సింగపూర్‌తో ఒప్పందాలు చాలా రహస్యం | Amaravati Deals with Singapore are very secret | Sakshi
Sakshi News home page

సింగపూర్‌తో ఒప్పందాలు చాలా రహస్యం

Published Wed, Feb 13 2019 4:49 AM | Last Updated on Wed, Feb 13 2019 11:24 AM

Amaravati Deals with Singapore are very secret - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి సంబంధించి సింగపూర్‌ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రహస్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని గోప్యంగా ఉంచాలన్న సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీల సూచనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సింగపూర్‌ కంపెనీలతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న షేర్‌ హోల్డర్స్‌ అగ్రిమెంట్‌ వివరాలను అందచేయాలంటూ అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు గత ఏడాది సెప్టెంబర్‌ 28, అక్టోబర్‌ 4వ తేదీన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వచ్చాయి. దీనిపై అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్స్‌ ప్రైవేట్‌ లిమెటెడ్‌ (ఏడీపీపీఎల్‌) బోర్డు సమావేశంలో ఇటీవల చర్చించారు. ఏడీపీపీఎల్‌ చైర్మన్‌గా ఉన్న సింగపూర్‌కు చెందిన తీన్‌ చుయ్‌ చింగ్‌ నినా అధ్యక్షతన సమావేశమై ఈ ఒప్పందాలకు సమాచార హక్కు చట్టం వర్తించదని తేల్చారు. 

బోర్డు తీర్మానానికి సర్కారు సరే..
రాజధానిలో సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలు 1,691 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానంలో అప్పగించిన విషయం తెలిసిందే. ఇందులో అభివృద్ధి చేసిన ప్లాట్లను సింగపూర్‌ సంస్థలు మూడో పార్టీకి విక్రయించుకునేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇందుకోసం అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటైంది. దీనికి సింగపూర్‌కు చెందిన వ్యక్తి చైర్మన్‌గా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష్మీపార్ధసారధి డైరెక్టర్‌గా ఉన్నారు. షేర్‌ హోల్డర్ల అగ్రిమెంట్‌ను రహస్యంగా ఉంచాలని, సమాచార హక్కు చట్టం కింద దీన్ని వెల్లడించరాదని ఇటీవల బోర్డు సమావేశంలో తీర్మానించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తలూపింది. 

గోల్‌మాల్‌ జరిగినందునే గుట్టుగా..
సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలు, సీఆర్‌డీఏ మధ్య జరిగిన షేర్‌ హోల్డర్ల  అగ్రిమెంట్‌ను గోప్యంగా ఉంచాలని నిర్ణయించడాన్ని బట్టి ఇందులో గోల్‌మాల్‌ జరిగిందనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏకంగా సమాచార హక్కు చట్టం కింద కూడా వివరాలు ఇవ్వడానికి వీల్లేదని నిర్ణయం తీసుకోవడం అంటే సింగపూర్‌ కంపెనీలకు చట్టం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వమే వంత పాడుతున్నట్లుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నట్లు తేటతెల్లమవుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 

ఆర్థికశాఖకూ వివరాలు తెలియవు..
సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలకు కేటాయించిన 1,691 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించాలనే షరతుకు సర్కారు అంగీకరించడం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిదశలో రూ.350 కోట్లను విడుదల చేయాలని సీఆర్‌డీఏ ఇటీవల ఆర్థిక శాఖను కోరింది. దీనిపై ఆర్థికశాఖ స్పందిస్తూ సింగపూర్‌ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను అందచేయాలని కోరింది. సీఆర్‌డీఏ ఇప్పటి వరకు ఒప్పందాలను కనీసం ఆర్థికశాఖకు కూడా వెల్లడించలేదంటే కచ్చితంగా ఏదో మతలబు ఉందని పేర్కొంటున్నారు. 

పారదర్శకంగా అంటూ అన్నీ ఉన్నత స్థాయిలోనే..
పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామంటూ నిత్యం చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విషయంలో మాత్రం అంతా గోప్యత పాటిస్తున్నారని, కనీసం సీఆర్‌డీఏ అథారిటీ సమావేశాల తీర్మానాలు కూడా అందుబాటులో లేకుండా రహస్యంగా ఉంచుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాజధానికి సంబంధించి ఏ విషయంలోనూ బిజినెస్‌ నిబంధనల మేరకు ఫైళ్లను పంపకుండా  పైస్థాయిలోనే అన్నీ చక్కబెడుతున్నారని తెలిపాయి. సీఎం అధ్యక్షత వహించే సీఆర్‌డీఏ సమావేశాల్లో ఆయన నిర్ణయాలు తీసేసుకున్న తరువాత ఫైళ్లు పంపిస్తే ఆర్థిక శాఖ ఏం చేస్తుందని ఓ ఉన్నతాధికారి ప్రశ్నించారు.

తాత్కాలిక సచివాలయ పనుల్లోనూ ఇదే తీరు
తాత్కాలిక సచివాలయ నిర్మాణం టెండర్లను భారీ ఎక్సెస్‌కు కట్టబెట్టారని, రాజధానిలో చేపట్టే ఏ ప్రాజెక్టుకైనా తొలుతే పెద్ద ఎత్తున అంచనాలను పెంచేసి టెండర్లను ఆహ్వానిస్తున్నారని, రహదారుల విషయంలోనూ ఇదే జరిగిందని, బిల్లుల చెల్లింపుల్లో కూడా నిబంధనలను పాటించడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  రాజధాని స్టార్టప్‌ ప్రాజెక్టుపై సింగపూర్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందాల్లో భారీ అవతవకలు ఉన్నట్లు తేలడం వల్లే ఆర్థికశాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర తాను ఏడీపీపీఎల్‌లో సభ్యుడిగా ఉండలేనని తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement