ప్రభాస్‌ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్‌! | Tollywood Lyricist Anantha Sriram Sensational Comments On Prabhas Kalki 2898 AD Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

Anantha Sriram: ప్రభాస్‌ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్‌!

Published Sun, Jan 5 2025 5:21 PM | Last Updated on Sun, Jan 5 2025 6:26 PM

Tollywood Lyricist Anantha Sriram Comments On Kalki 2898 AD Movie

టాలీవుడ్ పాటల రచయిత ‍అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్నా  అని మాట్లాడారు.  హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.

కల్కి చిత్రంపై ఆరోపణలు..

సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని అనంత శ్రీరామ్ ఆరోపించారు.  తెరపైన కనిపించే పాత్రలు...వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం..  కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ.. తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన అని తెలిపారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అని తెలిపారు. 

మూడు కోణాల్లో దాడి..

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..'సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అని అన్నారు. 
 

కృష్ణాజిల్లా గడ్డపై నిలబడి చెబుతున్నా..

అనంతరం మాట్లాడుతూ..'కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే... సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూతకల్పనలు... వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ,గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు  కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం.  ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లా. ఆపాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడు.  ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక్క పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు చిత్ర దర్శకనిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకనీరెత్తినట్లు ఉంటాం. కారణం వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి.  సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే...హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్పమార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు..డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తారో చూద్దాం.' అని ‍అనంత శ్రీరామ్ అన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement