‘నల్ల’ బంగారం.. రూ.50 వేలు!!
• గురువారం ఒక్కరోజే దాదాపు రూ.300 కోట్ల విక్రయాలు
• పాత నోట్లతో మార్పిడికి నల్ల కుబేరుల పరుగులు
• వెసులుబాటు కల్పిస్తున్న పసిడి వ్యాపారులు
• ముంబై, ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే తీరు..
హైదరాబాద్, సాక్షి: బంగారం తులం రూ.50 వేలు!! ఆశ్చర్యం అనిపించినా ఇది నిజమే!. కాకపోతే ఈ రేటు అందరికీ కాదు. చలామణికి పనికిరావని కేంద్రం ప్రకటించిన పాత రూ.500, రూ.1000 నోట్లతో కొనాలనుకున్నవారికే. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించటంతో నల్ల కుబేరులు తమ నగదును బ్యాంకుల్లో మార్చుకోవటం కష్టమని భావించి బంగారంవైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారికి బంగారం వ్యాపారులు కూడా లోపాయకారీగా వెసులుబాటు కల్పిస్తున్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లు తెచ్చినవారికి అధిక రేటుకు బంగారాన్ని విక్రరుుంచడానికి మొగ్గు చూపుతున్నారు.
ఆ నోట్లు తీసుకోవటం చట్టవిరుద్ధం
నిజానికి 8వ తేదీ అర్ధరాత్రి దాటిన తరవాత పెట్రోలు బంకులు, ప్రభుత్వాసుపత్రులు, మందుల షాపుల వంటి కొన్ని అత్యవసర సేవలందించేవి తప్ప మిగతా సంస్థలుగానీ, వ్యాపారులుగానీ పాత రూ.500, రూ.1,000 నోట్లను తీసుకోకూడదు. అది చట్ట విరుద్ధం. ఎవ్వరైనా తమ వద్దనున్న పాత నోట్లను బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలి. కానీ భారీ ఎత్తున డబ్బు కలిగి ఉన్నవారు బ్యాంకుల్లో వేస్తే పన్ను అధికారులు నిఘా వేసి... నోటీసులు పంపించే అవకాశం ఉంది. అది నల్లధనమని తేలితే దాదాపు 200 శాతం జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. పోనీ బ్యాంకుల్లో వేయకుండా ఆ నోట్లను అలాగే వదిలేద్దామనుకుంటే... డిసెంబర్ 31 తరవాత అవి ఎందుకూ పనికిరాని చిత్తు కాగితాలైపోతారుు. ఇలా ఆలోచిస్తున్న వారికోసమే కొందరు బంగారం వ్యాపారులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్‌లో ఒక్కరోజే రూ.300 కోట్ల వ్యాపారం!
పాత నోట్లను తీసుకుని బంగారాన్ని విక్రరుుస్తుండటంతో హైదరాబాద్‌లో కేవలం గురువారం ఒక్కరోజే దాదాపు రూ.300 కోట్లకు పైగా బంగారం వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. గత రెండురోజులుగా బంగారం క్రయ, విక్రయాలు తారస్థారుుకి చేరారుు. దీంతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో బంగాారం ధరను ఒకేసారి పెంచేశారు. గురువారం హైదరాబాద్‌లోని బేగం బజార్, సిద్దంబర్ బజార్ మార్కెట్లలో బంగారం తులం ధర రూ.50 వేల వరకూ పలికింది. నిజానికి కొందరు వ్యాపారులు బంగారం విక్రయాన్ని కూడా బ్లాక్‌లో చూపిస్తున్నారు. అలాంటి వారికి ఆ బంగారం బదులుగా బ్లాక్ మనీ చేతికొస్తుండటంతో వారు దీన్నొక అవకాశంగా భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధర తులం రూ.32వేల పైగా ఉండగా, రూ.100 నోట్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించటం లేదు. బ్లాక్‌మనీ కలిగిన వారే పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండటంతో ధర ఎగబాకుతోంది.