వారంలో రిలయన్స్ ‘లైఫ్’ మొబైల్స్!
ఈ నెల 28 నుంచి రూ.10 వేల శ్రేణిలో 5 మోడళ్లు
* నవంబర్‌లో రూ. 4వేల శ్రేణిలో హ్యాండ్‌సెట్లు
* వచ్చే జనవరి నుంచి జియో 4జీ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్‌తో దూసుకురావటానికి సన్నాహాలు చేస్తున్న రిలయన్స్ జియో... 4జీ ఇంటర్‌నెట్ సేవలకన్నా ముందు తన బ్రాండ్‌తో మొబైల్ హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి విడుదల చేయటానికి సిద్ధమవుతోంది. లైఫ్(ఎల్‌వైఎఫ్) బ్రాండ్‌తో ఈ నెల 28 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను విక్రయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
దేశవ్యాప్తంగా 1,50,000కుపైగా వివిధ రిటైల్ ఔట్‌లెట్లలో ఇవి లభిస్తాయి. రిలయన్స్ జియో లైఫ్ బ్రాండ్‌తో తొలుత రూ.10 వేల శ్రేణిలో 5 మోడళ్లను ప్రవేశపెడుతోంది. 5 అంగుళాల స్క్రీన్, 2 జీబీ ర్యామ్ వీటి ప్రత్యేకతలు. నవంబర్‌లో రూ.4 వేలు ఆపై శ్రేణిలో మరిన్ని మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది. మొత్తమ్మీద రూ.4 వేలు- 25 వేల మధ్య ఈ ఫోన్లు లభిస్తాయి. వాస్తవానికి భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో రూ.4-12 వేల శ్రేణిలో లభించే మోడళ్ల వాటా ఏకంగా 78 శాతం వరకూ ఉంది. అందుకే జియో సైతం ఈ శ్రేణి లో అధిక మోడళ్లను తేనున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా 100 రోజుల్లో 10 కోట్ల యూనిట్లు విక్రయించాలని జియో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. లక్ష్యాన్ని చేరుకోగానే వాణిజ్య పరంగా 4జీ సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఫోన్లను విక్రయించేందుకు తమ సంస్థతో రిలయన్స్ జియోకు ఒప్పందం కుదిరినట్లు రిటైల్ చైన్ ‘బిగ్ సి’ చైర్మన్ బాలు చౌదరి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు.
కొత్త సంవత్సరంలో 4జీ వాణిజ్య సర్వీసులు...
ఇక 4జీ సర్వీసులను ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న నెట్‌వర్క్ టీం వివిధ ప్రాంతాల్లో పరీక్షిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో పరీక్షించాలని అన్ని ఏర్పాట్లూ చేసుకున్నా... సాంకేతిక కారణాల వల్ల ఆఖరి క్షణంలో రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూపులో దాదాపు లక్ష మందికి పైగా వివిధ స్థాయిల్లో ఉద్యోగులున్నారని, నెట్‌వర్క్ స్థిరీకరణ పూర్తి కాగానే వారందరికీ జియో లైఫ్ ఫోన్లను ఇస్తారని ఆ గ్రూపు అధికారి ఒకరు వెల్లడించారు.
‘‘నెట్‌వర్క్ పనితీరుపై వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తాం. సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే సరిచేసి డిసెంబర్‌కల్లా 4జీని ప్రయోగాత్మకంగా లాంచ్ చేయాలని జియో కృతనిశ్చయంతో ఉంది. వాణిజ్య కార్యకలాపాలకు మాత్రం 2016-17 తొలి ఏడాది అవుతుంది’’ అని ఆయన తెలిపారు. 2016 జనవరిలోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని మరో అధికారి చెప్పారు. అతి తక్కువ ధరకు డేటా, వాయిస్ ప్యాక్‌లను అందించడం ద్వారా మార్కెట్లో పట్టు సాధించాలన్నది సంస్థ ఆలోచన.
దశలవారీగా విస్తరణ..
అసలైన 4జీ అనుభూతి అందించేందుకు వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ టెక్నాలజీని జియో వినియోగిస్తోంది. దీంతో కాల్స్ వేగంగా కనెక్ట్ అవుతాయి. మాట్లాడుతూనే నెట్ సర్ఫింగ్, డౌన్‌లోడ్‌ను కొనసాగించొచ్చు. కాల్ మాట్లాడుతూ ఒక క్లిక్‌తో వీడియో కాల్‌ను అందుకోవచ్చు. ఒకేసారి ఏడుగురితో ఆడియో కాన్ఫరెన్స్, నలుగురితో వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం ఉంటుంది. జియో తొలుత సాధారణ పౌరులకు(బీటూసీ) సేవలందించి, తర్వాత వ్యాపార సంస్థలకు ప్రత్యేక ప్యాకేజీలను పరిచయం చేస్తుందని సమాచారం. ఫైబర్ టు హోం సేవల ద్వారా భారీ గృహ సముదాయాలున్న కాంప్లెక్సులు, గేటెడ్ కమ్యూనిటీలకు తక్కువ ధరకే 4జీని ఆఫర్ చేయనుందని తెలుస్తోంది. మొబైల్ మనీ విభాగంలోకి సైతం కంపెనీ ప్రవేశించనుంది.
దేశీ కంపెనీలు సైతం...
హ్యాండ్‌సెట్లను సరఫరా చేసేందుకు 28 కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని ఇటీవల డిజిటల్ ఇండియా వీక్ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. ఇప్పటికే దిగ్గజ సంస్థలైన జెడ్‌టీఈ, అల్కాటెల్ వన్ టచ్, హువావే, కె-టచ్ కంపెనీలతో జియో చేతులు కలిపింది. జియోనీ తన నిర్ణయాన్నింకా వెల్లడించలేదు. మైక్రోమ్యాక్స్, లావా, సెల్‌కాన్, ఇంటెక్స్ తదితర దేశీ కంపెనీలు కూడా హ్యాండ్‌సెట్లను సరఫరా చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్లతో పాటు డాంగిల్స్, వైఫై రూటర్లు, 4జీ హాట్‌స్పాట్స్‌ను అందించనున్నాయి.