47 శాతానికి చేరిన వినియోగం
సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల వినియోగంలో దేశీ కంపెనీల వాటా గణనీయంగా మెరుగుపడింది. 2022కు ముందు తొమ్మిది పట్టణాల్లోని మొత్తం ఆఫీస్ వసతుల్లో దేశీ కంపెనీల వాటా మూడింట ఒక వంతే ఉండగా, ఆ తర్వాత (2022 నుంచి 2024లో మొదటి ఆరు నెలలు) చోటుచేసుకున్న 154 మిలియన్ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) లీజు లావాదేవీల్లో దేశీ కంపెనీల వాటా 47 శాతానికి (72 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ) చేరుకుంది.
ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ విడుదల చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, కోచి, అహ్మదాబాద్‌కు సంబంధించి గణాంకాలను ఈ నివేదికలో సీబీఆర్‌ఈ వెల్లడించింది. ‘‘వృద్ధి, వ్యాపార కార్యకలాపాల విస్తరణ పట్ల దేశీ కంపెనీల అంకిత భావాన్ని ఈ గణంకాలు తెలియజేస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఆఫీస్ వసతుల్లో దేశీ కంపెనీల వాటా మరింత పెరుగుతుంది.
దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎంతో వేగంగా విస్తరిస్తోంది. నైపుణ్య మానవవనరులు దండిగా ఉన్నాయి. డిమాండ్‌ను కీలకంగా ఇవే నడిపిస్తున్నాయి. వ్యాపారంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా అధిక నాణ్యత, సౌకర్యవంతమైన పని వాతావరణానికి భారత కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి’’అని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ పేర్కొన్నారు. టాప్–9 పట్టణాల్లో 2026 నాటికి అదనంగా 189 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీల ప్రీమియం ఆఫీస్ వసతి అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
మెరుగుపడిన సామర్థ్యాలు..
అంతర్జాతీయ అనిశి్చతుల్లోనూ దేశ ఆర్థిక భవిష్యత్ వృద్ధి పట్ల స్థానిక కంపెనీల్లో ఉన్న ఆశాభావాన్ని సీబీఆర్‌ఈ డేటా తెలియజేస్తోందని భీవ్ వర్క్‌స్పేసెస్ వ్యవస్థాపకుడు, సీఈవో శేషురావు పప్లికర్ పేర్కొన్నారు. ‘‘ఇది దేశ వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ పరిణతిని తెలియజేస్తోంది. స్థిరమైన వృద్ధిలో దేశీ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తోంది. మరిన్ని భారత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నందున, ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుంది’’అని శేషురావు వివరించారు. స్థానిక కంపెనీల సామర్థ్యాలను ఈ డిమాండ్ ధోరణులు తెలియజేస్తున్నట్టు ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి చెందిన బ్రహ్మ గ్రూప్ ఏవీపీ (ఆపరేషన్స్) ఆశిష్ శర్మ అన్నారు. టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల మద్దతుతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ పుంజుకున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment