న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు తమ షేర్లను నేరుగా విదేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి కోవిడ్–19 సహాయక ప్యాకేజీ కింద 2020 మేలోనే ప్రకటించినప్పటికీ, దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్‌మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు.
‘ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సే్చంజీల్లో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‘ అని ఆమె చెప్పారు. సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, మెరుగైన వేల్యుయేషన్స్ దక్కించుకునేందుకు దీనితో తోడ్పాటు లభించగలదని మంత్రి పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలుత గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్‌ఎస్‌సీ)లో లిస్ట్ అయ్యేందుకు, ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్‌కు అనుమతినివ్వొచ్చని పేర్కొన్నారు. ఈ జాబితాలో బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనవి
ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
స్టార్టప్‌లు.. రిలయన్స్‌కు బూస్ట్..
కొత్త పాలసీతో యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), విదేశాల్లో లిస్టింగ్‌పై కసరత్తు చేస్తున్న రిలయన్స్ డిజిటల్ విభాగానికి ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయ సంస్థలు.. ప్రధానంగా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్ట్ కావాల్సి ఉంటోంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలు ఇదే బాటలో లిస్ట్ అయ్యాయి. విదేశాల్లో లిస్టింగ్ వల్ల భారతీయ కంపెనీలు వివిధ దేశాల్లోని ఎక్సే్చంజీల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment