించేందుకు వీలు కల్పించడంవల్లే దీన్ని ‘ఛాలెంజ్‌’ అన్నారు. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ప్రాథమిక దశలోనే బహిర్గతం చేయకపోతే.. ఆ ప్రతిపాదనలను ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు ఎలా ‘ఛాలెంజ్‌’ చేయగలుగుతారు? ప్రతిపాదనలు బహిర్గతం కానపుడు పోటీ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఎవరైనా ఎందుకు ఉత్సాహం చూపుతారు?

ఉల్లంఘన: ఆదాయ వివరాలను ప్రాథమిక దశలో వెల్లడించలేమన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండో దశ(వాణిజ్య బిడ్‌)కు అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఆదాయ వివరాలను వెల్లడిస్తామంటూ సింగపూర్‌ కన్సార్టియం మళ్లీ పాత పాటే పాడింది.
హైకోర్టు అభ్యంతరం–2: సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలు ప్రభుత్వానికిగానీ.. సీఆర్‌డీఏ అధికారులకుగానీ తెలియనప్పుడు.. ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ణయానికి ఎలా వచ్చారు? వాణిజ్య బిడ్‌ నిబంధనలు తెలియకుంటే రూ.3137.30 కోట్ల భారీ ప్రాజెక్టుకు స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధం.

ఉల్లంఘన: సింగపూర్‌ కన్సార్టియం సీఆర్‌డీఏకు అందించిన ప్రతిపాదనల్లో కనీసం అధికారులకుగానీ.. ప్రభుత్వానికిగానీ ఆదాయ వివరాలను వెల్లడించలేదు. కానీ.. సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం.

హైకోర్టు అభ్యంతరం–3: ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినప్పుడు సీఆర్‌డీఏ, ఇన్‌ఫ్రా అథారిటీ వంటి సంస్థలు అందుకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తాయి?

ఉల్లంఘన: ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్‌ఫ్రా అథారిటీ, మంత్రి వర్గ ఉప సంఘం, సీఆర్‌డీఏతో సంబంధం లేకుండా గతేడాది జూలై 7న సింగపూర్‌ కన్సార్టియం, ఆ దేశ మంత్రి ఈశ్వరన్‌లతో చర్చించి.. ప్రాజెక్టుపై ఆమోదముద్ర వేశారు. అవే ప్రతిపాదనల ఆధారంగా మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

హైకోర్టు అభ్యంతరం–4: రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని చూస్తే ఏ ఒక్క అధికారి కూడా సహేతుకంగా, నిష్పక్షపాతంగా, చట్ట నిబంధనలకు లోబడి వ్యహరించలేదు.

ఉల్లంఘన: ఏ ప్రాజెక్టుకైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఆమోదం తప్పనిసరి. కానీ.. ఇటీవల ఏపీఐఈడీఏ–2001ను సవరించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీని తప్పించి సీఆర్‌డీఏ, ప్రభుత్వం ఆమోదం పొందేలా సవరణ చేశారు. తద్వారా హైకోర్టు అభ్యంతరాలను దొడ్డిదారిన అధిగమించారు.

హైకోర్టు అభ్యంతరం–5: ఛాలెంజ్‌ నోటిఫికేషన్‌లో నిర్దేశించిన అనర్హతల విషయానికి వస్తే ‘భారతదేశం వెలుపల’ అనే నిబంధన పక్షపాతంతో కూడుకున్నది.

ఉల్లంఘన: ఏపీఐఈడీఏ–2001 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయ, ఆర్థిక, బ్యాంకు రంగాల్లో నిపుణులైన ఇద్దరు సభ్యులుగా ఏర్పాటు చేసే వివావాద పరిష్కార మండలి అర్హతలు, అనర్హతలు వంటి వివాదాలను పరిష్కరించాలి. కానీ.. ఏపీఐఈడీఏ చట్టంలోని 32 నుంచి 53 సెక్షన్‌ల వరకూ ఈ ప్రాజెక్టుకు వర్తించవని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఆ స్థానంలో లండన్‌ కేంద్రంగా అంతర్జాతీయ వివావాద పరిష్కార మండలిని ఏర్పాటు చేసి.. అక్కడే వివాదాలు పరిష్కరించుకోవాలని సింగపూర్‌ కన్సార్టియం మెలిక పెట్టింది. ఈ మండలిలో సింగపూర్‌ కన్సార్టియం నుంచి ఒకరు, సీసీడీఎంసీఎల్‌ నుంచి ఒకరు, రెండు సంస్థలు అంగీకారం మేరకు భారతదేశం, సింగపూర్‌ దేశాలకు చెందని వ్యక్తి మరొకరు సభ్యులుగా ఉంటారు.

ఇతర దేశాలకు చెందిన వ్యక్తే మండలికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ ఛైర్మన్‌ కచ్చితంగా సింగపూర్‌ కన్సార్టియం చెప్పినట్టాల్లా తలాడించడం ఖాయం. దీనివల్ల రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక ప్రక్రియలో ఎవరు దరఖాస్తులు చేసినా.. వారిపై అనర్హత వేటు వేయడం ఖాయమనే భావన బలంగా వ్యక్తమవుతోంది. హైకోర్టు ఇదే అంశాన్ని తేల్చిచెప్పినా.. సర్కార్‌కు కనువిప్పు కలగకపోవడం గమనార్హం.

ఆ మర్మం ఏ ‘బాబు’కెరుక?
సింగపూర్‌ కన్సార్టియంకు రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు కట్టబెట్టేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం చంద్రబాబునాయుడు ఉత్సాహం చూపుతుండటంలో లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. బినామీలతో కలిసి దొరికినంత దోచుకోవడానికి సీఎం చంద్రబాబు మళ్లీ బరి తెగించారు. ఈనెల 3న జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌.. శుక్రవారం సింగపూర్‌ సంస్థలు బహిర్గతం చేసిన ప్రతిపాదనలే అందుకు తార్కాణం. ఆ ప్రతిపాదనలు ఇవీ..
రాజధానిని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును 6.84 చదరపు కిలోమీటర్ల(1691 ఎకరాలు)లో చేపడతామని సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించింది.
స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్‌ కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌(సీసీడీఎంసీఎల్‌) కలిసి అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఏడీపీలో సింగపూర్‌ కన్సార్టియం వాటా 58 శాతం.. సీసీడీఎంసీఎల్‌ వాటా 42 శాతం.
రూ.3137.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సింగపూర్‌ కన్సార్టియం రూ.306.4 కోట్లను పెట్టుబడిగా పెడుతుంది. సీసీడీఎంసీఎల్‌ రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. మిగతా నిధులను స్టార్టప్‌ ఏరియాలో ప్లాట్లను అభివృద్ధి చేసి.. విక్రయించడం ద్వారా, భూములకు బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా సమకూర్చుకుంటారు. ఈ ప్రాజెక్టుకు రూ.5,500 కోట్లతో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సదుపాయం, విద్యుత్‌ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి.
ఏడీపీ బోర్డులో ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు. ఇందులో సింగపూర్‌ కన్సార్టియం నుంచి నలుగురు.. సీసీడీఎంసీఎల్‌ నుంచి ఇద్దరు ఉంటారు. బోర్డు ఛైర్మన్‌గా సింగపూర్‌ కన్సార్టియం డైరెక్టరే వ్యవహరిస్తారు. ఏటా కనీసం మూడు సార్లు బోర్డు సమావేశమవుతుంది. సింగపూర్‌ కన్సార్టియం డైరెక్టర్లు కనీసం ఇద్దరు ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు.
స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అమల్లోకి వచ్చాక ఏవైనా వివాదాలు ఉత్పన్నమైతే.. లండన్‌లోని అంతర్జాతీయ వివాదా పరిష్కార మండలి(ఎల్‌ఐసీఏ)లో మాత్రమే పరిష్కారం చేసుకోవాలి. ఈ మండలిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. సింగపూర్‌ కన్సార్టియం నుంచి ఒకరు, సీసీడీఎంసీఎల్‌ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు. రెండు సంస్థలు అంగీకారం మేరకు భారతదేశం, సింగపూర్‌లకు చెందని వ్యక్తిని మూడో సభ్యునిగా నియమిస్తారు. ఆ సభ్యుడే మండలికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
వీటిని పరిశీలిస్తే సింగపూర్‌ సంస్థలు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నది స్పష్టమవుతోంది. సింగపూర్‌ కన్సార్టియం అడుగులకు ప్రభుత్వం మడుగులొత్తినా రాజధాని స్టార్టప్‌ ఏరియా ఆదాయ వివరాలను ప్రాథమిక దశలో బహిర్గతం చేయమని.. వాణిజ్య బిడ్‌కు అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే వెల్లడిస్తామని ఆ కన్సార్టియం మెలిక పెట్టడం గమనార్హం. దీనిపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినా  ప్రభుత్వం సింగపూర్‌ కన్సార్టియంకు వంత పాడటంలో మర్మమేమిటన్నది బహిరంగ రహస్యమే.

ప్రార్థనా మందిరాలు, శ్మశానాల తొలగింపు...
రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు చేపడుతోన్న 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనామందిరాలు, శ్మశానాలు, చెట్లు వంటివన్నీ తొలగించాలంటూ సింగపూర్‌ కన్సార్టియం చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.  అంటే.. ఆ ప్రాంతంలోని ప్రార్థనామందిరాలు, శ్మశనాలను తొలగించడం ఖాయం. చెట్లను నరికివేయడం అంతే ఖాయం. ప్రజల మనోభావాలతో చెలగాటమాడేందుకు సింగపూర్‌ కన్సార్టియం సిద్ధమైనా ప్రభుత్వం వంతపాడటం గమనార్హం.

రూ.306కోట్ల పెట్టుబడితో రూ.52,493.6 కోట్లు దోపిడీకి ఎత్తులు...
రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్‌ కన్సార్టియం పెట్టే పెట్టుబడి రూ.306.4 కోట్లు మాత్రమే. అదే రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్‌ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదీ గాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే.. ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్‌ కన్సార్టియం వాటా 58%.. రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్‌ వాటా 42 శాతమే.
ఏడీపీలో సీసీడీఎంసీఎల్‌ వాటా 50%, తమ వాటా 50% ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్‌ కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది. కన్సార్టియంగా ఏర్పడిన సింగపూర్‌ సంస్థల్లో తన బినామీలు ఉండటంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. జూలై 7, 2016న సింగపూర్‌ సంస్థలతో చర్చించిన సీఎం.. ఏడీపీలో ఆ సంస్థల వాటాను 58 శాతానికి పెంచాలని, సీసీడీఎంసీఎల్‌ వాటా 42 శాతానికి తగ్గించాలని స్వయంగా సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు. కానీ.. ప్రభుత్వ వాటాను సీఎం చంద్రబాబు తగ్గించమనడాన్ని బట్టి చూస్తే బినామీలతో కలిసి అడ్డగోలుగా దోచుకోవడానికి ఏ స్థాయిలో బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు.
రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును సింగపూర్‌ కన్సార్టియం నియమించే మేనేజ్‌మెంట్‌ కంపెనీకి ఏడీపీ అప్పగిస్తుంది. ఈ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఏదన్నది ప్రతిపాదనల్లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఆ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఎం చంద్రబాబు బినామీలది కావడంవల్లే గోప్యంగా ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఈ మేనేజ్‌మెంట్‌ కంపెనీ స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు ప్లాట్లను విక్రయిస్తుంది.
ప్రభుత్వం ఎకరం భూమి కనీస ధరను రూ.నాలుగు కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంస్థకు రూ.నాలుగు కోట్ల కన్నా తక్కువకు ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. ఆ తగ్గించిన మొత్తాన్ని సర్కారే మేనేజ్‌మెంట్‌ కంపెనీకి చెల్లించాలి. ఒకవేళ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎకరం భూమిని రూ.నాలుగు కోట్లకన్నా ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అంటే నష్టమొస్తే ప్రభుత్వం భరించాలి, లాభమొస్తే ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఇలా మేనేజ్‌మెంట్‌ కంపెనీని అడ్డుపెట్టుకుని రూ.4 కోట్లకు ఎకరం చొప్పున భూమిని కొట్టేసేందుకు చంద్రబాబు అండ్‌ కో, సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ఎత్తులు వేస్తున్నాయి.
విజయవాడలో బందరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో గజం భూమి కనిష్టంగా రూ.లక్ష పలుకుతోంది. రాజధానిలో అత్యంత ప్రధానమైన స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులోనూ భూమి విలువ ఇదే రీతిలో పలుకుతుంది. అంటే ఎకరం భూమి రూ.40 కోట్లు పలుకుతుంది.
రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులు పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనకు పోను మిగిలిన 1070 ఎకరాల భూమిని అమ్మి రూ.42,800 కోట్లను చంద్రబాబు అండ్‌ కో, సింగపూర్‌  కన్సార్టియం సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్‌ కన్సార్టియంకు సర్కార్‌ కట్టబెట్టనుంది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.40 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.పది వేల కోట్లు సింగపూర్‌ కన్సార్టియంకు దక్కనున్నాయి.

మొత్తమ్మీద రూ.52,800 కోట్లను సింగపూర్‌ కన్సార్టియం సొమ్ముచేసుకోనుంది. అంటే.. సింగపూర్‌ సంస్థలు పెట్టే రూ.306.4 కోట్ల పెట్టుబడికి రూ.52,800 కోట్లు దక్కించుకోనున్నాయన్న మాట. వీటిని పరిగణనలోకి తీసుకుంటే సింగపూర్‌ కన్సార్టియం ముసుగులో చంద్రబాబు అండ్‌ కో రూ.52,493.6 కోట్లను కొల్లగొట్టనున్నాయన్నది స్పష్టమవుతోంది. ఇంత ఆదాయం వచ్చే ప్రాజెక్టులో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్‌ కన్సార్టియం వెల్లడించకపోవడం గమనార్హం. 1691 ఎకరాల్లో చేపట్టే స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులోనే రూ.52,493.6 కోట్లు కొల్లగొడితే.. 53 వేల ఎకరాల్లో చేపట్టే రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటారో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement