డబ్బు నల్లగా జారుకునేదిలా..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్: వ్యక్తులైనా ,సంస్థలైనా నల్ల ధనాన్ని విదేశాలకు పంపించడానికి ఎంచుకునే ఏకైక మార్గం కార్పొరేట్ నిర్మాణ వ్యవస్థ. లెక్కకు మిక్కిలి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను నమోదు చేయడం, వాటికి అంచెలంచెలుగా సబ్సిడరీలను ఏర్పాటు చేయటం, లావాదేవీలను సంస్థల మధ్య గొలుసుకట్టుగా పేర్చటం, విదేశాల్లో సమాంతర వ్యవస్థలు నెలకొల్పడం, బ్యాంకుల ద్వారా దర్జాగా డ్రా చేసుకోవడం..ఇదీ స్థూలంగా నల్ల కుబేరుల సంపద సృష్టి రహస్యం.నల్ల ధనం మూలాల్లోకి వెళితే..
దేశీయ కంపెనీలు ఒక ఏడాదిలో ఆర్జించిన లాభాలపై 30 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాలి. సర్‌ఛార్జీ, విద్యా సెస్సులతో కలుపుకుంటే ఇది 33.9 శాతానికి పెరుగుతుంది. లాభరాశిలో మూడొం తులు పన్ను చెల్లించాల్సి రావడం తలకు మించిన భారం కావడంతో పన్ను ఎగవేత దారిని ఎంచుకోవడమే నల్లధనం సృష్టికి ప్రధాన కారణం అవుతోంది. సాధారణంగా వ్యాపార లావాదేవీలను వాస్తవ విలువ కన్నా తగ్గించికానీ,అసలే నమోదు చేయకపోవడం వల్లకానీ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడుతుంటాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు, జ్యువెలరీ వ్యాపారులు, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఎన్‌జీవోలు, విదేశీ వాణిజ్యం చేసే సంస్థలు ప్రధానంగా పన్ను ఎగవేత మార్గాలను ఎంచుకుంటారనీ 2012లో నల్ల ధనంపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొంది. ప్రధానంగా లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టికల్లో కంపెనీలు చేసే తారుమారు తతంగం కథా
కమామీషు ఇదీ..
విక్రయాలు, రాబడులు: పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా పేరుగాంచిన మారిషస్, కేమాన్ ఐలాండ్, హాంకాంగ్, వర్జిన్ ఐలాండ్ లాంటి దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి విక్రయాలను అక్కడికి మళ్లించటం, షెల్ కంపెనీల ద్వారా డమ్మీ లావాదేవీలు నెరపడం, ట్రస్టులు, హిందూ అవిభాజ్య కంపెనీలను (హెచ్‌యూఎఫ్) ఏర్పాటు చేసి లావాదేవీలను నెరపడం ద్వారా నల్లధనం పేరుకుపోతోంది. విదేశీ సంస్థలకు మార్కెటింగ్ వ్యయాల రూపంలో, ప్రకటనలు, కమిషన్ రూపంలో దేశీ సంస్థలు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తాయి. ఇదే సొమ్ము నాన్ టాక్సబుల్ రిసీట్స్ (విరాళాలు, ట్రస్టులు, లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థలలకు పంపించే డబ్బు) ద్వారా మళ్లీ ఇండియాలోకి ప్రవేశిస్తుంది. లేదా విదేశాల్లోనే బ్యాంకు ఖాతాల్లో ఉండిపోతోంది.
మూలధనం: కంపెనీలు జారీచేసే షేర్లకు దరఖాస్తుచేసే డబ్బు, షేర్ల కోసం అధిక ప్రీమియంగా చెల్లించే మొత్తం, విదేశీ సంస్థలు ద్వారా పోగైన షేర్ క్యాపిటల్, నకిలీ బహుమానాలు, బోగస్ మూలధన లాభాలు, నకిలీ ఆస్తులను పెంచడం ద్వారా నల్లధనం దర్జాగా మళ్లీ ఖాతాల్లోకి వస్తోంది.
ఇన్వెస్ట్‌మెంట్ స్కీంలు...
కొంత మంది వ్యక్తులు ఒక గ్రూప్‌గా కలసి ఆకర్షణీయమైన ఇన్వెస్ట్‌మెంట్ స్కీంలను ప్రవేశపెడతారు. ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడులకు అధిక రాబడులిస్తామని ఆశ పెడతారు. తమ బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సిందిగా సూచిస్తారు. ఇన్వెస్టర్‌కు వచ్చే ప్రతిఫలానికి భరోసాగా పోస్ట్ డేటెడ్ చెక్కును జారీ చేస్తారు. అనంతరం బ్యాంకులోని నగదును గ్రూప్ సభ్యులు తమ తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకుంటారు. ఈ ధనాన్ని విదేశాల్లో తాము ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాకు వైర్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మళ్లిస్తారు. అక్కడి నుండి మరో దేశంలోని మరో ఖాతాకి మళ్లిస్తూ నెట్‌వర్క్‌ను విస్తృత పరుస్తారు. విదేశాల్లోని బ్యాంకులు తమ ఖాతాదారులకు ప్రపంచంలో ఎక్కడైనా విని యోగించే క్రెడిట్, డెబిట్ కార్డులను జారీ చేస్తాయి. ఈ కార్డులతో ఇండియాలోనే దర్జాగా డబ్బును డ్రా చేసుకుంటారు.
స్మర్ఫింగ్..
బ్యాంకుల కళ్లు కప్పి ఖాతాల్లో డబ్బు దాచుకునే ప్రక్రియనే ‘స్మర్ఫింగ్’ అంటారు. బ్యాంకు ఖాతాలను నిరంతరం పర్యవేక్షించే అధికారులు నగదు డిపాజిట్, విత్ డ్రాయల్ లావాదేవీలకు ఒక పరిమితి పెట్టుకుంటారు. ఉదాహరణకు రూ. పది లక్షలు ఆపైన డిపాజిట్ కానీ విత్ డ్రాయల్ కానీ అయిన ఖాతాలను అబ్జర్వేషన్‌లో ఉంచుతుంటారు. అయితే స్మర్ఫింగ్ చేసే నల్ల కుబేరులు రూ. పది లక్షల కన్నా తక్కువ డిపాజిట్ చేసి బ్యాంకు దృష్టి నుంచి తప్పించుకుంటారు. ఇలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని విదేశాల్లోని తమ బ్యాంకు ఖాతాలకు వైర్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
హవాలా మార్గంలో...
ఎక్స్ అనే ఓ వ్యక్తి ఇండియలో అనైతిక మార్గాల ద్వారా రూ.10 కోట్లు సంపాదించాడనుకోండి. దీన్ని విదేశాలకు తరలించేందుకు ‘హవాలా’ మార్గాన్ని ఎంచుకుంటారు. స్థానిక హవాలా ఆపరేటర్ కొంత కమిషన్ తీసుకొని ఈ రూ. 10 కోట్లను విదేశాల్లో ఎక్స్ అనే వ్యక్తి ఏర్పాటు చేసుకున్న బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్ చేస్తాడు. విదేశాల్లో ఎక్స్ ప్రమోట్ చేసిన కంపెనీ ఇండియాలోని ఎక్స్ కంపెనీలో షేర్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంది. ఇండియాలోని ఎక్స్ కంపెనీ విదేశీ ఎక్స్ సంస్థకు డివిడెండ్ రూపంలో భారీ మొత్తం చెల్లిస్తుంది. అక్కడ పనిచేసే ఉద్యోగులకు భారీ వేతనాలు ఇవ్వడం ద్వారా బ్లాక్ మనీ వైట్ అయిపోతుంది. ఈ మొత్తాన్ని ఎక్స్ తన ఆదాయ పన్ను రిటర్న్‌లో పొందుపరస్తాడు.